Friday, June 29, 2007

స్వచ్ఛందం నేటితో సరి నత్తనడకన 610 బదిలీలు eenadu

15 శాఖల్లోనే ఉత్తర్వులు
సొంతజోన్లకు 60 మంది
స్పందించని 84 విభాగాలు
ట్రైబ్యునల్‌కెళ్లిన రెవెన్యూ సిబ్బంది
జులై 10 దాకా యథాతథ స్థితి
నేడు సభాసంఘం, స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 610 అమల్లో భాగంగా స్వచ్ఛంద బదిలీలకు గడువు శనివారంతో ముగుస్తోంది. ఇప్పటివరకు కేవలం 15 శాఖల్లో, 60 మందికే ఈ ప్రాతిపదికన ఆదేశాలు జారీ అయ్యాయి. మిగతా 84 శాఖల్లో దాదాపు 600 మంది వరకు స్వచ్ఛంద బదిలీ కోసం దరఖాస్తులు సమర్పించినా, సంబంధిత శాఖలు ఉత్తర్వులు అందజేయలేదు. గురువారం రెండు శాఖల నుంచి 20 మందిని సొంత జోన్లకు పంపిన సంగతి తెలిసిందే. మిగిలినవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించినా, పెద్దగా స్పందన లేదు. పశు సంవర్థక శాఖ ఏడుగురిని, వ్యవసాయ శాఖ 9 మందిని, సహకార శాఖ 10 మందిని బదిలీ చేశాయి. మరో పది శాఖలు ఒకరిద్దరు ఉద్యోగులకు ఉత్తర్వులిచ్చాయి. కొన్ని శాఖల్లో స్వచ్ఛంద దరఖాస్తులు రానేలేదు. ఎక్కువగా వచ్చిన పాఠశాల విద్యా శాఖలో ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయని భావించినా, ఉమ్మడి సర్వీసు నిబంధనల దృష్ట్యా చివరి నిమిషంలో ఆగిపోయాయి. రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్‌కు 136మంది టీచర్లను పంపించాలని అధికారులు మొదట నిర్ణయించారు. అయితే రంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్‌ పాఠశాలల్లో పనిచేసే వారిని, హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో నియమించేట్త్లెతేనే ఇది సాధ్యమని తేలింది. ఈ రెండింటి సర్వీసులు వేర్వేరు కావడం, వివాదం నడుస్తుండడంతో కొన్ని సంఘాలు అభ్యంతరం చెప్పాయి. దీంతో న్యాయ శాఖ సలహాలు తీసుకున్న తర్వాతే ఈ బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన 250 మంది ఉత్తర్వుల్ని మాత్రం శనివారం ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పారు.
నేటి సాయంత్రానికి చేసేయండి
స్థానికేతరుల ఉద్యోగులకు సంబంధించి జీఏడీకి ఇప్పటికి 99 శాఖల నుంచే సమాచారం అందింది. దేవాదాయం సహా మిగతా మూడు శాఖలూ ఇప్పటికీ వివరాలు అందించలేదు. జాబితా అందించీ, బదిలీలు జరపని శాఖల్లో అందుకు కారణాలేమిటో శుక్రవారం రాత్రికి కూడా జీఏడీకి తెలియలేదు. ఖాళీల వివరాలు అందకపోవడం, రాజకీయ జోక్యం వల్ల ఇబ్బందులు ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. స్వచ్ఛంద బదిలీలకు గడువు ఒకరోజే మిగిలి ఉన్నా, అతి తక్కువ శాఖలే స్పందించడంపై సాధారణ పరిపాలన శాఖ ఆందోళన చెందుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం సాయంత్రానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. శనివారం 610 శాసన సభా సంఘం భేటీ కానుంది. సాయంత్రం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. మొదటి విడత బదిలీల ప్రగతి, తర్వాత చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఇందులో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చిస్తుంది.
రెవిన్యూపై ట్రైబ్యునల్‌ స్టే
హైదరాబాద్‌లో పనిచేస్తున్న రెవిన్యూ ఉద్యోగుల బదిలీల విషయంలో యథాతథ స్థితి అమలు చేయాలంటూ పరిపాలన ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 610 జీవో అమల్లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తదితర అధికారులు జారీ ఆదేశాలను సవాలు చేస్తూ కె.ప్రవీణ్‌రెడ్డి మరికొందరు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులతో బదిలీ అయినవారంతా హైదరాబాద్‌లోనే నియమితులు (అపాయింట్‌) అయ్యారని పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదించారు. వారు ఇతర జిల్లాల్లో నియమితులై, బదిలీపై గానీ డిప్యుటేషన్‌పై గానీ ఇక్కడకు రాలేదనీ, అందువల్ల వారికి 610 వర్తించదని అన్నారు. హైదరాబాద్‌ అవసరాల కోసమే నియమితులైనవారిని బదిలీ చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఇక్కడే పనిచేస్తున్న వారిని, కొన్ని అంశాలకు లోబడి బదిలీ చేయడం, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి కేసే మరొకటి పెండింగ్‌లో ఉందని, అప్పట్లో స్టేటస్‌కో మంజూరు చేసిందని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకువచ్చారు. బదిలీలకు ఆదేశిస్తూ ఈనెల 21న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, 23న రెవిన్యూ ముఖ్య కార్యదర్శి, 27న భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై తగిన సమాచారం కోసం గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరడంతో ట్రైబ్యునల్‌ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది. ట్రైబ్యునల్‌ స్టే విషయం తెలిసి, కొన్ని శాఖలు తాము ఉత్తర్వులివ్వాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాయి. అయితే ఆ స్టే ట్రైబ్యునల్‌కు వెళ్లిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన శాఖలు యథాతథంగా ఉత్తర్వులను జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ సూచించింది.

No comments: