Monday, October 15, 2007
ఎన్నికలే అంతిమయుద్ధం: కేసీఆర్ Eenadu
నల్గొండ, భువనగిరి, న్యూస్‌టుడే: తెలంగాణ సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం. రాబోయే ఎన్నికలే అంతిమయుద్ధం కావాలి.. జైలుకు వెళ్లద్దు.. లాఠీ దెబ్బలు తినొద్దు.. వ్యాపారాలు, ఉద్యోగాలు మానుకోవద్దు. ఎన్నికలనే వేదికగా చేసుకుందాం. రాజకీయశక్తిగా మనం ఎదగాలని తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 100 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు గెలిపిస్తే.. వారే వచ్చి కాళ్లు మొక్కి తెలంగాణ రాసిస్తారు. జార్ఖండ్ బాటలో రాష్ట్రాన్ని సాధించుకుందాం. జెండా రాజకీయాలు, కాంట్రాక్టులతో గొడవలు పెడుతున్నారు. జెండాలు ఏం ఇచ్చాయి. అంతా మోసం చేస్తున్నాయి. ఎందుకు.. ఎవరికోసం జెండాలు మోస్తారని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు తరలించారు. మూసీ ప్రక్షాళన మరిచిపోయారు. నిధుల ఊసులేదు. నిమ్స్ యూనివర్సిటీ రాలేదు. ఫ్లోరైడ్ భూతం 2 లక్షల మందిని వృద్ధులుగా మార్చేసింది. ఈ జెండాలు, పార్టీల మత్తు వదలి.. మన జెండా పట్టండి. మళ్లీ ఎన్నికల వలలో పడి మోసపోకండని హితవు పలికారు. చంద్రబాబు 9గంటల ఉచితవిద్యుత్తు, వై.ఎస్. రెండు రూపాయల కిలోబియ్యం పథకం అంటూ మళ్లీ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సింగరేణి బొగ్గు మనది.. గోదావరి నీళ్లు మనవి. ఎన్‌టీపీసీకి ఇచ్చే నీరు, బొగ్గుతో 12 గంటలు ఉచిత విద్యుత్తు మనమే ఇచ్చుకుందాం. ఓట్లు మందికేసి బతకొద్దు. యాచించే స్థితిని నుంచి శాసించే స్థాయికి ఎదగాలని కోరారు. తెదేపా, కాంగ్రెస్ దొందు దొందేనని.. జెండాలు వేరైనా ఇద్దరి ఎజెండా ఒకటే. తెలంగాణకు అభివృద్ధిలో పెద్దపీటని మరోసారి మోసం చేస్తున్నారన్నారు. 610 జీవో అమలు విషయంలో ఇద్దరూ నాటకాలాడుతున్నారు. ఏ పార్టీ కూడా చేయదు. జీవో 34తో నీరివ్వమని చెప్పేశారు. కాలువ తవ్వి ఎకరాకు నీరిస్తే రూ.1300 ఖర్చయితే.. తుంపర సేద్యానికి రూ.53వేలు అవుతాయి. 50లక్షల ఎకరాల నీరిస్తామని చెప్పేవి మాటలే. చంద్రబాబు, వై.ఎస్.లకు దగ్గరి పోలికలున్నాయని.. రైతు ఆత్మహత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, చేనేత కూలీల ఆకలిచావులు, మహబూబ్‌నగర్ వలసలు ఆగడం లేదు. సాగునీరు అందదు. ఫ్లోరైడ్ భూతం వదిలించరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు విప్పడంలేదు. సీఎం మెడలు వంచండని డిమాండ్ చేశారు.
Subscribe to:
Posts (Atom)