తెలంగాణ సాయుధ గెరిల్లా అచ్చమాంబకు అందని సాయం
చిరుప్రాయంలోనే పోరుబాట పట్టిన తెలంగాణ సాయుధ పోరాట నేత నెల్లుట్ల మోహన్‌రావును అజ్ఞాతంలో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. ఎంతో మందికి సమరయోధుల పింఛను రావడానికి సహకరించిన మోహన్‌రావు సైతం అచ్చమాంబను విస్మరించడం విశేషం. మోహన్‌రావు మృతి అనంతరం భార్యగా వచ్చే పింఛను మాత్రమే ఆమె పొందుతున్నారు. ఆమె పోరాటానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు లేకుండా పోయింది. ఇతర సమరయోధుల కంటే ఆమెకు బలమైన సాక్ష్యాధారాలున్నాయి. పిండిప్రోలులో జరిగిన గెరిల్లా శిక్షణలో భాగంగా అధునాతన ఆయుధం (గైడర్) చేతబట్టిన ఫోటో ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
పోరాట విరమణ అనంతరం కేరళ నుంచి ఆ ఫోటోను మోహన్‌రావు తెప్పించారని అచ్చమాంబ తెలిపారు. అలాంటిది ఆమెకు సమరయోధు రాలిగా గుర్తింపు రాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతోపాటు అజ్ఞాతంలో కలిసి పని చేసిన నేనాల కమల, లలిత, లక్ష్మిలకు సైతం సమరయోధుల పింఛను చాలాకాలం కిందటే మంజూరైంది. పింఛన్ ఎందుకు రావడం లేదని అచ్చమాంబను 'ఆన్‌లైన్' ప్రశ్నిస్తే... 'అంతా నా భర్త మోహన్‌రావు చూసుకునేవారు. నేనా విషయాలు పట్టించుకోలేద'ని బదులిచ్చారు. కమలమ్మ సైతం అచ్చమాంబకు పింఛను రావడం లేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
'పోరాటం గురించి తెలియని వాళ్లు సైతం నేడు సమరయోధులుగా చలామణి అవుతున్నారు. డబ్బుల కోసం కాదు, నా పోరాటానికి గుర్తింపు లేదన్న బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంద'ని అచ్చమాంబ చెప్పారు. 'భవిష్యత్తులో ఎవరో ఏదో చేస్తారన్న ఆశతో నాడు పోరాటం చేయలేదు. భూస్వా ములు, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేశాం. గుర్తించాల్సింది ప్రభుత్వమే. కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. నాలా గుర్తింపునకు నోచుకోని వారు ఇంకా ఎందరో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, వారందరినీ ఆదుకోవలసిన అవసరం ఉంది. అయినా ఇప్పుడంతా పైరవీలమయం. నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు అచ్చమాంబ.
వైద్యంతో మమేకంపిండిప్రోలులో జరిగిన శిబిరంలో అచ్చమాంబ వైద్య శిక్షణ పొందారు. గాయపడిన గెరిల్లాలకు గాయాలు శుభ్రం చేయడం, కట్లు కట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడంలో తర్ఫీదు ఇచ్చారు. ఇద్దరు కొరియర్లతో పాటు ఒక గన్‌మెన్‌తో ఎక్కడ దళాలకు ప్రమాదం జరిగినా ఆమె అక్కడకు వెళ్లి చికిత్స చేసేవారు. దళాలకు చేయూతనిస్తున్న గిరిజన గూడేల్లోనూ వైద్య సేవ చేయడంతో అచ్చమాంబను ఆప్యాయంగా ఓడకాయ (టాబ్లెట్స్) అక్క, ఎర్రక్క అని అక్కడి వారు పిలుచుకునేవారు. దళాలకు పోలీసులు, రజాకార్ల నుంచే కాకుండా అడవి జంతువుల నుంచి ప్రమాదాలు పొంచి ఉండేవి. చిరుత దాడితో తీవ్రంగా గాయపడిన దళ సభ్యుడికి చికిత్స చేసి రక్షించారామె.
పోలీసుల దాడి నుంచి రక్షించు కొనేందుకు అనారోగ్యంతో ఉన్న తన భర్త మోహన్ రావును ఎత్తుకొని కిలోమీటర్ల దూరం పరుగె త్తారు. దాహంతో అల్లాడుతున్న మోహన్‌రావు దప్పిక తీర్చేందుకు ఉసిరి చెట్టు ఎక్కి కాయలను చూర్ణంగా దంచి, దాహం తీర్చానని అచ్చమాంబ తెలిపారు. ఎన్నోసార్లు పోలీసులు చుట్టుముట్టినా ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించుకునేవారని చెప్పింది. 'మీరు పేపర్‌లో ఎంత రాసినా ప్రభుత్వం స్పందించి, న్యాయం చేస్తుందన్న ఆశ నాకు ఎంతమాత్రం నాకు లేద'ని అచ్చమాంబ చెప్పడం కొసమెరుపు.
Monday, July 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment