రేపు మాట్లాడదాం
మేడంతోనూ చర్చిద్దాం
రాజకీయం చేయొద్దని దిగ్విజయ్ హితవు
రాష్ట్రంలో వీహెచ్ రాజీ యత్నాలు
రెండు కుటుంబాలతోనూ భేటీ
సీఎంతో చర్చ
న్యాయం జరక్కుంటే దీక్ష తప్పదు: పీజేఆర్
హైదరాబాద్, న్యూఢిల్లీ -న్యూస్‌టుడే
పీజేఆర్ ఆమరణ దీక్ష హెచ్చరిక ప్రకంపనలు సృష్టించింది. అధిష్ఠానాన్నీ కదిలించింది. అటు దిగ్విజయ్.. ఇటు వీహెచ్ రంగంలోకి దిగారు. అధికారికంగా రాజీ యత్నాలు షురూ చేశారు. చర్చల కోసం ఢిల్లీ రావాలని దిగ్విజయ్ ఆహ్వానించారు. మేడమ్‌తోనూ మాట్లాడుదురు గాని అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముంగిట ఇబ్బందికర పరిస్థితిని నివారించే లక్ష్యంతో సాగిన ఈ రాజీ యత్నాలు.. పీజేఆర్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆయనే మాత్రం రాజీ పడకపోగా... వైఎస్ ప్రభుత్వంపై దాడిని మరింత ఉద్ధృతం చేశారు. మరోసారి సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమరణ దీక్షపై వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. వైఎస్ సోదరుడూ ఘాటుగానే స్పందించారు. దెబ్బలు తిని కూడా బతికి ఉన్నందుకే తమపై హత్యాయత్నం కేసు పెట్టాలా అంటూ మండిపడ్డారు. దిగజారుడు డిమాండ్లొద్దని పీజేఆర్‌కు హితవు పలికారు.
ఇప్పటిదాకా దాన్నో చిన్నసమస్యగా అభివర్ణించిన కాంగ్రెస్ అధిష్ఠానం గురువారం నేరుగా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్, సీనియర్ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి కుటుంబాల మధ్య రేగిన చిచ్చు పార్టీకి నష్టం కలిగించనుందని గ్రహించి.. దానికి సత్వరం ముగింపు పలకాలని నిర్ణయించింది. ముఖ్యంగా తన డిమాండ్లను నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని పీజేఆర్ హెచ్చరించడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటుతోందని అది గ్రహించింది. అదీగాక అసెంబ్లీ సమావేశాలు 16న ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ వివాదాన్ని ప్రతిపక్షాలు హైజాక్‌చేసే ఆస్కారముందనీ ఆందోళన చెందింది. అదుకే హుటాహుటిన నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని రాజకీయం చేయొద్దని ఆయనకు సూచించారు. శనివారంనాడు (14న) ఢిల్లీకొస్తే.. నేరుగా చర్చిద్దామని దిగ్విజయ్ సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాతో కూడా మాట్లాడదామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
రవీంద్ర సౌమ్యుడు:పీజేఆర్‌తో చర్చించిన తర్వాత దిగ్విజయ్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి సౌమ్యుడని ఆయన కితాబిచ్చారు. రవీంద్ర ముఖ్యమంత్రికి సోదరుడన్న సంగతి ఆయన నివసించే ప్రాంతంలో చాలా మందికి తెలియదని.. దాన్నిబట్టే ఆయనెలాంటి వ్యక్తో తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తిపై చిన్న విషయం గురించి దాడిచేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్, పీసీసీ అధ్యక్షుడు కేకే, పీజేఆర్‌లతోసహా హైదరాబాద్‌లోని పలువురు పార్టీ నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు తమంతట తామే కేసులు నమోదు చేశారని, నిష్పాక్షికంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 307 సెక్షన్ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయడంపై పీజేఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారన్నారు. వైద్య పరీక్షల నివేదికలు పరిశీలించి, గాయాలు తీవ్రమైనవి కాకుంటే శిక్ష తగ్గుతుందని వివరించారు.
వైఎస్ జోక్యం అవసరంలేదు: ఈ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి వైఎస్ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని లేదని దిగ్విజయ్ స్పష్టంచేశారు. వీధి గొడవను రాజకీయ అంశంగా మార్చవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన మీడియాను తప్పుపట్టారు. రవీంద్రనాథ్‌కు పీజేఆర్ క్షమాణలు చెప్పారని తెలిపారు. ఈ వివాదంలో పలువురు ఎమ్మెల్యేలు పీజేఆర్‌ను సమర్థించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు కాదా అని అడగ్గా.. రాష్ట్రం నుంచి పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తెలంగాణ అంశంగా ఎలా మారుతుందంటూ ఎద్దేవా చేశారు.
నేనుంటే ఇలా జరిగేది కాదు: ఇటు హైదరాబాద్‌లో సీనియర్ నేత వి.హనుమంతరావు రాజీ యత్నాలకు శ్రీకారం చుట్టారు. అమెరికా నుంచి ఆయన గురువారం ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. వచ్చిన కొద్దిగంటల్లోనే పీజేఆర్ ఇంటికెళ్లారు. పీజేఆర్‌తోను, ఆయన భార్యతోను, కుమారుడితోను మాట్లాడారు. సంఘటన వివరాలను, తదనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డి తమపై దాడి జరిగిన తీరును వివరించారు. ఇలా రెండు కుటుంబాల అభిప్రాయాలూ తెలుసుకున్న వీహెచ్.. ఆనక సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని సైతం కలసి మాట్లాడారు. జరిగిన వివాదంపై తక్షణం దృష్టిసారించకపోతే పార్టీకి మరింత నష్టం కలుగుతుందని భావించి.. తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు వీహెచ్ ప్రకటించారు. ఆదివారం తాను హైదరాబాద్‌లో ఉండిఉంటే ఇంతవరకూ వచ్చి ఉండేది కాదన్నారు. ఆరోజే ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి ఉంటే సరిపోయేదన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేస్తే పార్టీకి మంచిదని చెప్పారు. చిన్న పిల్లల తగాదా పెద్ద కాకుండా ఉండాల్సిందన్నారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన సచివాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎలాచేస్తే బాగుంటుందనే అంశంపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. మొదట పీజేఆర్ ఆమరణ దీక్షను విరమింపజేయడం.. లేదంటే వాయిదా వేయిస్తే మిగతా అంశాలను పరిష్కరించేందుకు అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు గురించి తానేమీ మాట్లాడబోనన్నారు. మొత్తంమీద పీజేఆర్ డిమాండ్ల సాధ్యాసాధ్యాలను ఓవైపు పరిశీలిస్తూనే.. మరోవైపు దీక్ష చేపట్టకుండా చూడటమనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతల రాజీయత్నాలు సాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వివాదానికి ముగింపు పలకాలన్నది వారి లక్ష్యం!
Thursday, July 12, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment