610 వ్యవహారంపై ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయి. ఈ జీవో అమలుపై ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు, పీఆర్‌టీయూ, ఎస్టీయూ తదితర ప్రధాన సంఘాలతో కూడిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గైర్హాజరు కాగా, దీన్ని నిరసిస్తూ తెలంగాణా ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ రెండు వర్గాలను సముదాయించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు వారాల క్రితం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు, తెలంగాణా సంఘాలకు వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఈ వారం అన్ని సంఘాలకు ఉమ్మడిగా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. శనివారం సాయంత్రం అయిదు గంటలకు ఈ భేటీ ఉన్నట్లు స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో పాటు, ఏడు తెలంగాణా ఉద్యోగ సంఘాల నాయకులకూ సమాచారం పంపారు. తమకు విడిగా గాకుండా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడంపై కౌన్సిల్ నేతలు కినుక వహించారు. సాయంత్రం 4.30కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన కార్యాలయంలో విడిగా కలిశారు. గతంలో వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసి, మళ్లీ ఇప్పుడు ఉమ్మడి భేటీ ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ''వేర్వేరు సమావేశాలపై తెలంగాణా సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉమ్మడి భేటీయే జరపాలని ఆదేశించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని హరినారాయణ తెలిపారు. ''ఉమ్మడిగా జరిపే సమావేశంలో మాకు విలువ ఉండడం లేదు. చిన్నాచితక సంఘాలు ముందు వరుసలో కూర్చుంటుంటే మేం మూలగా కూర్చోవాల్సి వస్తోంది. ఎజెండాలో ఎన్నో ముఖ్యాంశాలున్నా ఒక్క 610 మీద చర్చించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మా సూచనలేవీ అమలు కావడం లేదు'' అని వారు అన్నారు. ''610ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలనీ, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారందరినీ స్వస్థలాలకు పంపించాలని మేం కోరినా పట్టించుకోవడం లేదు. ఇకనైనా దీన్ని అమలు చేయాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలి'' అని వారు సూచించారు. వీటిపై హరినారాయణ ఎలాంటి హామీ ఇవ్వలేదు. సమన్వయ కమిటీ సమావేశానికి రావాలనీ, అక్కడ వీటిని చర్చిద్దామని సూచించారు. ఇందుకు స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు నిరాకరించారు. రాలేమంటూ లేచి బయటికి వెళ్లిపోయారు. వీరిలో టీఎన్జీవో నేత సుధాకర్‌తో పాటు, గతంలో తెలంగాణా సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన స్వామిగౌడ్ సైతం ఉండడం విశేషం. అనంతరం స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణా సంఘాలతో సంబంధం లేకుండా తమతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించాలంటూ మంగళవారం ముఖ్యమంత్రిని కలసి కోరాలని నిర్ణయించారు.
సాయంత్రం ఐదున్నరకు సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభంకాగా, ఏడు తెలంగాణా సంఘాలే దానికి హాజరయ్యాయి. 610 జీవో అమలు ప్రగతిని హరినారాయణ వివరిస్తుండగా, తెలంగాణా సంఘాల నేతలు లేచి స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాము వారికి కూడా ఆహ్వానం పంపామని సీఎస్ చెప్పారు. అయినా వారు సమావేశానికి రాకుండా, సీఎస్‌ను కలిసి వెళ్లిపోవడం తమను అవమానించినట్లేనని తెలంగాణా సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్ విమర్శించారు. ''గతంలో స్టాఫ్ కౌన్సిల్ చేసిన ఏకపక్ష సూచనల మేరకు జీవోలు తేవడం వివాదాస్పదమైంది. ఈ సమయంలో సీఎం జోక్యం చేసుకొని కౌన్సిల్‌లో మాకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. అయినా అధికారులు ఇప్పటి వరకు దాన్ని పాటించలేదు. చివరికి సమన్వయ కమిటీకీ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు హాజరుకావడం లేదు. మేం సహకరిస్తున్నా, వారు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. వారు గైర్హాజరు కావడం తెలంగాణా సంఘాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే. దీనికి నిరసనగా మేం సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం'' అంటూ వారు తమ స్థానాల్లోంచి లేచారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణయ్య వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా వారు విన్లేదు. 610 అమలుపై తమ డిమాండ్ల పత్రాన్ని హరినారాయణకు ఇచ్చి వెళ్లిపోయారు.సచివాలయం లెక్క తేల్చాలి
సచివాలయం లెక్క తేల్చాలి సచివాలయంలో 53 శాతం తెలంగాణా ఉద్యోగులే ఉన్నారంటూ మంత్రి డి.శ్రీనివాస్ శుక్రవారం శాసన మండలిలో చేసిన ప్రకటనను తాము తిరస్కరిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. కిందిస్థాయి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమితులైన ఇతర ప్రాంతాల వారిని కలిపి 53 శాతం అధికారులు చూపించారని ఈ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విఠల్, గోపాల్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీధరరావు దేశ్‌పాండే, పద్మాచారి విమర్శించారు. నిజానికి అనేక సెక్షన్లలో నాలుగు శాతం వరకే తెలంగాణా ఉద్యోగులున్నారని వారు తెలిపారు.
No comments:
Post a Comment