తెలంగాణ సంఘాల్ని పిలవకూడదు
వేర్వేరుగా చర్చించండి
జేఎస్‌సీ సభ్యుల డిమాండ్
హైదరాబాద్, న్యూస్‌టుడే: 610 అమలుపై ఉద్యోగ సంఘాల మధ్య లుకలుకలు ముదురుతున్నాయి. రెండు వారాల క్రితం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలోనే బయటపడిన ఇవి, తాజాగా మరింత తీవ్రమయ్యాయి. శనివారం సాయంత్రం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో పాల్గొన్న కౌన్సిల్ అధికారిక ప్రతినిధులు నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ కార్యాలయానికి వెళ్లి, ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం లేని తెలంగాణ ఉద్యోగ సంఘాల వైఖరి సరిగా లేదని, సమావేశంలో జరిగిన చర్చలను బయటికి వెళ్లి వక్రీకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వచ్చేవారం జరిగే సమావేశానికి వాటిని పిలవకూడదని, కౌన్సిల్ అధికారిక సభ్యులను మాత్రమే ఆహ్వానించాలని సూచించారు. (శనివారం నాటి సమావేశానికి... కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం లేని ఏడు తెలంగాణ ఉద్యోగ సంఘాలను కూడా, ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆహ్వానించారు.) కావాలంటే సమన్వయ కమిటీ పేరిట తెలంగాణ సంఘాలతో విడిగా మరో సమావేశం నిర్వహించాలని కౌన్సిల్ ప్రతినిధులు ప్రతిపాదించారు. దీనిని పరిశీలిస్తానని సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో స్టాఫ్ కౌన్సిల్ అధికారిక సభ్యులకు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్న విభేదాలు మరోసారి వెల్లడయ్యాయి. స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, దానికి తెలంగాణ సంఘాలను ఆహ్వానించకపోవడం గమనార్హం.
లెక్క తప్పు... తెలంగాణ సంఘాలు:610 అమలు కోసం అధికారులు గుర్తించిన స్థానికేతరుల లెక్క తప్పుల తడక అని తెలంగాణ ఉద్యోగ సంఘాలు విమర్శించాయి. గతంలో ప్రభుత్వం నియమించిన కమిషన్లే 59 వేలకు పైగా స్థానికేతరులు తెలంగాణాలో ఉన్నట్లు తెలపగా, అధికారులు మాత్రం మూడు నుంచి నాలుగు వేలే అనడం సమంజసం కాదని పేర్కొన్నాయి. స్థానికేతరుల వాస్తవ లెక్కలు బయటపెట్టాలని ఈ సంఘాల నేతలు స్వామిగౌడ్, విఠల్, ప్రభాకర్ శనివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చల్లోనూ, ఆ తర్వాత కూడా వారీ అంశాన్ని లేవనెత్తారు. జనాభా ప్రాతిపదికన రాజధానిలోని సచివాలయం, ఇతర శాఖాధిపతుల కార్యాలయాల్లో సమ న్యాయ వాటా అమలు చేయాలని కోరారు. 229 ఉపాధ్యాయ బదిలీల కోసం జారీ చేసిన ఉత్తర్వులు వారిని అయోమయానికి గురి చేస్తున్నాయని పీఆర్‌టీయూ నేత రవికిరణ్ విమర్శించారు. జంట నగరాల్లోని పోలీసులను బలవంతంగా జిల్లాలకు పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రా ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్ విమర్శించారు. కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా, నేరుగా జిల్లాల్లో జాయిన్ చేయించి, ఆ తర్వాత ఉత్తర్వులు చేతులో పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు.
No comments:
Post a Comment