Thursday, October 25, 2007

ఉత్తర కరోలినాలో వైభవంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు Andhra Jyothy

రలీగ్‌, అక్టోబర్‌ 25: దసరా, బతుకమ్మ పండుగలను నార్త్‌ కరోలినా ప్రవాస తెలుగువారు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్బ్‌ట్రీ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు రలీగ్‌, డుర్హమ్‌, కారీ ప్రాంతాల నుంచి వ ందల సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం మొదలయిన వేడుకలు సూర్యాస్తమయంలోపు ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగువారు పండుగలతో తమకున్న తియ్యటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
మన సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలు మర్చిపోకుండా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని కడారు శ్రీలక్ష్మి, రామ్‌ప్రసాద్‌ అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన డం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు తానుగా బతుకమ్మ తయారుచేయడానికి తమ కుమార్తె యుక్తి శ్రీని ప్రోత్సహిస్తామని వారు తెలిపారు. బతుకమ్మ పేరు వింటేనే తాను పులకించిపోతానని మంచినేని రూప అన్నారు.

తమ చిన్నతనంలో బతుకమ్మ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించుకునే వారమని, తమ ఇంటిలోనే కాకుండా పొరుగు ఇళ్ళకు కూడా వెళ్ళి బతుకమ్మలను అలంకరించడం మర్చిపోలేమని జలగం లతా నితిన్‌, శుంకు జ్యోతి రవీందర్‌ చెప్పారు. బతుకమ్మ గురించి చెప్పే కథలు ఆశక్తికరంగా వినేవారమని పొదిల సంధ్యా లక్షీనారాయణ అన్నారు. తమ సోదరీమణులు, వారిపిల్లలు అంతా ఒక చోటికి చేరుకుని బతుకమ్మను ఘనంగా నిర్వహించుకునే వారమన్నారు. ఆప్యాయతానుబంధాలు తమ మధ్య వెల్లివిరిస్తుండేవని తెలిపారు. కొత్తబట్టలు ధరించి ఆ తొమ్మిది రోజులూ ఉత్సాహంగా ఉండేవారమని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
దివ్యశ్రీ వేమారెడ్డి దంపతులు, గోపి, స్వాతి బిరిచెట్టి, రాము, నరేందర్‌, విస్సు శ్రీధర్‌ తదితరులు వేడుకలో నవ్వులు పూయించారు. తెలంగాణా అభివృద్ది సంఘం , ట్రైయాంగిల్‌ ఎన్‌ఆర్‌ఐ తెలుగు అసోసియేషన్‌ తరపున ఆహూతులకు పొదిల లక్షీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రవాసులేకాక రాయలసీయ, కోస్తాంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రవాస భారతీయులు ఈ వేడుక ల్లో పాలుపంచుకున్నారు. కడారు రామ్‌ప్రసాద్‌ వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.




No comments: