ప్రాణాలు పోయినా లెక్కచేయను
గాంధీ మార్గంలో ఉద్యమిస్తా
న్యాయం జరగకుంటే దీక్ష తప్పదు
మా ప్రభుత్వంలో మాకు రక్షణలేదు
నా కుటుంబానికి భద్రత కల్పించాలి: పీజేఆర్
రౌడీయిజం నశించే వరకూ తన పోరాటం కొనసాగుతుందని, ఈ ప్రయత్నంలో తన ప్రాణాలుపోయినా లెక్కచేసేదిలేదని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వ్యక్తి పేరు చెప్పుకుని నడుస్తున్న గూండాయిజం పోవాలి' అని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తానని అన్నారు. గాంధేయవాద పద్ధతిలో తన పోరాటం ముందుకు సాగుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్ వివాదంలో ప్రభుత్వం న్యాయం చేయకుంటే సోమవారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించిన నేపథ్యంలో... పీజేఆర్ గురువారం అసెంబ్లీ వద్ద విలేఖరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తన ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నారు. నాకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేదిలేదని చెప్పాను. ఆయన గాయపడిన నా కుమారుణ్ని పరామర్శించారు' అని పీజేఆర్ అన్నారు. అయితే ఎవరి పేరిట గూండాగిరీ నడుస్తోందన్న ప్రశ్నకు మాత్రం పీజేఆర్ సమాధానం ఇవ్వలేదు. తెదేపాపై 30 ఏళ్ల పోరాటంలో తాను రక్తం చిందించిన సందర్భాలున్నా... తన భార్య, చెల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎప్పుడూ వెళ్లలేదన్నారు. కానీ మొన్నటి గొడవలో వెళ్లాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పశ్చిమ మండలం డీసీపీ మధుసూదన్‌రెడ్డే కారణమనీ, ఆయన్ను తక్షణం సస్పెండ్ చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. 'వస్తావా, లేపి తీసుకెళ్లాలా?' అంటూ తన బంధుమిత్రుల ముందే ఆయన దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. ఎవరో చెప్పిన ప్రకారం మధుసూదన్‌రెడ్డి నడుచుకున్నారని వ్యాఖ్యానించారు. 'పైగా నన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేనైన నాకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటి? నన్ను నేనే కాపాడుకోలేకపోతే నియోజకవర్గ ప్రజలనెలా కాపాడుకుంటాను? అందుకే ఈ విషయంలో న్యాయం జరిగే దాకా నిరాహార దీక్ష చేస్తాను' అన్నారు.
జూబ్లీహిల్స్‌లోని తన కుమార్తె అనురాగిణి రెడ్డి ఇంటివద్ద కూడా పీజేఆర్ గురువారం విలేఖరులతో మాట్లాడారు. 'మా ప్రభుత్వ పాలనలో మాకే రక్షణ లేకుండా పోయింది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఘటన జరిగినప్పటినుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కరువైందని, పోలీసులు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత రెండు రోజులుగా కొందరు అపరిచితులు తన కుమార్తె అనురాగిణిరెడ్డి ఇంటి పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకుని తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తమ చేతికి మట్టి అంటకుండా తీవ్ర స్థాయిలో నేరాలు చేసే వ్యక్తులు తన కుటుంబ సభ్యులపై దాడికి పథకం వేశారని ఆయన ఆరోపించారు. పశ్చిమ మండల డీసీపీ మధుసూదన్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, సీఎం సోదరుడిపై కూడా 307 కేసును నమోదు చేయాలనే డిమాండ్లను పునరుద్ఘాటించారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా 16వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు.
తమ ఇంటి పరిసరాల్లో అనుమానితుల తిరుగుతున్నారని పీజేఆర్ అల్లుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీజేఆర్ కుమార్తె అనురాగిణి రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment