హైదరాబాద్ అభివృద్ధికే అధిక నిధులు ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలి వనరుల సమీకరణ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం
ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలద్వారా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో భూముల అమ్మకాన్ని ఆపొద్దని, ఈ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను హైదరాబాద్ అభివృద్ధికే వెచ్చిస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేయడంద్వారా ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ఆయన మంగళవారమిక్కడి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య, పురపాలకశాఖ మంత్రి కోనేరు రంగారావు, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, అధికారులు ఇందులో పాల్గొన్నారు. హుడా భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు తెరాస, ఇతర పార్టీలు చేసిన ఆందోళనను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. భూముల అమ్మకంద్వారా వచ్చే ఆదాయాన్నంతా హైదరాబాద్‌కే వెచ్చిస్తున్న విషయాన్ని ఆయా పార్టీలు మరిచిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలుకు రూ.8,500 కోట్లు, ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ.6,500 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.2,500 కోట్లు, కృష్ణా నీటి సరఫరా రెండోదశకు రూ.వేయి కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.2,500 కోట్లు, పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారికి రూ.500 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.6వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.27,500 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు వైఎస్ సూచించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ విస్తృతంగా అభివృద్ధి చెందినందువల్లే స్థలాల ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలని ఆదేశించారు. స్థలాల అమ్మకం ప్రక్రియను ముమ్మరం చేసి సకాలంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
పన్నులు పెంచం.. కొత్తగా వేయం: రోశయ్య
బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు పన్నులు పెంచడం, కొత్తగా పన్నులు విధించడం వంటి ఆలోచనేదీ సర్కారుకు లేదని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. వనరుల సమీకరణ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఈనెల కాకున్నా వచ్చే నెలలోనైనా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు లోటు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలంటే నిధులు కావాలని, బడ్జెట్‌లో నిర్దేశించిన పన్నుల వసూలుతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయంద్వారా వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని రోశయ్య వెల్లడించారు.
Tuesday, September 18, 2007
Subscribe to:
Posts (Atom)