Tuesday, July 3, 2007

లగడపాటి ఆ సభలో పాల్గొనాల్సింది కాదు eenadu

కోమటిరెడ్డి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం 610 జీవో అమలుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు నిర్వహించిన సభలో పాల్గొనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజగోపాల్‌ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన మంగళవారమిక్కడ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. తెలంగాణను పాకిస్థాన్‌ సమస్యతో పోల్చడం ఎంత మాత్రం తగదని, ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లోని వారే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడం తగదని, ఈ జీవో అమలుకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
పీసీసీ చర్చించాలి: ఎమ్మెల్యే వేదవ్యాస్‌
610 జీవో అమలు నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడటంపై పీసీసీ చర్చించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ అన్నారు. పార్టీ నేతలు ఆవేశపడటం, తొందరపడి మాట్లాడటం మంచిది కాదన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆయన కోరారు. 610 జీవో అమలుతో బదిలీ కావాల్సిన వారు ఏడెనిమిది వేల మందికి మించి ఉండరని చెప్పారు.

సిటీ పోలీసు బదిలీలు 610కి విరుద్ధం: దారా eenadiuu

ఒంగోలు, న్యూస్‌టుడే:

హైదరాబాద్‌ సిటీ పోలీసులుగా పని చేస్తోన్న 1428 మంది కానిస్టేబుళ్లను స్థానికేతరులుగా పేర్కొంటూ బదిలీ చేయటం 610 జి.ఒ.కి విరుద్ధమని ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే, 610 జి.ఒ. సభా సంఘం సభ్యుడు దారా సాంబయ్య పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. 610 జి.ఒ. పేరిట హైదరాబాద్‌ సిటీ పోలీసులను బదిలీ చేయటం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. వీరిని బదిలీ చేయాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీసులు స్పెషల్‌ జోన్‌ పరిధిలో ఉంటారని చెప్పారు. ఈ అంశాలన్నీ తెలిసినప్పటికీ కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వాధినేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బదిలీ అయిన కానిస్టేబుళ్లలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే బదిలీలు నిలిచిపోతాయన్నారు. అప్పుడు ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతుందన్నారు. తెలంగాణా నేతలు 610పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

610పై రేపు కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ eenadu

మరో 17 మందికి బదిలీ ఉత్తర్వులు
610 జీవో అమలును వేగవంతం చేసేలా గురువారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) హరినారాయణ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. మరోవైపు స్వచ్ఛంద బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న 17 మంది స్థానికేతరులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మంగళవారం వరకు మొత్తం బదిలీల సంఖ్య 20 శాఖల్లో 777కి చేరింది. స్వచ్ఛంద బదిలీల కొనసాగింపు, 1975 నుంచి స్థానికేతరుల గుర్తింపు, డిప్యుటేషన్ల రద్దుకు సోమవారం హరినారాయణ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిపై చాలా శాఖల నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. సాధారణ పరిపాలన శాఖాధికారులు వీటన్నింటిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్లతో, అన్ని శాఖల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఈ సందేహాలను నివృత్తి చేయాలని సీఎస్‌ నిర్ణయించారు.

పోలీసుల బదిలీలపై మరో 2 వారాలు యథాతథ స్థితి eenadu

పరిపాలన ట్రైబ్యునల్‌ ఆదేశం

610 జీవో అమలులో భాగంగా పోలీసుల బదిలీకి జారీచేసిన ఉత్తర్వుల అమలుకు పరిపాలన ట్రైబ్యునల్‌ బ్రేకులు వేసింది. వారి బదిలీలపై యథాతథ స్థితిని మరో రెండు వారాలపాటు కొనసాగించాలని ఆదేశించింది. పోలీసు శాఖ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత వారం సుమారు 60 మంది దాకా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా, యథాతథ స్థితిని అమలు చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కౌంటరూ దాఖలు చేయలేదు. మంగళవారం ఆ శాఖ ఉత్తర్వులపై మరో 800 మంది దాకా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వీటిపై కూడా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

610పై హైకోర్టుకెళతా: చేగొండి eenadu

పాలకొల్లు, న్యూస్‌టుడే:

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలకు విఘాతమేర్పడుతోందని ప్రత్యేకాంధ్ర ఉద్యమనేత, నరసాపురం ఎంపీ చేగొండి వెంకటహరరామజోగయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పినదానికి ప్రభుత్వం తలూపుతోందని, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని అంశాలను 610 జీవో ద్వారా అమలు చేయటానికి ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై రెండు మూడు రోజుల్లో హైకోర్టులో రిట్‌ వేస్తానని చెప్పారు. అసలీ జీవోలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని అంశాలను చేర్చవద్దని, ఆంధ్రలో సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేకుండా చేయవద్దని పదే పదే కోరుతున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. దీనికి ఆంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.ఎల్‌.సి.ల అసమర్థతే కారణమన్నారు.

లగడపాటీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు మధుయాష్కీ డిమాండ్‌ andhra jyothy

లగడపాటీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు మధుయాష్కీ డిమాండ్‌
హైదరాబాద్‌, జూలై 2 (ఆన్‌లైన్‌) :'తెలంగాణ' కోరుకోవడమంటే.. భారత్‌-పాకిస్తాన్‌లను విడదీయడం వంటిదంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు.. ప్రత్యేక రాష్ట్ర వాదులను.. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అవమానపరచేవిగా ఉన్నాయని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాఖ్యలపై లగడపాటి తక్షణమే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
అమెరికా వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో లండన్‌ విమానాశ్రయం నుంచి సోమవారం 'ఆన్‌లైన్‌'తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వాదాన్ని భారత్‌-పాకిస్తాన్‌లతో పోల్చడమేమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు లగడపాటి అవగాహనా రాహిత్యాన్ని రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు.
610 జీవో అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదుప్రభుత్వానికి 610 ఉత్తర్వును అమలు చేయాలన్న చిత్తశుద్ధిలేదని మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా పెడదోవ పడుతోందని.. ఇలాంటి సమయంలో తెలంగాణ వాదులంతా సమైక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాలుక తెగ్గోస్తాం andhrajyothy

నాలుక తెగ్గోస్తాం
టీజేకు నరేంద్ర హెచ్చరిక
హైదరాబాద్‌, జూలై 2 (ఆన్‌లైన్‌) తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలు రాహు, కేతువులు అయితే.. తెలంగాణకు అడ్డుపడుతున్న సైంధవుడు కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌(ఎన్‌) అధ్యక్షుడు నరేంద్ర అభి వర్ణించారు.. తెలంగాణను కాంక్షించే వారంతా ఒక వేదికపైకి రావాలని ఆయన సోమవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిలుపుని చ్చారు.
610 జీవో అమలు కోసం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చి.. ఆ కార్యక్రమంలో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా వలస వాద ఉన్నతా ధికారులు ఉన్నంత వరకు జీవో అమలు కాదని పేర్కొన్నారు. సీమ ఉద్యోగులపై చెయ్యేస్తే.. తీసేస్తామంటూ పిచ్చివాగుడు వాగుతున్న వారి నాలిక తెగ్గోస్తామని నరేంద్ర హెచ్చరించారు.
కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి, రాయలసీమ హక్కుల వేదిక నాయకుడు టీజీ వెంకటేశ్‌ సభ్యత, సంస్కారం లేకుండా గూండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా, వీధి రౌడీ లుగా మాట్లాడుతున్నారని నరేంద్ర ఆక్షేపించారు. 610 జీవో అమలు చేయాలని అందరూ కొరుతుంటే పీసీసీ అధ్యక్షునికి మాత్రం అరుపులు, కేకలు, రాద్ధాంతంలా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. కేశవరావుకు ఏ భాషలో చెప్పాలో ఆ భాషలోనే చెప్పేకాలం త్వరలోనే వస్తుందన్నారు. ఈనెల ఆరవ తేదీన జిల్లా కలెక్టరేట్ల వరకు ప్రదర్శనలు నిర్వహించి.. అక్కడ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనిలో టీఎన్‌జీవో లు, విద్యావంతులు, నిరుద్యోగులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటు అవుతుందని నరేంద్ర చెప్పారు.

610కి అటూ ఇటూ vaartha

ముట్టడి భగ్నం
టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు సహా 1,200మంది సచివాలయంవద్ద అరెస్టు
శివార్లలో అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్‌, జూలై 2, ప్రభాతవార్త సిటీబ్యూరో

తెలంగాణప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చే 610 జిఒ అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ టిఆర్‌ఎస్‌ సోమవారం నిర్వహించిన సచివాలయం ముట్టడిని పోలీసులు భగ్నంచేశారు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు ఎన్నో వ్యూహాలురూపొందించుకుని ముందుకువచ్చినా విజయవంతం కాలేకపోయారు. ఉదయం నుంచే నేతలు వ్యూహరచన చేసి మధ్యాహ్నం కాగానే దఫదఫాలుగా కార్యకర్తలను సచివాలయంవైపు పంపించడానికిచేసిన యత్నాలను పోలీసులు ఎప్పటి ప్పుడు అడ్డుకున్నారు. ఇందిరాపార్క్‌వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా నాయకత్వం వహించి ఆందోళలనుచేయగా,ఇదే సమయంలో సచివాలయం ప్రధాన మార్గం వద్ద మెరుపులా వచ్చేందుకుకూడా ప్రయ త్నించారు.అయితే ఎవరూ సచివాలయ గోడలుకూడా తాకలేకపోయారు. రెండుచోట్లా 1200 మం దిని అరెస్టుచేశారు. వీరిలో ఎంపీలు రవీంద్రనాయక్‌, మధుసూధన్‌రెడ్డితోపాటు 13 మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ఆదివారంనుంచే భారీ భద్రత చేబట్టి జిల్లాలనుంచి వచ్చేవారిని ఎక్కడికక్కడే అరెస్టు చేసింది. అక్కడి పోలీసుల కళ్లుగప్పి సాధారణ ప్రయాణీకుల్లా బస్సులు, రైళ్లలో నగరానికి వచ్చిన మిగతావారిని శివారు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.కాగా, ముట్టడికి ముందు ఇందిరా పార్క్‌వద్ద నిర్వహించిన ప్రదర్శనకు పోలీసులు అవాంతరం కలిగించలేదు. ఇలా వచ్చినవారిలో పార్టీ ఎంపీలు రవీంద్రనాయక్‌, వినోద్‌, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పద్మారావు, పద్మాదేవేందర్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు నేతలు ఉన్నారు.వీరంతా సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బ ంగా పోలీసులకు, నేతలకు వాగ్వివాదాలు జరిగాయి.వారందరిని బల వంతంగా అరెస్టుచేసి నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.

ఇలావుంటే, సచివాలయంలోకి దూసుకుపోయేం దుకు 200మందివరకు కార్యకర్తలు తెలుగుతల్లి విగ్రహంనుంచి సచివాలయం ప్రధానమార్గం రోడ్డువద్దకు వచ్చారు.లుంబినీ పార్క్‌లోకి ఉదయమే చేరుకున్న వీరందరూ దఫదఫాలుగా బయట కొస్తున్నట్టు గమనించిన పోలీసులు వెంటనే అదు పులోకి తీసుకున్నారు. లుంబినీ పార్క్‌లో ఉన్న ఇతర కార్యకర్తలనుకూడా అరెస్టుచేశారు. ఉమాదేవి నేతృత్వంలోని మహిళల బృందం కారులోనుంచి దిగి నినాదాలు చేసుకుంటూ సచివాలయం ద్వారం నుంచి లోనికి దూరిపోయారు. వెంటనే పోలీసులు వారినికూడా అరెస్టు చేశారు. జంట నగరాలు, శివారు ప్రాంతాలలో ఐదువేలమందికి పైగా పోలీ సులను బందోబస్తు నిమిత్తం నియమించారు. పోలీసులు ఎక్కడా అతికి పోకుండా మర్యాదపూర్వ కంగానే వ్యవహరించడం గమనార్హం. సచివాలయం వద్ద అశ్విక దళాలను, టియర్‌గ్యాస్‌, వాటర్‌ కెనాన్‌లను సిద్ధంచేశారు. 15 ప్లాటూన్ల ఎపిఎస్పీ, నాలుగు ప్లాటూన్ల సిఆర్‌పిఎఫ్‌తోపాటు పెద్ద సంఖ్యలో హోంగార్డులు ఉదయం 6నుంచి సచివాలయంవద్ద మోహరించింది.


ఇందిరా పార్క్‌ వద్ద ఉద్రిక్తత
దోమలగూడ(ప్రభాతవార్త): తెలంగాణా జిల్లా ల్లోని పలు ప్రాంతాలనుంచి తరలివచ్చిన కార్య కర్తలు ఇందిరాపార్కుకు ఉదయమే చేరుకున్నారు. ఎంపీలు రవీంద్రనాయక్‌, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, టి. పద్మారావు, డాక్టర్‌ నగేష్‌, ఎమ్మెల్సీ ంెహమాన్‌, వెంకటేశ్‌గౌడ్‌ తదితర నేతలు ధర్నా చౌక్‌ వద్దకు చేరుకుని, వందలసంఖ్యలో తరలివచ్చిన ఉద్యమ కారులతో కలసి ఊరేగింపుగా సచివాలయంవైపు కదిలారు. ఇలా కొద్దిదూరం వెళ్ళగానే భారీ ఎత్తున పోలీసులు అడ్డంరావడంతో ఉద్రికత్త నెలకొంది. కొద్దిసేపు పెనుగులాట తర్వాత ఆందోళనకారులను అరెస్టుచేసి వాహనాలలో గోషామహల్‌స్డేడియంకు, నేతలను పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.

అరెస్టులకు భయపడం, ఉద్యమిస్తాం
610 జిఓ అమలును నీరుగార్చడానికి చేస్తున్న పన్నాగాలను సాగనివ్వబోమని టిఆరెసెల్పీ నేత జి.విజయరామారావు, ఉపనేత నాయిని నర్సిం హారెడ్డి, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పద్మారావులు హెాచ్చరించారు. అరెస్టులద్వారా ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపలేదన్నారు. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. ఇక్కడ ఉద్యోగాలలో తెలంగాణేతరులు 5వేలమంది కాదని 75000 మంది ఉన్నారని, న్యాయబద్దంగాచూస్తే 2లక్షల తెలంగాణవారి ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వారు తన్నుకుపోయారని వివరించారు. జిఓ అమలు పేరుతో తెలంగాణవారిని కూడా వారివారి ప్రాంతాలకు పంపించే కుట్ర చేస్తున్నారని, ఇలాంటి విధానాలే కొనసాగిస్తే గుజ్జర్లుచేసిన తరహాలో ఆందో'ళన తీవ్రం చేస్తామని హెాచ్చ రించారు.

ఇంత చేస్తున్నా... రాజకీయ రాద్ధాంతం
15నాటికి స్వచ్ఛంద బదిలీలన్నీ పూర్తి
విలేకర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌

హైదరాబాద్‌, జూలై 2, ప్రభాతవార్త610 జీవో అడ్డంపెట్టుకుని టిఆర్‌ఎస్‌ నాయకులు అనవసరంగా రాజ కీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆరోపించారు. 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అమలు చేయలేని రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుకు శ్రీకారం చుట్టామని, అలాగే 20ఏళ్ల క్రితం జారీఅయిన 610జీవోను కూడా త్రికరణశుద్ధితో అమలు చేస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు కావాలని రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసన్నారు. ఈ సమస్యను రాజకీయ లబ్ధికోసం కొన్ని శక్తులు వాడుకోవడం హాస్యా స్పదమని ముఖ్యమంత్రి విమర్శించారు. 610 జీవో అమలు తీరును నిరసిస్తూ టిఆర్‌ఎస్‌ సోమవారంతలపెట్టిన సచివాలయముట్టడిపై ఆయనను సచివాలయంలో సోమవారంజరిగిన ఒక కార్యక్రమంలో విలేకరులు ప్రస్తావించినప్పుడు పైవిధంగా స్పందించారు. ఇదివరకెన్నడూ జరగని విధంగా ఈ ఉత్తర్వుల అమలుకు తీసుకుంటున్న తమ చర్యలను అన్ని రాజ కీయపార్టీలూ తాము చేస్తున్న మంచిపనిని నిర్ద్వంధంగా సమర్ధిస్తూ, అభినందించాల్సిందిపోయి, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదారిపట్టించే దిశగా ఆందోళనకు దిగడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రపతి జీవోలో పొందుపరిచే అంశాలకంటే ఇంకా ముందుకు పోయి,ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే దిశగా కృషి చేస్తున్నామన్నారు. 610జీవో అమలువిషయంలో సమస్యలేవీ లేకున్నా కావాలని పనిగట్టుకుని సృష్టిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిజానికి అదనంగా ఏడువేల పోస్టులు ఉండగా, 50వేలని, లక్షని, రెండులక్షలంటూ విపక్షాలు తమ ఇష్టమొచ్చే విధంగా మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. అదనంగా ఉన్న ఏడువేలపోస్టుల్లో ఆంధ్రా- తెలంగాణ ప్రాంతాలకు చెరోసగం వంతున ఉన్నట్లు తెలిపారు.ఏడువేల మందిలో మూడువేల మంది హోంశాఖ ఉద్యోగులన్నారు. మిగతా 4వేల ఉద్యోగులు ఇతర శాఖలకు చెందినవారని వీరిలో విద్యాశాఖకు చెందినవారే పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. స్వచ్ఛందంగా సొంత ప్రాంతాలకు వెళ్లాలనకున్న ఉద్యోగులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేస్తున్నామని, ఈ నెల 15వ తేదీనాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధి కారులను ఆదేశించామన్నారు. ఆ తర్వాత డెప్యుటేషన్‌పై వచ్చి అక్రమపద్ధతిలో ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపే కార్యక్రమం చేపడతామన్నాను. ఇందుకోసం ఎన్జీవో సంఘాల ప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ, వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నామన్నారు.బదిలీ ఉత్తర్వులు జారీచేసే విషయంలో అనవసరమైన అపోహలకు పోవద్దన్నారు.స్థానికేతరులు వారంతట వారుపోతుంటే కాదు, కూడదని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. అంతేగాక ఏమి చేసినా బడ్జెట్‌ నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ చట్టానికి లోబడే ఏదైనా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఏ పొరపాటు చేసిన రూ.6వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ గ్రాంటు తగ్గిపోతుందన్నారు. అందువల్ల రాబడులు, వ్యయం అనేఅంశాలు చాలా కీలకమని, వాటి మార్గదర్శకాల పరిధిలోనే పాలనాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 1975నుంచి 124జీవో ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేపట్టే ప్రక్రియ కూడా మొదలుపెడతామన్నారు. హోంశాఖతోపాటు మిగతా అన్నిశాఖలోనూ ఆనాడు ఉండే 80:20 నిష్పత్తిలో స్థానికులు, స్థానికేతరుల (ఓసి) బదిలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ లెక్కన స్థానికేతరులు కేవలం మరో ఐదు లేదా పదిశాతం మందే పెరగొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ తెలిపారు. ఎవ్వరూ ఏదీ అడగడానికి వీలులేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా 610జీవోను అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ బదిలీల ప్రక్రియలో తప్పులు జరగకూడదని, చిన్నపాటి తప్పులు జరిగినా మీడియా పెద్దవిగా చూపెడుతుందని వ్యాఖ్యానించారు. పోలీసులను వెనక్కి పంపితే అందుకు ప్రత్యామ్నాయంగా 3నుంచి 6నెలల వరకు కొందరిని డెప్యుటేషన్‌లో నియమించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
స్థానికేతరులు 7,123 మంది!
610 పై మంత్రుల ప్రకటన
అడిగిన వారందరినీ పంపబోమని, అధికంగా ఉంటేనే పంపుతామని వెల్లడి
'స్వచ్ఛంద'కు 15 రోజుల గడువు
నాన్‌లోకల్‌ రిజర్వేషన్‌ లేదు
20,30,40 శాతాలు ఓపెన్‌ కోటాయే
పోలీసులకు బదిలీ, ఆ వెంటనే ఏడాది డిప్యుటేషన్‌
హైదరాబాద్‌, జూలై 2 ప్రభాతవార్త

చట్ట సవరణ అనివార్యం andhra jyothi

(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో): మహా నగర పాలక సంస్థకు చట్ట సవరణ అనివార్యమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌ఎంసి చ ట్టాన్ని సవరించడం ద్వారానే గ్రేటర్‌ జోనల్‌ కమిషనర్లకు సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తాయి. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం పరిమిత అధికారాలతో పాలనను కొనసాగించాల్సింటుంది. మే 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో గ్రేటర్‌కు లైన్‌క్లియర్‌ అయ్యింది. అధికారుల అంచెలపై కూడా రూపు ఏర్పడింది. అయితే గ్రేటర్‌ అవిర్భావంతో అధికారిక వికేంద్రీకరణ జరపాలనే ప్రభుత్వ ఉద్ధేశానికి హెచ్‌ఎంసి యాక్ట్‌ బ్రేకులు వేసింది. 1955లో రూపొంది ంచిన హెచ్‌ఎంసి యాక్ట్‌ను సవరించడంతోనే గ్రేటర్‌కు మార్గం సుగమమవుతుంది. దీన్ని సవరించకుండా గ్రేటర్‌ను ఏర్పాటు చేయడం చట్టపరంగా వీలుపడదు. అయితే సవరణ ప్రక్రియ పూర్తికావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు ఒడిదుడుకుల మధ్యన గ్రేటర్‌ పాలన కొనసాగనుంది.
జోనల్‌ కమిషనర్ల అధికారాల్లో అస్పష్టత... గ్రేటర్‌లో ప్రతిపాదించిన జోనల్‌ కమిషనర్లకు బదలాయించాల్సిన అధికారాలపై కొంత అనిశ్చితి ఏర్పడింది. జోనల్‌ కమిషనర్‌కు రూ.25 లక్షల వరకు ఆర్థికాధికారం కట్టబెట్టాలని ప్రభుత్వం భావించిప్పటికీ, ఇప్పటికిప్పుడు ఈ అధికారాలను ధారదత్తం చేయడం సాధ్యపడదు. చట్టసవరణ కోసం వేచిచూడాల్సిందే. అప్పటివరకు తన విచ క్షణాధికారంతో కొన్ని అధికారాలను జోనల్‌ కమిషనర్లకు కట్టబెట్టాలని గ్రేటర్‌ కమిషనర్‌ భావిస్తున్నారు. అందులోభాగంగా రూ. 10లక్షల విలువైన పనులు మంజూరు చేసే అధికారాన్ని వీరికి అప్పగించాలని సంకల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. అలాగే ఐదులక్షల ఆర్థికాధికారం ప్రతిపాదించిన డిప్యూటీ కమిషనర్లకు తాజాగా రూ.2 లక్షల విలువైన పనులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. బిల్డింగ్‌ పర్మిషన్లలో సందిగ్దత ఇదిలావుండగా భవన నిర్మాణాల అనుమతుల విషయంలో కొంత గందరగోళం నెలకొంటోంది. డిప్యూటీ కమిషనర్లకు కట్టబెట్టిన జి+2 బిల్డింగ్‌ పర్మిషన్లు జారీపై ఎలాంటి సందిగ్దత లేనప్పటికీ, బహుళ అంతస్తు భవనాల(జి+2 పై అంతస్తులు) విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడంలేదు.
జోనల్‌ కమిషనర్లకు ఈ అధికారం కట్టబెట్టాలని నిర్ణయించినప్పటికీ, బిల్డింగ్‌ కమిటీతో ముడిపడి ఉన్న ఈ అనుమతుల విషయంలో ఉన్నతాధికారులు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. భవన అనుమతులను పరిశీలించే బిల్డింగ్‌ కమిటీలో హుడా, ఫైర్‌, పోలీసు తదితర విభాగాల సభ్యులు ఉంటారు. వీరందరు ఆయా జోన్‌లలో పక్షం రోజులకోసారి జరిగే బిల్డింగ్‌ కమిటీ సమావేశానికి రావాలంటే కుదురుతుందా? లేదా అనే అంశంపై అధికారుల్లో మీమాంస నెలకొంది.అంతేగాకుండా బిల్డింగ్‌ కమిటీకి హాజరయ్యే సభ్యుల హోదా కంటే తక్కువస్థాయిలో ఉన్న కొందరు జోనల్‌ కమిషనర్లుగా వ్యవహరిస్తుండడం కూడా అధికారులను ఇరకాటంలో పడేస్తోంది. ఇదిలావుండగా జోనల్‌ స్థాయిలో జమ,పద్దులతో కూడిన రికార్డులను భద్రపరచాలని నిర్ణయించారు. దీనికోసం ఆయా జోన్ల లో ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌, ఫైనా న్సియల్‌ అడ్వయిజర్‌ను నియమించనున్నారు. వీటితో పాటు కొన్ని రికార్డులను మాత్రం ప్రధాన కార్యాలయంలో కూడా పొందుపరచాలని సంకల్పించారు.


యుద్ధ వాతావరణం andhra jyothi

(ఆన్‌లైన్‌-సిటీబ్యూరో/రాంనగర్‌): 610 జీవో అమలు కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సోమవారం మధ్యాహ్నం పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సెక్రటేరియట్‌ ముట ్టడి కోసం టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నా చౌక్‌ నుంచి కదిలారు. భారీగా మోహరిం చిన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన ్లకు తరలిం చారు. ధర్నా చౌక్‌ రెండు వైపులా ఇనుప కంచెల తో మూసివేసి ఎటువైపూ వెళ్లకుండా చేశారు. చుట్టూ మోహరించిన పోలీసులు టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసు బలగాలను దాటుకొని పోవడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేలు హరీష్‌రావు, నాయిని నరసింహారెడ్డి, పద్మారావులను ఎత్తుకెళ్లి వాహనాల్లో పడేశారు. నాయకులు, కార్యకర్తలు ఎక్కడ నిలబడితే అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
కోవర్ట్‌ ఆపరేషన్‌00 టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయడానికి పోలీసులు పకడ్బందీ వ్యూహం రచించారు. కోవర్ట్‌ ఆపరేషన్‌ కూడా చేశారు. ముందుగా పోలీసులు కొంత మందిని సివిల్‌ డ్రస్సులో టిఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో కలిపేశారు. పోలీ సు అధికారులు వెళ్లి టిఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడుతుం డగానే తిన్నగా అక్కడకు వాహనాలు వచ్చాయి. ఆ వెంటనే వెనకాల టిఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఉన్న పోలీసులే వారిని తోసి వాహనాల్లోకి ఎక్కించారు. మధ్యాహ్నం 12.40 గం టలకు మొదలైన అరెస్టుల కార్యక్రమం రెండు గంటల పాటు ఏకధాటిగా సాగింది. మధాహ్నం 2.40 గంటలకు దర్నా చౌక్‌లో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థులు, కొందరు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ సెక్రటేరియట్‌ లోపలికి వెళ్లే ప్రయ త్నం చేశారు. అక్కడ మోహరించిన పోలీసులు ఆ రెండు బృందాలను అరెస్టు చేశారు.


రోడ్లు మూసివేత
సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని టిఆర్‌ఎస్‌ ముందే ప్రకటించడంతో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. సోమవారం ఉదయమే లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రోడ్డును పోలీసులు మూసివేశారు. ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. పోలీసులు వాహనాలు, అశ్వికదళాలు, వాటర్‌కెనన్‌లను సిద్ధం చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితినైనా తిప్పకొట్టే విధంగా ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. సెక్రటేరియట్‌ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఈ ప్రాంతంలో ఘర్షణ జరగబోతుందన్న భయానక వాతావరణాన్ని పోలీసులు సృష్టించారు. టిఆర్‌ఎస్‌ ముట్టడికి ఎవరూ రారన్న ప్రచారాన్ని కూడా లేవదీశారు. పోలీసుల కళ్ళుగప్పి... పటిష్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, పోలీసుల కళ్ళుగప్పి టిఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాచౌక్‌కు చేరుకున్నారు.
ప్రధాన నాయకులు, కార్యకర్తల ఇళ్ళ వద్ద ఆదివారం నుంచే నిఘా ఏర్పాటు చేసి, వారిని ముట్టడి ర్యాలీకి రాకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. సచివాలయం ముట్టడికి ఐదారువందల మంది వస్తారని పోలీసులు అంచనా వేశారు. వారి అంచనాలు తారుమారయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను సచివాలయం వరకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు సెంట్రల్‌ జోన్‌ డిసిపి ఎగ్బాల్‌, సౌత్‌ జోన్‌ డిసిపి కమలహాసన్‌, చిక్కడపల్లి ఎసిపి సుమతితో పాటు ఇతర అధికారులు ఆగమేఘాల మీద భారీ పోలీసు బలగాలను రంగంలోకి దింపి ధర్నా చౌక్‌కు రెండు వైపులా మూసివేశారు.


ఆంధ్ర అధికారులు కుట్ర: నాయిని
610 జీవో సక్రమంగా అమలు కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న ఆంధ్ర అధికారులు కుట్ర పన్నుతున్నారని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. ఆంధ్ర అధికారులంతా దొంగలని తెలంగాణ అధికారులంతా దద్దమ్మలుగా మరోసారి ఈ జీవో అమలు విషయంలో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. జూన్‌ 30లోగా జీవోను కచ్చితం గా అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌, ఆర్థిక శాఖ మంత్రి రోశయ్యలు దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. వాగ్దానాలు అమలు చేయనందున టిఆర్‌ఎస్‌ చేపట్టిన సచివాలయం ముట్టడికి ప్రభుత్వం పోలీసులతో విఘాతం కలిగించిందన్నారు. జీవో అమలయ్యే వరకు తపోరాటం ఆగదన్నారు.

ముందు ఆంధ్ర అధికారులను పంపాలి: పద్మారావు
ముందుగా ఆంధ్ర అధికారులను పంపిన తర్వాతే తెలంగాణ వారిని తమ సొంత జిల్లాలకు పంపాలని టిఆర్‌ఎస్‌ నగర కన్వీనర్‌, ఎమ్మెల్యే పద్మారావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతూ జీవోను నీరుగార్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌లో ధర్నా సచివాలయం ముట్టడికి తరలివచ్చిన కొందరు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 200మంది కార్యకర్తలు అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ధర్నా చేశారు. శాసనసభ్యులు రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ సత్యనారాయణలను కూడా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సిటీ బస్సుల్లో పబ్లిక్‌ ఫోన్లు
(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో) ఆర్టీసీ బస్సుల్లో త్వరలో పబ్లిక్‌ టెలిఫోన్లు రానున్నాయి. ముంబాయి తరహా బస్సుల్లో పబ్లిక్‌ టెలిఫోన్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల మన్నలను పొందడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అత్యవసర సమయంలో ఫోన్‌ అందుబాటులో ఉంటే ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ముంబాయిలో ఇప్పటికే బస్సుల్లో పబ్లిక్‌ టెలిఫోన్‌ ఉండడంతో ఆ తరహా పద్దతిని సిటీ రీజియన్‌లో కూడా అమలు చేయాలనే దిశగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మేరకు ముగ్గురు అధికారులు ముం బాయి వెళ్లి పబ్లిక్‌టెలిఫోన్‌ పనితీరుపై పర్యవేక్షించి ఒక నివేదికను సిటీ ఆర్‌ఎంకు సమర్పించారు. నివేదికను పరిశీలించిన తరువాత పబ్లిక్‌టెలిఫోన్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌. నాగరాజు తెలిపారు. వీరా బస్సుల్లో ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టే ఆలోచనలో అధికారులున్నారు. అయితే బస్సుల్లో పబ్లిక్‌ టెలిఫోన్‌ రక్షణ... రద్దీ బస్సుల్లో పబ్లిక్‌ టెలిఫోన్‌ ఎంత వరకు సాధ్యమా ? తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. డ్రైవర్‌ వద్ద పబ్లిక్‌ టెలిఫోన్‌ను ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా మెరుగ్గా ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు. సెల్‌ఫోన్‌ లేని ప్రయాణీకులు అత్యవసర సమయంలో బస్సులో ఫోన్‌ వినియోగించుకునే అవకాశముంటుందని ఆర్‌ఎం నాగరాజు తెలిపారు.

సవరణలు కుదరవ్‌! eenadu

జీవో 43పై తేల్చిన న్యాయశాఖ
తప్పదంటున్న జాక్టో
హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
610 జీవో అమల్లో భాగంగా ఉపాధ్యాయుల స్వచ్ఛంద బదిలీలకై విడుదల చేసిన 43 జీవో వివాదం సృష్టిస్తోంది. అందులోని అంశాలు ఏకీకృత సర్వీస్‌కు విరుద్ధంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. దానిని సవరించాలి లేదా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి కార్యాచరణ సమితి (జాక్టో) సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిసింది. ప్రభుత్వం ఏకీకృతానికి కట్టుబడి ఉందా లేదా అని ప్రశ్నించింది. రద్దు చేస్తే పరువు పోతుందని, ఆ జీవోకు తాను సవరణ చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన ఉన్నతాధికారులను పిలిచి సవరణల అవసరాన్ని గుర్తుచేశారు. ఎలాంటి సవరణలూ అవసరం లేదని, సంఘాలు చెబుతున్నట్లు కలెక్టర్లకు అధికారాలిస్తూ సవరణలు చేస్తే మరిన్ని వివాదాలు వస్తాయని న్యాయ శాఖ తిరస్కరించింది.

స్థానికేతరుల్లో సగం తెలంగాణ వారే ! eenadu

వివరాలు వెబ్‌సైట్లో పెడతాం
610పై పార్టీలది రాజకీయం
ఇష్టమొచ్చినట్టు పోస్టులివ్వలేం: సీఎం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
610 అమలుపై ఇప్పటివరకు జరిగిన కసరత్తు చాలా బాగుందని ముఖ్యమంత్రి వైఎస్‌ పేర్కొన్నారు. న్యాయబద్ధంగా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియను నిర్వహిస్తుండగా, కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. జీవోపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడారు. ''ఇప్పటి వరకు 124 జీవో ఆధారంగా 80 శాతం స్థానిక, 20 శాతం ఓపెన్‌ కోటా ప్రాతిపదికన స్థానికేతరుల నిర్ధారణ జరిగింది. దీని ప్రకారం 7089 మందిని గుర్తించాం. ఉద్యోగ సంఘాల డిమాండ్‌ మేరకు, ఇక వెంటనే 1975 నుంచి గుర్తింపు ప్రక్రియ చేపడతాం. దీని ద్వారా స్థానికేతరుల సంఖ్య అయిదు నుంచి పది శాతం పెరగొచ్చు. స్థానికేతర ఉద్యోగుల సంఖ్య 50 వేలు, లక్ష, రెండు లక్షలు అని కొన్ని పార్టీలు చెబుతున్న దానిలో వాస్తవం లేదు. ఇప్పటికి హైదరాబాద్‌లో గుర్తించిన ఏడు వేల పైచిలుకు మందిలో సగం మంది తెలంగాణ జిల్లాల వారే. మిగిలిన సగం ఇతర ప్రాంతాల వారు. వీరందరి సమాచారం త్వరలో వెబ్‌సైట్‌లో పెడతాం'' అని ఆయన ప్రకటించారు. ''30 ఏళ్లుగా అమలుకాని ఈ జీవోను మేం చిత్తశుద్ధితో ఆచరణలోకి తెస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన కృషిని అన్ని పార్టీలు నిర్ద్వంద్వంగా అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల కన్నా ఎక్కువగా మేం దీని అమలుకు చర్యలు తీసుకున్నాం. 610 పరిధిలో లేనప్పటికీ కార్పొరేషన్లు, విశ్వ విద్యాలయాలకూ దీన్ని వర్తింపజేయాలని ఆదేశించాం'' అని ఆయన తెలిపారు. ''వాస్తవానికి ఈ జీవో అమలు జూన్‌ 30లోగానే ముగిసేది. అయితే ఉత్తర్వులపై వివాదాలు, ఇతర సమస్యల వల్ల జాప్యం జరిగింది. ఏ సమస్య అయినా ఉద్యోగ సంఘాలతో చర్చించి, పరిష్కరిస్తున్నాం. ఇక ఎవరూ ఏదీ అడగడానికి వీల్లేకుండా, తప్పులు జరగకుండా జాగ్రత్తగా చేస్తున్నాం'' అని ఆయన వివరించారు. స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చే వారందర్నీ ఎందుకు బదిలీకి అనుమతించడం లేదనే ప్రశ్నకు... ''అందరూ జిల్లాలకు వెళ్తే అక్కడ వారికోసం పోస్టులు సృష్టించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నియామకాలు చేపట్టలేదు. ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ పాటించకపోతే 6వేల కోట్ల రూపాయల కేంద్ర గ్రాంటు రాదు. ఇలాంటివన్నీ చూసుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని ఆయన వివరించారు.
వెంటనే ఉత్తర్వులు: పోలీసు శాఖలో స్థానికేతరులుగా గుర్తించిన వారిలో 2987 మంది కానిస్టేబుళ్లు, 175 ఎస్సైలు ఉన్నారని 610 మంత్రివర్గం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, సభ్యుడు, హోంమంత్రి జానారెడ్డి విలేఖరులకు తెలిపారు. వీరిలో ఇప్పటికే 159 మంది కానిస్టేబుళ్లకు ఉత్తర్వులు అందాయని, మిగిలిన వారికి వెంటనే జారీ చేస్తున్నామని చెప్పారు. అంతమందిని ఒక్కసారిగా పంపిస్తే వినాయక చవితి, ఇతర పండుగల సమయంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున, బందోబస్తు అవసరాల కోసం, డిప్యుటేషన్‌పై కొనసాగించనున్నట్టు వెల్లడించారు. కొత్త నియామకాలు జరిగిన తర్వాత వీరి డిప్యుటేషన్లను రద్దు చేస్తామన్నారు. 610 అమలుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నామని, అన్ని పార్టీలూ దీనికి సహకరించాలని జానారెడ్డి కోరారు. బదిలీ అయిన వారు వెళ్లబోమంటే కుదరదని, నిబంధనల మేరకు వెళ్లాల్సిందేనని స్పష్టంచేశారు.

అరెస్టులతో ఆగిన ముట్టడి eenadu

610పై తెరాస నిరసన భగ్నం సచివాలయానికి చేరింది కొందరే ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు అయినా కళ్లుగప్పి వచ్చిన కార్యకర్తలు హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

610 జీవోను, రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలనే డిమాండ్‌తో తెరాస చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం అరెస్టులతో ముగిసింది. తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా కొందరు తెరాస కార్యకర్తలు వారి కళ్లుగప్పి వివిధ మార్గాల్లో సచివాలయానికి చేరుకున్నారు. పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ముట్టడి యత్నాన్ని భగ్నం చేశారు.

తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ముట్టడి కోసం బయల్దేరిన తెరాస కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పెద్దఎత్తున అరెస్టులు జరిపారు. హైదరాబాద్‌ శివార్లలో కూడా రోడ్లను దిగ్బంధించి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్బంధాలన్నింటినీ అధిగమించి కొందరు తెరాస కార్యకర్తలు నగరంలోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడ తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వారితో కలిశారు. అంతా కలిసి సచివాలయం వైపు సాగే ప్రయత్నం చేశారు. వారిని ముందుకు కదలనీయకుండా పోలీసులు అక్కడే అరెస్టు చేశారు. ముట్టడిలో ప్రత్యక్షంగా పాల్గొనని తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు, వాహనాలు, కాలినడకన వంటి మార్గాల ద్వారా తమ కార్యకర్తలను వ్యూహాత్మకంగా సచివాలయం సమీపానికి చేరవేసి పోలీసులను ఆశ్చర్యపరిచారు. ముట్టడి నేపథ్యంలో సచివాలయం, ధర్నాచౌక్‌ ప్రాంతాలు పోలీసు బలగాలతో నిండిపోయాయి.


అంతా ప్రశాంతం: తెరాస నేతలు, కార్యకర్తలు సోమవారం ఉదయం ధర్నాచౌక్‌కు తరలివచ్చారు. పార్లమెంట్‌ సభ్యులు రవీంద్రనాయక్‌, మధుసూధన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, శాసనసభా పక్షనేత విజయరామారావు, ఉపనేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, చంద్రశేఖర్‌, పద్మారావు, నగేశ్‌, ఈటెల రాజేందర్‌, రామలింగారెడ్డి, లక్ష్మీకాంతారావు, గోవింద్‌నాయక్‌, పద్మా దేవేందర్‌రెడ్డి, తెరాస యువత అధ్యక్షుడు ప్రభాకర్‌, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజా కళాకారులు రసమయి బాలకిషన్‌, దేశీపతి శ్రీనివాస్‌ తదితరులు అక్కడ భేటీ అయ్యారు. చౌక్‌ నుంచి సచివాలయం వైపు దూసుకుపోవాలని, పోలీసుల నుంచి ఎలాంటి ప్రతిఘటననైనా ఎదుర్కోవాలని ముందుగా వారికి పార్టీ నిర్దేశించింది. అయితే చివరిక్షణంలో వ్యూహం మార్చి దూకుడుకు తావివ్వకుండా సంయమనం పాటించింది. నేతలు ముట్టడి ప్రయత్నాలేవీ చేయకుండా బృందాలుగా మంతనాలు సాగిస్తూ పోలీసులను అయోమయ పరిచారు.

పోలీసుల ప్రతివ్యూహం: మరోవైపు పోలీసులు అదనపు బలగాలు, బారికేడ్లను, ఆందోళనకారులను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. ధర్నాచౌక్‌ సిగ్నల్స్‌ వైపు ముళ్లకంచెలు వేశారు. సుమారు మూడువందల మంది పోలీసులు అక్కడ మోహరించారు. కొద్దిపాటి ఉత్కంఠ అనంతరం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో బారికేడ్ల వైపు దూసుకొచ్చిన తెరాస కార్యకర్తలను అరెస్టు చేశారు. స్వల్ప ప్రతిఘటన మధ్య ఎమ్మెల్యేలను పోలీస్‌ వ్యాన్‌లలో, కార్యకర్తలను లారీల్లో తరలించారు. ఇందుకు నిరసనగా వారంతా పెద్దపెట్టున నినాదించారు. బారికేడ్లను దాటి దూసుకొచ్చేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు, మరికొందరు నేతలు, కార్యకర్తలు విఫలయత్నం చేశారు. ప్రతిఘటన తీవ్రత ఊహించినంతగా లేకపోవడంతో పోలీసుల పని సులువైంది. అందరినీ లంగర్‌హౌస్‌, గోల్కొండ పోలీసు స్టేషన్లకు తరలించారు. దారిలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ ప్రాంతంలో కొందరు కార్యకర్తలు తమను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ల టైర్లలో గాలి తీసేసి ధర్నా చేశారు. అదుపులోకి తీసుకున్నాక పోలీసులు మధ్యాహ్న భోజనం, మంచినీరు ఇవ్వలేదంటూ వారు కబాడీ, వాలీబాల్‌ ఆడి నిరసన తెలపడం విశేషం. అంతకు ముందు చౌక్‌ వద్ద కొందరు కార్యకర్తలు ఓ పాడెను మోసుకుంటూ సీఎం డౌన్‌ డౌన్‌ అని నినదించారు. మరోవైపు పోలీసులతో రవీంద్రనాయక్‌కు వాగ్వాదం జరిగింది. స్థానికేతర పోలీసులు తరలిపోయే సమయం వచ్చిందని, అతిగా వ్యవహరించడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిలబడ్డ వారిని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులతో నాయిని వాదానికి దిగారు.
పోలీసుల్ని ఏమార్చి...: ధర్నాచౌక్‌లో అరెస్టుల పర్వం సాగుతుండగానే కొందరు తెరాస కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా సచివాలయం చేరుకున్నారు. ఇందుకు రకరకాల మార్గాలు ఎంచుకుని పోలీసులను ఆశ్చర్యపరిచారు. కొంతమంది ఆర్టీసీ బస్సులో సచివాలయం సమీపం దాకా ప్రయాణించి ఒక్కసారిగా దిగి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరికొందరు సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో ముందుగానే ప్రవేశించారు. అక్కణ్నుంచి సచివాలయం గేటు వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంకొందరు మామూలు వాహనదారుల్లా సచివాలయం సమీపం దాకా వచ్చి, హఠాత్తుగా కిందికి దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గేటు వైపు పరుగు తీశారు. కానీ వారందరినీ పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేసి తరలించారు. ఈ సందర్భంగా మూడు గంటల పాటు సచివాలయంలోకి ఉద్యోగులు, మంత్రులను తప్ప ఎవరినీ పోలీసులు అనుమతించలేదు.

తెలంగాణ వారిని చివరిగా పంపాలి: నాయిని

తమ కార్యకర్తలను బెదిరించడం ద్వారా ముట్టడిని విఫలం చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నిందంటూ తెరాస విమర్శించింది. పలువురిని వేధింపులు, బెదిరింపులకు గురి చేశారంది. 610 అమలు పేరుతో తెలంగాణ వారినే ముందుగా బదిలీ చేస్తూ వారి మధ్య తగాదా పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. దీని వెనక ముఖ్యమంత్రి వైఎస్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారని ఆరోపించారు. 610 అమలులో భాగంగా స్థానికేతర తెలంగాణ ఉద్యోగులూ వెళ్లిపోతారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. అయితే ముందుగా ఆంధ్ర ఉద్యోగులనే పంపాలన్నారు. అనంతరం హరీశ్‌ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులను పంపాలని 610 జీవోలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. కేవలం ఐదు, ఆరు జోన్ల నుంచి స్థానికేతరులను పంపాలని మాత్రమే అందులో చెప్పారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా 610ను పూర్తిగా అమలు చేయిస్తామని ఆయన తెలిపారు.