Wednesday, July 4, 2007

స్వచ్ఛందానికి స్పందన కరవు eenadu

20 శాఖల్లో 802 మంది బదిలీ
55 శాఖల్లో ఒక్క ఉత్తర్వూ జారీ కాలేదు
రాష్ట్రంలో 610 జీవో అమల్లో భాగంగా స్వచ్ఛంద బదిలీలకు గడువు పెంచినా ఆశించిన స్పందన లేదు. 7వేల మందికి పైగా స్థానికేతరులను గుర్తించినప్పటికీ ఇప్పటిదాకా 802 మందికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు 1975 నుంచీ ఉన్న స్థానికేతర ఉద్యోగుల జాబితా గుర్తింపు ప్రక్రియపై సవాలక్ష సందేహాలు తలెత్తటంతో ఏ ఒక్క శాఖలోనూ దీన్ని ప్రారంభించలేదు. పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా నత్తనడకన సాగుగుతోంది. చాలా శాఖలు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

స్వచ్ఛంద బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ గతనెల రెండో వారం నుంచి మొదలయింది. 27 నుంచి ఉత్తర్వులివ్వడం మొదలుపెట్టారు. బుధవారం వరకూ 20 శాఖల నుంచే బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు, విద్యా శాఖలు జారీ చేసిన ఉత్తర్వులపై వివాదాలు నెలకొని బదిలీలు నిలిచిపోయాయి. సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, పశు సంవర్థక, నీటిపారుదల, రెవెన్యూ, రవాణా- రోడ్లు- భవనాలు, యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక, ఉన్నత విద్య, ఆర్థిక, ఇంధన, పురపాలక, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, జీఏడీ, ప్రణాళిక శాఖల నుంచి 573 మందికే ఉత్తర్వులిచ్చారు. స్వచ్ఛంద బదిలీలకు ఈ నెల 16 వరకే గడువును నిర్దేశిస్తూ మూడురోజుల క్రితం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత కేవలం నాలుగు శాఖల నుంచే ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 75 శాఖలకు గాను ఇంకా 55 శాఖల నుంచి ఒక్క ఉత్తర్వు జారీ గాకపోవడం సాధారణ పరిపాలన వర్గాల్లో విస్మయం కలిగించింది. సీఎం నిర్దేశించిన గడువుకు మరో పది రోజులే ఉండగా ఈ లోపే అన్ని శాఖల నుంచి ఉత్తర్వులు జారీ చేయించాలనే ఉద్దేశంతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణకు పూనుకున్నారు. మరోవైపు 1975 నుంచి స్థానికేతరుల గుర్తింపు ప్రక్రియకు ఉత్తర్వులు ఇచ్చినా ఇది ఎక్కడా జరగలేదు. కొన్ని శాఖలు తమ వద్ద జాబితాలు లేవని చెప్పగా, మరికొందరు మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తంచేశారు.
ముల్కీ నిబంధనల్ని పునరుద్ధరించాలి : ఆరు సూత్రాల పథకంలో మొదటి ఐదు నిర్వీర్యమయినందున చివరి సూత్రంలో చెప్పినట్లు ముల్కీ నిబంధనల్ని పునరుద్ధరించి, తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని ఒకే జోన్‌గా పరిగణించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది.

No comments: