ఖైరతాబాద్‌లో విషాదఛాయలు
సోనియా, వైఎస్ దిగ్భ్రాంతి !!
మిన్నంటిన అభిమానుల ఆగ్రహజ్వాలలు
పరిస్థితి ఉద్రిక్తం.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే జనార్దనరెడ్డి హఠాన్మరణం
హైదరాబాద్, డిసెంబర్ 28 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్దన రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. జువెల్ గార్డెన్స్ ప్రాంగణంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటీన మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే 11.30 గంటలకు కన్నుమూశారు. పి. జనార్దాన్ రెడ్డి హటాన్మరణంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. జనార్దన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు శోకసంధ్రంలో మునిగిపోయారు. పిజెఆర్ గాంధీభవన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన పార్టీ వ్యవస్థాపక వారోత్సవాల్లో పాల్గొని, గ్రేటర్ ఎన్నికల వ్యూహరచనపై జరుగుతోన్న పార్టీ అంతర్గత సమావేశానికి హాజరు కావడానికి బయలుదేరారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనవలసి ఉంది. జువెల్ గార్డెన్స్‌లో జరుగుతోన్న సమావేశ ప్రాంగణంలోకి రాగానే పిజెఆర్ కళ్ళు తిరిగి పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అనంతరం హుటాహుటీన అనుచరులు కిమ్స్‌కు తరలించినా పలితం లేకపోయింది. తీవ్ర గుండెపోటుతో మార్గం మధ్యలోనే జనార్దన రెడ్డి కన్నుమూశారు. జనార్దన రెడ్డి హఠాన్మరణంతో హైదరాబాద్, సికిందరాబాద్ నగరాల్లో విషాద వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తల ఆందోళనతో నగరం నలుమూలలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిజెఆర్ నివాసం వద్ద బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో విషాదభరిత వాతవరణం నెలకొంది. ఇప్పటికే హుటాహుటీన హనుమంతరావు, ఉప్పునూతల, వైఎస్ వంటి కాంగ్రెస్ హేమాహేమీలు కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని జనార్దన రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రస్తుతం పిజెఆర్ మృతదేహాన్ని కార్యకర్తలు, అనుచరులు ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంలోని పలువురు ప్రముఖులకు అత్యంత సన్నిహితులు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జనార్దన రెడ్డి హఠాన్మరణంతో తీవ్ర ద్రిగ్భాంతికి గురై ఫోను ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. హైదరాబాద్ బ్రదర్స్‌లో ఒకడుగా విశేష పేరు ప్రఖ్యాతులు గాంచిన జనార్దన రెడ్డి మృతి ఊహించని పరిణామమని సహచరుడు మర్రి శశిధర రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధినేతలు జనార్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించడానికి వస్తోన్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment