610 జీవోను, రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలనే డిమాండ్‌తో తెరాస చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం అరెస్టులతో ముగిసింది. తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా కొందరు తెరాస కార్యకర్తలు వారి కళ్లుగప్పి వివిధ మార్గాల్లో సచివాలయానికి చేరుకున్నారు. పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ముట్టడి యత్నాన్ని భగ్నం చేశారు.
తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ముట్టడి కోసం బయల్దేరిన తెరాస కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పెద్దఎత్తున అరెస్టులు జరిపారు. హైదరాబాద్ శివార్లలో కూడా రోడ్లను దిగ్బంధించి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్బంధాలన్నింటినీ అధిగమించి కొందరు తెరాస కార్యకర్తలు నగరంలోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడ తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వారితో కలిశారు. అంతా కలిసి సచివాలయం వైపు సాగే ప్రయత్నం చేశారు. వారిని ముందుకు కదలనీయకుండా పోలీసులు అక్కడే అరెస్టు చేశారు. ముట్టడిలో ప్రత్యక్షంగా పాల్గొనని తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు, వాహనాలు, కాలినడకన వంటి మార్గాల ద్వారా తమ కార్యకర్తలను వ్యూహాత్మకంగా సచివాలయం సమీపానికి చేరవేసి పోలీసులను ఆశ్చర్యపరిచారు. ముట్టడి నేపథ్యంలో సచివాలయం, ధర్నాచౌక్ ప్రాంతాలు పోలీసు బలగాలతో నిండిపోయాయి.
అంతా ప్రశాంతం: తెరాస నేతలు, కార్యకర్తలు సోమవారం ఉదయం ధర్నాచౌక్‌కు తరలివచ్చారు. పార్లమెంట్ సభ్యులు రవీంద్రనాయక్, మధుసూధన్‌రెడ్డి, వినోద్‌కుమార్, శాసనసభా పక్షనేత విజయరామారావు, ఉపనేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, చంద్రశేఖర్, పద్మారావు, నగేశ్, ఈటెల రాజేందర్, రామలింగారెడ్డి, లక్ష్మీకాంతారావు, గోవింద్‌నాయక్, పద్మా దేవేందర్‌రెడ్డి, తెరాస యువత అధ్యక్షుడు ప్రభాకర్, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజా కళాకారులు రసమయి బాలకిషన్, దేశీపతి శ్రీనివాస్ తదితరులు అక్కడ భేటీ అయ్యారు. చౌక్ నుంచి సచివాలయం వైపు దూసుకుపోవాలని, పోలీసుల నుంచి ఎలాంటి ప్రతిఘటననైనా ఎదుర్కోవాలని ముందుగా వారికి పార్టీ నిర్దేశించింది. అయితే చివరిక్షణంలో వ్యూహం మార్చి దూకుడుకు తావివ్వకుండా సంయమనం పాటించింది. నేతలు ముట్టడి ప్రయత్నాలేవీ చేయకుండా బృందాలుగా మంతనాలు సాగిస్తూ పోలీసులను అయోమయ పరిచారు.
పోలీసుల ప్రతివ్యూహం: మరోవైపు పోలీసులు అదనపు బలగాలు, బారికేడ్లను, ఆందోళనకారులను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. ధర్నాచౌక్ సిగ్నల్స్ వైపు ముళ్లకంచెలు వేశారు. సుమారు మూడువందల మంది పోలీసులు అక్కడ మోహరించారు. కొద్దిపాటి ఉత్కంఠ అనంతరం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో బారికేడ్ల వైపు దూసుకొచ్చిన తెరాస కార్యకర్తలను అరెస్టు చేశారు. స్వల్ప ప్రతిఘటన మధ్య ఎమ్మెల్యేలను పోలీస్ వ్యాన్‌లలో, కార్యకర్తలను లారీల్లో తరలించారు. ఇందుకు నిరసనగా వారంతా పెద్దపెట్టున నినాదించారు. బారికేడ్లను దాటి దూసుకొచ్చేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు, మరికొందరు నేతలు, కార్యకర్తలు విఫలయత్నం చేశారు. ప్రతిఘటన తీవ్రత ఊహించినంతగా లేకపోవడంతో పోలీసుల పని సులువైంది. అందరినీ లంగర్‌హౌస్, గోల్కొండ పోలీసు స్టేషన్లకు తరలించారు. దారిలో ఆర్టీసీ క్రాస్‌రోడ్ ప్రాంతంలో కొందరు కార్యకర్తలు తమను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ల టైర్లలో గాలి తీసేసి ధర్నా చేశారు. అదుపులోకి తీసుకున్నాక పోలీసులు మధ్యాహ్న భోజనం, మంచినీరు ఇవ్వలేదంటూ వారు కబాడీ, వాలీబాల్ ఆడి నిరసన తెలపడం విశేషం. అంతకు ముందు చౌక్ వద్ద కొందరు కార్యకర్తలు ఓ పాడెను మోసుకుంటూ సీఎం డౌన్ డౌన్ అని నినదించారు. మరోవైపు పోలీసులతో రవీంద్రనాయక్‌కు వాగ్వాదం జరిగింది. స్థానికేతర పోలీసులు తరలిపోయే సమయం వచ్చిందని, అతిగా వ్యవహరించడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిలబడ్డ వారిని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులతో నాయిని వాదానికి దిగారు.
పోలీసుల్ని ఏమార్చి...: ధర్నాచౌక్‌లో అరెస్టుల పర్వం సాగుతుండగానే కొందరు తెరాస కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా సచివాలయం చేరుకున్నారు. ఇందుకు రకరకాల మార్గాలు ఎంచుకుని పోలీసులను ఆశ్చర్యపరిచారు. కొంతమంది ఆర్టీసీ బస్సులో సచివాలయం సమీపం దాకా ప్రయాణించి ఒక్కసారిగా దిగి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరికొందరు సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో ముందుగానే ప్రవేశించారు. అక్కణ్నుంచి సచివాలయం గేటు వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంకొందరు మామూలు వాహనదారుల్లా సచివాలయం సమీపం దాకా వచ్చి, హఠాత్తుగా కిందికి దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గేటు వైపు పరుగు తీశారు. కానీ వారందరినీ పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేసి తరలించారు. ఈ సందర్భంగా మూడు గంటల పాటు సచివాలయంలోకి ఉద్యోగులు, మంత్రులను తప్ప ఎవరినీ పోలీసులు అనుమతించలేదు.
తెలంగాణ వారిని చివరిగా పంపాలి: నాయిని
తమ కార్యకర్తలను బెదిరించడం ద్వారా ముట్టడిని విఫలం చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నిందంటూ తెరాస విమర్శించింది. పలువురిని వేధింపులు, బెదిరింపులకు గురి చేశారంది. 610 అమలు పేరుతో తెలంగాణ వారినే ముందుగా బదిలీ చేస్తూ వారి మధ్య తగాదా పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. దీని వెనక ముఖ్యమంత్రి వైఎస్, ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారని ఆరోపించారు. 610 అమలులో భాగంగా స్థానికేతర తెలంగాణ ఉద్యోగులూ వెళ్లిపోతారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. అయితే ముందుగా ఆంధ్ర ఉద్యోగులనే పంపాలన్నారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులను పంపాలని 610 జీవోలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. కేవలం ఐదు, ఆరు జోన్ల నుంచి స్థానికేతరులను పంపాలని మాత్రమే అందులో చెప్పారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా 610ను పూర్తిగా అమలు చేయిస్తామని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment