Monday, September 3, 2007

తెలంగాణ కోసమే ఎస్సార్సీ వేయాలి Eenadu

ఉప్పునూతల స్పష్టీకరణ తేలిగ్గా చూస్తే ద్రోహం చేసినట్లే: మధు యాష్కీ
తెలంగాణ అంశాన్ని పక్కనబడేసినా, దాని ప్రభావం ఎన్నికలపై ఉండదని తేలిగ్గా తీసేసినా తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ మధు యాష్కీ అన్నారు. వారు సోమవారం వేర్వేరుగా న్యూస్‌టుడేతో మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్సీ ద్వారానే పరిష్కరించాలనుకుంటే ప్రత్యేకంగా దాని కోసమే వేయాలని తెలంగాణ ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌ అయిన ఉప్పునూతల స్పష్టంచేశారు.



కాలయాపన చేయడం కన్నా.. ఎన్నికలకు ముందే తెలంగాణపై పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభావం ఉండదని తేలిగ్గా తీసిపడేస్తే మాత్రం తెలంగాణకు ద్రోహం చేసినట్లని అన్నారు. టీఆర్‌సీసీసీ సమావేశంలో ఈ అంశాలపై మాట్లాడతానని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, 2009 ఎన్నికల్లోపు కాంగ్రెస్‌ దీనిపై నిర్ణయం తీసుకోవాలని మధు యాష్కీ చెప్పారు. రెండో ఎస్సార్సీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్న అంశమే అయినా ఇప్పుడు ఎస్సార్సీ ద్వారా ఫలితాలు రావడం కష్టమని తెలిపారు. ఏకాభిప్రాయం ద్వారా తెలంగాణ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ అంశాన్ని తేలిగ్గా తీసేస్తే ద్రోహం చేసిన వాళ్లవుతారని హెచ్చరించారు. టీఆర్‌సీసీసీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. 2004 ఎన్నికలకు ముందు ఏర్పాటైన టీఆర్‌సీసీసీ ఇంకా అప్పటి సభ్యులతోనే కొనసాగుతోందని ఆక్షేపించారు. ఎంపీలుగా ఆహ్వానిస్తే టీఆర్‌సీసీసీ సమావేశానికి వెళ్తానన్నారు.