''తెలంగాణలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ లిఫ్టులే (ఎత్తిపోతలు). తెలంగాణకు లిఫ్టంటే నీళ్లన్నీ ఆంధ్రకు తెఫ్టే (దోచెయ్యడమే)! అదీ లోగుట్టు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గజదొంగల్లా కృష్ణా జలాలను ఆంధ్రకు తరలిస్తున్నరు. తెలంగాణకు తుంపర సేద్యమంటూ వైఎస్ కొత్తపాట పాడుతున్నడు. ఇక నుంచి ప్రతి నీటిచుక్కా డ్యాం నుంచి నేరుగా మొక్క మొదట్లో పడతదట! అట్ల తెలంగాణలో 50 లక్షల ఎకరాలకు నీరిస్తడట. ఇదీ వైఎస్ బిత్తిరి సేద్యం!'' తెరాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యలివి. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో 22వ విద్యార్థుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం వారి కేకలు, నినాదాలు, చప్పట్లతో మార్మోగిపోయింది. తెలంగాణలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను గెలుచుకుని, తెరాస మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పడలేని రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని వారికి కేసీఆర్ ఉద్బోధించారు. కుక్కకు ఎముకేసినట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులందరికీ వైఎస్ మంత్రి పదవులు, ప్రాజెక్టులు కట్టబెట్టారని కేసీఆర్ ఎద్దేవాచేశారు. ''మీ ఊళ్లలో కాంగ్రెస్, తెదేపా జెండాలు పట్టుకున్నోళ్లను నిలదియ్యండి. కరెంటు, నీళ్లు ఇవ్వని జెండాలను ఎందుకు మోస్తున్నరని అడగండి. మనం తెలంగాణ అనంగనె జై ఆంధ్ర, జై రాయలసీమ అని బొబ్బలు పెడతరు. శ్రీశైలం ప్రాజెక్టును సీమకు వదిలితేనే హైదరాబాద్‌ను తెలంగాణకు ఇస్తామని రాయలసీమ హక్కుల వేదిక నేత టీజీ వెంకటేశ్ అంటున్నడు. హైదరాబాద్‌ను నెత్తిల పెట్టుకుని తెలంగాణకు వచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఎన్నికల్లో ఓట్ల యావతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నడు. పథకాలు ప్రకటిస్తున్నడు. వీటిని నమ్మొద్దు. తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల విద్యార్థులు బలీయశక్తిగా తయారైతే ప్రత్యేక రాష్ట్రాన్ని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు'' అని వారికి సూచించారు. చదువులను పాడుచేసుకోకుండా శాంతియుతంగా తెలంగాణ భావవ్యాప్తి చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక ఏ పదవీ తీసుకోకుండా తాను కాపలా కుక్కలా ఉంటానన్నారు.
తెరాస గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీని పార్టీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అధ్యక్షతన 135 మందితో కమిటీ ఏర్పాటైంది.