Tuesday, July 3, 2007

లగడపాటి ఆ సభలో పాల్గొనాల్సింది కాదు eenadu

కోమటిరెడ్డి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం 610 జీవో అమలుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు నిర్వహించిన సభలో పాల్గొనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజగోపాల్‌ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన మంగళవారమిక్కడ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. తెలంగాణను పాకిస్థాన్‌ సమస్యతో పోల్చడం ఎంత మాత్రం తగదని, ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లోని వారే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడం తగదని, ఈ జీవో అమలుకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
పీసీసీ చర్చించాలి: ఎమ్మెల్యే వేదవ్యాస్‌
610 జీవో అమలు నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడటంపై పీసీసీ చర్చించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ అన్నారు. పార్టీ నేతలు ఆవేశపడటం, తొందరపడి మాట్లాడటం మంచిది కాదన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆయన కోరారు. 610 జీవో అమలుతో బదిలీ కావాల్సిన వారు ఏడెనిమిది వేల మందికి మించి ఉండరని చెప్పారు.

No comments: