Sunday, July 15, 2007

వై ఎస్‌-పీ జే ఆర్‌ వివాదాన్ని పరిష్కరిస్తాం andhrajyothi

ఏ ఐసీసీ ప్రతినిధి సురేష్‌
హైదరాబాద్‌, జూలై 15(ఆన్‌లైన్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఐసీసీ ప్రతినిధి సురేష్‌ చెప్పారు. ఈ వివాదం కారణంగా సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగేందుకు సిద్ధమైన పీజేఆర్‌ను శాంతింపజేసేందుకు ఆదివారం నగరానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

'కారు' వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు, పీజేఆర్‌, వైఎస్‌ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డిలను కలసి పరిస్థితిని సమీక్షించానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో అధిష్ఠానం తలమునకలై ఉన్నందున ఆందోళనను వాయిదా వేసుకోవాలని పీజేఆర్‌కు సూచించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలను కూడా పీజేఆర్‌కు వివరించానని చెప్పారు. తన సూచన మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను ఆయన అభినందించారు.

వారం రోజుల మా శ్రమ వృథాకాదు: వీహెచ్‌
వైఎస్‌-పీజేఆర్‌ కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించరించేందుకు వారం రోజులుగా చేస్తున్న శ్రమ వృథా కాదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. పీజేఆర్‌తో భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను వీహెచ్‌ అభినందించారు.

'కారు' వివాదం పాలనకు అద్దం పడుతోంది : శశిధర్‌రెడ్డి
పీజేఆర్‌ తనయుడిపై, అల్లుడిపై పోలీసులు 307 సెక్షన్‌ కింద నమోదు చేసిన కేసులు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నాయని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందునే పీజేఆర్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పీజేఆర్‌ చేస్తున్న పోరాటం వ్యక్తిగతమైనది కాదని... పార్టీ ప్రతిష్ఠను పెంచడం ద్వారా 2009లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాం గ్రెస్‌ అధికారంలోకి రావడానికేనని చెప్పారు.

లెక్క తప్పీంది 610 అమలులో ప్రతిష్టంభన eenadu


610 అమలులో ప్రతిష్టంభన
స్థానికేతరుల సంఖ్య ఏడువేలకే పరిమితం
21 శాఖల్లో 828 మందికే బదిలీ ఉత్తర్వులు
ఒక్క డెప్యుటేషన్‌ కూడా రద్దు కాలేదు
1975 నుంచీ పరిశీలన హుళక్కే
వెబ్‌సైట్‌లో వివరాలే లేవు
సీఎం హామీలూ బేఖాతరు
హైదరాబాద్‌- న్యూస్‌టుడే
''ఈ నెల 15 కల్లా 610 జీవో అమలు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని పనిని మేం చిత్తశుద్ధితో చేస్తున్నాం.''
- ఈ నెల 2న ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రకటన
జూన్‌ నెలాఖరుకల్లా 610 జీవో అమలును పూర్తి చేస్తామని గతేడాది డిసెంబరు 12న ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఆ తరవాత వెలువడిన ప్రకటన... ఈ నెల 15వ తేదీని గడువుగా పేర్కొంది. ఇదే ఆఖరు గడువని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. వారం రోజుల్లో స్వచ్ఛంద బదిలీలు పూర్తి చేయాలని, 1975 నుంచి స్థానికేతర ఉద్యోగుల లెక్కలు తీయాలని, డెప్యుటేషన్లను రద్దుచేయాలని ఆదేశించారు. కానీ... వాటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. చిత్రమేమిటంటే సీఎం ప్రకటన తరవాత 610 అమలుపై ఊహించని ప్రతిష్టంభన ఏర్పడింది. తరవాత జైభారత్‌రెడ్డి కమిటీ నివేదిక, 1975 నుంచి ఏపీపీఎస్సీ నియామకాల రికార్డుల గల్లంతు వంటి అనేక విస్మయకరమైన అంశాలు వెలుగుచూశాయి.
అరకొర సమాచారం
610 అమలులో భాగంగా అక్రమంగా నియమితులైనట్లు ఇప్పటి వరకు గుర్తించిన ఉద్యోగులు 7,089 మందే. 3,162 మంది పోలీసులు కాగా మరో 3,927 మంది ఇతర శాఖల ఉద్యోగులు. 2002లో జారీ అయిన 124 జీవో కింద 75 శాఖల నుంచి వీరిని గుర్తించారు. దేవాదాయ శాఖలో స్థానికేతరుల లెక్క ఇప్పటికీ తేలలేదు. కొన్ని న్యాయ విభాగాల నుంచి సమాచారం రాలేదు. అయినా ఇంతకు మించి లేరంటూ సాధారణ పరిపాలన శాఖ అధికారులు సీఎంకు, మంత్రివర్గ ఉపసంఘానికి, ఉద్యోగ సంఘాలకు, శాసనసభా సంఘానికి తేల్చి చెప్పేశారు. స్థానికేతరులుగా గుర్తించిన వారిని గత నెల మూడో వారం నుంచి స్వచ్ఛందంగా బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల రెండో తేదీ వరకు 21 శాఖల్లో 828 మందికి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయులు, పోలీసులు పోనూ మిగిలింది 510 మందే. అదే రోజు సీఎం సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నివేదికలను ఇవ్వగా, ఈ సంఖ్య మరీ తక్కువగా ఉందని, 15 వరకు గడువు పొడగించి మరిన్ని స్వచ్ఛంద బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. కానీ, ఈ సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. ఏ ఒక్క శాఖలోనూ స్వచ్ఛంద బదిలీలు జరగలేదు. వాస్తవానికి స్వచ్ఛంద బదిలీలకు గడువు పొడగించినా మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించకపోవడం గమనార్హం. దీంతో గడువు పొడిగింపు నిష్ప్రయోజన తంతుగా మారింది. మరోవైపు స్వచ్ఛంద బదిలీలపై వెళ్లిన వారికి పోస్టింగులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వారి స్థానాలను భర్తీ చేయడంలోనూ శ్రద్ధ చూపడం లేదు.

-డెప్యుటేషన్ల మాటేమిటి: నియామక నిబంధనలకు విరుద్ధంగా డెప్యుటేషన్లపై చేరి విధులను నిర్వర్తిస్తున్నవారిని స్వస్థలాలకు పంపిస్తామని గత నెలారంభం నుంచి ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు అలా ఒక్కరినీ పంపించలేదు. ఈ నెల 2న సమావేశం సందర్భంగా వారం రోజుల వ్యవధిలో డెప్యుటేషన్లను రద్దు చేస్తామని సీఎం ప్రకటించినా ఏ ఒక్క శాఖలోనూ అది జరగలేదు. అసలింతవరకు డెప్యుటేషన్లపై వచ్చిన వారెందరనేదే తేలలేదు. ప్రాథమికంగా 900 మంది అంటూ అంచనా వేసినా వారిని తిప్పి పంపేందుకు ఏ శాఖా చొరవ చూపడం లేదు.

1975 నుంచి లెక్కలేవీ: 1975 నుంచీ నియమితులైన స్థానికేతరుల్ని గుర్తించే ప్రక్రియ ఏమాత్రం జరగడం లేదు. వారం రోజుల్లోనే ఇది పూర్తవుతుందని, ఇప్పటివరకు గుర్తించినవి కాకుండా మరో పది శాతం వరకు స్థానికేతరుల లెక్క తేలవచ్చని సీఎం రెండో తేదీన స్వయంగా చెప్పారు. ఈ కోణంలో ఏ ఒక్క శాఖలోనూ కసరత్తు జరగడం లేదు. సాధారణ పరిపాలన శాఖ కూడా దీనిపై ఏమాత్రం ఒత్తిడి చేయకపోవడం గమనార్హం. ఈ రికార్డులు లేవని పోలీసు శాఖ మొదట్లోనే చేతులెత్తేసింది. ఏపీపీఎస్సీ అధికారులు గత రెండేళ్లు మినహాయిస్తే 75 నుంచి రికార్డులు లేవని తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పేశారు. విద్యాశాఖ సైతం డీఎస్సీల వారిగా వివరాలను సేకరించడానికి ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి 1975 అక్టోబరు నుంచి 85 అక్టోబరు వరకు నియమితులైన 58,952 మంది స్థానికేతరులు గుర్తించి... 1985 డిసెంబరు 30న జారీ అయిన 610 జీవోలో ప్రభుత్వం ఈ సంఖ్యను పేర్కొంది. లెక్కలేవీ దీనికి విరుద్ధంగా లేవని ప్రభుత్వ శాఖలు చెబుతున్నాయి. 1984లో అప్పటి ముఖ్య కార్యదర్శి జైభారతరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. ఇప్పుడా నివేదిక లేదంటూ ప్రభుత్వంచేతులెత్తేయడంపై శాసనసభా సంఘం విస్మయం వ్యక్తంచేసింది. 1985 నుంచి విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో మినహాయిస్తే మిగిలిన శాఖల్లో నియామకాలు అంతంత మాత్రమే. నియామకాల ప్రక్రియకు సంబంధించిన రికార్డులు అన్ని శాఖల్లోనూ భద్రంగా ఉన్నా ఈ లెక్కలు లేవని చెప్పడం ఉద్దేశపూర్వకంగానే జీవో అమలుకు తిలోదకాలు ఇచ్చే ప్రయత్నమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికేతరుల వివరాలపై అనుమానాలను తొలగించేందుకు వారి వివరాలు వెబ్‌సైట్‌లో పెడతామని నెల రోజులుగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు అలాంటిదేదీ లేదు. మరోవంక శాసనసభ సమావేశాల్లో 610 కీలకాంశం కాబోతుండగా... దీని అమలుపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు గత సోమవారం జరగాల్సిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. జీవో అమలుపై నిర్లక్ష్యమే దీనికి కారణమని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.

సీఎం అసంతృప్తితో ఉంటే...: 610ని జూన్‌ నెలాఖరులోగా అమలు చేస్తామని తాను హామీ ఇచ్చినా జరగలేదని శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో అధికారులు నెలాఖరుకల్లా దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అప్పటివరకు శాసనసభా సమావేశాలు జరుగుతాయి కనక అప్పటిలోగా అమలు కావడం అసాధ్యమైన పనే.