పాఠశాల విద్యాశాఖలో తాజా వివాదం
43ని సవరిస్తూ కొత్త జీవో
కలెక్టర్లకు పోస్టింగ్ అధికారం
కోర్టుకెక్కనున్న ప్రభుత్వ టీచర్లు
రాష్ట్రపతి దృష్టికి వివాదం
టీఆర్‌టీయూకు అందిన పిలుపు
ఏకీకృత సర్వీసుకు ఎసరు!
పాఠశాల విద్యాశాఖలో స్థానికేతర ఉపాధ్యాయుల బదిలీపై మరో వివాదం చెలరేగింది. 610 అమలు కోసం ఇచ్చిన జీవో 43లో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 45ను జారీ చేసింది. ఇందులో డీఈవో, సీఈవోలకు బదులుగా జిల్లా కలెక్టర్లకు పోస్టింగు అధికారాలివ్వడం వివాదాస్పదమైంది. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుకే ఎసరు పెట్టే ప్రమాదం కనిపిస్తోంది. తాజా జీవో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని ప్రభుత్వ టీచర్ల సంఘం ఆరోపించింది. ''గతంలో జారీ చేసిన 529 జీవో ఉపాధ్యాయుల నియామక అధికారి డీఈవో అని చెప్పింది. కానీ తాజా జీవోలో ఈ అధికారాలను కలెక్టర్‌కు అప్పగించారు. ఇది సమస్యగా మారనుంది'' అని నిపుణులు అంటున్నారు. ఇదే వాదనతో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అప్పుడే కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రస్తుతం 610 ప్రకారం స్వచ్ఛంద బదిలీలు మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో నిర్బంధ బదిలీలు చేసినా... కలెక్టర్లకే నియామకాల అధికారాన్ని ఇస్తూ జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలా బదిలీ అయ్యేవారు కోర్టును ఆశ్రయించే అవకాశం, ఫలితంగా 610/రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు సందిగ్ధంలో పడే వీలు కనిపిస్తున్నాయి. ఏకీకృత సర్వీసు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ యత్నాలకు ఇది గండికొట్టే అవకాశం ఉంది.
610 అమలుకై జారీ చేసిన జీవో 43లో పేర్కొన్న అంశాలు ఉపాధ్యాయుల వేర్వేరు సర్వీస్‌ను సూచిస్తున్నాయని, ఇది ఇన్నాళ్ల తమ పోరాటానికి గండి కొడుతుందంటూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త పోరాట సమితి (జాక్టో) ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రినీ కలిసి ఈ జీవోను సవరించాలని కోరింది. కానీ ఇలా చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయంటూ సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు న్యాయ విభాగం, ఉన్నతాధికారులు అభ్యంతరపెట్టారు. అయినా జాక్టో ఒత్తిడితో, ముఖ్యమంత్రి ఆదేశాలతో సవరణ జీవో జారీ అయింది. ఈ జీవో పట్ల న్యాయవిభాగం అసంతృప్తితో ఉంది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏకీకృతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని జాక్టో నేతలు గురువారం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన తీరు... ఇన్నాళ్లూ కాస్తో కూస్తో సానుకూలంగా దీనికై యత్నించిన అధికార వర్గాల్నీ, మంత్రినీ తీవ్ర నిరుత్సాహంలో పడేసింది.
ఢిల్లీ పయనమూ ప్రశ్నే
ఈనెల 9న ఢిల్లీకి మూకుమ్మడిగా వెళ్లి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు కోసం ప్రయత్నాలు చేయాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం. కానీ కేంద్రం వ్యక్తీకరించిన సందేహాలకు ఇప్పటికీ రాష్ట్రం సమాధానాలను పంపించలేదు. ఆ ఫైల్ ఢిల్లీ చేరక ముందే వెళ్లి ఏం చేయాలనే ప్రశ్న తాజాగా తలెత్తింది. అందుకని 9న ఢిల్లీలో ఎంపీలందరూ ఉండటం లేదనే సాకుతో ప్రయాణాన్ని వాయిదా వేయనున్నట్లు తెలిసింది. కేంద్రానికి సమాధానాలు ఏమని పంపాలో అర్థం గాక ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భావించినా... అది మరిన్ని చిక్కులకు దారితీయవచ్చునని న్యాయవాదులు హెచ్చరించడంతో ఆ ప్రయత్నమూ వాయిదా పడినట్లు సమాచారం. ''ఈ స్థితిలో ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాం?'' అని ఓ నేత ప్రశ్నించారు.
రాష్ట్రపతి రమ్మన్నారు!
ఏకీకృత సర్వీస్ కోసం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు తీసుకొచ్చే ప్రతిపాదన భవిష్యత్తులో తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు ప్రమాదకరం అయ్యే అవకాశాలున్నాయని వాదిస్తున్న టీఆర్‌టీయూ ఈసారి ఏకంగా రాష్ట్రపతినే కలిసి తన వాదనను వినిపించడానికి తయారవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతికి అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు పెట్టుకోగా, ఆయన ఈనెల 16న రావాలంటూ సమ్మతి తెలిపారు. ''రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలోని కనీసం అయిదు అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని నిండా ముంచేస్తాయి. అదే రాష్ట్రపతికి వివరిస్తాం'' అని టీఆర్‌టీయూ చెబుతోంది. వెరసి 610 అమలు వ్యవహారంతో ఏకీకృత వివాదం ముదిరి పాకానపడుతోంది!
No comments:
Post a Comment