Tuesday, July 24, 2007

610 జీవోపై 'జానా'కు అవగాహన లేదు : చేగొండి Andhra Jyothi

హైదరాబాద్‌, జూలై 24 (ఆన్‌లైన్‌): హోం మంత్రి జానారెడ్డికి 610 జీవోపై సరైన అవగాహన లేదని , అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపి చేగొండి హరిరామజోగయ్య ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1975 నగర పోలీసు చట్టం ప్రకారం ఎలాంటి రిక్రూట్‌ మెంట్లు జరగలేదని జానారెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనకు జీవోపై సరైన అవగాహన లేదని, అందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీసులు 610 జీవో పరిధిలోకి రారని, అక్రమంగా వారిని బదిలీ చేస్తున్నారని మండి పడ్డారు.
1975 తర్వాత రిక్రూట్‌ మెంట్లు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ముందు జీవో గురించి అవగాహన చేసుకున్నాక వ్యాఖ్యలు చేయండి లేదా... అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడి పూర్తిగా తెలుసుకోండి'అని జానారెడ్డికి ఆయన హితవు పలికారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీవో అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆంధ్రా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారు చేపట్టే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

No comments: