Sunday, July 1, 2007

610పై టిఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది: కేకే andhra jyothi

హైదరాబాద్‌, జూలై 1 (ఆన్‌లైన్‌): 'ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణీత కాలవ్యవధిలో 610 ఉత్తర్వును అమలు చేయాలని కోరుకుంటోంది .. ఇందుకు సంబంధించి చర్యలు వేగవంత చేసింది .. ఇప్పటికే బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది .. ఇంత కంటే ఏం చేయాలి'అని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు ప్రశ్నించారు. రాజకీయం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధిలో లోపమెక్కడుందో చెప్పాలని టిఆర్‌ఎస్‌ నేతలను కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 610 ఉత్తర్వు అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, సభా సంఘాన్ని కూడా నియమించిందని అన్నారు.
ఇంకా కావాలంటే.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమేనని.. అ సమావేశానికి టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావును కూడా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇప్పటివరకూ నాలుగువేల మంది వరకూ స్థానికేతర ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. గత ఇరవై రెండేళ్లుగా 610 ఉత్తర్వుల అమలుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గాని, ఆ పార్టీలోనే కొనసాగిన కేసీఆర్‌గాని మాట్లాడలేదని కేకే అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని ప్రయత్నిస్తుంటే.. రాజకీయ రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎందుకు సచివాలయాలన్ని ముట్టడి చేయాల్సి వస్తోందో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రజలకు వివరించాలని అన్నారు.
గిర్‌గ్లాని నివేదిక గురించి గాని.. 610 ఉత్తర్వు గురించి గాని టిఆర్‌ఎస్‌ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. లక్షలాది మంది స్థానికేతర ఉద్యోగులు ఉన్నారని అంటున్నారని.. ప్రభుత్వం లెక్కలు తీస్తే.. నాలుగువేల మంది మాత్రమే ఉన్నట్లు తేలిందని.. ఇంకా మరో పదిహేను వందల మంది వరకూ ఉంటే ఉండోచ్చని అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నట్లు లక్షల సంఖ్యలో స్థానికేతర ఉద్యోగులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 610 ఉత్తర్వు పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర సమితికి చిత్తశుద్ధి లేదని .. ఆ సమస్య పరిష్కారమైతే.. ఇక మాట్లాడేందుకు ఆ పార్టీకి ఏ అంశమూ ఉండదని కేకే అన్నారు. గతంలో 399,415 ఉత్వర్వులను వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారని.. ఇప్పుడు వాటిని అనుసరించే మార్గదర్శకాలు రూపొందించి, బదిలీల ప్రక్రియను చేపట్టారని పేర్కొన్నారు.

No comments: