Wednesday, July 4, 2007

జీవో 43ను రద్దు చేయాలి andhrajyothy

హైదరాబాద్‌, జూలై 4 (ఆన్‌లైన్‌): స్థానికేతర టీచర్లను సొంత జిల్లాలకు పంపించే ప్రక్రియలో భాగంగా పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో 43ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ నేతలు బుధవారంనాడిక్కడ పాఠశాల విద్యా డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ సిబ్బంది లోపలికి వెళ్ళకుండా అడ్డుకొని,పాఠశాల విద్యా డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘెరావ్‌ చేశారు. దీంతో పోలీసులు ఎంఎల్‌సీలు మోహన్‌రెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీనివాసులు నాయుడు, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట రెడ్డి, రవికిరణ్‌లతో సహా పలువురిని అరెస్టు చేసి తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.

అంతకు ముందు మోహన్‌రెడ్డి, వెంకటరెడ్డిలు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయానికి వెళ్ళి ధర్నా నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకోసం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సీబీ ఎస్‌ వెంకటరమణ, డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం అక్కడకు వస్తారని ఉపాధ్యాయ నేతలు భావించారు. అయితే, ఉన్నతాధికారులిద్దరూ పాఠ్య పుస్తకాల సరఫరాపై డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే పేరిట పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమానికి హాజరు కాలేదు.

దీంతో నేతలంతా పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ చేరుకొని, అక్కడ డైరెక్టర్‌ను ఘెరావ్‌ చేయడంతో అరెస్టులు జరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలనుంచి సొంత జిల్లాలకు బదిలీ అయినవారిలో పంచాయతీరాజ్‌ టీచర్లకు జిల్లా పరిషత్‌ సీఈఓలు, ప్రభుత్వ టీచర్లకు డీఈఓలు పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వాలని జీవో 43లో నిర్దేశించడం వివాదాస్పదమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఈ నెల 17వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

No comments: