ఆంధ్రావాళ్ల లుంగీలు త్వరగా లాగండి
అప్పుడైనా మా వాళ్లకు రోషం వస్తుంది
తిరుమల నిధులు మళ్లిస్తే వూరుకోం
హైదరాబాద్ మీరు తీసుకుంటే... శ్రీశైలం నీళ్లు మేం
తీసుకుంటాం
టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు
కర్నూలు, నంద్యాలటౌన్- న్యూస్‌టుడే
610 జీవో అమలుపై జరుగుతోన్న రగడ నేపథ్యంలో రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ మళ్లీ గళమెత్తారు. తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ సోమవారం చేపడుతున్న సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం సరికాదన్నారు. రాయలసీమ ఉద్యోగులపై చెయ్యేస్తే... చెయ్యి తీస్తామని హెచ్చరించారు. సీమ ఉద్యోగుల రక్షణకు ఓ సేనను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు, నంద్యాలల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ''నాడు ఉద్యోగాలకు అర్హులైన వారు దొరక్కపోవడంతో కోస్తా, రాయలసీమ నుంచి వెళ్లారు. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్లమనడం సబబు కాదు'' అని పేర్కొన్నారు. ''హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్ల లుంగీలు లాగుతామంటున్నారు. అదేదో తొందరగా చేయండి. అప్పుడన్నా మావాళ్లకు రోషం వచ్చి సీమ అభివృద్ధికి కృషి చేస్తారు'' అని టీజీ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మా అబ్బ సొత్తు అని తెరాస ఎమ్మెల్యే హరీష్ పేర్కొనడాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ లెక్కన శ్రీశైలం డ్యాం తమ అబ్బ సొత్తుగా టీజీ పేర్కొన్నారు. ''దీనికి ఒప్పుకునేందుకు వారు సిద్ధంగా ఉంటే... పెద్దవాళ్లం కూర్చొని మాట్లాడుకుంటాం'' అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 'ఓవర్ యాక్టివ్'తో 610జీవో అమలుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ''610జీవో అమలైతే తెలంగాణ సమస్య సమసిపోతుందని వైఎస్ భావిస్తున్నారు. ఆ సమస్య తీరదన్న విషయం ఆయన అర్థం చేసుకోవాలి'' అని పేర్కొన్నారు. రాయలసీమలో ఉన్న తిరుపతి, శ్రీశైలం ఆలయాలకు వచ్చే నిధుల్ని సీమలోనే వినియోగించాలని టీజీ డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాల్లో ఆ నిధుల్ని వినియోగిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కోస్తా, తెలంగాణలో ఉన్న దేవాలయాలకు అత్యుత్సాహంతో తిరుపతి నిధులను మళ్లించారని... పుష్కరాలప్పుడు కూడా ఇదే విధంగా వాడారని విమర్శించారు. రాయలసీమకు చెందిన విద్యుత్ బోర్డులు రెండూ కోస్తా, తెలంగాణలో ఉన్నాయని, వాటిని వెంటనే సీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు బెంచ్‌తో పాటు, కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలు వరదలతో సతమతమవుతుంటే... తెరాస సభ్యులు 610జీవో అమలుపై రాజకీయం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ''కష్టాల్లో ఉన్నప్పడు కనీస సానుభూతి కూడా చూపించరా? మనిషిగా పుట్టిన వారిలా చేస్తారా?... ధర్నా చేస్తాం... ముట్టడి చేస్తాం అని ఇప్పుడా అనేది? కేసీఆర్ తెదేపాలో ఉన్నప్పుడు జీవో అమలుపై మాట్లాడకుండా కుంభకర్ణుడిలా నిద్రపోయారా?'' అని తీవ్రంగా మండిపడ్డారు.
వల్లభాయ్‌పటేల్ హైదరాబాద్‌ను విముక్తి చేయకపోతే చరిత్రలో అదో మినీ పాకిస్థాన్‌గా మిగిలేదని టీజీ పేర్కొన్నారు.
వల్లభాయ్‌పటేల్ హైదరాబాద్‌ను విముక్తి చేయకపోతే చరిత్రలో అదో మినీ పాకిస్థాన్‌గా మిగిలేదని టీజీ పేర్కొన్నారు.
No comments:
Post a Comment