Friday, July 13, 2007

వైఎస్‌ సోదరుడిపై కేసు మూసివేత eenadu

పీజేఆర్‌ భార్యది తప్పుడు ఫిర్యాదు: కమిషనర్‌

పీజేఆర్‌-వైఎస్‌ సోదరుడి కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఒకవైపు తన భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడిపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని పీజేఆర్‌ డిమాండ్‌ చేస్తుండగా.. అసలామె ఇచ్చిన ఫిర్యాదే తప్పని పోలీసులు పేర్కొన్నారు. అందులోని అంశాలు వాస్తవం కాదన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌ రెడ్డిపై పెట్టిన కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ''గత ఆదివారం (8న) రాత్రి 9.30కి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి భార్య ఇందిర అలియాస్‌ సులోచన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. భారీ సంఖ్యలో జనం రాడ్లు, కర్రలు, పదునైన ఆయుధాలతో తమను అడ్డుకున్నారని.. తమపై దాడి చేసి చంపుతామంటూ బెదిరించారన్నవి ఆ ఫిర్యాదులోని ఆరోపణలు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు వై.ఎస్‌.రవీంద్రనాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిగా ఈ ఫిర్యాదు చేశారు. సులోచన ఇచ్చిన ఫిర్యాదుపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపారు. ఘటనాస్థలిలో, చుట్టపక్కల అనేక మంది సాక్షుల్ని విచారించారు. సమగ్ర విచారణ అనంతరం ఆమె చేసిన ఆరోపణలు వాస్తవంకాదని వెల్లడైంది. అంతేగాక ఘటన జరిగిన చాలా సమయం తర్వాత ఫిర్యాదు చేయడంతో.. అది రవీంద్రనాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిగా చేశారని తేలింది. ఈ నేపథ్యంలో సులోచన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌రెడ్డిపై నమోదుచేసిన కేసును ఎత్తివేస్తున్నాం'' అని బల్వీందర్‌ ప్రకటనలో వివరించారు.

ఆదివారం రాత్రి జరిగిన గొడవకు సంబంధించి ఇరు వర్గీయులూ పోలీసుల్ని ఆశ్రయించడం తెలిసిందే. ఆ ఫిర్యాదుల ఆధారంగా పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మేనల్లుడు సంతోష్‌రెడ్డిలపై హత్యా యత్నం కేసును నమోదు చేశారు. పీజేఆర్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డిలపై అటకాయించడం, దాడి తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇది వివాదానికి ఆజ్యం పోసింది. రవీంద్రనాథ్‌ రెడ్డి, ఆయన కుమారుడిపై కూడా 307 సెక్షన్‌ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయాలని, డీసీపీని సస్పెండ్‌ చేయాలని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని పీజేఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆ 3 డిమాండ్లపై స్పందించకుంటే.. సోమవారం నుంచి ఆమరణ దీక్షచేస్తాననీ ఆయన హెచ్చరించారు. ఇలాంటి నేపథ్యంలో.. పోలీసులు కేసే ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments: