Friday, June 29, 2007

పంపుతున్నది పిడికెడే ఇంకా గంపెడున్నారు! eenadu

ముందుంది ముసళ్లపండుగ

సచార్‌ నివేదికను అమలు చేయాలి

కేబీఆర్‌ పార్కు పేరు మార్చేస్తాం

జీవో 34పై అఖిలపక్షం: కేసీఆర్‌

హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

జీవో 610 అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించ తలపెట్టిన స్థానికేతరుల సంఖ్య పిడికెడేనని తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఇంకా గంపెడంత మందిని పంపాల్సి ఉందని తెలిపారు. 'ముందుంది ముసళ్ల పండుగ' అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ''సచివాలయం సహా అన్ని శాఖల ఉద్యోగాల్లోనూ తెలంగాణకు సహజ వాటా కావాల్సిందే. తెలంగాణకు పెద్దపీట అంటున్న వైఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో వీలైనంత అన్యాయం చేస్తోంది'' అని విమర్శించారు. హైదరాబాద్‌లోని హార్టికల్చర్‌ కళాశాలలో అడ్మిషన్లు ఇవ్వద్దంటూ జారీ చేసిన జీవో 134ను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. ''సంబంధిత బోర్డు అనుమతి కూడా తీసుకోకుండానే హార్టికల్చర్‌ కళాశాలలో అడ్మిషన్లు ఎత్తేస్తున్నారు. బదులుగా రాయలసీమలో, మహబూబ్‌నగర్లో ఒక్కో కళాశాల చొప్పున ఏర్పాటు చేస్తామంటున్నారు. కడప విశ్వవిద్యాలయాన్ని ఎన్నడో పూర్తి చేసిన వైఎస్‌... దాంతోపాటు తలపెట్టిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి బుధవారం శంకుస్థాపన చేశారు'' అని కేసీఆర్‌ విమర్శించారు. జీవో 34కు వ్యతిరేకంగా రాష్ట్రస్థాయిలో త్వరలో అఖిలపక్షం నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. దీనిపై నల్గొండలో నిర్వహించిన భేటీకి కాంగ్రెస్‌ తప్ప అన్నీ పార్టీలూ వచ్చాయన్నారు.


అసఫ్‌జాహీ బాగ్‌గా కేబీఆర్‌ పార్కు ముస్లింల స్థితిగతుల మెరుగుదలపై రాజేంద్రకుమార్‌ సచార్‌ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇందుకోసం జులై 10న తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ధర్నాలో తాను పాల్గొంటానని ఆయన తెలిపారు. ''సచార్‌ నివేదికను అమలు చేయాలంటూ వైఎస్‌కు ఇప్పటికే వినతిపత్రం ఇచ్చాం. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయాలంటూ సభలోనే ప్రతిపాదించాం. కేంద్రాన్నీ డిమాండ్‌ చేస్తున్నాం'' అన్నారు. తెలంగాణ ముస్లింలకు అన్నింటా అన్యాయమే జరుగుతోందని కేసీఆర్‌ ఆరోపించారు. ''హైదరాబాద్‌లో ఎన్నో కట్టడాలు నిర్మించిన అసఫ్‌జాహీ వంశస్తుల పేరును ప్రభుత్వం ఎక్కడా వాడటం లేదు. వారి వారసులకు పరిహారమైనా ఇవ్వకుండా చిరాగ్‌ ప్యాలెస్‌ను కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుగా మార్చారు. దీనికి 1969 ఉద్యమంలో 400 మంది ఉద్యమకారుల్ని చంపించిన వ్యక్తి పేరు పెట్టడం దారుణం. తెలంగాణ రాగానే ఆ పార్కుకు అసఫ్‌జాహీ బాగ్‌గా పేరు మారుస్తాం'' అని పేర్కొన్నారు. తెరాస వారు చెవుల్లో పువ్వులు కాకుండా క్యాబేజీలు పెట్టుకోవాలన్న ఏపీఎన్జీవో నేతల వ్యాఖ్యలపై తానేమీ వ్యాఖ్యానించబోనని కేసీఆర్‌ అన్నారు. దాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు. వారిలా తమకు నీచ సంస్కారం లేదని వ్యాఖ్యానించారు. 'మేం ఆంధ్ర వాళ్ల నీళ్లు, ఉద్యోగాలు కోరలేదు. కొల్లగొట్టిన వారికే అంతుంటే కోల్పోయిన వారికి ఇంకెంతుంటుంది?' అని ఆవేశంగా ప్రశ్నించారు.


No comments: