Sunday, September 30, 2007
తెలంగాణకు లిఫ్ట్‌లంటే... ఆంధ్రకు నీళ్లు దోచిపెట్టడమే Eenadu
Monday, September 24, 2007
టీడీఎఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ Eenadu
Wednesday, September 19, 2007
అభివృద్ధి అవినీతిలోనే పార్టీపై 'సమాల్' ప్రభావం
Tuesday, September 18, 2007
ఎన్ని ఆటంకాలొచ్చినా భూముల అమ్మకాన్ని ఆపొద్దు Eenadu
ఆందోళనలు, ఇతరత్రా కార్యక్రమాలద్వారా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో భూముల అమ్మకాన్ని ఆపొద్దని, ఈ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను హైదరాబాద్ అభివృద్ధికే వెచ్చిస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేయడంద్వారా ప్రతిపక్షాల వాదనను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్థిక వనరుల సమీకరణపై ఆయన మంగళవారమిక్కడి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి రోశయ్య, పురపాలకశాఖ మంత్రి కోనేరు రంగారావు, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, అధికారులు ఇందులో పాల్గొన్నారు. హుడా భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు తెరాస, ఇతర పార్టీలు చేసిన ఆందోళనను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. భూముల అమ్మకంద్వారా వచ్చే ఆదాయాన్నంతా హైదరాబాద్‌కే వెచ్చిస్తున్న విషయాన్ని ఆయా పార్టీలు మరిచిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలుకు రూ.8,500 కోట్లు, ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ.6,500 కోట్లు, హైదరాబాద్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.2,500 కోట్లు, కృష్ణా నీటి సరఫరా రెండోదశకు రూ.వేయి కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.2,500 కోట్లు, పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ రహదారికి రూ.500 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.6వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.27,500 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చిస్తున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు వైఎస్ సూచించారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ విస్తృతంగా అభివృద్ధి చెందినందువల్లే స్థలాల ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలని ఆదేశించారు. స్థలాల అమ్మకం ప్రక్రియను ముమ్మరం చేసి సకాలంలో లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
పన్నులు పెంచం.. కొత్తగా వేయం: రోశయ్య
బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు పన్నులు పెంచడం, కొత్తగా పన్నులు విధించడం వంటి ఆలోచనేదీ సర్కారుకు లేదని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. వనరుల సమీకరణ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఈనెల కాకున్నా వచ్చే నెలలోనైనా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు లోటు లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలంటే నిధులు కావాలని, బడ్జెట్‌లో నిర్దేశించిన పన్నుల వసూలుతోపాటు కేంద్రం నుంచి వచ్చే సాయంద్వారా వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామని రోశయ్య వెల్లడించారు.
Sunday, September 9, 2007
ఎస్సార్సీ వద్దు వేస్తే స్వయంకృతాపరాధమే! తెలంగాణ సెంటిమెంటే బలం
రెండో ఎస్సార్సీ వద్దుగాక వద్దు.. రాష్ట్రమే కావాలి.. గడువు మించిపోతోంది.. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉంది.. దీన్ని తక్కువ అంచనా వేసినా, ఉదాసీనంగా వ్యవహరించినా మునిగిపోవడం ఖాయం.
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సమన్వయ సంఘం (టీఆర్‌సీసీసీ) సమావేశంలో వెల్లడైన ఏకాభిప్రాయమిది. కాంగ్రెస్ అధిష్ఠానం రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా ప్రకటించిన అనంతరం శనివారం జరిగిన టీఆర్‌సీసీసీ సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది. ఎస్సార్సీ వేయడం స్వయంకృతాపరాధమే అవుతుందని ఒకరిద్దరు మినహా దాదాపు సభ్యులంతా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలంగాణపై తేల్చకుండా నాన్చితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఎస్సార్సీ, అభివృద్ధి అంశాలను కొందరు ప్రస్తావించినా ఇప్పుడు వాటి గురించి చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, తెలంగాణ ఇవ్వాలని కోరడమే శ్రేయస్కరమని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రెండో ఎస్సార్సీని బహిరంగంగా వ్యతిరేకిస్తే అధిష్ఠానం నిర్ణయాన్ని, వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకించినట్లు అవుతుందని, దీనిపై బహిరంగంగా మాట్లాడకుండా టీఆర్‌సీసీసీ సభ్యులు బృందంగా వెళ్లి సోనియా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిర్ణయాన్ని మాత్రం ఆమెకే వదిలిపెట్టాలని నిశ్చయించారు.
2009 ఎన్నికల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని టీఆర్‌సీసీసీ మెజారిటీ సభ్యులు తేల్చి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుని విస్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఇద్దరు సభ్యులు మినహా హాజరైనవారంతా ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని ప్రతిపాదించారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించి ఇతర కీలకాంశాలను చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూముల అమ్మకంపై ప్రభుత్వ వైఖరిని పలువురు సభ్యులు తప్పుపట్టారు. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవడం, తెలంగాణ అభివృద్ధి, 610 జీవో అమలు, పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపైనా చర్చించినా.. అధిక సమయం తెలంగాణకే కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రెండో ఎస్సార్సీ వేస్తే తెలంగాణ రాష్ట్రం కోసం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ప్రారంభించినట్లవుతుందని, అధిష్ఠానం నిర్ణయం కూడా ఇదే అయినపుడు వ్యతిరేకించడం భావ్యం కాదని పీసీసీ కిసాన్ సెల్ ఛైర్మన్ కోదండరెడ్డి ప్రతిపాదించారు. మెజారిటీ సభ్యులు ఆయనతో విభేదించారు. రెండో
ఎస్సార్సీ వూసే ఇప్పుడొద్దని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీఏ ఎస్సార్సీ వేసే అవకాశాలే లేవని, బీఎస్పీ నాయకురాలు మాయావతి అసలే ఒప్పుకోరని మధు యాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే గత ఎన్నికల నాటి ఫలితాలు తారుమారవుతాయని ఎక్కువ మంది సభ్యులు అన్నారు.
అభివృద్ధితో ఓట్లు సాధిద్దాం: జీవన్‌రెడ్డి
'రెండో ఎస్సార్సీతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నాం.. అధిష్ఠానం తిరస్కరిస్తే మరిన్ని చిక్కుల్లో పడతాం' అని మంత్రి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మరేదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. దాని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేమని, ఎలాగైనా తెలంగాణ అంశంపై అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చేందుకు కృషి చేద్దామని సభ్యులు అన్నారు. అభివృద్ధితో ఓట్లు సాధిద్దామని జీవన్‌రెడ్డి అనగా.. కరీంనగర్ ఉప ఎన్నికలో అభివృద్ధి ఏమైందని సభ్యులు ప్రశ్నించారు (ఈ ఉపఎన్నికలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీచేసి తెరాస అధినేత కేసీఆర్ చేతిలో ఓడిపోయారు). అభివృద్ధి కంటే సెంటిమెంటు బలంగా ఉందని పలువురు అన్నారు. అభివృద్ధి అంశం చర్చకు వచ్చినపుడు జీవన్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే పీజేఆర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 'అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు... ఎక్కడుంది అభివృద్ధి' అని పీజేఆర్ అనగా.. తాను కరీంనగర్ గురించి మాట్లాడుతున్నానని మంత్రి సమాధానమిచ్చారు.
సెంటిమెంటును కాదంటే అంతే!
కరీంనగర్ ఉప ఎన్నిక, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న విషయాన్ని స్పష్టంగా చూశామని, దీన్ని విస్మరిస్తే ఇబ్బందుల్లో పడతామని వీహెచ్, మధు యాష్కీ సహా మరి కొందరు సభ్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రలోను కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావడానికి తోడ్పడుతుందని వీహెచ్ అన్నారు. తెలంగాణను కాదంటే ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తారుమారై తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, పులివీరన్న తదితరులు వ్యాఖ్యానించారు. టీఆర్‌సీసీసీలో ఉన్న మంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరని, ఈ నేపథ్యంలో టీఆర్‌సీసీసీని పునర్‌వ్యవస్థీకరించాలని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. భూముల విక్రయాల అంశాన్ని తెలంగాణ ప్రణాళిక, అభివృద్ది మండలి ఛైర్మన్ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి లేవనెత్తగా.. ఈ అంశంపై వీహెచ్, పీజేఆర్ మాట్లాడారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయాల ద్వారా వచ్చే రాబడిని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించకుండా ఇక్కడే వ్యయం చేయాలని అత్యధిక సభ్యులు అభిప్రాయపడ్డారు. 'అసలు డబ్బులెక్కడ వస్తున్నాయి.. ఎకరం భూమిని ఒక రూపాయికి ఇస్తుంటే' అని పీజేఆర్ విమర్శించారు.
అందరి కంటే ముందుంటా: మీరు రాష్ట్రం మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు కావడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులుంటాయి అని కేశవరావును ఉద్దేశించి సర్వే సత్యనారాయణ అన్నారు. కొందరు తనను శంకిస్తుంటారని, అందరికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరేవాడిని తానేనంటూ కేకే స్పందించారు. నేను కొట్లాడినపుడు మీరంతా లేరని వ్యాఖ్యానించి.. తెలంగాణ రాష్ట్రం కోసం అందరికంటే తానే ముందుంటానని చెప్పారు.
Tuesday, September 4, 2007
ఉద్యమానికి పునరంకితమవుదాం Eenadu
హైదరాబాద్, న్యూస్‌టుడే: త్యాగాల పునాదిపై జరిగిన ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పునరంకితమవ్వాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. 'ఇడ్లీ సాంబర్ గో బ్యాక్.. నాన్
ముల్కీ గో బ్యాక్' ఉద్యమంలో అసువులు బాసిన వారి సంస్మరణార్థం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో గల అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెరాస ఏడు భారీ కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది. నాన్ ముల్కీ గో బ్యాక్.. జై తెలంగాణ లాంటి నినాదాలు ఈ సందర్భంగా మిన్నంటాయి. కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణపై వలసవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణను హేళన చేస్తూ అప్పటి మద్రాసు ప్రభుత్వ నేతలు చేసిన ప్రకటనలపై తెలంగాణ విద్యార్థులు 1949లో 'ఇడ్లీ సాంబార్ గో బ్యాక్.. నాన్ ముల్కీ గో బ్యాక్' నినాదంతో ఆందోళన ఉద్ధృతం చేశారన్నారు. ఈ సమయంలో సిటీ కాలేజీ వద్ద పోలీసులు కాల్పులు జరిపి ఏడుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వాదులపై, ఉద్యమకారులపై అవి తొలి పోలీసు కాల్పులన్నారు. ఆ దమననీతి, మోసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ జోహారులు.. జోహారులు.. అమవీరులకు జోహారులంటూ గీతాలను ఆలపించి అందరి కర్తవ్యాన్నీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు నాయిని నర్సింహ్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, పార్లమెంట్ సభ్యులు రవీంద్రనాథ్, ఎమ్మెల్సీలు దిలీప్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.