Friday, December 28, 2007

ఇద్దరినీ ఇరుకున పెట్టిన ఘనుడు.. పీజేఆర్‌, Andhra Jyothi, 29th Dec, 07

కేవలం 26 మంది ఎమ్మెల్యేలతో 1994-99 మధ్య కాలంలో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా వ్యవహ రించిన పీజేఆర్‌ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆల్మట్టి డ్యాం, ఏలేరు స్కాం, కాల్దరి కాల్పులు వంటి పలు అంశాలపై ముప్పతిప్పలు పెట్టారు. 2004 నుంచి నేటి వరకు శ్రీశైలం రిజర్వాయర్‌ కనీస నిల్వ మట్టం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, జంట నగరాలకు మూడో దశ కృష్ణా జలాల తరలింపు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ప్రసాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌, ఔటర్‌రింగ్‌ రోడ్డు భూ సేకరణ అక్రమాలు, డీబీఆర్‌ మిల్స్‌ భూముల కేటా యింపు వంటి అంశాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డికి నిద్ర లేకుండా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్‌ అయినా, పార్టీ కేంద్ర నాయకత్వం కన్నెర్ర చేసినా ప్రజా సమస్యలపై మడమ తిప్పని పోరాటం చేయడం పీజేఆర్‌ నైజం.
రాజధానికి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ గురించి అవగాహన సహజంగానే ఉండదు. పీజేఆర్‌ మాత్రం ఆ కోవలోకి రారు. నాటి ఆల్మట్టి డ్యాం నుంచి నేటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వరకు రాష్ట్రంలో ఏ ప్రాంత, ఏ పార్టీ నాయకుడు పోరు సలపనంతగా పీజేఆర్‌ జరిపారు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలనే సలహాలు రాష్ట్ర, కేంద్ర పార్టీ నాయకత్వాల నుంచి, మిత్రుల నుంచి వచ్చినా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల గురించి పోరాటం చేయకుండా ఉండలేని బలహీనత పీజేఆర్‌ది అని ఆయన సన్నిహితులు చెప్పారు.

ఎవరేమన్నా ఎదురీతే, Andhra jyothi, 29th Dec, 07

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (ఆన్‌లైన్‌): "అన్నా'' అంటే "నేనున్నా'' అంటూ అర్ధరాత్రి సైతం ప్రత్యక్షమయ్యే పబ్బతిరెడ్డి జనార్దన్‌రెడ్డికి హైదరాబాద్‌ బడుగు బస్తీ ప్రజలు గుండెలో గుడికట్టుకున్నా.... రాజకీయంగా మాత్రం ఆయనకు ఎదురీత తప్పలేదు. ఆరు నూరైనా అణుమాత్రం కదలని, పట్టువిడుపులు లేని మొండితనం కార్మిక నేతగా ట్రేడ్‌యూనియన్‌ వ్యవహారాలలో ఆయనను అగ్రస్థానంలో నిలిపినా రాజకీయాలలో ఒంటరిని చేసింది.
పార్టీ ఆయనకు ఊపిరి.. అయినా ఆయనకు షోకాజ్‌ నోటీసులు, సస్పెన్షన్‌ వంటి క్రమశిక్షణ చర్యలు తప్పలేదు. పార్టీ ఆవిర్భావ దినాన, పార్టీ కార్యకర్తల మధ్య, పార్టీ కార్యక్రమంలో తుదిశ్వాస విడిచిన పీజేఆర్‌ పార్టీలో మాత్రం కొరకరాని కొయ్యే... ఎందరికో పంటిలో రాయే. కొద్దినెలల క్రితం క్రమశిక్షణలో భాగంగా పార్టీ అధిష్ఠానం జారీ చేసిన ఒక షోకాజ్‌ నోటీసుకు ఆయన ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉండడం విశేషం.
చర్యలపై చరిష్మాదే పైచేయి1989 ఎన్నికల ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడు.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డికి వ్యతిరేకంగా పీజేఆర్‌ బహిరంగ పోరాటం చేశారు. ఎన్నికల ముందు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదే తీరులో 2004 ఎన్నికలకు కొంతకాలం ముందు ఎం.సత్యనారాయణరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వాయలార్‌ రవి ఆయనను సస్పెండ్‌ చేశారు. తాజాగా.. కొద్దినెలల క్రితం దిగ్విజయ్‌సింగ్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అయితే ఆయనపై ఏ క్రమశిక్షణ చర్యనూ హైకమాండ్‌ ఎంతో కాలం కొనసాగించలేదు. అ ప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డిలతో ఆయన సర్దుకుపోలేక పో యారు.
పార్టీ రాజకీయాలలో టి.అంజయ్య అడుగుజాడ ల్లో నడిచిన పీజేఆర్‌ ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిని అనుసరించారు. తర్వాతి రోజులలో నేదురుమల్లి పట్ల కూడా చాలా రోజులు కినుకవహించి అంటీ అంటకుండా తిరిగినా.. ఇటీవల మళ్లీ సన్నిహితమయ్యారు. రాజకీయం గా సమకాలికుడు.. తనతోపాటు తొలిసారి మంత్రి అయిన వైఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఒక దశలో పీజేఆర్‌ ప్రయ త్నించినా అది ఎంతో కాలం కొనసాగలేదు. 1999 ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న దశలో వైఎస్‌ను పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. ఢిల్లీ నుంచి వస్తున్న వైఎస్‌కు స్వాగతంపలకటానికి విమానాశ్రయానికి వెళ్లాలా, వద్దా అని ఆయన రెండు రోజులు మథనపడ్డారు. అప్పటికి నాలుగు సంవత్సరాలుగా సీఎల్పీ నేతగా ఉన్న పీజేఆర్‌ అధికార తెలుగుదేశం పార్టీపై గట్టిపోరాటం చేస్తున్నారు.
పార్టీ అతి బలహీనమైన దశలో ఉన్న ఆ కాలంలో పీజేఆర్‌ పోరాట ధోరణి కారణంగానే కాంగ్రెస్‌ ప్రజలలో నానుతుండేది. ఒకటి రెండు సార్లు వైఎస్‌ సన్నిహితుల నుంచి పిలుపు రావటంతో తప్పని పరిస్థితిలో ఆయన వైఎస్‌కు స్వాగతం పలకడానికి వెళ్లి... టాపులేని కారులో వెంట వచ్చారు. అయితే ఈ నిర్ణయంపై అనతికాలంలోనే పశ్చాత్తాపపడ్డారు. "తప్పు చేశా. విమానాశ్రయానికి వెళ్లకుండా ఉండాల్సింది. గాంధీభవన్‌కు వెళ్లి కలిసి వచ్చివుంటే సరిపోయేది'' అని ఆ తర్వాత పదేపదే అనుకున్నారు. పార్టీలోని రెండు కీలక పదవులలో ఇద్దరూ ఉండటంతో ఎంతోకాలం సర్దుకుపోలేకపోయారు. ఎన్నికల నాటికి వారి మధ్య వైరం మరింతపెరిగింది. టిక్కెట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం కుదరక రోజుల తరబడి గొడవపడ్డారు.
సీఎల్పీ నాయకత్వం అరుదైన మలుపుపీజేఆర్‌కు అనుకోని అరుదైన అవకాశం కోట్ల విజయభా స్కరరెడ్డి హయాంలో 1994లో వచ్చింది. నిజానికి అదే ఆయనను రాజకీయంగా దెబ్బ కూడా కొట్టింది. 1994 ఎన్నికల నాటికి తన మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన పీజేఆర్‌ను కోట్ల అప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా దగ్గరకు తీశారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతిని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 26 మంది సభ్యులు మాత్రమే ఉన్న అప్పటి సీఎల్పీకి నాయకత్వం వహించలేని,వైఎస్‌ వర్గానికి పదవి ఇవ్వటం ఇష్టం లేని కోట్ల... పీజేఆర్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. ఇది ఆయన స్థాయిని పెంచింది.. సమస్యలూ పెంచింది.
ఏకపక్షంగా తెలుగుదేశం వెలిగిపోతున్న కాలం.. కొమ్ములు తిరిగిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలందరూ పరాజయంతో ఇంట్లో కూర్చున్న రోజులు. అసెంబ్లీలో 220 పైగా సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీతో పోరాడాల్సిన పనిని పీజేఆర్‌ భుజానికెత్తుకున్నారు. రాత్రింబవళ్లూ శ్రమించారు. వాక్‌చాతుర్యంతో పని లేదనుకొని న మ్మినదానికి కట్టుబడి మొండిగా పోరాడారు. ఆల్‌మట్టి వంటి అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే సీఎల్‌పీలో కనీసం సగంమంది సహకారం కూడా లభించలేదు.
నలుగురైదుగురిని వెంటపెట్టుకున్నా ఆయనది దాదాపు ఒంటరి పోరాటంగానే మారింది."పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఈ విజయంలో సీఎల్‌పీ పాత్రను మరిచిపోకూడదు..'' అని 1999 ఎన్నికల ఫలితాలకు ముందు సోనియాను కలిసి చెప్పి వచ్చిన పీజేఆర్‌ తన కంచుకోట ఖైరతాబాద్‌తో పరాజయం పాలయ్యారు. దీంతో ఆయన తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. దీనికి తోడు 1998 నుంచి.. దాదాపు దశాబ్దకాలంగా రాష్ట్ర పార్టీలో వైఎస్‌ ప్రాబల్యం అధికమైంది.
కష్టకాలంలో సీఎల్‌పీకి నాయకత్వం వహించిన పీజేఆర్‌.. ఆ స్థాయిని కాపాడుకుంటూ పోరాటపంథాలో కొనసాగాల్సి వచ్చింది. అయిదు సంవత్సరాల విరామం తర్వాత 2004లో పార్టీకి అధికారం దక్కినా ఆయనకు మాత్రం పదవి దక్కలేదు. ఏకపక్షంగా సాగుతున్న వైఎస్‌ ధోరణికి ఎక్కడికక్కడ అడ్డుకట్టవేయాలని ఆయన గట్టి ప్రయత్నం చేశారు. పార్టీలోని పెద్ద నాయకులు సైతం రాజీపడినా పీజేఆర్‌ మాత్రం తిరుగుబాటు బవుటా ఎగవేశారు.
నిత్య విద్యార్థిఏదైనా సాంకేతిక అంశంపై మాట్లాడటానికి ముందు దాని గురించి అనుభవజ్ఞులైన సాం కేతిక నిపుణులతో మాట్లాడి అవగాహన చేసుకున్న తర్వాతే అసెంబ్లీలో కానీ, పార్టీ వేదికలపై కానీ, ఇతర వేదికలపై కానీ ఆయన మాట్లాడేవారు. తెలియని విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస పీజేఆర్‌లో అపారంగా ఉండటం వల్లే ఎన్నో విషయాలను సులువుగా అర్ధం చేసుకునే వారని పాలి టెక్నిక్‌ చదివే రోజుల్లో ఆయనకు విద్య బోధించిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ జి.ప్రభాకర్‌ 'ఆన్‌లైన్‌'కు తెలిపారు.

ప్రజల మనిషి అనడానికి , Andhra Jyothi, 29th Dec, 07

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఒక్కసారి తిరగండి. అక్కడి టీ బంకుల్లో తేరిపార చూడండి. సెలూన్లను పరిశీలించండి. రోడ్డుపక్కనున్న చెప్పుల షాపులో తొంగి చూడండి. పాన్‌ షాపుల్ని పరిశీలించండి. చాలావాటిల్లో ఒక ఫొటో కనిపిస్తుంది. చిరునవ్వుతో రిబ్బ న్‌ కత్తిరిస్తున్న పి.జనార్దన్‌రెడ్డి... పక్కన నవ్వుతూ నిలబడ్డ కొట్టు యజ మాని, ఇతర జనం. పీజేఆర్‌ జనం నాయకుడు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
కూకట్‌పల్లి-అమీర్‌పేట దారిలో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎవరికి వారు హారన్లు కొడుతున్నారు. కాస్త సందు దొరికితే ముందుకు దూరి పోతున్నారు. అంతలో... కారులోంచి ఖద్దరు కట్టుకున్న ఓ నాయకుడు దిగాడు. ఆయనతోపాటు అనుచరులూ వచ్చారు. అప్పటికప్పుడు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను ఓ గాడిన పెట్టారు. పరిస్థితి అదుపు లోకి వచ్చాకే ఆ నేత అక్కడి నుంచి కదిలారు. ఆ నాయకుడు పీజేఆర్‌. సమస్య చిన్నదైనా... ఆయన తనదారి తాను చూసుకునే రకం కాదని చెప్పడానికి ఇంతకంటే రుజువు అవసరమా?
నగరంలోని సంపన్న ప్రాంతంలో అదో మురికివాడ. అక్కడ ప్రభు త్వ భూమిలో బడుగులు గుడిసెలు వేసుకున్నారు. అవన్నీ ఆక్రమణ లు అన్నారు అధికారులు. తొలగించేందుకు మందీ మార్బలంతో వ చ్చారు. గుడిసెపై విరుచుకుపడేందుకు గునపాలు సిద్ధంగా ఉన్నాయి. అంతలోనే అక్కడ పీజేఆర్‌ ప్రత్యక్షమయ్యారు. 'గుడిసెపై మొదటి గునపం ఎవరు వేస్తే, అదే గునపం వారి గుండెలో దిగుతుంది' గర్జిం చాడు పీజే ఆర్‌. అధికారులు వెనుదిరిగారు. 'పీజేఆర్‌ పేదల దేవుడు' అంటే అతిశయోక్తి ఏముంది?
నగరంలో ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూలు వ్యాన్‌ ఓ మహిళ ను ఢీకొంది. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. స్థానికుల ఆందోళన మొదలైంది. ట్రాఫిక్‌ జామ్‌. ఉద్రిక్తత. అంతలో పీజేఆర్‌ అక్కడికి వచ్చా రు. బాధితుల పక్షాన నిలబడ్డారు. స్కూలు యాజమాన్యంతో మాట్లా డారు. మృతురాలి కుటుంబానికి డబ్బు ఇప్పించారు. ప్రభుత్వంకంటే ముందు సమస్యను పరిష్కరించారు. సమస్యల పరిష్కారంలో జనా ర్దన్‌రెడ్డి చొరవ గురించి చెప్పేందుకు ఇంతకు మించి ఉదాహరణ ఏముంటుంది?

పీజే ఆర్‌ హఠాన్మరణం , Andhra Jyothi, 29th Dec, 07

కార్యకర్తల ఒడిలోనే ఒరిగిన నేత
ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూత
శోకసంద్రమైన భాగ్యనగరం
పార్టీ వ్యవస్థాపక దినం రోజే తుదిశ్వాస
ఆఖరిమాట ' ఇందిరమ్మ'
అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
ఆఖరి ప్రస్థానం ఉదయం 6.00 గంటలకు పెద్దమ్మగుడిలో పూజ 9.00 గంటలకు గాంధీభవన్‌ చేరిక 9.30 గంటలకు గాంధీభవన్‌నుంచి బయటకు 10.20 గంటలకు సికింద్రాబాద్‌ జ్యుయెల్‌గార్డెన్‌కు చేరుకుని గేటులోపల అడుగుపెట్టి కుప్పకూలారు 10.30 గంటలకు గార్డెన్‌ నుంచి హుటాహుటిన ఆస్పత్రికి 10.45 గంటలకు ఆస్పత్రిలోపలికి చేరుకున్నారు 11.30గంటలకు పీ జే ఆర్‌ మరణవార్త ప్రకటించారు ఆయన ఇక లేరని తెలిసి రాజధాని ఆర్తనాదం చేసింది. అన్నా అని పిలిస్తే నేనున్నాననే గొంతు మూగబోయిందని తెలిసి పట్నం గుండె పగిలింది.
గూడులేని వారికి నీడై, కష్టజీవులకు కొండంత అండై, అసహాయులకు ఆపన్నహస్తమై నిలిచిన నాయకశిఖరం కూలిందని జనదుఃఖం కట్టలు తెగింది. కాంగ్రెస్‌ నాయకుడు, కార్మికోద్యమనేత, మాజీ ప్రతిపక్ష నాయకుడు పి.జనార్దనరెడ్డి శుక్రవారం నాడు ఉద యం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. జనమేజీవితంగా గడిపే జనార్దనరెడ్డి తనకు ప్రాణప్రదమైన అనుచరగణం మధ్య, వారి చేతుల్లోనే ఆఖరిశ్వాస వదిలారు. అధిష్ఠానానికి తప్ప మరెవరికీ విధేయుడిని కానని రుజువుచేసుకుంటూ, ఆఖరిక్షణాల్లో కూడా ఇందిరపేరునే ఉచ్చరించారు.
సొంతపార్టీ ప్రభుత్వమే అయి నా, సమస్యల విషయంలో పాలకగణానికే పక్కలో బల్లెంలా మెలిగారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆయన సామాన్యుల మనిషి. మిరుమిట్లు గొలిపే అభివృద్ధి నీడన నలిగే చీకటిబతుకుల పక్షానే ఆయన పోరాటం. మహానగరం కడుపులో దాగిన పల్లెటూరు అతను. పదవులెన్ని చూసినా పెద్దమ్మ కొడుకే. నేల విడిచి సాముచేయని భూమి పుత్రుడే. అందుకే జనార్దనరెడ్డిని అన్ని పార్టీల వారూ ఆర్ద్రంగా స్మరించుకుంటున్నారు. శనివారం జరిగే ఆయన అంతిమయాత్రను కాంగ్రెస్‌ పార్టీ, ప్రభు త్వం, జనార్దనరెడ్డి అభిమానులు పెద్దఎత్తున జరుపనున్నారు.

బడుగుల దేవుడు అస్తమయం, andhra Jyothi, 29th Dec, 07

అనుచరుల ఒడిలో ఒరిగిపోతూ...
గుడిసె బెదిరింది. పేద గూడు వణికింది. నిలువెల్లా బాధతో భాగ్యనగరపు మురికవాడంతా విలవిలలాడింది. వలవలా ఏడ్చింది. పేదల గుండె గుడిలో కొలువైన జన్నన్న... గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. 'అన్నా' అని పిలిచిన వెంటనే 'నేనున్నా' అంటూ జరూరుగా ఉరికురికి వచ్చే 'బడుగుల దేవుడు' పి.జనార్దన్‌రెడ్డి అనుకోకుండా అస్తమించారు. అనంత లోకాలకు వెళ్లిపోయారు. 60 ఏళ్లు నిండకుండానే ఆయువు చాలించారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీయే ఊపిరిగా జీవించిన ఈ మడమతిప్పని పోరాట యోధుడు... చివరికి కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం రోజునే... పార్టీ జెండా ఎగరేసిన కాసేపటికే ప్రాణాలు వదిలారు.
ఇందిరాగాంధీ కుటుంబానికి అచంచల విధేయుడైన ఈ నాయకుడి నోటివెంట చివరగా వెలువడిన మాట 'ఇందిరమ్మ'! భాగ్యనగర రాజకీయాలే ఆలంబనగా... జనం సమస్యలే సోపానాలుగా... ఒక్కో మెట్టూ ఎదిగిన ఈ గరీబోల్ల బిడ్డ... ఆ మహానగర రహదారిపైనే రాలిపోయారు. అచేతనంగా వాలిపోయారు. పిలిస్తే రాని పెళ్లిలేదు. పలకరిస్తే మాట్లాడని క్షణం లేదు. పట్టించుకోని సమస్య లేదు సీ ఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే అయిన 59 ఏళ్ల పి.జనార్దన్‌ రెడ్డి ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు.. ప్రజానాయకుడు! ప్రజా సమస్యలే ఆయుధాలుగా... స్వపక్షంలోనే విపక్షంగా... హీరోచిత పోరాటాలు చేసిన సాహసికుడాయన. పాలకులు సొంత పార్టీ వారైనా రాజీ పడకుండా... పక్కలో బల్లంలా మారి పరేషాన్‌ చేసిన వీరుడాయన. కేవలం 26 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉంటూ కూడా... బలమైన ప్రభుత్వాన్ని గడగడలాడించి... కాంగ్రెస్‌ పరువు కాపాడిన ధీరుడాయన.
నేడు జంటనగరాల జనం కృష్ణా నీళ్లు తాగుతున్నారంటే అది పీజేఆర్‌ పుణ్యమే! ఆయన... కార్మిక నాయకుడు అంజయ్య శిష్యుడు. ఆరంభంలో కార్మికుడు. ఆజన్మాంతం కార్మిక నేత. అట్టడుగు నుంచి... పేద కుటుంబం నుంచి ఎదిగిన ఆయన చివరి వరకూ పేదల్ని విడవలేదు. హైదరాబాద్‌ బ్రదర్స్‌లో ఒకడిగా పేరుగాంచిన పీజే ఆర్‌ పేరు ప్రస్తావించకుండా రాజధాని రాజకీయం గురించి మాట్లాడడం అసంభవం. పీజేఆర్‌ అకాల మృతి... రాజకీయ నాయకుల్ని, రాష్ట్ర ప్రజల్ని విస్తుపోయేలా చేసింది. నిన్నటికి నిన్న పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని బేనజీర్‌భుట్టో దారుణ హత్య వార్త నుంచి ఇంకా తేరుకోక ముందే, మరో దిగ్భ్రాంతికర విషయాన్ని విని జనం నివ్వెరపోయారు.
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (ఆన్‌లైన్‌): బడుగు జీవుల అన్న, కార్మిక లోకం ప్రతినిధి పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్‌) శుక్రవారం అకస్మాత్తుగా కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటుకు గురైన పీజేఆర్‌ను ఆయన అనుయాయులు ఆసుపత్రికి తరలిస్తుండగామార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గాంధీభవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న పీజేఆర్‌, ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని జువెల్‌ గార్డెన్స్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా నగర కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు.
పీజేఆర్‌ వాహనం నుంచి దిగగానే ఆయన అభిమానులు "పీజేఆర్‌ జిందాబాద్‌'' అంటూ ఆయనను ఎత్తుకోబో యారు. ఆయన అభిమానుల్ని వారిస్తూ... "నన్ను కాదు. ఇందిరమ్మ జిందాబా ద్‌ అనండి'' అంటూ సమావేశ ప్రాంగణం వైపు రెండడుగులు వేశారో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీనితో తీవ్ర ఆందోళనకు గురైన అనుయా యులు వెంటనే ఆయన్ను సమీపంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన కిమ్స్‌ వైద్యులు చికిత్స చేపట్టారు. ఈసీజీ తీశారు. నాడి స్పందన, అవసరమైన రక్తపోటు కనిపించలేదు.
ఒకవైపు గుండెలపై మసాజ్‌ చేస్తూనే, మరోవైపు ఐ.వి. ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అయినా ఫలితం కనిపించ లేదు. ఆయన గుండెకు రక్తాన్ని పంపించే నాలుగు కవాటాల్లో ఒకదానికి రక్త ప్రసరణ లేదని, మధుమేహం, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీజే ఆర్‌ తీవ్ర గుండెపోటుతో మార్గమధ్యంలోనే మరణించినట్లు భావిస్తున్నామని కిమ్స్‌ సీఈవో డాక్టర్‌ బి.భాస్కరరావు చెప్పారు. పీజేఆర్‌ అంత్యక్రియలను అంబ ర్‌పేట స్మశాన వాటికలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అధికార లాంఛనా లతో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ, మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పీజేఆర్‌ ఇంటి నుంచి శనివారం ఉదయం 9 గంటలకు భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
పీజేఆర్‌ మృతికి సంతాపసూచకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. దేశంలో అతిపెద్ద శాసనసభ నియోజకవర్గమైన ఖైరతాబాద్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీజేఆర్‌ మరణంతో కాంగ్రెస్‌ పార్టీ గొప్ప పోరాట యోధుణ్ని కోల్పోయింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదురులేని నేతగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ ను అనేక అంశాలపై పీజేఆర్‌, మర్రి శశిధర్‌ రెడ్డిలు ఢీ కొట్టి హైదరాబాద్‌ బ్రదర్స్‌గా పేరొందారు. రాష్ట్ర నాయకత్వం కంటే కూడా పార్టీ కేంద్ర నాయక త్వాన్నే ఎక్కువ నమ్మిన పీజేఆర్‌ తన చివరి క్షణాల్లో కూడా ఇందిరమ్మ పేరునే ఉచ్చరించడం విశేషం. భవిష్యత్తులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరే షన్‌ ఎన్నికలు రాబోతున్న తరుణంలో పీజేఆర్‌ ఆకస్మిక మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని నష్టమే.
తెలంగాణ సమస్యలపై సొంత ప్రభుత్వంపైనే గళమెత్తి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న పీజేఆర్‌ మరణం తెలంగాణవాదులను తీవ్ర విచా రంలో ముంచెత్తిందంటే అతిశయోక్తి కాదు. పీజేఆర్‌ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారన్న సమాచారం తెలుసుకున్న వెంట నే పార్టీ ముఖ్యులు వి.హనుమంతరావు, ముఖేష్‌ గౌడ్‌, నాగేందర్‌ తదితరులు కిమ్స్‌కు చేరుకున్నారు. అప్పటికే పీజేఆర్‌ మరణించారని వైద్యులు తెలపడంతో భిన్నులయ్యారు. వీహెచ్‌ భోరున ఏడ్చారు. ఏఐసీసీ కార్యదర్శి ఇక్బాల్‌సింగ్‌, ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.జనార్దనరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణలతో పాటు పలువురు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు కిమ్స్‌కు వెళ్ళి నివాళులర్పించారు.
అనంతరం పీజేఆర్‌ భౌతికకాయాన్ని దోమలగూడలోని ఆయన నివాసానికి తరలించారు. పీజేఆర్‌ మరణవార్త నగరంలో దావానలంలా వ్యాపించింది. నగ రంలో 'స్వచ్ఛంద బంద్‌' జరిగింది. పలుచోట్ల వ్యాపార కేంద్రాలను, విద్యాల యాలను స్వచ్ఛందంగా మూసివేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూడా సంతాపసూచకంగా మూసివేశారు. పీజేఆర్‌ మరణవార్త తెలుసుకున్న నగర ప్రజలు, బస్తీ వాసులు, మురికివాడల బడుగు జీవులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. తమ ఆత్మీయుడిని కోల్పోయామంటూ మురికివాడల ప్రజలు గుండెలవిసేలా రోదించారు. ముఖ్యమంత్రి తన అధికార కార్యమ్రాలన్నీ రద్దు చేసుకున్నారు.

జనార్దనరెడ్డి అంతిమయాత్ర ప్రారంభం, Andhra Jyothi, 29th Dec, 07

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 : గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే జనార్దన రెడ్డి అంతిమయాత్ర శనివారం ఉదయం పది గంటలకు ప్రారంభమయింది. దోమల్‌గూడలోని పిజెఆర్‌ స్వగృహం నుండి పిజెఆర్‌ భౌతికకాయాన్ని లక్డీకపూల్‌ మీదుగా గాంధీభవన్‌కు ఊరేగింపుగా తరలిస్తున్నారు. గాంధీభవన్‌లో రెండు గంటల పాటు పిజెఆర్‌ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్దనార్దం ఉంచుతారు. అనంతరం అబిడ్స్‌, కోఠి, చాదర్‌ఘాట్‌ల మీదుగా పిజెఆర్‌ భౌతిక కాయాన్ని తరలించి అంబర్‌పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంబర్‌పేట స్మశాన వాటికలో నిర్వహిస్తున్న అంత్యక్రియలకు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పాటు పిజెఆర్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే జనార్దనరెడ్డి హఠాన్మరణం , Andhra Jyothi, 29th Dec, 07

పి.జనార్దన రెడ్డి మృతితో ....
ఖైరతాబాద్‌లో విషాదఛాయలు
సోనియా, వైఎస్‌ దిగ్భ్రాంతి !!
మిన్నంటిన అభిమానుల ఆగ్రహజ్వాలలు
పరిస్థితి ఉద్రిక్తం.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే జనార్దనరెడ్డి హఠాన్మరణం
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. జువెల్‌ గార్డెన్స్‌ ప్రాంగణంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటీన మినిస్టర్‌ రోడ్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే 11.30 గంటలకు కన్నుమూశారు. పి. జనార్దాన్‌ రెడ్డి హటాన్మరణంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. జనార్దన్‌ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు శోకసంధ్రంలో మునిగిపోయారు. పిజెఆర్‌ గాంధీభవన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన పార్టీ వ్యవస్థాపక వారోత్సవాల్లో పాల్గొని, గ్రేటర్‌ ఎన్నికల వ్యూహరచనపై జరుగుతోన్న పార్టీ అంతర్గత సమావేశానికి హాజరు కావడానికి బయలుదేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనవలసి ఉంది. జువెల్‌ గార్డెన్స్‌లో జరుగుతోన్న సమావేశ ప్రాంగణంలోకి రాగానే పిజెఆర్‌ కళ్ళు తిరిగి పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అనంతరం హుటాహుటీన అనుచరులు కిమ్స్‌కు తరలించినా పలితం లేకపోయింది. తీవ్ర గుండెపోటుతో మార్గం మధ్యలోనే జనార్దన రెడ్డి కన్నుమూశారు. జనార్దన రెడ్డి హఠాన్మరణంతో హైదరాబాద్‌, సికిందరాబాద్‌ నగరాల్లో విషాద వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తల ఆందోళనతో నగరం నలుమూలలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిజెఆర్‌ నివాసం వద్ద బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో విషాదభరిత వాతవరణం నెలకొంది. ఇప్పటికే హుటాహుటీన హనుమంతరావు, ఉప్పునూతల, వైఎస్‌ వంటి కాంగ్రెస్‌ హేమాహేమీలు కిమ్స్‌ ఆసుపత్రికి చేరుకుని జనార్దన రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రస్తుతం పిజెఆర్‌ మృతదేహాన్ని కార్యకర్తలు, అనుచరులు ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంలోని పలువురు ప్రముఖులకు అత్యంత సన్నిహితులు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ జనార్దన రెడ్డి హఠాన్మరణంతో తీవ్ర ద్రిగ్భాంతికి గురై ఫోను ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. హైదరాబాద్‌ బ్రదర్స్‌లో ఒకడుగా విశేష పేరు ప్రఖ్యాతులు గాంచిన జనార్దన రెడ్డి మృతి ఊహించని పరిణామమని సహచరుడు మర్రి శశిధర రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధినేతలు జనార్దన్‌ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించడానికి వస్తోన్నట్లు తెలుస్తోంది.

స్వపక్షంలో విపక్షం, Eenadu, 29th, Dec. 07

వాగ్దాన భంగాలపై వైరిపక్షం
రాజీలేని 'రాజ'కీయాల్లో కృష్ణపక్షం
కాంగ్రెస్‌లో పీజేఆర్‌ ప్రస్థానం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
పీజేఆర్‌ విలక్షణ రాజకీయ నాయకుడు. సమస్యలతో రాజీ పడడం ఆయన నైజం కాదు. ఏ మాత్రం సర్దుకు పోయినా అందలం ఎక్కే అవకాశం ఉంటుందని తెలిసినా తాననుకున్న దానికే కట్టుబడ్డారు. తాను మంచి అనుకున్నదే చేస్తారు. దానివల్ల రాజకీయంగా తను నష్టపోయే పరిస్థితి ఉన్నా లెక్కపెట్టరు. ఆయనలోని ఈ మొండితనం ఆయన్ను అనేకసార్లు పదవులకు దూరం చేసిందని సన్నిహితులు అంటారు. 1994-99 మధ్య కాలంలో పీజేఆర్‌ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేశారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా పీజేఆర్‌ సమస్యలపై తన పోరాటం నుంచి పక్కకు తప్పుకోలేదు. హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్‌ విపక్షంలో ఉండి వాగ్దానాలకు కట్టుబడాలని ఆయన పట్టుబట్టారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఐమ్యాక్స్‌, రిపబ్లిక్‌ ఫోర్జ్‌ కంపెనీ ఆస్తుల వేలం, తదితర అనేక అంశాల్లో ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక వేసిన సభా సంఘాల్లో ఎక్కువ శాతం పీజేఆర్‌ డిమాండ్‌తో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంపు విషయంలో ఆయన సహ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డితో కలసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ శాసన సభ్యునిగా ఉంటూ ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సమస్యపై ఆందోళనదశలోనే పీజేఆర్‌, శశిధర్‌రెడ్డిలను హైదరాబాద్‌ బ్రదర్స్‌ అనే పేరు వచ్చింది. పోతిరెడ్డి పాడు అంశాన్ని పీజేఆర్‌ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దానివల్ల తెలంగాణాకు ముఖ్యంగా జంట నగరాల తాగునీటి అవసరాలకు ఇబ్బంది అవుతుందని వాదించారు. కాంగ్రెస్‌లో అసమ్మతినేతగా అంతా భావించినా ఆయనెప్పుడూ పార్టీ క్రమశిక్షణను తప్పకుండా సమస్యలపై మాత్రమే గళమెత్తారు. దాంతో పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు ఆయనతో చర్చలు జరిపేది. పోతిరెడ్డిపాడు విషయంలో పీజేఆర్‌ డిమాండ్లతో అప్పటి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రత్యేకంగా ఒక ఇంజినీర్‌తో దానిపై అధ్యయనం చేయించారు. పోతిరెడ్డిపాడు వల్ల ఇబ్బంది లేదని ఇంజినీరు తేల్చారు. పార్టీలో ఒకనిర్ణయం తీసుకున్నాక కొందరికి ఆమోద యోగ్యం కాకున్నా కట్టుబడి ఉండాల్సిందేనన్న పార్టీ సూచన మేరకు దానికి కొంత విరామాన్నిచ్చారు. పోతిరెడ్డిపాడు వివాదానికి ముందు పీజేఆర్‌ ప్రత్యేక తెలంగాణా విషయంలో తన వైఖరిని ఎప్పుడూ బయట పెట్టలేదు. పోతిరెడ్డిపాడుపై పీజేఆర్‌ రాజీలేని పోరాటం చేయడంతో తెలంగాణా వాదుల్లో ఆయన్ను హీరోను చేసింది. అప్పటినుంచి ఆయన ప్రత్యేక వాదిగా ముద్రపడ్డారు. హైదరాబాద్‌ నగరానికి మూడో దశ కింద కృష్ణాజలాలనే రప్పించాలనేది ఆయన డిమాండ్‌. డిపెప్‌ కుంభకోణంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు పాత్రపై విచారణ కోసం పీజేఆర్‌ కొంతకాలంగా సభాసంఘం సమావేశాల్లో తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. సూరీడును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన రెండు రోజుల క్రితం సిఐడి అధికారులను నిలదీశారు. ప్రభుత్వం గోదావరి నీటినితెచ్చే ప్రయత్నాల్లో ఉండడంతో దానిపై ఉద్యమం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు.
మరణించే నాటికి ఆయన కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతినేతగా ఉన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ఆయనకు మధ్య బాగా ఎడం పెరిగి పోయింది. రాజకీయంగా విబేధాలతోపాటు జూబ్లీహిల్స్‌లో జరిగిన కారు సంఘటన రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది.వాస్తవానికి పీజేఆర్‌ ఆది నుంచి వైఎస్‌ వ్యతిరేకి కాదు. 1978లో వైఎస్‌, పీజేఆర్‌లు ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలయ్యారు. ఆ తరువాత 1988లో వైఎస్‌ ఆధ్వర్యంలో రాయలసీమ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ దీక్షల ఏర్పాట్లన్నింటినీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పీజేఆరే పర్యవేక్షించారు. ఆ తరువాత 1994లో పీజేఆర్‌ సీఎల్పీ నేత కాగా 1998లో వై.ఎస్‌ పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి. 1999 ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో అవి మరింత ముదిరాయి. 1999 ఎన్నికల్లో పీజేఆర్‌ ఓటమి పాలవడం, వైఎస్‌ సీఎల్పీ నేత కావడంతో ఆ తరువాత ఇద్దరి మధ్యా విభేదాలు అలాగే ఉండి పోయాయి. 2004లో వైఎస్‌ సీఎం అయ్యాక అంతకుముందు ఆయన్ను వ్యతిరేకించిన అనేక మంది నేతలు ఆయనతో రాజీ పడిపోయారు. ఆయన వద్దకెళ్ళి ఇక మీతోనే ఉంటామంటూ సర్దుకు పోయారు. అటువంటి వారికి మంచి పదవులు దక్కాయి. అయితే పీజేఆర్‌ మాత్రం రాజీపడలేదు. వైఎస్‌ వ్యతిరేక వైఖరిని అలాగే కొనసాగించారు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పీజేఆర్‌లేని మంత్రివర్గమా అని హైదరాబాద్‌ ప్రజలు ఆశ్చర్య పోయారు. వైఎస్‌తో ఏ మాత్రం రాజీపడ్డా తొలి మంత్రివర్గంలోనే పీజేఆర్‌కు పెద్దపీట వేసేవారని సీఎం సన్నిహితులు కూడా అంటుంటారు. సీనియర్‌ నేతగా మీకు అన్యాయం జరిగిందని ఎన్నో సార్లు దిగ్విజయ్‌సింగ్‌ పీజేఆర్‌తో అనే వారు. వైఎస్‌తో విభేదించినా పీజేఆర్‌ ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగించలేదు. చివరి వరకు అసమ్మతి వాదిగా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభ ఎన్నటికీ వెలుగొందాలనే కోరుకున్న నేత ఆయన. అదేవిధంగా చివరకు కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం రోజున అదే సభా వేదిక వద్ద ఆఖరి శ్వాస విడిచారు.

పేదల మనిషి , Eenadu, 29th Dec.

పీజేఆర్‌కు ప్రముఖుల నివాళి
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, సీఎల్పీ మాజీ నేత
పి.జనార్దన్‌రెడ్డి


(పీజేఆర్‌) ఆకస్మిక మరణం పలువురిని కలచివేసింది. ఆయన మృతివార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ముఖేష్‌గౌడ్‌, కొణతాల రామకృష్ణ, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ తదితరులు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా నేతలేమన్నారంటే...


*పోరాటపటిమగల నాయకుడు పీజేఆర్‌ అని మంత్రి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.
*పేదోళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఏకైక నాయకుడు పీజేఆర్‌ అని మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు.
*పేదలకు, వేలాదిమంది కార్మికులకు నేతగా ఉన్న పీజేఆర్‌ ఇకలేరనే విషయాన్ని ఇంకా నమ్మలేకుండా ఉన్నామని మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
*శాసనసభాపక్ష నేతగా, మాజీ మంత్రిగా, అంతకుమించి ప్రజల మనిషిగా ఉన్న పీజేఆర్‌ తమకు అత్యంత ఆప్తుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, నేతలు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ పేదల పక్షపాతని, పలు ప్రభుత్వ కుంభకోణాలను వెలికితీయడంలో ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలున్నాయని సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
*ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ బయటా, లోపలా పీజేఆర్‌ విశేషంగా కృషిచేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, శాసనసభాపక్ష నేత నోముల నర్సింహయ్యలు పేర్కొన్నారు.
*తెలంగాణ వాదంపై నిక్కచ్చిగా నిలిచిన ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెరాస అసమ్మతి ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
*పీజేఆర్‌ మృతి పార్టీకి తీరని లోటని పీసీసీ అధ్యక్షుడు జి.ఎస్‌.రావు వ్యాఖ్యానించారు.
* కార్మిక నేతగా కార్మికుల సంక్షేమానికి పీజేఆర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎల్పీ అభిప్రాయపడింది.
*కార్మిక నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన పీజేఆర్‌ మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
*అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన పీజేఆర్‌ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండే నాయకుడని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు.
*అంకితభావంతో పనిచేసే నేతను కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, రాష్ట్ర మంత్రులు కె.రోశయ్య, జి.చిన్నారెడ్డి, మండలి బుద్ధప్రసాద్‌, ఆనం రాంనారాయణరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా తీరని లోటని కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు.
*పీజేఆర్‌కు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు.
*మూడు దశాబ్దాలుగా జంటనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి, ఆ ప్రాంతంలోని పేదలు, బడుగువర్గాల అభ్యున్నతికి పీజేఆర్‌ ఎనలేని కృషి చేశారని శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి పేర్కొన్నారు.
*పీజేఆర్‌ ప్రజల మనిషని, తనకు మంచి స్నేహితుడని, ఆయన లేనిలోటు బాధాకరమని తెదేపా నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
*పీజేఆర్‌ హఠాన్మరణంపట్ల హోంమంత్రి జానారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
*కార్మికలోకం మంచి నాయకున్ని కోల్పోయిందని తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు.
నేటి ఆటా వేడుకలు రద్దు: అమెరికా తెలుగు సంఘం (ఆటా-2007) హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఆటా వేడుకల తొలిరోజు (శనివారం) కార్యక్రమాలు రద్దయ్యాయి.
రాజకీయ వేధింపులవల్లే మృతి అనుచరుడి ఆరోపణహైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాజకీయ వేధింపులు, ఒత్తిడి కారణంగానే పి.జనార్దన్‌రెడ్డి మృతి చెందారని.. పీసీసీ ప్రధాన కార్యదర్శి, పీజేఆర్‌ సన్నిహితుడు జి.నిరంజన్‌ ఆరోపించారు. పార్టీ శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పీజేఆర్‌ వ్యతిరేకించారని పేర్కొన్నారు.
- న్యూస్‌టుడే యంత్రాంగం

జనం గుండె చప్పుడు, Eenadu, 29th, Dec.07

ఆపన్నులకు అభయహస్తం
రాజీలేని వ్యక్తిత్వం సొంతం
పీజేఆర్‌... ఈ పేరు చెబితేనే జనంలో ఓ కదలిక. ఒక ఉత్సాహం. సమస్యలపై ఆయన కదిలితే అదో అలజడి. ఆయన తమ వెంట ఉన్నారంటే ప్రజల్లో ఒక ధీమా. అంతులేని విశ్వాసం. అర్ధరాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ వెంట నడుస్తారు. జనం బాధను పంచుకుంటారు. కొండంత అండగా నిలబడతారు.
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

అర్ధరాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ ఆయన వెంట నడుస్తారు. జనం బాధను పంచుకుంటారు. కొండంత అండగా నిలబడతారు. ఆయన ఏ పదవిలో ఉన్నా నమ్మిన వారికి న్యాయం చేసేవరకు విశ్రమించరు. బడుగువర్గాలు, కార్మికులంటే ఎంతో ప్రేమ. పదవిలో ఉన్నా.. లేకున్నా.. ఆయనది రాజీలేని మనస్తత్వం. ఆయనే పబ్బతిరెడ్డి జనార్దనరెడ్డి. పీజేఆర్‌గా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులు. హైదరాబాద్‌ ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువైన నేత. నగరంలో ఏమూల ఏపేదవాడికి ఏకష్టమొచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోయే జెన్నన్నను మృత్యువు మింగేసిందంటే జనం తట్టుకోలేకపోతున్నారు.
కార్మిక పక్షపాతి: 'ఓట్లతో గెలిచేవాడు కాదు... ప్రజల్లోంచి పుట్టుకొచ్చేవాడు అసలైన నాయకుడు...' ఈ వాస్తవం పీజేఆర్‌ జీవితంలో అక్షరసత్యం. సామాన్య కుటుంబంలో పుట్టి కార్మికునిగా కంపెనీలో చేరిన ఆయన కార్మికనేతగా ఎదిగారు. అనంతరం రాజకీయాల్లోచేరి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మిక మంత్రి అయ్యారు. మంత్రి పదవి చేపట్టినా... కార్మిక లోకానికి ఆయన ఎన్నడూ దూరం కాలేదు. ఆయన కార్మిక పక్షపాతి. పలు కర్మాగారాల్లో సంఘాలకు నాయకత్వం వహించిన ఆయన కార్మికులకు మెరుగైన జీవితం కోసం నిరంతరం పోరాడారు. 2003, నవంబరులో కూకట్‌పల్లిలోని ఐడీఎల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతిచెందారు. బాధితుల పక్షాన నిలిచిన పీజేఆర్‌ మునుపెన్నడూలేని విధంగా యాజమాన్యం నుంచి రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగాన్ని బాధిత కుటుంబాలకు ఇప్పించారు. అదేవిధంగా 3నెలల క్రితం నాట్కోలో జరిగిన ప్రమాదంలోముగ్గురు కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు కూడా ఇదే రీతిలో నష్టపరిహారాన్ని ఇప్పించారు.
హైదరాబాద్‌ 'బిగ్‌' బ్రదర్‌: అర్ధరాత్రి ఏ ఆదప వచ్చినా 'మా జెన్నన్న పరుగెత్తుకు వస్తాడు...' అనే కొండంత నమ్మకాన్ని సామాన్య కార్మికులు, జనంలో నాటుకు పోయేలా చేయగలిగారు. నగరంలో పేదవాడికి అన్యాయం జరిగితే తక్షణమే ఆయన ప్రత్యక్షమయ్యేవారు. అది చివరికి తమ పార్టీ కార్యాలయానికి సంబంధించిన విషయమైనాసరే. నాంపల్లిలో నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణం వల్ల కొన్ని కుటుంబాల వారు నిర్వాసితులవుతారని దాన్ని వ్యతిరేకించారు. ప్రజలకోసమే పార్టీ అనే భావంతో ఉండేవారు. ఈ మనస్తత్వమే ఆయన్ను హైదరాబాద్‌లో నంబర్‌ వన్‌ మాస్‌ లీడర్‌ను చేసింది. పాన్‌షాప్‌, సెలూన్‌, కిరాణాకొట్టు దేన్ని ప్రారంభానికైనా బేషజం లేకుండా రిబ్బన్‌ కత్తిరించడంలో ఆయన ముందుండేవారు. ఖైరతాబాద్‌ ప్రాంతంలోని ఇలాంటి అనేక షాపుల్లో ఆయన ఫొటోలే ఇందుకు నిదర్శనం. ఆయన పిలుపు ఇస్తే వేలమంది పోగయ్యే పరిస్థితి ఉండేది. 1999లో ఖైరతాబాద్‌ నుంచి ఓడిపోయినా ఆయన ప్రజలతో సంబంధాలు పోగొట్టుకోలేదు. జనంతోనే మమేకమయ్యారు. అదే ఆయనకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అసలు ప్రజలు మన దగ్గరికి రావడం కాదు, మనమే ప్రజల వద్దకు వెళ్ళాలి అనేది పీజేఆర్‌ సూత్రం. ఒకసారి మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటే నేతగా పేరుపడ్డారు.
అధికార 'ప్రతిపక్షం': ప్రజలకు చేసిన వాగ్దానాల అమలులో అధికారులను పరుగులెత్తించే వారు. అధికారపార్టీ కదా అని అధికారులు చెప్పినదానికి తలాడించే నైజం కాదు. అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు మాట మార్చడమంటే ఆయనకు గిట్టేది కాదు. అధికారంలోకి వచ్చాక అనేక అవినీతి ఆరోపణలున్న అంశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీపడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. సమీక్షా సమావేశాల్లో ఆయన ప్రతిపక్షపాత్రలోనే కనిపించేవారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో ఆయన విభేదిస్తున్నా అనేకమంది రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పీజేఆర్‌ వైఖరిని తప్పుపట్టలేకపోయేవారు. పీజేఆర్‌ వ్యతిరేకులు కూడా ఆయనలోని రాజీలేని ధోరణని మెచ్చుకుంటారు. ఆయన ఏంచేసినా పార్టీకి, ఇందిరాగాంధి కుటుంబానికి మాత్రం ఎల్లప్పుడూ విధేయుడుగానే ఉన్నారు. తన కుటుంబ సభ్యులను సమాజంలో మంచి వ్యక్తులుగా చేయాలనే తపన ఉండేది. ఇందులో భాగంగా కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డిని తన రాజకీయవారుసుణ్ని చేయాలని ఆయన అనుకున్నారు. పీజేఆర్‌లో ఆధ్యాత్మికత ఎక్కువ. జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ గుడి ఆయనలో భక్తి ప్రపత్తులకు నిదర్శనం. దేవాలయాన్ని ఆయనే దగ్గరుండి కట్టించారు. ఇప్పటికీ నిత్యం ఉదయాన్నే ఆయన గుడికివెళ్ళి పెద్దమ్మ సన్నిధిలో కొద్దిసేపు గడిపివచ్చేవారు.
గురుదేవోభవ: తన రాజకీయ గురువు మాజీ ముఖ్యమంత్రి అంజయ్య అంటే పీజేఆర్‌కు ఎనలేని గౌరవం. ఆయన్ను అగౌరవంగా మాట్లాడితే ఒప్పుకునేవారు కారు. అంజయ్య మరణం తరువాత ఆయన భార్య మణెమ్మను రాజకీయాల్లోకి తెచ్చి ఎంపీని చేశారు. ఇటీవలే లుంబినీ పార్కులో తన గురువు విగ్రహాన్ని నెలకొల్పారు.
తాను ఎదుగుతూ... నీడనిస్తూ: కేవలం తన ఎదుగుదలను మాత్రమే చూసుకుంటూ... నమ్మినవారిని తొక్కేసే కుటిల రాజకీయాలకు పీజేఆర్‌ దూరంగా నిలిచారు. తన నీడలో మరికొంతమంది నాయకులు రూపుదిద్దుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు. దానం నాగేందర్‌, తెరాస ఎమ్మెల్యే పద్మారావులతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌కూడా ఆయన శిష్యరికంలోనే రాజకీయ జీవితాన్ని మలుచుకున్నారు.


పీజేఆర్‌ హఠాన్మరణం, Eenadu, 29th, Dec.07




పార్టీ వేదిక వద్ద గుండెపోటు ఆసుపత్రికి చేర్చేలోపు మృత్యువాత మహానగరం దిగ్భ్రాంతి శోకసంద్రంలో అభిమానులు నేతల అశ్రు నివాళి నేడు అంత్యక్రియలు గ్రేటర్‌ హైదరాబాద్‌కు సెలవు హైదరాబాద్‌ - న్యూస్‌టుడే



పిలిస్తే పలికే నాయకుడు... కష్టాలెన్ని ఎదురైనా తుదిశ్వాస వరకు పార్టీ ఒడిలోనే బతకాలని తపించే కాంగ్రెస్‌వాది... అధిష్ఠానం ముందు తన వైఖరి కుండబద్దలు కొట్టే నిర్మొహమాటి... సమస్యలపై పోరాటంలో రాజీలేని యోధుడు... కార్యకర్తలకు గుర్తింపు లేకపోతే ఇబ్బంది తప్పదని తరచూ హెచ్చరించే హితైషి... కార్మిక నాయకుడు... ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి హఠాన్మరణం పాలయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌ నగర పార్టీ సమావేశంలో అభిమానించే కార్యకర్తల ఒడిలో కన్నుమూశారు. సికింద్రాబాద్‌ జ్యువెల్‌ గార్డెన్‌లో కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ శాఖ నిర్వహిస్తున్న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలోకి నడుచుకుంటూ వస్తున్న పీజేఆర్‌హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలి పోయారు. కార్యక్తలు ఆయన్ను ఆసుపత్రికి తరలించే లోగానే మరణించారు.
పీజేఆర్‌ జ్యువెల్‌ గార్డెన్‌కు వచ్చేసరికి సమయం ఉదయం పదిన్నర గంటలైంది. వేదికపై ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రసంగిస్తున్నారు. నగరంలో ముఖ్యనేత పీజేఆర్‌ రాకపోవడంతో ఆయన అనుచరులంతా గార్డెన్‌ బయట వేచి ఉన్నారు. పది నిమిషాల్లో పీజేఆర్‌ వచ్చారు. 'పీజేఆర్‌ జిందాబాద్‌' నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. కారుదిగి ఇరవై అడుగులు వేశారో లేదో పీజేఆర్‌ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. పక్కనే ఉన్న అనుచరులు వెంటనే కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.
మరోపక్క నగర కాంగ్రెస్‌ నేతలు పీజేఆర్‌కు స్వల్ప అస్వస్థత వచ్చిందని భావించి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించారు. ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ప్రసంగించాక పీజేఆర్‌ మరణవార్త తెలిసింది. విషయాన్ని చెప్పకుండా 'పీజేఆర్‌ అన్న సీరియస్‌గా ఉన్నారు. కార్యక్రమాన్ని ముగిస్తున్నాం' అని దానం నాగేందర్‌ చెప్పారు. వారంతా కిమ్స్‌ ఆసుపత్రికి బయలు దేరారు.
కిమ్స్‌ ఆసుపత్రి వద్ద వైద్యులు పీజేఆర్‌ను పరీక్షించారు. అప్పటికే ఆయన చనిపోయారని గుర్తించారు. చివరి ప్రయత్నంగా అత్యవసర విభాగానికి తరలించారు. కృత్రిమశ్వాస కల్పించేందుకు యంత్ర పరికరాలతో మర్దనచేశారు. 15 మంది వైద్య నిపుణులు అరగంట పాటు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో చనిపోయినట్లు ప్రకటించారు. అనంతరం ఆయనను దోమల్‌గూడలోని స్వగృహనికి తీసుకువెళ్లారు.
పీజేఆర్‌ హఠాన్మరణం నగర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. తమ ప్రియతమ నేత ఇకలేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు ఆగ్రహావేశాలు, ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ సహా కాంగ్రెస్‌ పార్టీ నేతలు, తెలుగుదేశం, తెరాస, వామపక్షాల నేతలు అశ్రునివాళులు సమర్పించారు
కిమ్స్‌లో ఉద్వేగం... వైద్య చికిత్సల కోసం పీజేఆర్‌ను తరలించిన కిమ్స్‌ ఆసుపత్రిలో ఉద్వేగం నెలకొంది. అపస్మారక స్థితిలో ఉన్నట్లు భావించిన పి.జనార్దన్‌రెడ్డిని అంబులెన్స్‌ నుంచి ఆసుపత్రి అత్యవసర సర్వీసుల విభాగానికి తరలించిన వెంటనే కిమ్స్‌ సి.ఇ.ఒ. డాక్టర్‌ బి.భాస్కర్‌రావు నేతృత్వంలోని వైద్యుల బృందం అరగంట పాటు శ్రమించారు. ఫలితం లేకపోవడంతో పీజేఆర్‌ మరణించారంటూ తెలిపారు. మరణవార్త విన్న అభిమానులు, ప్రజలు వేల సంఖ్యలో కిమ్స్‌ ఆసుపత్రికి తరలివచ్చారు. కొందరు ఆవేశంతో మంత్రి షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ యాదవ్‌లను అడ్డగించారు. ఎంపీ వీహెచ్‌ జోక్యంతో పీజేఆర్‌ భౌతికకాయాన్ని చూసేందుకు అతికష్టం మీద వారు వచ్చారు. పీజేఆర్‌ మరణవార్తతో సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలన్నీ రెండుగంటల పాటు వాహనాలతో స్తంభించి పోయాయి.
తరలివచ్చిన నేతలు పీజేఆర్‌ మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఆసుపత్రికి ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌, నేదురుమల్లి దంపతులు, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఇక్బాల్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, పళ్లంరాజు, రాష్ట్ర మంత్రులు కొణిజేటి రోశయ్య, కొణతాల రామకృష్ణ, రఘువీరారెడ్డి, షబ్బీర్‌అలీ, డాక్టర్‌ గీతారెడ్డి, ముఖేష్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచందర్‌రావు, సీనియర్‌ నేతలు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణరావు, కోదండరెడ్డి, ఎంపీలు వెంకటస్వామి, వి.హనుమంతరావు, తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌ రావు, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి, తెదేపా నేతలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జి.సాయన్న, భాజపా నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, క్రైస్తవ మతప్రచారకుడు కె.ఎ.పాల్‌, సినీ ప్రముఖులు శ్రీహరి, ఎం.ఎస్‌.రెడ్డి, బాబూ మోహన్‌, కార్మిక సంఘాల నేతలు వచ్చారు.
ఇంటి వద్ద శోకసంద్రం కిమ్స్‌ ఆసుపత్రి నుంచి పీజేఆర్‌ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు తీసుకువచ్చారు. అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు ఇంటికి చేరుకున్నారు. పీజేఆర్‌ మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువస్తుండగా కుటుంబసభ్యులు, అభిమానుల రోదనలు మిన్నంటాయి. 'అన్నా... అన్నా... మమ్మల్ని వదిలి వెళ్లావా?' అంటూ ఆయన అనుచరులు ఏడుస్తూనే ఉన్నారు. భార్య సులోచన, కుటుంబసభ్యులు షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంటి పరిసర ప్రాంతాల్లో విషాదం అలుముకుంది.
నేడు అంత్యక్రియలు కార్మిక నేత, ఎమ్మెల్యే పి.జనార్దన్‌ రెడ్డి అంత్యక్రియలను శనివారం అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. పీజేఆర్‌ కూతురు అమెరికా నుంచి రావాల్సి ఉంది.
నేడు సెలవు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డికి అంతిమ నివాళులు అర్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఈసెలవు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జీవో విడుదల అయ్యింది.





ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన్‌ రెడ్డి హఠాత్మరణం, Vartha 28th December


ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పీ.జే.ఆర్‌.ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. ఈయన వయస్సు59 సంవత్సరాలు.జువెల్‌ గార్డెన్స్‌ లో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం లో పాల్గోనేందుకు ఆయన కారు లో వచ్చారు.గేటు దిగుతుండాగా చెమటలు పట్టి ఒళ్లు చల్లబడి సృహ తప్పి పడిపోయాడు. వెంటనే దగ్గర లో వున్న కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.అక్కడ అతను గుండెపోటు తో పడిపోయాడని గుర్తించిన సిబ్బంది ఆపరేషన్‌ కు ఏర్పాట్లు చేస్తూండాగానే ఆయన తుది శ్వాస విడిచారు.ఈ విషయం తెలియగానే పార్టీలో విషాదం అలముకుంది. .

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే జనార్దనరెడ్డి హఠాన్మరణం, Andhra jyothi,28 th December

పి.జనార్దన రెడ్డి మృతితో ....ఖైరతాబాద్‌లో విషాదఛాయలుసోనియా, వైఎస్‌ దిగ్భ్రాంతి !!మిన్నంటిన అభిమానుల ఆగ్రహజ్వాలలుపరిస్థితి ఉద్రిక్తం.


హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దన రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. జువెల్‌ గార్డెన్స్‌ ప్రాంగణంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటీన మినిస్టర్‌ రోడ్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే 11.30 గంటలకు జనార్దన రెడ్డి కన్నుమూశారు. పి. జనార్దాన్‌ రెడ్డి హఠాన్మరణంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. జనార్దన్‌ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు శోకసంధ్రంలో మునిగిపోయారు.

వివరాలు
పోరాట దురంధరుడు పిజెఆర్‌
జనార్దనరెడ్డి హఠాన్మరణంతో ఉద్రిక్త పరిస్థితులు
సోనాబాయ్‌ దేవాలయంలో చోరీ
హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
ఉగ్రవాదుల దౌష్ట్యానికి బెనజీర్‌ భుట్టో బలి
ఓయూలో వేర్వేరుగా విద్యార్థి సంఘాల ఆందోళన
జువెనైల్‌ హోమ్‌ నుంచి 20 మంది పరారీ
నీలోఫర్‌ నుంచి అరుదైన శిశువుల డిశ్చార్జి
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌పార్టీ వ్యవస్థాపక వేడుకలు
హైకోర్టుకు సంక్రాంతి సెలవులు
మందకృష్ణపై కోర్టు ధిక్కారం కేసు
ఎగ్జిబిషన్‌ కోసం సిద్ధమవుతున్న 'నాంపల్లి' మైదానం
నివ్వెర పోయిన నగరం

పీజేఆర్‌కు నేతల నివాళులు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 : పీజేఆర్‌ మృతికి పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన హఠాన్మరణం పార్టీకి, కార్యకర్తలకు తీవ్ర విషాదాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. పీజేఆర్‌ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్‌రెడ్డి, మంత్రి రఘువీరారెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, ఎంపీ వీహెచ్‌తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి నగరానికి తీరని లోటని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. తెలంగాణా సంస్కృతికి పీఏఆర్‌ ప్రతీక అని కాంగ్రెస్‌లో ఉన్నా తెలంగాణా ఉద్యమానికి మద్దతు తెలిపారని గద్దర్‌ అన్నారు. అట్టడుగుస్థాయినుంచి ప్రజానాయకుడిగా ఎదిగారని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.

పీజేఆర్‌ హఠాన్మరణం Eenadu 28-12-07

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్థనరెడ్డి హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆయన మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని జ్యువెల్‌ గార్డెన్స్‌లో ఈరోజు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో పాల్గొనేందుకు ఆయన కారులో వచ్చారు. గేటు దిగుతుండగా ఆయనకు చెమటలు పట్టి ఒళ్లు చల్లబడి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయన తీవ్రమైన గుండెపోటుతో అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఉదయం 11.40 గంటలకు ఆయన మరణించినట్లు ధృవీకరించారు. ఈ వార్త తెలియగానే పార్టీలో విషాదం అలముకొంది. జనార్థనరెడ్డికి 59 సంవత్సరాలు. 1948లో జన్మించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హైదరాబాద్‌లో కాంగ్రెస్‌పార్టీకి గుండెకాయగా మారారు.