వాగ్దాన భంగాలపై వైరిపక్షం
రాజీలేని 'రాజ'కీయాల్లో కృష్ణపక్షం
కాంగ్రెస్‌లో పీజేఆర్ ప్రస్థానం
కాంగ్రెస్‌లో పీజేఆర్ ప్రస్థానం
హైదరాబాద్ - న్యూస్‌టుడే
పీజేఆర్ విలక్షణ రాజకీయ నాయకుడు. సమస్యలతో రాజీ పడడం ఆయన నైజం కాదు. ఏ మాత్రం సర్దుకు పోయినా అందలం ఎక్కే అవకాశం ఉంటుందని తెలిసినా తాననుకున్న దానికే కట్టుబడ్డారు. తాను మంచి అనుకున్నదే చేస్తారు. దానివల్ల రాజకీయంగా తను నష్టపోయే పరిస్థితి ఉన్నా లెక్కపెట్టరు. ఆయనలోని ఈ మొండితనం ఆయన్ను అనేకసార్లు పదవులకు దూరం చేసిందని సన్నిహితులు అంటారు. 1994-99 మధ్య కాలంలో పీజేఆర్ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా పీజేఆర్ సమస్యలపై తన పోరాటం నుంచి పక్కకు తప్పుకోలేదు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్ విపక్షంలో ఉండి వాగ్దానాలకు కట్టుబడాలని ఆయన పట్టుబట్టారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఐమ్యాక్స్, రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ ఆస్తుల వేలం, తదితర అనేక అంశాల్లో ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వేసిన సభా సంఘాల్లో ఎక్కువ శాతం పీజేఆర్ డిమాండ్‌తో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు విషయంలో ఆయన సహ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డితో కలసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ శాసన సభ్యునిగా ఉంటూ ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సమస్యపై ఆందోళనదశలోనే పీజేఆర్, శశిధర్‌రెడ్డిలను హైదరాబాద్ బ్రదర్స్ అనే పేరు వచ్చింది. పోతిరెడ్డి పాడు అంశాన్ని పీజేఆర్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దానివల్ల తెలంగాణాకు ముఖ్యంగా జంట నగరాల తాగునీటి అవసరాలకు ఇబ్బంది అవుతుందని వాదించారు. కాంగ్రెస్‌లో అసమ్మతినేతగా అంతా భావించినా ఆయనెప్పుడూ పార్టీ క్రమశిక్షణను తప్పకుండా సమస్యలపై మాత్రమే గళమెత్తారు. దాంతో పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు ఆయనతో చర్చలు జరిపేది. పోతిరెడ్డిపాడు విషయంలో పీజేఆర్ డిమాండ్లతో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రత్యేకంగా ఒక ఇంజినీర్‌తో దానిపై అధ్యయనం చేయించారు. పోతిరెడ్డిపాడు వల్ల ఇబ్బంది లేదని ఇంజినీరు తేల్చారు. పార్టీలో ఒకనిర్ణయం తీసుకున్నాక కొందరికి ఆమోద యోగ్యం కాకున్నా కట్టుబడి ఉండాల్సిందేనన్న పార్టీ సూచన మేరకు దానికి కొంత విరామాన్నిచ్చారు. పోతిరెడ్డిపాడు వివాదానికి ముందు పీజేఆర్ ప్రత్యేక తెలంగాణా విషయంలో తన వైఖరిని ఎప్పుడూ బయట పెట్టలేదు. పోతిరెడ్డిపాడుపై పీజేఆర్ రాజీలేని పోరాటం చేయడంతో తెలంగాణా వాదుల్లో ఆయన్ను హీరోను చేసింది. అప్పటినుంచి ఆయన ప్రత్యేక వాదిగా ముద్రపడ్డారు. హైదరాబాద్ నగరానికి మూడో దశ కింద కృష్ణాజలాలనే రప్పించాలనేది ఆయన డిమాండ్. డిపెప్ కుంభకోణంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు పాత్రపై విచారణ కోసం పీజేఆర్ కొంతకాలంగా సభాసంఘం సమావేశాల్లో తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. సూరీడును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన రెండు రోజుల క్రితం సిఐడి అధికారులను నిలదీశారు. ప్రభుత్వం గోదావరి నీటినితెచ్చే ప్రయత్నాల్లో ఉండడంతో దానిపై ఉద్యమం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు.మరణించే నాటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో అసమ్మతినేతగా ఉన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ఆయనకు మధ్య బాగా ఎడం పెరిగి పోయింది. రాజకీయంగా విబేధాలతోపాటు జూబ్లీహిల్స్‌లో జరిగిన కారు సంఘటన రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది.వాస్తవానికి పీజేఆర్ ఆది నుంచి వైఎస్ వ్యతిరేకి కాదు. 1978లో వైఎస్, పీజేఆర్‌లు ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలయ్యారు. ఆ తరువాత 1988లో వైఎస్ ఆధ్వర్యంలో రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ దీక్షల ఏర్పాట్లన్నింటినీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పీజేఆరే పర్యవేక్షించారు. ఆ తరువాత 1994లో పీజేఆర్ సీఎల్పీ నేత కాగా 1998లో వై.ఎస్ పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి. 1999 ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో అవి మరింత ముదిరాయి. 1999 ఎన్నికల్లో పీజేఆర్ ఓటమి పాలవడం, వైఎస్ సీఎల్పీ నేత కావడంతో ఆ తరువాత ఇద్దరి మధ్యా విభేదాలు అలాగే ఉండి పోయాయి. 2004లో వైఎస్ సీఎం అయ్యాక అంతకుముందు ఆయన్ను వ్యతిరేకించిన అనేక మంది నేతలు ఆయనతో రాజీ పడిపోయారు. ఆయన వద్దకెళ్ళి ఇక మీతోనే ఉంటామంటూ సర్దుకు పోయారు. అటువంటి వారికి మంచి పదవులు దక్కాయి. అయితే పీజేఆర్ మాత్రం రాజీపడలేదు. వైఎస్ వ్యతిరేక వైఖరిని అలాగే కొనసాగించారు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పీజేఆర్‌లేని మంత్రివర్గమా అని హైదరాబాద్ ప్రజలు ఆశ్చర్య పోయారు. వైఎస్‌తో ఏ మాత్రం రాజీపడ్డా తొలి మంత్రివర్గంలోనే పీజేఆర్‌కు పెద్దపీట వేసేవారని సీఎం సన్నిహితులు కూడా అంటుంటారు. సీనియర్ నేతగా మీకు అన్యాయం జరిగిందని ఎన్నో సార్లు దిగ్విజయ్‌సింగ్ పీజేఆర్‌తో అనే వారు. వైఎస్‌తో విభేదించినా పీజేఆర్ ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగించలేదు. చివరి వరకు అసమ్మతి వాదిగా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభ ఎన్నటికీ వెలుగొందాలనే కోరుకున్న నేత ఆయన. అదేవిధంగా చివరకు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజున అదే సభా వేదిక వద్ద ఆఖరి శ్వాస విడిచారు.
No comments:
Post a Comment