ముల్కీ కాలం చెల్లిపోయింది రాష్ట్రపతి ఉత్తర్వులను 2007 నుంచి అమలు చేయాలి హరిరామజోగయ్య వ్యాఖ్యలు
ముల్కీ కాలం చెల్లిపోయిందని, దాన్ని 1975లోనే రద్దు చేసి ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీ హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. అసలు ముల్కీ విధానమే సరైంది కాదని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ''1975లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలు చేయాలనడం సరికాదు. నాడు స్థానికేతరులుగా ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది ఇప్పుడు స్థానికులు అయిపోయారు. అందువల్ల వారిని బదిలీ చేయాలనడం న్యాయ సమ్మతం కాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులను 2007 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బందిని స్థానికేతరుల పేరుతో ప్రభుత్వం బదిలీ చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా తాను, ఎంపీ హర్షకుమార్ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు. ''రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. సర్కారు ఉత్తర్వులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం కానేకాదు. ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మాపై ఉంది. ఆంధ్ర ప్రాంతంలో పార్టీని రక్షించుకునే చర్యల్లో భాగంగానే నేను జీవో అమలును వ్యతిరేకిస్తున్నాను'' అని ఆయన వివరించారు. కేవలం కొందరి ఒత్తిళ్ల వల్లే వైఎస్ 610 జీవోను అమలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ''బదిలీ చేస్తున్న ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతంలోని ఖాళీల్లోనూ, సూపర్ న్యూమరరీ పోస్టుల్లోనూ నియమిస్తే అక్కడ మా వాళ్లకు ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అందువల్ల బదిలీ అయ్యే వారికి ఇక్కడే సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాలి. ఆంధ్ర ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలి'' అని ఆయన డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఇరు ప్రాంతాల నేతలను పిలిచి దీనిపై చర్చించాల్సి ఉందని జోగయ్య అభిప్రాయపడ్డారు.
Friday, July 6, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment