హైదరాబాద్ - న్యూస్‌టుడే
అర్ధరాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ ఆయన వెంట నడుస్తారు. జనం బాధను పంచుకుంటారు. కొండంత అండగా నిలబడతారు. ఆయన ఏ పదవిలో ఉన్నా నమ్మిన వారికి న్యాయం చేసేవరకు విశ్రమించరు. బడుగువర్గాలు, కార్మికులంటే ఎంతో ప్రేమ. పదవిలో ఉన్నా.. లేకున్నా.. ఆయనది రాజీలేని మనస్తత్వం. ఆయనే పబ్బతిరెడ్డి జనార్దనరెడ్డి. పీజేఆర్‌గా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువైన నేత. నగరంలో ఏమూల ఏపేదవాడికి ఏకష్టమొచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోయే జెన్నన్నను మృత్యువు మింగేసిందంటే జనం తట్టుకోలేకపోతున్నారు.
కార్మిక పక్షపాతి: 'ఓట్లతో గెలిచేవాడు కాదు... ప్రజల్లోంచి పుట్టుకొచ్చేవాడు అసలైన నాయకుడు...' ఈ వాస్తవం పీజేఆర్ జీవితంలో అక్షరసత్యం. సామాన్య కుటుంబంలో పుట్టి కార్మికునిగా కంపెనీలో చేరిన ఆయన కార్మికనేతగా ఎదిగారు. అనంతరం రాజకీయాల్లోచేరి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మిక మంత్రి అయ్యారు. మంత్రి పదవి చేపట్టినా... కార్మిక లోకానికి ఆయన ఎన్నడూ దూరం కాలేదు. ఆయన కార్మిక పక్షపాతి. పలు కర్మాగారాల్లో సంఘాలకు నాయకత్వం వహించిన ఆయన కార్మికులకు మెరుగైన జీవితం కోసం నిరంతరం పోరాడారు. 2003, నవంబరులో కూకట్‌పల్లిలోని ఐడీఎల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతిచెందారు. బాధితుల పక్షాన నిలిచిన పీజేఆర్ మునుపెన్నడూలేని విధంగా యాజమాన్యం నుంచి రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగాన్ని బాధిత కుటుంబాలకు ఇప్పించారు. అదేవిధంగా 3నెలల క్రితం నాట్కోలో జరిగిన ప్రమాదంలోముగ్గురు కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు కూడా ఇదే రీతిలో నష్టపరిహారాన్ని ఇప్పించారు.
హైదరాబాద్ 'బిగ్' బ్రదర్: అర్ధరాత్రి ఏ ఆదప వచ్చినా 'మా జెన్నన్న పరుగెత్తుకు వస్తాడు...' అనే కొండంత నమ్మకాన్ని సామాన్య కార్మికులు, జనంలో నాటుకు పోయేలా చేయగలిగారు. నగరంలో పేదవాడికి అన్యాయం జరిగితే తక్షణమే ఆయన ప్రత్యక్షమయ్యేవారు. అది చివరికి తమ పార్టీ కార్యాలయానికి సంబంధించిన విషయమైనాసరే. నాంపల్లిలో నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం వల్ల కొన్ని కుటుంబాల వారు నిర్వాసితులవుతారని దాన్ని వ్యతిరేకించారు. ప్రజలకోసమే పార్టీ అనే భావంతో ఉండేవారు. ఈ మనస్తత్వమే ఆయన్ను హైదరాబాద్‌లో నంబర్ వన్ మాస్ లీడర్‌ను చేసింది. పాన్‌షాప్, సెలూన్, కిరాణాకొట్టు దేన్ని ప్రారంభానికైనా బేషజం లేకుండా రిబ్బన్ కత్తిరించడంలో ఆయన ముందుండేవారు. ఖైరతాబాద్ ప్రాంతంలోని ఇలాంటి అనేక షాపుల్లో ఆయన ఫొటోలే ఇందుకు నిదర్శనం. ఆయన పిలుపు ఇస్తే వేలమంది పోగయ్యే పరిస్థితి ఉండేది. 1999లో ఖైరతాబాద్ నుంచి ఓడిపోయినా ఆయన ప్రజలతో సంబంధాలు పోగొట్టుకోలేదు. జనంతోనే మమేకమయ్యారు. అదే ఆయనకు పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అసలు ప్రజలు మన దగ్గరికి రావడం కాదు, మనమే ప్రజల వద్దకు వెళ్ళాలి అనేది పీజేఆర్ సూత్రం. ఒకసారి మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటే నేతగా పేరుపడ్డారు.
అధికార 'ప్రతిపక్షం': ప్రజలకు చేసిన వాగ్దానాల అమలులో అధికారులను పరుగులెత్తించే వారు. అధికారపార్టీ కదా అని అధికారులు చెప్పినదానికి తలాడించే నైజం కాదు. అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు మాట మార్చడమంటే ఆయనకు గిట్టేది కాదు. అధికారంలోకి వచ్చాక అనేక అవినీతి ఆరోపణలున్న అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. సమీక్షా సమావేశాల్లో ఆయన ప్రతిపక్షపాత్రలోనే కనిపించేవారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో ఆయన విభేదిస్తున్నా అనేకమంది రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పీజేఆర్ వైఖరిని తప్పుపట్టలేకపోయేవారు. పీజేఆర్ వ్యతిరేకులు కూడా ఆయనలోని రాజీలేని ధోరణని మెచ్చుకుంటారు. ఆయన ఏంచేసినా పార్టీకి, ఇందిరాగాంధి కుటుంబానికి మాత్రం ఎల్లప్పుడూ విధేయుడుగానే ఉన్నారు. తన కుటుంబ సభ్యులను సమాజంలో మంచి వ్యక్తులుగా చేయాలనే తపన ఉండేది. ఇందులో భాగంగా కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డిని తన రాజకీయవారుసుణ్ని చేయాలని ఆయన అనుకున్నారు. పీజేఆర్‌లో ఆధ్యాత్మికత ఎక్కువ. జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ గుడి ఆయనలో భక్తి ప్రపత్తులకు నిదర్శనం. దేవాలయాన్ని ఆయనే దగ్గరుండి కట్టించారు. ఇప్పటికీ నిత్యం ఉదయాన్నే ఆయన గుడికివెళ్ళి పెద్దమ్మ సన్నిధిలో కొద్దిసేపు గడిపివచ్చేవారు.
గురుదేవోభవ: తన రాజకీయ గురువు మాజీ ముఖ్యమంత్రి అంజయ్య అంటే పీజేఆర్‌కు ఎనలేని గౌరవం. ఆయన్ను అగౌరవంగా మాట్లాడితే ఒప్పుకునేవారు కారు. అంజయ్య మరణం తరువాత ఆయన భార్య మణెమ్మను రాజకీయాల్లోకి తెచ్చి ఎంపీని చేశారు. ఇటీవలే లుంబినీ పార్కులో తన గురువు విగ్రహాన్ని నెలకొల్పారు.
తాను ఎదుగుతూ... నీడనిస్తూ: కేవలం తన ఎదుగుదలను మాత్రమే చూసుకుంటూ... నమ్మినవారిని తొక్కేసే కుటిల రాజకీయాలకు పీజేఆర్ దూరంగా నిలిచారు. తన నీడలో మరికొంతమంది నాయకులు రూపుదిద్దుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు. దానం నాగేందర్, తెరాస ఎమ్మెల్యే పద్మారావులతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌కూడా ఆయన శిష్యరికంలోనే రాజకీయ జీవితాన్ని మలుచుకున్నారు.
No comments:
Post a Comment