(ఆన్‌లైన్ , సిటీబ్యూరో) చైనాలోని 'ప్యూ అండ్ నాన్' నది తరహాలోనే మూసీని బాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక లు సిద్ధం చేసింది. మూసీ నది తరహాలోనే ఆ నది సైతం కాలుష్యంతో నిండిపోయింది. చైనా ప్రభుత్వం దాన్ని శుద్ధిచేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కలుషిత నదిని బాగుచేయడంలో చైనా ప్రభుత్వం కనబరిచిన కౌశలాన్ని ప్రపంచ పర్యావరణవేత్తలు ముక్తకంఠంతో ప్రశంసిం చారు. ప్యూ అండ్ నాన్ మాదిరిగానే భాగ్యనగర చరిత్రతో పెనవేసుకున్న 'మూసీ' నదిని మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది.
లక్ష్య సాధనలో ఇప్పటికే ఆయా శాఖలు తమ పనులు ప్రారంభించాయి. 'మూసీ ఇక కంపు కాదు... సొంపు' అంటూ అధికారులు ప్రకటనలు గుప్పించేశారు. అయితే మూసీ ప్రక్షాళనకు పరిశ్రమల కాలుష్య జలాలు పెద్ద సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏమంటే ఆయా ప్రాంతాలల్లో 'సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్' ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రసాయన వ్యర్ధాలు మూసీలోకి రావని వారి వాదన. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
మూసీలోకి పారిశ్రామిక వ్యర్ధజలాలు వివిధ నాలాల గుండా ప్రవహించడం అటుంచితే, ఏకంగా కొన్ని పరిశ్రమల నిర్వాహకులు అత్యంతగాఢత ఉన్న యాసిడ్ అవశేషాలను అక్రమంగా మూసీలోకి కుమ్మరిస్తున్న సంఘటనలు తాజాగా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దాడులల్లో వెలుగుచూశాయి. మరో పక్క మహానగర నీటి సరఫరా, సివరేజ్ బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు' నిర్మిస్తోంది. అయితే ఈ ప్లాంట్లు పరిశ్రమల వ్యర్ధజలాలను శుద్ధి చేసేవి కాదు. ఇటువంటి పరిస్థితిలో నిజంగా 'మూసీ సొంపు' అవుతుందా... వెచ్చిస్తున్న కోట్లరూపాయలకు ఫలితం ఉంటుందా... లేదా... అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న...
ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఇవే...
మూసీలోకి వస్తున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు గాను వాటర్ బోర్డ్ సివరేజ్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్స్‌ను 340 కోట్లరుపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తోంది. అంబర్‌పేట్, నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్‌లలో వీటిని నిర్మిస్తున్నారు. వీటి సామర్ధ్యం అంబర్‌పేట్‌లో 339 ఎం ఎల్‌డి(మిలియన్ లీటర్స్ ఫర్ డే) నాగోల్‌లో 172, నల్లచెరువులో 30 , అత్తాపూర్‌లో 51 ఎంఎల్‌డి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పరిశ్రమల రసాయన వ్యర్ధజలాల శుద్ధికి ఇక్కడ నిర్మిస్తున్న సివరేజ్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ శక్తి సరిపోదు. అని శాస్త్రీయంగా మాట్లాడితే పరిశ్రమల వ్యర్ధజలాలతో గృహా వ్యర్ధాలను కలపడం ద్వారా వాటి గాఢత తగ్గిస్తాం అని పేర్కొంటున్నారు. వాస్తవానికి రసాయన వ్యర్ధజలాలో ఉండే భారీలోహాలు ఎటువంటి వ్యర్ధాలతో కలిపినా వాటి స్వరూపం మారవన్న భౌతిక శాస్త్ర నియమాన్నే కాదనే అధికారులను చూసి జాలిపడాలో .. ఇటు వంటి అధికారులు చరిత్ర ఆనవాళ్లు ఉన్న మూసీనదికి మంచి రోజులు తెస్తామంటే సంబరపడాలో అర్ధం కావడం లేదు.
Sunday, July 8, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment