Thursday, June 28, 2007

లగడపాటీ.. ప్రేలాపనలాపు! Eenadu

రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు
తెరాస నేతలు వినోద్‌కుమార్‌, హరీశ్‌ ధ్వజం
610పై చర్చకు రావాలని సవాల్‌
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ను తెలంగాణ ఉద్యోగులే అక్కణ్నుంచి తరిమికొడతారన్న కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వ్యాఖ్యలపై తెరాస ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే హరీశ్‌లు మండిపడ్డారు. నోటిని అదుపుచేసుకోవాలని సలహా ఇచ్చారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలో వేర్వేరు విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. 610 జీవో అమలుపై హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగచర్చకు రావాలని లగడపాటి రాజగోపాల్‌కు వినోద్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. ''610 జీవోకు లోబడి స్వస్థలాలకు వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు, టీచర్లు తెరాస ఆఫీసుకొచ్చి చెప్పారు. కానీ ఆ ప్రాంత రాజకీయ నాయకులు, ఉద్యోగసంఘాల ప్రతినిధులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. లగడపాటి రాజగోపాల్‌కు 610 అమలుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలి. 610వెనుకున్న స్ఫూర్తి ఏమిటో... రాజ్యాంగం తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హక్కులేమిటో సవివరంగా చర్చిద్దాం. 610 జీవో అమలుచేస్తే తెలంగాణ నాయకులనే తరమికొడతారన్నట్లు లగడపాటి మాట్లాడుతున్నారు. ఈయన తెలంగాణ అంశంపై చరిత్రను వక్రీకరిస్తూ గతంలో ఎంపీలకు లేఖలు రాశారు. ఫజల్‌అలీ కమిషన్‌ తెలంగాణ వద్దని చెప్పినట్లు వాదన లేవనెత్తారు. అంటే తెలంగాణ వాళ్లకు భాషరాదనా ఆయన ఉద్దేశం. లేదంటే వెర్రివాళ్లనుకున్నారా. దానిపైన కూడా చర్చిద్దాం రండి. లేదంటే ఇలాంటి పనికిమాలిన మాటలు ఇంకెప్పుడూ మాట్లాడకుండా రాజకీయ నాయకుడిలా సొంత నియోజకవర్గం కోసం పనిచేసుకుంటే బాగుంటుంది'' అని వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్న 610 అమలును లగడపాటి ఎందుకు అడ్డుకుంటున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ హైదరాబాద్‌లో ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ ముందు జరిగిన పరాభవాన్ని లగడపాటి మర్చిపోయినట్టుందంటూ ఎద్దేవా చేశారు. 'ఆరోజు తిన్న తన్నులూ దెబ్బలూ గుర్తు లేవా? ఈ పిచ్చి ప్రేలాపనలు మానుకో' అని తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అటు ఎన్డీయేకానీ, ఇటు యూపీఏ కానీ అధికారికంగా ఎవ్వరూ తమను సంప్రదించలేదని వినోద్‌కుమార్‌ తెలిపారు.
610 నీటిపారుదల శాఖకే
610 జీవో కేవలం నీటిపారుదల (ఇరిగేషన్‌) శాఖలోని ఉద్యోగులకోసం ఉద్దేశించింది మాత్రమేనని తెరాస ఎంపీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అది చాలా చిన్న అంశమని, అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రపతి ఉత్తర్వులు అమలుచేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. ఏ జోన్లో ఆ ప్రాంత ఉద్యోగులుండాలని రాష్ట్రపతి ఉత్తర్వులు చెబుతున్నాయని, 610 జీవో స్ఫూర్తిని మిగతా శాఖల్లోనూ అమలుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

స్థానికేతరులు 4500 మంది - eenadu

స్థానికేతరులు 4500 మంది ప్రభుత్వానికి 99 శాఖల సమాచారం స్పందించని మూడు విభాగాలు జాబితాలపై తెలంగాణ సంఘాల అసంతృప్తి 75 నుంచి వివరాల సేకరణ కష్టమంటున్న అధికారులు నేటి నుంచి బదిలీలు హైదరాబాద్‌- న్యూస్‌టుడే610 అమల్లో భాగంగా ఇప్పటికి 99 శాఖలు స్థానికేతర ఉద్యోగుల్ని గుర్తించాయి. వారి జాబితాను ప్రభుత్వానికి సమర్పించాయి. గత శనివారం వరకు 63 శాఖలకు చెందిన 3,114 మందితో మాత్రమే జాబితా తయారు కావడం, దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడం తెలిసిందే. దీంతో సాధారణ పరిపాలన అధికారులు మిగతా అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఫలితంగా సోమవారం నుంచి బుధవారం వరకు, మరో 36 శాఖలు తమ పరిధిలోని సుమారు 1400 మంది ఉద్యోగుల వివరాలను పంపించాయి. వెరసి బుధవారం వరకు గుర్తించిన స్థానికేతరుల సంఖ్య సుమారు నాలుగున్నర వేలకు చేరింది. 610 అమలుకు గుర్తించిన మొత్తం 102 శాఖల్లో, దేవాదాయ, న్యాయ, భూ ఆక్రమణల కోర్టు విభాగాలు మాత్రమే ఇప్పటివరకు స్పందించలేదు. గురువారం వరకు వాటి నుంచి కూడా సమాచారం అందుతుందని భావిస్తున్నారు. మరోవైపు పోలీసు శాఖ నుంచి పూర్తి (కానిస్టేబుళ్లు, తదితరుల) వివరాలు అందలేదు. అక్కడ బదిలీల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావడంతో, ఒకటి రెండు రోజుల్లో సమగ్ర సమాచారం అందుతుందని చెబుతున్నారు. గుర్తించిన స్థానికేతరుల్లో స్వచ్ఛంద బదిలీ కోరుకునే వారికి, 28 నుంచి ఉత్తర్వులు అందజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు, గురువారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఉద్యోగుల పేర్లతోనే జీవోలివ్వాలని సాధారణ పరిపాలన అధికారులు అన్ని శాఖల వారికి నిర్దేశించారు. శాఖల వారీగా రెండేసి జీవోలు ఇస్తారు. పోస్టులు ఖాళీలున్న చోట్లకు బదిలీ చేస్తూ ఒకటి, పోస్టులు ఖాళీ లేని చోట్లకు డిప్యుటేషన్‌, కాల పరిమితితో బదిలీలతో మరోటి ఉంటాయి.
సర్కారు రూపొందించిన స్థానికేతరుల జాబితాపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో, ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఉద్యోగ నాయకుల్ని బుధవారం అత్యవసరంగా చర్చలకు పిలిచింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌, కార్యదర్శి గోపాల్‌రెడ్డి, గెజిడెట్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, ఉపాధ్యాయ సంఘం నేత ప్రభాకర్‌, ఇంజినీరింగ్‌ ఎక్సైజ్‌ సంఘాల శ్రీధర్‌ దేశ్‌పాండే, శ్రీనివాస్‌రావులతో సాధారణ పరిపాలన శాఖ సేవా విభాగం ముఖ్య కార్యదర్శి కృష్ణయ్య సమావేశమయ్యారు. ప్రభుత్వం తయారు చేసిన జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఉద్యోగులందరినీ సొంతజోన్లకు పంపాలని, డిప్యుటేషన్లన్నింటినీ రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. స్థానికేతర ఉద్యోగుల జాబితా తప్పులతడకగా ఉందని అభ్యంతరం తెలిపారు. వివాదాస్పద 415, 399 జీవోల ఆధారంగానే అది రూపొందిందని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని విమర్శించారు. ఎక్కువగా తెలంగాణా ఉద్యోగులనే స్థానికేతరులుగా గుర్తించారంటూ ఎక్సైజ్‌, ఇంజినీరింగ్‌ ఉద్యోగుల జాబితాలను ఉదహరించారు. ఈ జాబితాతో 610 అమలు సమస్యాత్మకంగా మారుతుందని, ఇది తెలంగాణా ఉద్యోగుల్లో చిచ్చు పెడుతుందని తెలిపారు. 1975 నుంచి జరిగిన నియామకాల ఆధారంగా స్థానికేతరులను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నందున, తమకు అందుబాటులో ఉన్న సమాచారం జాబితా ఆధారంగా మొదటి దశ బదిలీలు చేపట్టామని కృష్ణయ్య తెలిపారు. 1975 నుంచి వివరాలు సేకరించడం కష్టసాధ్యమని ఆయా శాఖలు చెబుతున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ నేతలు ఈ వాదనను తోసిపుచ్చారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, ఇతర బోర్డుల నుంచి సమాచారం సేకరిస్తే అన్ని వివరాలు సులభంగా అందుతాయని సూచించారు. (వారి అభ్యంతరాలను ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన కృష్ణయ్య, వెంటనే వెళ్లి ప్రధాన కార్యదర్శిని కలిశారు.) పరిమితికి లోబడి స్వచ్ఛంద బదిలీలపై వెళ్లేవారికే సీనియారిటీ వర్తిస్తుందని, ఇంకా ఎవరైనా వెళితే వారికి సీనియారిటీ వర్తింపజేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల నేతలతో శనివారం మరోదఫా చర్చలు జరిపి సలహాలు సేకరిస్తామని తెలిపారు. కాగా న్యాయ సలహా అవసరం లేకుండానే ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ నేతలు కోరారు.

ఇవేం బదిలీలు? - vaartha

జిఎడి కార్యదర్శిని ప్రశ్నించిన టిజెఎసి హైదరాబాద్‌, జూన్‌ 27, ప్రభాతవార్త రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 610 జీవోను అమలు చేస్తామని చెపుతున్న ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా పనిచేస్తుందని తెలంగాణ జెఎసి సెక్రెటరీ జనరల్‌ సి.విఠల్‌, కో-ఛైర్మన్‌ ప్రభాకర్‌, కార్యదర్శులు శ్రీధర్‌ దేశ్‌పాండే, గోపాల్‌రెడ్డి,శ్రీనివాసరావు, పద్మాచారి,శ్రీనివాస్‌గౌడ్‌లు విమర్శించారు. బుధవారం జిఎడి కార్యదర్శితో వారు సమావేశమయ్యారు.399,415 జీవోలను రద్దు చేసినా కూడా అందులో ఉన్న విధంగానే బదిలీలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 1975 నుంచి స్థానికేతరులను గుర్తించకుండా సీలింగ్‌ విధించడాన్ని వారు ప్రశ్నించారు.బదిలీకోసం రూపొందించిన లిస్టులో కూడా తెలంగాణవారినేచేర్చి, ఆంధ్రవారిని ఇక్కడే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. సచివాలయంలో ఫేర్‌షేర్‌ ఇవ్వాలని 42 శాతం తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై జిఎడి కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం జీవో అమలుకు చిత్తశుద్దితో ఉందన్నారు. ఇప్పుడు గుర్తించిన వారిని బదిలీచేసిన తరువాత 1975 నుంచి వివరాలు సేకరిస్తుందని చెప్పారు. మేము అంగీకరించం : ఎపిఎన్జీఓలుప్రభుత్వం ప్రస్థుతం జారీచేయాలను కుంటున్న బదిలీ ఉత్తర్వులను అంగీకరించబోమని ఎపి ఎన్జీఓల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. స్థానికేతరులను గుర్తించి ముందుగా వారి జాబితాను అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం జాబితా ఇవ్వకుండానే బదిలీ ఉత్తర్వులు ఇస్తామని చెప్పడం సరికాదని వారంటున్నారు. అలాగే ఎపిఎన్జీఓల నాయకులపై టిఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై కూడా వారు మండిపడుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 610ని అమలు చేయాలనే తాము కోరుతున్నామని వారు పేర్కొంటున్నారు.