ఉద్యోగుల మధ్య చిచ్చుకోసమే తెలంగాణ సంఘాల ఆగ్రహం సమావేశం నుంచి సగంలో బయటకు అడిగితేనే ఇలా నిర్వహించాం మరోసారి అలా చేయం: సీఎస్
రాష్ట్రంలో 610 జీవో అమలు వ్యవహారం మరో వివాదంలో చిక్కుకుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ శనివారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం ఇందుకు కారణం. దీన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమర్థించగా.. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. సీఎస్ ఎదుటే నిరసన తెలిపాయి. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే తాము హాజరుకాబోమని స్పష్టంచేసి, అర్ధాంతరంగా వెళ్లిపోయాయి. విడివిడిగా చర్చలు జరిపినా, శనివారం కీలక నిర్ణయాలేమీ తీసుకోకపోవడం విశేషం.
గత వారం ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశం ముగిశాక స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు సీఎస్‌ను విడిగా కలిశారు. తమకు, తెలంగాణ సంఘాలకు వేర్వేరు సమావేశాలు నిర్వహించాలని కోరారు. దీంతో శనివారం ఉదయం స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి ఏపీ ఎన్జీవో, టీఎన్జీవో నేతలతోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. విడి భేటీ నిర్వహించినందుకు ప్రతినిధులు సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఇలాగే జరపాలని సూచించారు. 610తో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చే వారందరినీ బదిలీ చేయాలని మరోసారి కోరారు. టీఏ, డీఏలను, సీనియారిటీని అడక్కుండానే వెళ్లడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘంతో, సీఎంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని సీఎస్ హామీ ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలపై మార్గదర్శకాలు లేకపోవడంవల్ల అమలు కష్టసాధ్యంగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పగా, త్వరలో వాటిని ఇస్తామని హరినారాయణ అన్నారు. 1975 నుంచి ఉద్యోగుల జాబితా దొరకడం అసాధ్యమని సంఘాలు చెప్పగా, అందుబాటులో ఉన్నవన్నీ సేకరించాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించామన్నారు. స్థానికేతరుల జాబితాపై అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని సంఘాలు ఫిర్యాదు చేయగా వారి వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని హామీ ఇచ్చారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సంఘాలతో సీఎస్ విడిగా సమావేశమయ్యారు. దీనిపై ఆ సంఘాల నేతలు తీవ్ర నిరసన తెలిపారు. ''తెలంగాణ, తెలంగాణేతర సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను ఉమ్మడిగా చర్చిస్తేనే, ఒకరి అభిప్రాయం మరొకరు తెలుసుకొని, తుదకు ఏకాభిప్రాయం, పరిష్కారం సాధించే వీలుంది. వేర్వేరు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటి? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, తెలంగాణ సంఘాలతో ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆదేశాలిచ్చారు. దానిని బేఖాతరు చేయడం మాకు అవమానకరం. దీనికి బాధపడుతున్నాం. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం. స్టాఫ్ కౌన్సిల్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు లేవు. దాంతో సమావేశం జరపడం వల్ల మా ప్రాంతానికి ఒరిగేదేమీ లేదు. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే మేం హాజరుకాబోం. లేదంటే మాకూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ హోదా కల్పించాలి'' అని ప్రతినిధులు వాదులాడారు. సంఘాలను తాము వేర్వేరుగా చూడడంలేదని సీఎస్ వివరణ ఇచ్చారు. ''స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రత్యేకంగా జరపాలని దాని ప్రతినిధులు కోరడం వల్లే అందుకు అనుమతిచ్చాం. సాయంత్రం సమన్వయ కమిటీ భేటీకి హాజరు కావాలని వారికి సూచించినా ఎవరూ రాలేదు. మరోసారి ఇలా జరగనివ్వం'' అని హరినారాయణ వివరించారు. అనంతరం జీవో అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించబోగా... తెలంగాణ నేతలు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.
నేడు రౌండ్ టేబుల్ భేటీ
కాగా బదిలీలను నిషేధిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల పరిధిలోంచి 610 జీవో బదిలీలను ప్రభుత్వం మినహాయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అన్ని శాఖల్లో కాంట్రాక్టు నియామకాల్లో సైతం విధిగా 610ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ముల్కీ నిబంధనల అమలు కోసం ఆదివారం ఉదయం పది గంటలకు నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 610 అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఆరు సూత్రాలలో అయిదింటిని ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్లనే.. ముల్కీ నిబంధనలు అమలు చేసి, తెలంగాణ మొత్తాన్ని ఒక జోన్‌గా పరిగణించాలని కోరుతున్నామని చెప్పారు.
Sunday, July 8, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment