సీఎంకు ఫోన్ కూడా చేయాలన్పించలేదా?
ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా?
క్షమాపణ చెబుతానన్నా కేసులు పెట్టారే
తెదేపా పాలనలోనూ ఇంత దారుణం లేదే
కార్లో కత్తులు పెడతారని భయపడ్డా
భావి కార్యాచరణ నిర్ణయిస్తా: పీజేఆర్
ముఖ్యమంత్రి వైఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ధ్వజమెత్తారు. ప్రస్తుతం కుటుంబ సమస్యో కానే కాదని స్పష్టంచేశారు. భార్య సులోచనమ్మతో కలిసి మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ''ముఖ్యమంత్రి రాష్ట్రానికే సీఎం. వైఎస్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆస్పత్రికివెళ్లి సోదరుణ్ని, ఆయన కుమారుడిని పరామర్శించారు. 1978 నుంచి ఎమ్మెల్యేను, పార్టీ కోసం కృషి చేస్తున్నాను.. నాకు కనీసం ఫోన్‌చేసి మాట్లాడాలని కూడా ఆయనకు అనిపించలేదు. ఇంత అన్యాయమా?'' అంటూ మండిపడ్డారు. కనీసం తానో ఎమ్మెల్యేనని కూడా చూడకుండా పోలీసులు అత్యుత్సాహంతో అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ''నేను హంతకుడినా, క్రిమినల్‌నా, రౌడీషీటర్‌నా? ఎమ్మెల్యేతో పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా?'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్, చంద్రబాబులకు వ్యతిరేకంగా తాను పలు కార్యక్రమాలు చేపట్టినా.. ఏనాడూ తనపట్ల ఇంత దారుణంగా వ్యవహరించలేదన్నారు. తన సభా హక్కులకు భంగం కలిగించారనే అంశంపై ఫిర్యాదుచేసేందుకూ ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
నా కొడుకు భవిష్యత్ పాడుచేసేందుకే...
కాంగ్రెస్‌కు నష్టం జరక్కుండా చూసేందుకు తాను తీవ్రంగా ప్రయత్నించానని పీజేఆర్ పేర్కొన్నారు. ''సంఘటన జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అరవిందరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి భాను ఇద్దరికీ నేనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాను. జరిగిందేదో జరిగిపోయింది.. నేను క్షమాపణ చెబుతాను. కేసులొద్దని చెప్పాను. కానీ వైఎస్ సోదరుడు కేసు పెట్టాలనే పట్టుబట్టినట్లు వారిద్దరూ చెప్పారు'' అని తెలిపారు. ''నా కొడుకు గతమెలాంటిదో చూశారా? అతడేమైనా నేరస్తుడా? ఎవరినైనా కొట్టాడా? భూవివాదాల్లో చిక్కుకున్నాడా? ఎన్‌ఎస్‌యూఐ కోశాధికారి అయిన అతడి భవిష్యత్ పాడుచేయాలని ప్రయత్నం చేశారు'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. వెస్ట్ జోన్ డీసీపీ మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేసి, జరిగిన దానిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ''డీసీపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రవర్తించారు. నేను హోంమంత్రికి కూడా చెప్పాను. అయితే ఆయన్ను మాత్రం ఎంతవరకు నడవనిస్తారు? ఎవరి మాటా వినొద్దనే కదా కడప జిల్లాకు చెందిన ఈ డీసీపీని తెచ్చారు. ఆయన్ను సెంట్రల్ జోన్ నుంచి వెస్ట్‌జోన్‌కు ఎందుకు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు'' అని వ్యాఖ్యానించారు.
మారణాయుధాలు పెడతారని..
''నా భార్యపట్ల మహిళ అనే సానుభూతిని కూడా పోలీసులు చూపలేదు. క్రూరంగా ప్రవర్తించారు. మొదట నా కారును సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. నేను అంగీకరించలేదు. ఆర్టీఏ ఆఫీసుకు ఫోన్ చేసి, కారు నెంబరిచ్చి ఎవరి పేరు మీదుందో క్షణాల్లో తెలుసుకున్నారు. నా కారులో కత్తులు, మారణాయుధాలు పెట్టి.. కేసులు పెడతారని భయపడ్డాం. అందుకే విలేకరుల సమక్షంలో కారు తలుపులు తీసి, పోలీసులకు చూపించా'' అని పీజేఆర్ వివరించారు. ''పోలీసుస్టేషన్‌లో 20 గంటలు కాదు.. ఎన్ని రోజులున్నా పోలీసులు వైఎస్ సోదరుడిపైనా, ఆయన కుమారుడిపైనా 307 సెక్షన్(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయరని నిర్ధారణ అయిన తర్వాతే వెనక్కి వచ్చేశా. స్టేషన్ నుంచి వచ్చిన తర్వాతే నా కార్యకర్తలను పోలీసుస్టేషన్ల నుంచి విడుదల చేశారు. హైదరాబాద్‌లో మొత్తం 10 వేల మంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. నన్ను చూద్దామని వచ్చిన వాళ్లనూ జైళ్లలో ఉంచారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా'' అని మండిపడ్డారు.
ప్రాణ త్యాగానికైనా..
''నా మిత్రులు అయిన ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, శంకరరావు బుధవారం వస్తున్నారు. వీరితోబాటు నా పట్ల సానుభూతి ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నాతో మాట్లాడుతున్నారు. వారందరితో చర్చించి బుధవారం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తా'' అని పీజేఆర్ తెలిపారు. ''నేను, నా కుటుంబం నాశనమైనా పర్వాలేదు. నన్ను, పార్టీని నమ్ముకున్నవారికి నష్టం జరగకూడదనేదే నా అభిమతం. ఈ క్రమంలో ప్రాణత్యాగం చేసేందుకూ నేను సిద్ధంగా ఉన్నాను'' అంటూ ఆవేశంగా స్పందించారు. రాజు ఎవరైతే వారిదే కదా శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతంటూ.. వైఎస్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ''వైఎస్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నవారిలో నేనూ ఒకడిని. అలాంటిది.. నా కొడుక్కి ఎన్‌ఎస్‌యూఐ పదవి వచ్చాక సీఎంను కలిసేందుకు ఆయన సెక్రటేరియట్‌లో స్వయంగా అపాయింట్‌మెంట్ అడిగాం. ఇంత వరకూ టైం ఇవ్వలేదు'' అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
దత్తాత్రేయ, శ్రీనివాసయాదవ్‌ల రాక
భాజపా నేత బండారు దత్తాత్రేయ, తెదేపా నేత తలసాని శ్రీనివాసయాదవ్‌లు మంగళవారం పీజేఆర్‌ను కలుసుకున్నారు. జరిగిన వివాదం, గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై పీజేఆర్‌తో వారు చర్చించారు.