Saturday, May 10, 2008

తెలంగాణ పోరాట యోధుడు (Eenadu 10-5-08)

బీఎన్‌ రెడ్డి కన్నుమూతతెలంగాణ పోరాటయోధుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్‌ రెడ్డి) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని గోల్నాకలో నివాసముంటున్న ఆయన గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్వల్పఅస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంబర్‌పేట శ్మశానవాటికలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు బీఎన్‌రెడ్డి మరణవార్త తెలియగానే పలువురు నాయకులు ఆయన ఇంటికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నల్గొండజిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కె.జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ, లోక్‌సభ సభ్యుడు సురవరం సుధాకర్‌రెడ్డి, భాజపా జాతీయ కార్యదర్శి ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ చుక్కారామయ్య, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకట్‌రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్‌ తదితరులు ఆయన ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఎం కేంద్ర కమిటీ నేతలు, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావు తదితరులు సంతాపం తెలిపారు.
ఇదీ ప్రస్థానం: 1925లో నల్గొండజిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు రెండోసంతానంగా బి.ఎన్‌.రెడ్డి జన్మించారు. ఆయన సోదరుడు కుశలవరెడ్డికాగా సోదరీమణులు మల్లు స్వరాజ్యం, శశిరేఖ, సరస్వతమ్మలు. మెట్రిక్యులేషన్‌ పూర్తయిన వెంటనే బీఎన్‌రెడ్డి ఉద్యమాల బాటపట్టారు. 1945లో సరోజను వితంతు వివాహం చేసుకున్నారు. 1957, 1967లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, 1971, 1984, 1991లో ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంటుకు బస్సులోనే వెళ్లేవారు. 1975 నుంచి 1983 వరకు సీపీఎం జిల్లా కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1997లో సీపీఎంను వీడి బీఎన్‌ సీపీఎంను స్థాపించారు. అనంతరం ఓంకార్‌ స్థాపించిన ఎంసీపీఐలోచేరారు. వందెకరాల సొంత భూమిని పేదలకు పంచిన ఘనత ఆయనకే దక్కుతుంది.
పోరాటాల 'భీముడు' నిజాంను ధిక్కరించాడు రజాకార్లకు ఎదురొడ్డాడు తెలంగాణ సాయుధ పోరాట సేనాని పేదల పక్షపాతి ఎంపీ, ఎమ్మెల్యేగా గెల్చినా బస్సులోనే ప్రయాణం వామపక్షాల ఐక్యత ఆయన కల హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

ఉద్యమాల వీరుడు.. పోరాటాలకు నిలువెత్తు రూపం. గోలుకొండా ఖిల్లా కింద నీ గోరి కడతం కొడుకో.. అని నైజాంను గర్జించినవాడు. భూస్వాముల ఆగడాల్ని, రజాకార్ల అకృత్యాల్ని నిలువరించేందుకు స్వయంగా తుపాకీ చేబట్టి పేదల పక్షాల నిలిచిన ధీరోదాత్తుడు. తెలంగాణ సాయుధ పోరాట దళానికి తొలి తరం గెరిల్లా సేనాని. సమసమాజం కోసం పాటుపడిన వ్యక్తి. 'దున్నేవాడిదే భూమిరా' అంటూ నినదించి.. వంద ఎకరాల తన భూమిని ప్రజలకు పంచిన త్యాగశీలి. సమరశీల పోరాటాలు రచించడంలో ఉద్ధండుడు. చాకలి ఐలమ్మ పోరాటం నుంచి భూస్వామి విస్నూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ముందున్న ధీశాలి. ఆయనే బి.ఎన్‌.రెడ్డిగా ప్రాచుర్యం పొందిన భీంరెడ్డి నర్సింహారెడ్డి.
నేపథ్యమిది.. నల్గొండ జిల్లా తుంగతుర్తి తాలూకా కొత్తగూడ గ్రామంలో ధనవంతుల కుటుంబంలో జన్మించినా.. ఆలోచనలు, ఆశయాలు మాత్రం సమసమాజం వైపే. స్థానిక జమీందారుల నిరంకుశత్వానికి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం క్రమంగా నిజాం అరాచకాలపై వ్యతిరేక పోరుగా... ఆనక రాజకీయ ఉద్యమంగా మారింది. మొదటి దశకు ఆద్యుడైన రెండో తరం నేతలల్లో ముందు భాగాన ఉన్న బీఎన్‌... చివరి దశ వరకూ అలుపెరగని పోరాటం సాగించారు. వీర తెలంగాణ ఉద్యమ నేతలుగా రావి నారాయణరెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్‌ తదితరులుంటే... ఆరుట్ల రామచంద్రరెడ్డి, బీఎన్‌ రెడ్డి, కుర్రారం రామిరెడ్డి తదితరులు సాయుధ పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సాయుధ సేనానులుగా ఉండి భూస్వాములకు, నిజాంకు వ్యతిరేకంగా పోరు సల్పారు. సాయుధ పోరాట సమన్వయానికి ఏడుగురి సభ్యులతో ఒక కమిటీ ఉంటే... దానికి కార్యదర్శిగా బీఎన్‌ ఉండేవారు. కమ్యూనిస్టులకు సహకరిస్తున్నావంటూ భూస్వామి విస్నూరు రామచంద్రారెడ్డి చాకలి ఐలమ్మపై కక్షగట్టారు. తన దగ్గర కౌలుదారుగా ఉన్న ఆమె పండించిన ధాన్యం బస్తాలను తీసుకుపోయి దాచేస్తే... భీంరెడ్డి స్వయంగా వెళ్లి ధాన్యం బస్తాలను భుజాన వేసుకుని తిరిగి ఐలమ్మకు అప్పగించారు. సూర్యాపేట భూపోరాటంలోనూ బీఎన్‌ సమరశీల పాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతరం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆ తర్వాత సూర్యాపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత ఆయన సీపీఎం వైపునకు వెళ్లారు.
నల్గొండలో మాత్రం ఐక్యంగా ఉండాల్సిందే 1971లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎన్‌రెడ్డి మిర్యాలగూడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేశారు. సమైక్యవాదంపై గట్టిగా నిలబడ్డారు. అప్పటికి రావి నారాయణరెడ్డి కూడా జీవించే ఉన్నారు. దేశమంతా కమ్యూనిస్టులు ఎలా ఉన్నా.. వామపక్షాల పురిటిగడ్డ నల్గొండలో మాత్రం కలిసే ఉండాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు ఐక్యంగా పనిచేయడంతో తెలంగాణ ఉద్యమ గాలిలో కూడా.. బీఎన్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం మూడుసార్లు మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెల్చిన ఆయన చివరి కోరిక కమ్యూనిస్టులను ఐక్యంగా చూడాలన్నదే. ఆయన చివరి రోజుల్లో కూడా సన్నిహితులతో ఇదే తన ఆఖరి కోరిక అని చెప్పేవారని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.
మూడుసార్లు ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే అయినా... రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా... గెలిచినా బీఎన్‌ రెడ్డి చాలా సాదాసీదాగా ఉండేవారు. అంతకాలం పదవుల్లో ఉన్నా ప్రజల కోసమే పనిచేశారు తప్ప... తనకోసం సంపాదించుకున్నది చిల్లిగవ్వ కూడా లేదు. పార్లమెంటు సమావేశాలకు ఆయన ఎప్పడూ బస్సులోనే వెళ్లేవారు. ఈ తరం రాజకీయ నేతలు అలాంటి నేతల జీవితాలనుంచి ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎంతో ఉంది.
- న్యూస్‌టుడే, హైదరాబాద్‌, నల్గొండ

1 comment:

raj kumar said...

anna nice information..chala bagundi ee blog keep it up .

rajkumar
www.tgstate.com