క్రైస్తవ ఆస్తుల చట్టం వద్దు వెనక్కితగ్గకపోతే ఆందోళన సర్కారుకు కేసీఆర్ హెచ్చరికహైదరాబాద్, న్యూస్‌టుడే: క్రైస్తవ సంఘాల ఆస్తుల పరిరక్షణ ముసుగులో వాటి ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను హస్తగతం చేసుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆరోపించారు. క్రైస్తవ సంఘాల ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టం తీసుకొచ్చే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మొండి వైఖరితో ముందుకెళ్తే ఆందోళనలను చేపట్టి అడ్డుకుంటామని గురువారమిక్కడ తెలంగాణ భవన్‌లో హెచ్చరించారు. చర్చి ఫాదర్లు, పాస్టర్లు, బిషప్పులను భవిష్యత్‌లో ప్రభుత్వమే నిర్ణయించనుందన్నారు. క్రైస్తవ సంస్థల ఆస్తులు వక్ఫ్, దేవాదాయ ఆస్తుల కంటే భిన్నమైనవిగా గుర్తించాలని సూచించారు. ఈ ఆస్తులు చట్టబద్ధంగా కొనుగోలు చేసినవనే అంశాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. 'అంకితభావంతో సేవలు చేస్తున్న సంస్థల ఆస్తులను హస్తగతం చేసుకునే దిశగా సర్కారు ముందుకెళ్తోంది. చర్చిల్లో పెళ్లిళ్లు జరపడానికి ఉన్న షరతులను సరళతరం చేయాలని ఒకవైపు క్రైస్తవ సంస్థలు కోరుతుంటే.. మరోవైపు ఆస్తులను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమించడం దారుణం' అని మండిపడ్డారు.
పోతన కవిని కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా పేర్కొంటున్నారని, ఇంతకంటే దారుణం మరొకటి లేదని కేసీఆర్ విమర్శించారు. వరంగల్ జిల్లాలో కవి పోతన కుటుంబీకులు ఇప్పటికీ ఉన్నారని, ఇలాంటి వాస్తవాలను విస్మరించి కడప ఉత్సవాల్లో పోతనను ఆ జిల్లా వ్యక్తిగా చెప్పడం దారుణమన్నారు. 'పోతనను కడప జిల్లా వ్యక్తిగా పేర్కొన్నందుకు తెలంగాణ ప్రజలకు కడప జిల్లా కలెక్టరు, మంత్రి క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
ప్రజలే తేలుస్తారు: తెలంగాణ ప్రాజెక్టులకు ఎక్కువ నిధులిచ్చినట్లు సీఎం పేర్కొన్న అంశంపై కేసీఆర్ స్పందిస్తూ.. ఈ అంశాలన్నిటినీ ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లు మోకాలిపై నడిచినా ఓట్లు రావని, డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు.