జోగయ్యకు మధుయాష్కీ హెచ్చరిక
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: 610 జీవో అమలును వ్యతిరేకిస్తూ ఎంపీ హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. జోగయ్య వ్యాఖ్యలు తెలంగాణ వాదులను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇలాంటి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. మంగళవారమిక్కడి ఏపీ భవన్‌లో మధుయాష్కీ విలేకరులతో మాట్లాడారు. దిగ్విజయ్‌సింగ్ కూడా ఈ అంశంపై తెలంగాణ ఉద్యోగులు, నాయకుల వాదనలు వినాలని డిమాండు చేశారు. '610కు వ్యతిరేకంగా పోరాడాలని హరిరామజోగయ్య, హర్షకుమార్ పిలుపునిచ్చారు. అధిష్ఠానం వద్ద మాత్రం తాము 610కి వ్యతిరేకం కాదని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. జయభారత్‌రెడ్డి నివేదిక ప్రకారం స్థానికేతర ఉద్యోగుల సంఖ్య 1985 నాటికే 55వేలు. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం అది ఏడువేలకు తగ్గిపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. ఇది పూర్తి అవాస్తవం. హరిరామ జోగయ్య వ్యాఖ్యలు చూస్తే శాంతియుతంగా జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మకం చేయడానికి ఇక్కడివారిని రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. 610 జీవోను చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటే సరైన లెక్కలు తీయాలి. అందులో తెలంగాణ ఉద్యోగ సంఘాలనూ భాగస్వాములను చేయాలి. తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ ప్రాంతంలో కనిపించే చిన్న పార్టీ నాయకుడినీ నిలదీసి వారి ఉద్యమానికి మద్దతిచ్చేలా ఒత్తిడి తేవాలి. ఆంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల వెంట ఉంటానని హరిరామ జోగయ్య ప్రకటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకుల మద్దతు తీసుకుని 610 అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని యాష్కీ పేర్కొన్నారు.
Tuesday, July 24, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment