జోనల్ కమిషనర్ల అధికారాల్లో అస్పష్టత... గ్రేటర్‌లో ప్రతిపాదించిన జోనల్ కమిషనర్లకు బదలాయించాల్సిన అధికారాలపై కొంత అనిశ్చితి ఏర్పడింది. జోనల్ కమిషనర్‌కు రూ.25 లక్షల వరకు ఆర్థికాధికారం కట్టబెట్టాలని ప్రభుత్వం భావించిప్పటికీ, ఇప్పటికిప్పుడు ఈ అధికారాలను ధారదత్తం చేయడం సాధ్యపడదు. చట్టసవరణ కోసం వేచిచూడాల్సిందే. అప్పటివరకు తన విచ క్షణాధికారంతో కొన్ని అధికారాలను జోనల్ కమిషనర్లకు కట్టబెట్టాలని గ్రేటర్ కమిషనర్ భావిస్తున్నారు. అందులోభాగంగా రూ. 10లక్షల విలువైన పనులు మంజూరు చేసే అధికారాన్ని వీరికి అప్పగించాలని సంకల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. అలాగే ఐదులక్షల ఆర్థికాధికారం ప్రతిపాదించిన డిప్యూటీ కమిషనర్లకు తాజాగా రూ.2 లక్షల విలువైన పనులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. బిల్డింగ్ పర్మిషన్లలో సందిగ్దత ఇదిలావుండగా భవన నిర్మాణాల అనుమతుల విషయంలో కొంత గందరగోళం నెలకొంటోంది. డిప్యూటీ కమిషనర్లకు కట్టబెట్టిన జి+2 బిల్డింగ్ పర్మిషన్లు జారీపై ఎలాంటి సందిగ్దత లేనప్పటికీ, బహుళ అంతస్తు భవనాల(జి+2 పై అంతస్తులు) విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడంలేదు.
జోనల్ కమిషనర్లకు ఈ అధికారం కట్టబెట్టాలని నిర్ణయించినప్పటికీ, బిల్డింగ్ కమిటీతో ముడిపడి ఉన్న ఈ అనుమతుల విషయంలో ఉన్నతాధికారులు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. భవన అనుమతులను పరిశీలించే బిల్డింగ్ కమిటీలో హుడా, ఫైర్, పోలీసు తదితర విభాగాల సభ్యులు ఉంటారు. వీరందరు ఆయా జోన్‌లలో పక్షం రోజులకోసారి జరిగే బిల్డింగ్ కమిటీ సమావేశానికి రావాలంటే కుదురుతుందా? లేదా అనే అంశంపై అధికారుల్లో మీమాంస నెలకొంది.అంతేగాకుండా బిల్డింగ్ కమిటీకి హాజరయ్యే సభ్యుల హోదా కంటే తక్కువస్థాయిలో ఉన్న కొందరు జోనల్ కమిషనర్లుగా వ్యవహరిస్తుండడం కూడా అధికారులను ఇరకాటంలో పడేస్తోంది. ఇదిలావుండగా జోనల్ స్థాయిలో జమ,పద్దులతో కూడిన రికార్డులను భద్రపరచాలని నిర్ణయించారు. దీనికోసం ఆయా జోన్ల లో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఫైనా న్సియల్ అడ్వయిజర్‌ను నియమించనున్నారు. వీటితో పాటు కొన్ని రికార్డులను మాత్రం ప్రధాన కార్యాలయంలో కూడా పొందుపరచాలని సంకల్పించారు.
No comments:
Post a Comment