మా పిల్లలు ఇక్కడే లోకల్
వారిని వదిలిపెట్టి ఎలా వెళ్లమంటారు?
ఇవన్నీ బలవంతపు బదిలీలే
610పై స్థానికేతర కానిస్టేబుళ్ల ఆరోపణ
హైదరాబాద్ - న్యూస్‌టుడే
రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవోల పేర్లు చెప్పి తమని బలవంతంగా హైదరాబాద్ నుంచి పంపిస్తున్నారని నగర పోలీసు విభాగంలోని కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. సరైన మార్గదర్శకాలు, నియమనిబంధనలు లేకుండా కేవలం కొందరు నేతల బ్లాక్‌మెయిల్‌కి ప్రభుత్వం తలొగ్గి తమకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నేపథ్యంలో బదిలీ కాబోతున్న దాదాపు 600 మంది కానిస్టేబుళ్లు ఆదివారమిక్కడ సమావేశమయ్యారు. ఎవరికి వారు ఈ బదిలీ ఉత్తర్వుల్ని న్యాయస్థానంలో సవాల్ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... ''1985 నుంచి గుర్తుకురాని 610 జీవో ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది. కేవలం కొందరు రాజకీయనాయకులు ఒత్తిళ్లకు తలొగ్గే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బదిలీ ఉత్తర్వులు సైతం అస్పష్టంగా ఉన్నాయి. సాధారణంగా వాటిపై డీఓ (డిపార్ట్‌మెంటల్ ఆర్డర్) నంబరు ఉంటుంది. అయితే ఈ అన్యాయమైన బదిలీలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఉండేందుకే డీఓ నంబర్లు లేకుండా ఉత్తర్వులు ఇస్తున్నారు. కానిస్టేబుళ్ల సొంత జిల్లాలకు సంబంధించి జోన్ల వారిగా జాబితాలు విడుదల చేసి కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేస్తున్నారు. సొంత జిల్లాలకు వెళ్లిన వారు అక్కడ ఎస్పీలకు రిపోర్ట్ చేసి తిరిగి హైదరాబాద్ రావచ్చంటూ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదు. ఏళ్లకొద్దీ ఉన్న సర్వీసును కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అమెరికాలో సైతం కొన్నేళ్లుంటే అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అలాంటిది పక్క జిల్లాల నుంచి వచ్చి కొన్నేళ్లుగా ఇక్కడుంటున్న వారు స్థానికేతరులు ఎలా అవుతారు? మా పిల్లలు ఇక్కడ లోకల్... మరి వారిని విడిచిపెట్టి ఎలా వెళ్లాలి. హైదరాబాద్‌ని ఫ్రీజోన్ అని ప్రకటించిన తర్వాతే మేము దరఖాస్తు చేశాం. అలా పేర్కొని మమ్మల్ని తప్పుదోవ పట్టించిన వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఫ్రీజోన్‌గా ప్రకటించినప్పుడు ఈ తెలంగాణవాదులు ఏమయ్యారు? మేము వెళ్లిపోతున్నట్లే కేసీఆర్ సైతం తన నియోజకవర్గం సిద్ధిపేటకే పరిమితం కావాలి. 1973లో వచ్చిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రకారం నగర పోలీసులు, సచివాలయ ఉద్యోగులు 610 నుంచి మినహాయింపని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దాన్నీ బుట్టదాఖలు చేశారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్, హరీష్‌రావు, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసుల జాబితా సిద్ధం
నేడో రేపో ఉత్తర్వులు
610 జీవో నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో బదిలీలు పూర్తిచేయడానికి రంగం సిద్ధమైంది. ఈ జీవో కింద నగర కమిషరేట్ నుంచి 2643 మంది తమ సొంత జిల్లాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే 2 విడతలుగా 248మందిని బదిలీ చేశారు. మిగిలినవారి జాబితా సిద్ధం చేశారు. తూర్పు మండలంలో 198, దక్షిణ మండలంలో 332, మధ్య మండలంలో 213, ఉత్తర మండలంలో 283, పశ్చిమ మండలంలో 323, ట్రాఫిక్‌లో 318, సాయుధ దళంలో 586, స్పెషల్ బ్రాంచ్‌లో 60, సీసీఎస్‌లో 82 మంది బదిలీ కానున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమ, మంగళవారాల్లో వెలువడే అవకాశం ఉంది. తొలుత సొంత జిల్లాలకు బదిలీ చేసి, ఆ వెంటనే డిప్యుటేషన్‌పై తీసుకువస్తారని తెలుస్తోంది.
No comments:
Post a Comment