Saturday, July 14, 2007

వై ఎస్ తో అమీతుమీ ? eenadu


రౌడీలకే కాదు.. మాకూ ఆయనే సీఎం
307 కేసు పెట్టించింది కేవీపీ
నా సస్పెన్షన్‌కు 2002 తరహాలో కుట్ర: పీజేఆర్‌
కాంగ్రెస్‌లో సంచలనం
దిగ్విజయ్‌ ఫోను చర్చలు
వీహెచ్‌ మలివిడత రాయబారం
..అయినా పట్టువీడని జనార్దన్‌
నేడు అధిష్ఠాన దూతగా సురేష్‌ రాక
వెనక్కి తగ్గని పీజేఆర్‌
వీహెచ్‌ మలివిడత రాయబారంవ్యవహారం ముదిరి పాకానపడింది. పీజేఆర్‌ అమీతుమీకి సిద్ధమయ్యారు. వైఎస్‌పై మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన రౌడీలకు ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చేలా పరోక్ష విమర్శనాస్త్రాలూ సంధించారు. అంతటితో ఆగకుండా తాజాగా కేవీపీ పేరునూ వివాదంలోకి లాగారు. దీక్ష ప్రారంభించి తీరుతానని చెప్పడం ద్వారా.. అధిష్ఠానం (ఢిల్లీ) వద్దకెళ్లడం కంటే, దీక్షకే తన ప్రాధాన్యమని కుండబద్దలు కొట్టారు. తద్వారా తాను దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో పీజేఆర్‌ వ్యవహారం పార్టీలో పెనుసంచలనమై కూర్చుంది. అందుకే చిన్న వివాదాన్ని ఆయన అనవసరంగా పెద్దది చేస్తున్నారని అధిష్ఠానం పేర్కొంటున్నా.. గట్టిగా ముందడుగు మాత్రం వేయలేకపోతోంది. దిగ్విజయ్‌ శనివారం మరోమారు పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. ఇటు వీహెచ్‌ రాయబారమూ కొనసాగింది. ..అయినా ఇప్పటికైతే ఫలితం శూన్యం! గందరగోళం యథాతథం!!
హైదరాబాద్‌, న్యూఢిల్లీ - న్యూస్‌టుడే


తన కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్‌ కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తున్న అసమ్మతి నేత పీజేఆర్‌ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? పార్టీ అధిష్ఠానం రమ్మని పిలిచినా ఢిల్లీకి పోకుండా ఆమరణ దీక్షకు సన్నద్ధమవడం దానికి సంకేతమేనా? అవుననేదే పీజేఆర్‌ సన్నిహితుల సమాధానం! ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారన్నది వారు చెబుతున్న మాట. అయితే ఆయన కాంగ్రెస్‌ నుంచి బయటికిపోయే ప్రసక్తి ఉండదని.. పార్టీలోనే ఉంటూ వైఎస్‌పై రాజీలేని పోరు సాగిస్తారని వారు చెబుతుండటం గమనార్హం. మొత్తంమీద ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడి పుట్టిస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. వైఎస్‌ సోదరుడితో కారు దగ్గర మొదలైన గొడవ.. ఇప్పటికే పార్టీని చాలామేరకు భ్రష్టు పట్టించిందని.. ఇక దీక్ష కూడా మొదలైతే పరిస్థితి మరింత చెయ్యి దాటిపోతుందన్నది పార్టీ నేతల విశ్లేషణ. పరిస్థితిని గమనిస్తున్న అధిష్ఠానం ఇప్పటికైతే పీజేఆర్‌కు నచ్చజెప్పేందుకే ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడొద్దని.. ఆయనకు ఒకటికి రెండుసార్లు చెబుతోంది. అదేసమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కొంత ఆగ్రహంతోనూ ఉంది. సోనియా సన్నిహితవర్గాలు ఢిల్లీలో స్పందిస్తూ.. ''జరిగింది చిన్న వీధి గొడవ. పార్టీ ప్రతిష్ఠను పణంగాపెట్టి పీజేఆర్‌ దాన్ని రాజకీయం చేయడమేమిటి? అయినా అది నాయకత్వంపై పోరుకు ఎంచుకోదగిన అంశం ఎంతమాత్రం కాదు. దీని ద్వారా ఆయన ఎవరి సానుభూతీ పొందజాలరు'' అని సూటిగా చెప్పాయి. పైగా పీజేఆర్‌ అంత బలమైన స్థితిలో ఏమీలేడనేది గ్రహించాలని వ్యాఖ్యానించాయి. సోనియా సన్నిహితుల అభిప్రాయాలకు అనుగుణంగానే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ శనివారం మరోమారు పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. సంయమనం పాటించాలని సూచించారు.
అధిష్ఠానం వైఖరి ఇలా ఉన్నా పీజేఆర్‌ తన మానాన తాను ముందుకు సాగడం పార్టీ రాష్ట్ర పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి అధిష్ఠానం జోక్యంతో దీక్ష విషయంలో పీజేఆర్‌ వెనక్కితగ్గుతారని వారు భావించారు. కానీ దీక్ష తర్వాతే ఢిల్లీ వెళతానంటూ ఆయన ఏర్పాట్లు చేస్తుండటంతో.. ఇది ఇంతటితోపోయే విషయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదేరోజు ఆయన దీక్ష మొదలుపెడుతున్నారు. జరుగుతున్న పరిణామాలు.. వైఎస్‌పై శనివారం తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తే.. ముఖ్యమంత్రితో అమీతుమీ తేల్చుకునేందుకే పీజేఆర్‌ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు పీజేఆర్‌కు అనుకూలంగా దీక్ష వద్దకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు అసమ్మతి వర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, శంకరరావులు ఆయనకు మద్దతుగా నిలవటం తెలిసిందే.

అసంతృప్తి నుంచి ఆందోళనదాకా..
వైఎస్‌కు, పీజేఆర్‌కు మధ్య రాజకీయవైరం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక పీజేఆర్‌తోపాటు గతంలో వైఎస్‌ను వ్యతిరేకించే పలువురు నేతలు మంత్రి పదవులను ఆశించారు. వారిలో కొందరు పాత వైరాన్ని మరచి వైఎస్‌తో రాజీపడ్డారు. దాంతో వారికి మంత్రి పదవులు దక్కాయి. పీజేఆర్‌ మాత్రం తన పంథా వీడలేదు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తెదేపా హయాంలో కాంగ్రెస్‌ వ్యతిరేకించిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వంటి కొన్ని వ్యవహారాలను అడ్డుకునేందుకు పీజేఆర్‌ ప్రయత్నించారు. తన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకే పీజేఆర్‌ అలా చేస్తున్నారని వైఎస్‌ భావించారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరగడం మొదలైంది. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు, కృష్ణా మూడో దశ, తదితర అంశాల్లో ఆయన వైఎస్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పీజేఆర్‌కు అవకాశమివ్వాలని అధిష్ఠానం సూచించినా.. వైఎస్‌ ససేమిరా అన్నారు. దీంతో ఇద్దరి మధ్యా మరింత అగాథం ఏర్పడింది. వీటన్నింటి నేపథ్యంలో చోటుచేసుకున్న జూబ్లీహిల్స్‌ కారు వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరాన్ని ఏర్పరచింది. వైఎస్‌పై తీవ్రస్థాయి విమర్శలు, ఢిల్లీ రమ్మన్మా వెళ్లకపోవడం వంటి చర్యల మూలంగా.. అధిష్ఠానం వద్ద పీజేఆర్‌ మరింతగా ఇబ్బందుల్లో పడతారనేది సీఎం వర్గీయుల అంచనా! పీజేఆర్‌ మాత్రం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తనతో మాట్లాడుతున్నారంటూ.. పరోక్షంగా తనకూ బలముందని చెప్పే ప్రయత్నం చేస్తుండం విశేషం!

పీజేఆర్‌తో వీహెచ్‌, ఆమోస్‌, మర్రి భేటీ
పీజేఆర్‌తో సీనియర్‌ నేత, ఎంపీ వి.హనుమంతరావు శనివారం రాత్రి మలివిడత చర్చలు జరిపారు. దీక్షను విరమించుకోవాలని, లేదంటే కనీసం రాష్ట్రపతి ఎన్నికలవరకూ వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. సుమారు గంటకుపైగా సాగిన చర్చల్లో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌, పీజేఆర్‌ సన్నిహితుడు మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. తన డిమాండ్లను వెనక్కి తీసుకునేది లేదని వీహెచ్‌కు పీజేఆర్‌ స్పష్టంచేసినట్లు తెలిసింది. తమ ఫిర్యాదే తప్పంటూ, సీఎం సోదరుడిపై కేసు మూసివేయడంపైనే పీజేఆర్‌ ఎక్కువసేపు మాట్లాడారు. తనపట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని.. ఈ పరిస్థితుల్లో వెనకడుగువేయడం తనకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. చర్చల అనంతరం.. పీజేఆర్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలను వీహెచ్‌ ఫోన్‌ ద్వారా అధిష్ఠానానికి(దిగ్విజయ్‌కు) తెలియజేశారు. ఆ తర్వాత వీహెచ్‌ విలేకరులతో మాట్లాడుతూ... చాలా అవమానం జరిగిందని పీజేఆర్‌ బాధపడుతున్నారని చెప్పారు. దీక్షను ఆపడానికి తన ప్రయత్నాలు కొనసాగుతాయని.. ఇంకా 48 గంటల సమయం ఉందని పేర్కొన్నారు.

శశిధర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ... పీజేఆర్‌ కుటుంబంతో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం నాడు, తెదేపా హయాంలో కూడా ఇలా వ్యవహరించలేదన్నారు.

ఇక సురేష్‌ వంతు
రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు నియమితుడైన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సురేష్‌ ఆదివారం హైదరాబాద్‌ వస్తున్నారు. శనివారం రాత్రి వీహెచ్‌ అందించిన సమాచారం నేపథ్యంలో సురేష్‌ను కేరళ నుంచి ఆదివారమే హైదరాబాద్‌ పంపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి ఆయన సోమవారం రావాల్సి ఉంది. ఆయన వీహెచ్‌తో కలిసి వెళ్లి పీజేఆర్‌తో భేటీ అవుతారు. అధిష్ఠానం వైఖరిని ఆయనకు తెలియజెప్పి దీక్ష చేపట్టకుండా చూసేందుకు ప్రయత్నిస్తారు.

పీజేఆర్‌తో ఫోన్‌లో చర్చించిన అనంతరం దిగ్విజయ్‌సింగ్‌ విలేఖరులతో మాట్లాడారు. సమస్య పరిష్కారంలో పీజేఆర్‌ రాజకీయ విజ్ఞత ప్రదర్శిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వివరాలను చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. జూబ్లీహిల్స్‌ సంఘటన రాజకీయ అంశమే కాదని, అదో చిన్నపాటి వివాదం మాత్రమేనని దిగ్విజయ్‌ పునరుద్ఘాటించారు. వైఎస్‌ సోదరుడికి వైద్య పరీక్షలు జరిపిన తర్వాతే పీజేఆర్‌ తనయుడిపై 307 కేసు నమోదైందని వివరించారు.

మధ్యవర్తిత్వం నెరపాలని వీహెచ్‌ను కోరలేదు: వేరే పనిలో తీరికలేకుండా ఉన్నందున పీసీసీ అధ్యక్షుడు కేకేను ఈ వ్యవహారంలో రంగంలోకి దించలేదని దిగ్విజయ్‌ చెప్పారు. మధ్యవర్తిత్వం నెరపాలని ఎంపీ వి.హనుమంతరావుకు పార్టీ ఎటువంటి అధికారం కట్టబెట్టలేదన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తనంత తానుగా వీహెచ్‌ చొరవ తీసుకున్నారన్నారు.

No comments: