నిర్మల్, న్యూస్‌టుడే: 'కాంగ్రెస్ తన బండారాన్ని తానే బయటపెట్టుకుంది. తెలంగాణ ద్రోహులమని వారే చెప్పుకొంటున్నారు. రెండో ఎస్సార్సీ ఏర్పాటుచేస్తున్నట్లు నమ్మక ద్రోహపు మాటలు మాట్లాడిన వీరప్ప మొయిలీ.. నీకు వీర తెలంగాణ దెబ్బ చూయిస్తం'.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. గురువారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో 'ఆదిలాబాద్ జిల్లా ప్రజాచైతన్య సదస్సు' పేరిట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం యావత్తూ కాంగ్రెస్, తెదేపాను దుయ్యబట్టారు. ప్రసంగపాఠం ఆయన మాటల్లోనే..
'50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. నెహ్రూ చెప్పినట్లు భార్యాభర్తల్లా విడిపోదామంటే కాంగ్రెస్ అడ్డుపడుతోంది. కాంగ్రెస్, తెదేపా రెండూ తెలంగాణను నాశనం చేశాయి. వైఎస్‌ఆర్ పాలన స్వర్ణయుగమంటూ మొయిలీ కితాబిచ్చిండు. ఏది స్వర్ణయుగం? దుబాయ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు జ్వరాలతో పిట్టల్లా రాలుతున్నరు. 2004 ఎన్నికల్లో నమ్మినం. నమ్మక ద్రోహం చేసిండ్రని వారే చెప్పుకొంటున్నరు. రాష్ట్రంలో ప్రాజెక్టులను ఆధునీకరించి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామంటున్నారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును ఎందుకు తెరపైకి తేలేదు. 22 ఏళ్ళుగా ఊసులేని మందాకినీ కాలువ ఏమైంది? ఉచిత కరెంట్, రూ. 2కే కిలో బియ్యం.. వీటికి మోసపోతే.. భవిష్యత్తులో గోసపడతాం. తెలుగుదేశం, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేద్దం' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
Thursday, October 25, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment