Monday, August 27, 2007

పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తి Eenadu

హైదరాబాద్‌, ఆగస్టు 27 : 610 జీఓ అమలుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం వివరాలను మంత్రివర్గ ఉప సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో స్థానికేతరుల గుర్తింపు పూర్తయిందని అయితే వారి పూర్తి వివరాలు పొందుపరచవలసి ఉందని చెప్పారు. 1975 నుంచి నియామకాల పరిశీలన పూర్తయితే స్థానికేతరుల సంఖ్య మరో రెండు వేలవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగతా శాఖల్లో 610 జీఓకు సంబంధించి స్థానికేతరుల గుర్తింపు ఈ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు.

Friday, August 24, 2007

గోనెపై విద్యార్థుల దాడి గాజులు, పసుపు కుంకుమలు జల్లి నిరసన Eenadu

యాష్కీపై ఆరోపణలకు ఖండన

ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజం

ప్రతిఘటించిన ప్రకాశరావు; ఎదురుదాడి

న్యూస్‌టుడే


ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌, మాజీ శాసనసభ్యుడు గోనె ప్రకాశరావుపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం స్థానిక ఫతేమైదాన్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో గోనె మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. తెలంగాణకు, తెలంగాణ బీసీ నేతలకు ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ విద్యార్థులు ధ్వజమెత్తారు. దాడి సందర్భంగా గోనె, ఆయనతో ఉన్న కాంగ్రెస్‌ నేతలు గట్టిగానే ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు. మొత్తానికి నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌పై గోనె చేసిన ఆరోపణలు ఈ దాడికి కారణమైనట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం కూడా మధుయాష్కీపై ఆయన సరికొత్త ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే విద్యార్థుల దాడి జరిగింది. విలేకరుల సమావేశం ముగుస్తున్న తరుణంలో వట్టికూటి రామారావు అనే విద్యార్థి వేదికపైకి వెళ్లి మొదట గోనెపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్‌పరిమాణం నుంచి వెంటనే తేరుకున్న గోనె, ఆయన పక్కనే ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ రవిబాబు, పీసీసీ కార్యదర్శి నిరంజన్‌లు ప్రతిఘటించారు. రామారావుపై ప్రతి దాడి చేశారు. ఇంతలోనే గాజుల శ్రీధర్‌ అనే మరో విద్యార్థి పసుపు, కుంకుమ, గాజులను తీసుకొచ్చి గోనెపై వేశారు. మూడో విద్యార్థి నాగరాజూ వారితో జతకలిశారు. తెలంగాణ బీసీ నాయకులను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని వారు గోనెపై ఆరోపణలు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఎవరికైనా ఇదే శాస్తి యాష్కీ ఎదుగుతున్న బీసీ నాయకుడు కావడంతో ఓర్వలేకే ఆయనపై ఆరోపణల దాడికి పాల్పడుతున్నారని రామారావు ఆరోపించారు. అవకతవకలుంటే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని.. అలా కాకుండా ఓర్వలేనితనంతో ఇలా కుట్ర పన్నడం తగదంటూ మండిపడ్డారు. బీసీ వ్యతిరేకుల దాడుల్ని ప్రతిఘటిస్తామన్నారు. మధుయాష్కీ తెలంగాణ అడుగుతుండటం కొందరికి ఆగ్రహం తెప్పిస్తోందంటూ.. ముఖ్యమంత్రికి గోనె తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎక్కడైనా ఇలాగే ప్రతిఘటిస్తామన్నారు.

విద్యార్థుల అరెస్టు దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్‌ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కెం.ఎం.ప్రతాప్‌ అక్కడికి చేరుకొని గోనెను పరామర్శించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు మధు యాష్కీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముగ్గురు విద్యార్థులపైనా, వారితోపాటు వచ్చిన మరికొందరు విద్యార్థులపైనా కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఐపీసీ 143, 323, 341 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు వివరించారు. మరోవైపు నిందితుల్లో ఒకరైన రామారావు గోనెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 506, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంటిపేరు మార్చి 2 పాస్‌పోర్టులు: గోనె ఇంటి పేరు మార్చి మధుయాష్కీ నిబంధనలకు విరుద్ధంగా రెండు పాస్‌పోర్టులు పొందినట్లు గోనె అంతకుముందు ఆరోపించారు. మొదట మధుసూదన్‌ యాష్కీ అనే పేరుతో పొందిన పాస్‌పోర్టుకు వీసా రాకపోవడంతో.. ఇంటి పేరు మార్చి మరో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఆయన సోదరులిద్దరు, సోదరి, బావమరిది కూడా నకిలీ సర్టిఫికెట్లతో హెచ్‌-1 వీసా పొంది, గ్రీన్‌కార్డు కూడా పొందినట్లు ఆరోపించారు. గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి పొందినట్లు చెబుతున్న ఇంజినీరింగ్‌ డిగ్రీలు నకిలీవని తేలాయన్నారు. వీటన్నిటిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

వైఎస్‌కు యాష్కీని పరిచయం చేసిందే నేను దాడి ఘటన అనంతరం కూడా గోనె విలేకరులతో మాట్లాడారు. తాను బీసీలకు వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. దాడులకు భయపడబోనని, మధుయాష్కీకి సంబంధించి తాను వెలుగులోకి తీసుకొస్తున్న అంశాలను ఆపబోనని తేల్చిచెప్పారు. వైఎస్‌కు మధుయాష్కీని పరిచయం చేసిందే తానని ఆయన పేర్కొన్నారు. టికెట్‌ తనవల్లే వచ్చిందని యాష్కీనే స్వయంగా చెప్పారని తెలిపారు.

వ్యక్తిగత విమర్శలు తప్పే: కేకే గోనె మీద జరిగిన దాడిపై స్పందించేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ నిరాకరించారు. మీడియా ప్రతినిధులు ఢిల్లీలో ఆయన స్పందన కోరగా.. ''నేనెందుకు పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు ఇక్కడే ఉన్నారుగా.. ఆయనే స్పందిస్తారని'' చెప్పారు. కేకే మాట్లాడుతూ.. ఆ విషయం ఇంకా తన దృష్టికి రాలేదన్నారు. అన్ని విషయాలనూ తాను పరిశీలిస్తానని చెప్పారు. మరి మధుయాష్కీపై గోనె చేసిన ఆరోపణల సంగతేమిటని అడగ్గా.. అలా వ్యక్తిగత విమర్శలకు దిగడం తప్పేనన్నారు.

గోనె ప్రకాశరావుపై విద్యార్థుల దాడి Eenadu

హైదరాబాద్‌: బీసీలకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశరావుపై కొంతమంది ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఫతేమైదాన్‌లో మీడియా సమావేశం జరుగుతుండగా విద్యార్థులు దూసుకువచి ప్రకాశరావుపై చేయి చేసుకున్నారు. దీంతో గోనెకు, విద్యార్థులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ప్రకాశరావు కూడా విద్యార్థులపై ఎదురుదాడికి దిగారు. మధుయాష్కీ తెలుగుదేశం పార్టీ ఏజెంటు అంటూ నిన్న ప్రకాశరావు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. తనపై దాడి వెనుక కారకులెవరో తెలుసునని గోనె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న మధుయాష్కీ దీనిపై స్పందిస్తూ, తనకు గోనె ప్రకాశరావుకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు.

Monday, August 13, 2007

త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళ బదిలీ

కొత్త గడువు సెప్టెంబరు: జానారెడ్డి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పోలీసుశాఖలో 610 జీవో అమలులో భాగంగా త్వరలో మరికొందరు కానిస్టేబుళ్ళను స్వస్థలాలకు పంపుతున్నట్లు హోంమంత్రి జానారెడ్డి తెలిపారు. కొత్తగా ఎంపికైన సుమారు 2700 మంది కానిస్టేబుళ్ళను ఈ నెలఖారులోపు నియమించే అవకాశం ఉన్నందున ఆమేరకు స్థానికేతరులను బదిలీ చేస్తామన్నారు. 610 జీవోపై సోమవారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఇందులో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల్లో కలిపి 8718 మంది స్థానికేతరులు ఉన్నట్లు గుర్తించగా వారిలో 958 మందిని ఇప్పటికే స్వస్థలాలకు పంపామని చెప్పారు. సెప్టెంబరు చివరినాటికి అన్నిశాఖల్లోనూ స్థానికేతరుల బదిలీ ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. ముందు బదిలీ చేసి అవసరమైతే మళ్ళీ డిప్యూటేషన్లపై తీసుకుంటామని, కొత్తవారు చేరగానే ఈ డిప్యుటేషన్లు రద్దు చేస్తామని హోంమంత్రి జానారెడ్డి వివరించారు

Saturday, August 11, 2007

నాలుగు లక్షల మంది విద్యార్థులతో ఉద్యమం

తెలంగాణ వచ్చేదాకా పోరు ఆగదు శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ ఉద్ఘాటన
నాలుగు లక్షల మంది విద్యార్థులతో పటిష్టమైన విద్యార్థి విభాగాన్ని రూపొందించుకుని ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడతామని తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఇక్కడి తెలంగాణ భవన్లో తెరాస విద్యార్థి విభాగం సభ్యుల తొలిదశ శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే 15,000 మంది విద్యార్థులు తమ విభాగంలో చేరారని, వీరికి ఆర్నెల్ల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. అనంతరం మరో 15,000 మంది విద్యార్థినులకు డివిజన్‌ స్థాయిలో శిక్షణ ఇస్తామన్నారు. హింసకు దిగడమే ఉద్యమం కాదని, ప్రజాస్వామ్యయుతంగా బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణను సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. 'ఈ దఫా తెలంగాణ వచ్చేదాకా పోరు జరిగి తీరుతుంది. తెలంగాణకు అనాదిగా అన్యాయం జరుగుతోంది. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన 36 జీవోకు వ్యతిరేకంగా మంత్రి దామోదరం సంజీవయ్యే కోర్టుకెక్కారు. ఇప్పుడు 610పై కాంగ్రెస్‌ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కోర్టుకు వెళ్లారు. అనాదిగా తెలంగాణకు ఇదే అన్యాయం జరుగుతోంది. వీటినుంచి బయట పడాలంటే ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం. ఈ విద్యార్థులు ఏడాదికి 15 రోజుల పాటు ముఖ్యమైన రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు' అని కేసీఆర్‌ వివరించారు. ఈ శిబిరంలో సూర్యాపేట (నల్గొండ), గద్వాల (మహబూబ్‌నగర్‌), కమలాపురం (కరీంనగర్‌) నియోజకవర్గాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి వారికి కేసీఆర్‌ వివరించారు. అనంతరం దేశిపతి శ్రీనివాస్‌, విద్యాసాగరరావు, ప్రకాశ్‌, ఇతర తెలంగాణ మేధావులు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాల నేతలు పాల్గొన్నారు.