Thursday, December 13, 2007

పిట్టల శ్రీశైలంకు బెయిల్‌ మంజూరు Andhra Jyothy

కందుకూరు, డిసెంబరు 13 (ఆన్‌లైన్‌): మావోయిస్టు కొరియర్‌ అనే ఆరోపణలతో ఈనెల ఐదున అరెస్టయిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలంకు గురువారం బెయిల్‌ మంజూరైంది. శ్రీశైలంకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా ఆయన సోదరి కోమబోతు మంగ, సోదరుడు పిట్టల వెంకటేష్‌లు బుధవారం పిటీషన్‌ దాఖలు చేయగా నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసిన కందుకూరు అడిషనల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎస్‌.చినబాబు బెయిల్‌ మంజూరు చేశారు. అలాగే శ్రీశైలంను విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ ను ఆయన తోసిపుచ్చారు.
అయితే ఈనెల 15వ తేది పోలీసు విచారణాధికారి ఎదుట ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హాజరై విచారణకు సహకరించాలని కోరారు. అది కూడా పోలీసులు శ్రీశైలంను నాయయవాదుల సమక్షంలో మాత్రమే విచారించాలని మేజిస్ట్రేట్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం సోదరి కోమబోతు మంగ పది వేల రూపాయలకు, సోదరుడు పిట్టల వెంకటేష్‌ ఐదు వేలకు పూచీకత్తు ఇచ్చిన మీదట నెల్లూరు జైలులో ఉన్న శ్రీశైలంను విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శ్రీశైలంకు బెయిల్‌ మంజూరు కోరుతూ దాఖలైన పిటీషన్‌పై నిర్ణయం వెలువడుతున్న సందర్భంగా సిఐ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో సబ్‌ కోర్టు ఆవరణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మావోయిస్టు అగ్రనేత సాంబశివుడికి కొరియర్‌గా ఉంటూ కందుకూరులో ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి 10 లక్షలు తీసుకెళ్లి నల్గొండ జిల్లాలోని మల్లారెడ్డికి అందించేందుకు శ్రీశైలం కందుకూరు రాగా తాము అరెస్ట్‌ చేశామని పోలీసులు ఆయనపై అభియోగం మోపగా తనకు, మావోయిస్టులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఒక జర్నలిస్టుగా మావోయిస్టు నాయకులను ఇంటర్వ్యూ చేయటానికి మాత్రమే తాను కందుకూరు వచ్చానని శ్రీశైలం వాదిస్తున్న విషయం తెలిసిందే.