Sunday, July 15, 2007

వై ఎస్‌-పీ జే ఆర్‌ వివాదాన్ని పరిష్కరిస్తాం andhrajyothi

ఏ ఐసీసీ ప్రతినిధి సురేష్‌
హైదరాబాద్‌, జూలై 15(ఆన్‌లైన్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఐసీసీ ప్రతినిధి సురేష్‌ చెప్పారు. ఈ వివాదం కారణంగా సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగేందుకు సిద్ధమైన పీజేఆర్‌ను శాంతింపజేసేందుకు ఆదివారం నగరానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

'కారు' వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు, పీజేఆర్‌, వైఎస్‌ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డిలను కలసి పరిస్థితిని సమీక్షించానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో అధిష్ఠానం తలమునకలై ఉన్నందున ఆందోళనను వాయిదా వేసుకోవాలని పీజేఆర్‌కు సూచించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలను కూడా పీజేఆర్‌కు వివరించానని చెప్పారు. తన సూచన మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను ఆయన అభినందించారు.

వారం రోజుల మా శ్రమ వృథాకాదు: వీహెచ్‌
వైఎస్‌-పీజేఆర్‌ కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించరించేందుకు వారం రోజులుగా చేస్తున్న శ్రమ వృథా కాదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చెప్పారు. పీజేఆర్‌తో భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు దీక్షను వాయిదా వేసుకున్న పీజేఆర్‌ను వీహెచ్‌ అభినందించారు.

'కారు' వివాదం పాలనకు అద్దం పడుతోంది : శశిధర్‌రెడ్డి
పీజేఆర్‌ తనయుడిపై, అల్లుడిపై పోలీసులు 307 సెక్షన్‌ కింద నమోదు చేసిన కేసులు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నాయని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందునే పీజేఆర్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పీజేఆర్‌ చేస్తున్న పోరాటం వ్యక్తిగతమైనది కాదని... పార్టీ ప్రతిష్ఠను పెంచడం ద్వారా 2009లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాం గ్రెస్‌ అధికారంలోకి రావడానికేనని చెప్పారు.

లెక్క తప్పీంది 610 అమలులో ప్రతిష్టంభన eenadu


610 అమలులో ప్రతిష్టంభన
స్థానికేతరుల సంఖ్య ఏడువేలకే పరిమితం
21 శాఖల్లో 828 మందికే బదిలీ ఉత్తర్వులు
ఒక్క డెప్యుటేషన్‌ కూడా రద్దు కాలేదు
1975 నుంచీ పరిశీలన హుళక్కే
వెబ్‌సైట్‌లో వివరాలే లేవు
సీఎం హామీలూ బేఖాతరు
హైదరాబాద్‌- న్యూస్‌టుడే
''ఈ నెల 15 కల్లా 610 జీవో అమలు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని పనిని మేం చిత్తశుద్ధితో చేస్తున్నాం.''
- ఈ నెల 2న ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రకటన
జూన్‌ నెలాఖరుకల్లా 610 జీవో అమలును పూర్తి చేస్తామని గతేడాది డిసెంబరు 12న ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఆ తరవాత వెలువడిన ప్రకటన... ఈ నెల 15వ తేదీని గడువుగా పేర్కొంది. ఇదే ఆఖరు గడువని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. వారం రోజుల్లో స్వచ్ఛంద బదిలీలు పూర్తి చేయాలని, 1975 నుంచి స్థానికేతర ఉద్యోగుల లెక్కలు తీయాలని, డెప్యుటేషన్లను రద్దుచేయాలని ఆదేశించారు. కానీ... వాటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. చిత్రమేమిటంటే సీఎం ప్రకటన తరవాత 610 అమలుపై ఊహించని ప్రతిష్టంభన ఏర్పడింది. తరవాత జైభారత్‌రెడ్డి కమిటీ నివేదిక, 1975 నుంచి ఏపీపీఎస్సీ నియామకాల రికార్డుల గల్లంతు వంటి అనేక విస్మయకరమైన అంశాలు వెలుగుచూశాయి.
అరకొర సమాచారం
610 అమలులో భాగంగా అక్రమంగా నియమితులైనట్లు ఇప్పటి వరకు గుర్తించిన ఉద్యోగులు 7,089 మందే. 3,162 మంది పోలీసులు కాగా మరో 3,927 మంది ఇతర శాఖల ఉద్యోగులు. 2002లో జారీ అయిన 124 జీవో కింద 75 శాఖల నుంచి వీరిని గుర్తించారు. దేవాదాయ శాఖలో స్థానికేతరుల లెక్క ఇప్పటికీ తేలలేదు. కొన్ని న్యాయ విభాగాల నుంచి సమాచారం రాలేదు. అయినా ఇంతకు మించి లేరంటూ సాధారణ పరిపాలన శాఖ అధికారులు సీఎంకు, మంత్రివర్గ ఉపసంఘానికి, ఉద్యోగ సంఘాలకు, శాసనసభా సంఘానికి తేల్చి చెప్పేశారు. స్థానికేతరులుగా గుర్తించిన వారిని గత నెల మూడో వారం నుంచి స్వచ్ఛందంగా బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల రెండో తేదీ వరకు 21 శాఖల్లో 828 మందికి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయులు, పోలీసులు పోనూ మిగిలింది 510 మందే. అదే రోజు సీఎం సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నివేదికలను ఇవ్వగా, ఈ సంఖ్య మరీ తక్కువగా ఉందని, 15 వరకు గడువు పొడగించి మరిన్ని స్వచ్ఛంద బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. కానీ, ఈ సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. ఏ ఒక్క శాఖలోనూ స్వచ్ఛంద బదిలీలు జరగలేదు. వాస్తవానికి స్వచ్ఛంద బదిలీలకు గడువు పొడగించినా మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించకపోవడం గమనార్హం. దీంతో గడువు పొడిగింపు నిష్ప్రయోజన తంతుగా మారింది. మరోవైపు స్వచ్ఛంద బదిలీలపై వెళ్లిన వారికి పోస్టింగులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వారి స్థానాలను భర్తీ చేయడంలోనూ శ్రద్ధ చూపడం లేదు.

-డెప్యుటేషన్ల మాటేమిటి: నియామక నిబంధనలకు విరుద్ధంగా డెప్యుటేషన్లపై చేరి విధులను నిర్వర్తిస్తున్నవారిని స్వస్థలాలకు పంపిస్తామని గత నెలారంభం నుంచి ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు అలా ఒక్కరినీ పంపించలేదు. ఈ నెల 2న సమావేశం సందర్భంగా వారం రోజుల వ్యవధిలో డెప్యుటేషన్లను రద్దు చేస్తామని సీఎం ప్రకటించినా ఏ ఒక్క శాఖలోనూ అది జరగలేదు. అసలింతవరకు డెప్యుటేషన్లపై వచ్చిన వారెందరనేదే తేలలేదు. ప్రాథమికంగా 900 మంది అంటూ అంచనా వేసినా వారిని తిప్పి పంపేందుకు ఏ శాఖా చొరవ చూపడం లేదు.

1975 నుంచి లెక్కలేవీ: 1975 నుంచీ నియమితులైన స్థానికేతరుల్ని గుర్తించే ప్రక్రియ ఏమాత్రం జరగడం లేదు. వారం రోజుల్లోనే ఇది పూర్తవుతుందని, ఇప్పటివరకు గుర్తించినవి కాకుండా మరో పది శాతం వరకు స్థానికేతరుల లెక్క తేలవచ్చని సీఎం రెండో తేదీన స్వయంగా చెప్పారు. ఈ కోణంలో ఏ ఒక్క శాఖలోనూ కసరత్తు జరగడం లేదు. సాధారణ పరిపాలన శాఖ కూడా దీనిపై ఏమాత్రం ఒత్తిడి చేయకపోవడం గమనార్హం. ఈ రికార్డులు లేవని పోలీసు శాఖ మొదట్లోనే చేతులెత్తేసింది. ఏపీపీఎస్సీ అధికారులు గత రెండేళ్లు మినహాయిస్తే 75 నుంచి రికార్డులు లేవని తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పేశారు. విద్యాశాఖ సైతం డీఎస్సీల వారిగా వివరాలను సేకరించడానికి ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి 1975 అక్టోబరు నుంచి 85 అక్టోబరు వరకు నియమితులైన 58,952 మంది స్థానికేతరులు గుర్తించి... 1985 డిసెంబరు 30న జారీ అయిన 610 జీవోలో ప్రభుత్వం ఈ సంఖ్యను పేర్కొంది. లెక్కలేవీ దీనికి విరుద్ధంగా లేవని ప్రభుత్వ శాఖలు చెబుతున్నాయి. 1984లో అప్పటి ముఖ్య కార్యదర్శి జైభారతరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. ఇప్పుడా నివేదిక లేదంటూ ప్రభుత్వంచేతులెత్తేయడంపై శాసనసభా సంఘం విస్మయం వ్యక్తంచేసింది. 1985 నుంచి విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో మినహాయిస్తే మిగిలిన శాఖల్లో నియామకాలు అంతంత మాత్రమే. నియామకాల ప్రక్రియకు సంబంధించిన రికార్డులు అన్ని శాఖల్లోనూ భద్రంగా ఉన్నా ఈ లెక్కలు లేవని చెప్పడం ఉద్దేశపూర్వకంగానే జీవో అమలుకు తిలోదకాలు ఇచ్చే ప్రయత్నమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికేతరుల వివరాలపై అనుమానాలను తొలగించేందుకు వారి వివరాలు వెబ్‌సైట్‌లో పెడతామని నెల రోజులుగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు అలాంటిదేదీ లేదు. మరోవంక శాసనసభ సమావేశాల్లో 610 కీలకాంశం కాబోతుండగా... దీని అమలుపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు గత సోమవారం జరగాల్సిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. జీవో అమలుపై నిర్లక్ష్యమే దీనికి కారణమని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.

సీఎం అసంతృప్తితో ఉంటే...: 610ని జూన్‌ నెలాఖరులోగా అమలు చేస్తామని తాను హామీ ఇచ్చినా జరగలేదని శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో అధికారులు నెలాఖరుకల్లా దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అప్పటివరకు శాసనసభా సమావేశాలు జరుగుతాయి కనక అప్పటిలోగా అమలు కావడం అసాధ్యమైన పనే.

Saturday, July 14, 2007

వై ఎస్ తో అమీతుమీ ? eenadu


రౌడీలకే కాదు.. మాకూ ఆయనే సీఎం
307 కేసు పెట్టించింది కేవీపీ
నా సస్పెన్షన్‌కు 2002 తరహాలో కుట్ర: పీజేఆర్‌
కాంగ్రెస్‌లో సంచలనం
దిగ్విజయ్‌ ఫోను చర్చలు
వీహెచ్‌ మలివిడత రాయబారం
..అయినా పట్టువీడని జనార్దన్‌
నేడు అధిష్ఠాన దూతగా సురేష్‌ రాక
వెనక్కి తగ్గని పీజేఆర్‌
వీహెచ్‌ మలివిడత రాయబారంవ్యవహారం ముదిరి పాకానపడింది. పీజేఆర్‌ అమీతుమీకి సిద్ధమయ్యారు. వైఎస్‌పై మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన రౌడీలకు ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చేలా పరోక్ష విమర్శనాస్త్రాలూ సంధించారు. అంతటితో ఆగకుండా తాజాగా కేవీపీ పేరునూ వివాదంలోకి లాగారు. దీక్ష ప్రారంభించి తీరుతానని చెప్పడం ద్వారా.. అధిష్ఠానం (ఢిల్లీ) వద్దకెళ్లడం కంటే, దీక్షకే తన ప్రాధాన్యమని కుండబద్దలు కొట్టారు. తద్వారా తాను దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో పీజేఆర్‌ వ్యవహారం పార్టీలో పెనుసంచలనమై కూర్చుంది. అందుకే చిన్న వివాదాన్ని ఆయన అనవసరంగా పెద్దది చేస్తున్నారని అధిష్ఠానం పేర్కొంటున్నా.. గట్టిగా ముందడుగు మాత్రం వేయలేకపోతోంది. దిగ్విజయ్‌ శనివారం మరోమారు పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. ఇటు వీహెచ్‌ రాయబారమూ కొనసాగింది. ..అయినా ఇప్పటికైతే ఫలితం శూన్యం! గందరగోళం యథాతథం!!
హైదరాబాద్‌, న్యూఢిల్లీ - న్యూస్‌టుడే


తన కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్‌ కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తున్న అసమ్మతి నేత పీజేఆర్‌ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? పార్టీ అధిష్ఠానం రమ్మని పిలిచినా ఢిల్లీకి పోకుండా ఆమరణ దీక్షకు సన్నద్ధమవడం దానికి సంకేతమేనా? అవుననేదే పీజేఆర్‌ సన్నిహితుల సమాధానం! ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారన్నది వారు చెబుతున్న మాట. అయితే ఆయన కాంగ్రెస్‌ నుంచి బయటికిపోయే ప్రసక్తి ఉండదని.. పార్టీలోనే ఉంటూ వైఎస్‌పై రాజీలేని పోరు సాగిస్తారని వారు చెబుతుండటం గమనార్హం. మొత్తంమీద ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడి పుట్టిస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. వైఎస్‌ సోదరుడితో కారు దగ్గర మొదలైన గొడవ.. ఇప్పటికే పార్టీని చాలామేరకు భ్రష్టు పట్టించిందని.. ఇక దీక్ష కూడా మొదలైతే పరిస్థితి మరింత చెయ్యి దాటిపోతుందన్నది పార్టీ నేతల విశ్లేషణ. పరిస్థితిని గమనిస్తున్న అధిష్ఠానం ఇప్పటికైతే పీజేఆర్‌కు నచ్చజెప్పేందుకే ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడొద్దని.. ఆయనకు ఒకటికి రెండుసార్లు చెబుతోంది. అదేసమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కొంత ఆగ్రహంతోనూ ఉంది. సోనియా సన్నిహితవర్గాలు ఢిల్లీలో స్పందిస్తూ.. ''జరిగింది చిన్న వీధి గొడవ. పార్టీ ప్రతిష్ఠను పణంగాపెట్టి పీజేఆర్‌ దాన్ని రాజకీయం చేయడమేమిటి? అయినా అది నాయకత్వంపై పోరుకు ఎంచుకోదగిన అంశం ఎంతమాత్రం కాదు. దీని ద్వారా ఆయన ఎవరి సానుభూతీ పొందజాలరు'' అని సూటిగా చెప్పాయి. పైగా పీజేఆర్‌ అంత బలమైన స్థితిలో ఏమీలేడనేది గ్రహించాలని వ్యాఖ్యానించాయి. సోనియా సన్నిహితుల అభిప్రాయాలకు అనుగుణంగానే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ శనివారం మరోమారు పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. సంయమనం పాటించాలని సూచించారు.
అధిష్ఠానం వైఖరి ఇలా ఉన్నా పీజేఆర్‌ తన మానాన తాను ముందుకు సాగడం పార్టీ రాష్ట్ర పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి అధిష్ఠానం జోక్యంతో దీక్ష విషయంలో పీజేఆర్‌ వెనక్కితగ్గుతారని వారు భావించారు. కానీ దీక్ష తర్వాతే ఢిల్లీ వెళతానంటూ ఆయన ఏర్పాట్లు చేస్తుండటంతో.. ఇది ఇంతటితోపోయే విషయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదేరోజు ఆయన దీక్ష మొదలుపెడుతున్నారు. జరుగుతున్న పరిణామాలు.. వైఎస్‌పై శనివారం తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తే.. ముఖ్యమంత్రితో అమీతుమీ తేల్చుకునేందుకే పీజేఆర్‌ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు పీజేఆర్‌కు అనుకూలంగా దీక్ష వద్దకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు అసమ్మతి వర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, శంకరరావులు ఆయనకు మద్దతుగా నిలవటం తెలిసిందే.

అసంతృప్తి నుంచి ఆందోళనదాకా..
వైఎస్‌కు, పీజేఆర్‌కు మధ్య రాజకీయవైరం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక పీజేఆర్‌తోపాటు గతంలో వైఎస్‌ను వ్యతిరేకించే పలువురు నేతలు మంత్రి పదవులను ఆశించారు. వారిలో కొందరు పాత వైరాన్ని మరచి వైఎస్‌తో రాజీపడ్డారు. దాంతో వారికి మంత్రి పదవులు దక్కాయి. పీజేఆర్‌ మాత్రం తన పంథా వీడలేదు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తెదేపా హయాంలో కాంగ్రెస్‌ వ్యతిరేకించిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వంటి కొన్ని వ్యవహారాలను అడ్డుకునేందుకు పీజేఆర్‌ ప్రయత్నించారు. తన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకే పీజేఆర్‌ అలా చేస్తున్నారని వైఎస్‌ భావించారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరగడం మొదలైంది. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు, కృష్ణా మూడో దశ, తదితర అంశాల్లో ఆయన వైఎస్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పీజేఆర్‌కు అవకాశమివ్వాలని అధిష్ఠానం సూచించినా.. వైఎస్‌ ససేమిరా అన్నారు. దీంతో ఇద్దరి మధ్యా మరింత అగాథం ఏర్పడింది. వీటన్నింటి నేపథ్యంలో చోటుచేసుకున్న జూబ్లీహిల్స్‌ కారు వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరాన్ని ఏర్పరచింది. వైఎస్‌పై తీవ్రస్థాయి విమర్శలు, ఢిల్లీ రమ్మన్మా వెళ్లకపోవడం వంటి చర్యల మూలంగా.. అధిష్ఠానం వద్ద పీజేఆర్‌ మరింతగా ఇబ్బందుల్లో పడతారనేది సీఎం వర్గీయుల అంచనా! పీజేఆర్‌ మాత్రం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తనతో మాట్లాడుతున్నారంటూ.. పరోక్షంగా తనకూ బలముందని చెప్పే ప్రయత్నం చేస్తుండం విశేషం!

పీజేఆర్‌తో వీహెచ్‌, ఆమోస్‌, మర్రి భేటీ
పీజేఆర్‌తో సీనియర్‌ నేత, ఎంపీ వి.హనుమంతరావు శనివారం రాత్రి మలివిడత చర్చలు జరిపారు. దీక్షను విరమించుకోవాలని, లేదంటే కనీసం రాష్ట్రపతి ఎన్నికలవరకూ వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. సుమారు గంటకుపైగా సాగిన చర్చల్లో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌, పీజేఆర్‌ సన్నిహితుడు మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. తన డిమాండ్లను వెనక్కి తీసుకునేది లేదని వీహెచ్‌కు పీజేఆర్‌ స్పష్టంచేసినట్లు తెలిసింది. తమ ఫిర్యాదే తప్పంటూ, సీఎం సోదరుడిపై కేసు మూసివేయడంపైనే పీజేఆర్‌ ఎక్కువసేపు మాట్లాడారు. తనపట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని.. ఈ పరిస్థితుల్లో వెనకడుగువేయడం తనకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. చర్చల అనంతరం.. పీజేఆర్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలను వీహెచ్‌ ఫోన్‌ ద్వారా అధిష్ఠానానికి(దిగ్విజయ్‌కు) తెలియజేశారు. ఆ తర్వాత వీహెచ్‌ విలేకరులతో మాట్లాడుతూ... చాలా అవమానం జరిగిందని పీజేఆర్‌ బాధపడుతున్నారని చెప్పారు. దీక్షను ఆపడానికి తన ప్రయత్నాలు కొనసాగుతాయని.. ఇంకా 48 గంటల సమయం ఉందని పేర్కొన్నారు.

శశిధర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ... పీజేఆర్‌ కుటుంబంతో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం నాడు, తెదేపా హయాంలో కూడా ఇలా వ్యవహరించలేదన్నారు.

ఇక సురేష్‌ వంతు
రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు నియమితుడైన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సురేష్‌ ఆదివారం హైదరాబాద్‌ వస్తున్నారు. శనివారం రాత్రి వీహెచ్‌ అందించిన సమాచారం నేపథ్యంలో సురేష్‌ను కేరళ నుంచి ఆదివారమే హైదరాబాద్‌ పంపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి ఆయన సోమవారం రావాల్సి ఉంది. ఆయన వీహెచ్‌తో కలిసి వెళ్లి పీజేఆర్‌తో భేటీ అవుతారు. అధిష్ఠానం వైఖరిని ఆయనకు తెలియజెప్పి దీక్ష చేపట్టకుండా చూసేందుకు ప్రయత్నిస్తారు.

పీజేఆర్‌తో ఫోన్‌లో చర్చించిన అనంతరం దిగ్విజయ్‌సింగ్‌ విలేఖరులతో మాట్లాడారు. సమస్య పరిష్కారంలో పీజేఆర్‌ రాజకీయ విజ్ఞత ప్రదర్శిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వివరాలను చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. జూబ్లీహిల్స్‌ సంఘటన రాజకీయ అంశమే కాదని, అదో చిన్నపాటి వివాదం మాత్రమేనని దిగ్విజయ్‌ పునరుద్ఘాటించారు. వైఎస్‌ సోదరుడికి వైద్య పరీక్షలు జరిపిన తర్వాతే పీజేఆర్‌ తనయుడిపై 307 కేసు నమోదైందని వివరించారు.

మధ్యవర్తిత్వం నెరపాలని వీహెచ్‌ను కోరలేదు: వేరే పనిలో తీరికలేకుండా ఉన్నందున పీసీసీ అధ్యక్షుడు కేకేను ఈ వ్యవహారంలో రంగంలోకి దించలేదని దిగ్విజయ్‌ చెప్పారు. మధ్యవర్తిత్వం నెరపాలని ఎంపీ వి.హనుమంతరావుకు పార్టీ ఎటువంటి అధికారం కట్టబెట్టలేదన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తనంత తానుగా వీహెచ్‌ చొరవ తీసుకున్నారన్నారు.

రౌడీలకే కాదు.. మాకూ ఆయనే సీఎం! eenadu

307 కేసు పెట్టించింది కేవీపీ
కేసు ఎత్తివేతపై కోర్టుకెళతా
ఆమరణ దీక్ష చేసి తీరుతా
ఇంట్లోనే చేపడతా: పీజేఆర్‌
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే


కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి శనివారం మరింత తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''కాంగ్రెస్‌ నుంచి నా సస్పెన్షన్‌కు ముఖ్యమంతి కుట్రపన్నారు. 2002లో అప్పటి రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ వాయలార్‌ రవి వచ్చినపుడు కూడా ఆయన తన ఉద్దేశపూర్వక చర్యల ద్వారా నన్ను సస్పెండ్‌ చేయించారు. ఇప్పుడూ అలాగే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలను సాగనివ్వను. అన్ని విషయాలూ సోనియా దృష్టికి తీసుకెళ్తాను'' అంటూ ఘాటుగా స్పందించారు. సోమవారం నుంచి తాను ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతానని.. ఇందులో ఎలాంటి మార్పులూ ఉండబోవని తేల్చిచెప్పారు. దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను విడుదలచేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయం కోసం, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమని ఉద్ఘాటించారు. గతంలో చెప్పినట్లు ఇందిరా పార్కువద్ద కాకుండా తన ఇంటిలోనే సోమవారం ఉదయం దీక్ష ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఉల్టా చోర్‌...
రాష్ట్రంలో పరిస్థితులపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పీజేఆర్‌ చెప్పారు. ''రాష్ట్రం మొత్తం దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలు బతకడమే కష్టమైపోయింది. పార్టీకి, ప్రజలకు నష్టం కలుగుతోందని.. పరిస్థితిని చక్కదిద్దాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను కూడా. ఆయన రౌడీలకే కాదు.. మాకు కూడా ముఖ్యమంత్రే కదా?'' అంటూ ఆగ్రహంగా స్పందించారు. పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరించారన్నారు. తమ ఫిర్యాదును పోలీసులు తోసిపుచ్చి, కేసు ఎత్తివేయడాన్ని కోర్టులో సవాల్‌ చేయనున్నట్లు తెలిపారు. ''మా ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసును రద్దు చేస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. కమిషనర్‌ పత్రికలకు ప్రకటన విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి? ఈ అంశంలో మమ్మల్ని కనీసం విచారించరా? మాకు నోటీసు కూడా ఇవ్వరా? 'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ డాంటే' అంటే ఇదే'' అంటూ ఆయన మండిపడ్డారు.

మూడేళ్లుగా భరిస్తున్నా..
''ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు నా కుమారుడిపై 307 సెక్షన్‌ కింద కేసు పెట్టించారు. మేము ఇచ్చిన ఫిర్యాదును పక్కన పెట్టి.. తన సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డిపై కేసు లేకుండా ముఖ్యమంత్రి చేసుకున్నారు'' అంటూ పీజేఆర్‌ తాజా ఆరోపణలు చేశారు. తనను మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా భరిస్తున్నానని చెప్పుకొచ్చారు.

వాళ్లనలా.. మమ్మల్నిలానా?
''గత ఏడాది ఆగస్టు 22న స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావు కుమారుడు ఆదిత్య ప్రతాప్‌ ఇంటికి రాయలసీమ గూండాలొచ్చారు. ఆయన భార్యను కొట్టి, ఆయన్ను తుపాకితో బెదిరించి.. నార్సింగ్‌ వద్ద ఉన్న భూములు అమ్మాలని హెచ్చరించారు. దీనిపై ఆరోజే కేసు పెడితే 307 సెక్షన్‌తోసహా పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. రాయలసీమకు చెందిన ప్రతాపరెడ్డి అనే వ్యక్తితోబాటు మరికొందరు ఈ సంఘటనకు బాధ్యులని పోలీసులే తేల్చారు. కానీ నిందితులను మాత్రం ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అదే మాపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలోనైతే.. అప్పటికప్పుడు అరెస్టు చేసి జైలుకూ పంపేస్తారా'' అంటూ పీజేఆర్‌ సూటిగా ప్రశ్నించారు.

అమ్ముకోవడమే పనా: ''ఔటర్‌ రింగురోడ్డును మూడుసార్లు మార్చారు. పేదల భూములను అతి తక్కువ ధరలకు బలవంతంగా తీసుకుని ప్రభుత్వమే కంపెనీలకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటే ఎలా? ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కోసం ఒక్కో ఎకరం రూ.6.5 లక్షలు చొప్పున తీసుకుని ప్రభుత్వం రూ.29 లక్షలకు అమ్ముకుంది. ఆనక ఆ సంస్థవాళ్లేమో వెయ్యి గజాలను పది కోట్లకు అమ్ముకున్నారు'' అని పీజేఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నేనే తొలి ఓటు వేస్తా: రాష్ట్రపతి ఎన్నికల్లో తానే మొదటి ఓటు వేస్తానని పీజేఆర్‌ చెప్పారు. ''మాది ధర్మ పోరాటం. దీనికి సైన్యంతో పని లేదు. ధర్మంతోనే పని'' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందని అడగ్గా 2009 ఎన్నికల్లో తెలుస్తుందన్నారు.

Friday, July 13, 2007

వైఎస్‌ సోదరుడిపై కేసు మూసివేత eenadu

పీజేఆర్‌ భార్యది తప్పుడు ఫిర్యాదు: కమిషనర్‌

పీజేఆర్‌-వైఎస్‌ సోదరుడి కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఒకవైపు తన భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడిపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని పీజేఆర్‌ డిమాండ్‌ చేస్తుండగా.. అసలామె ఇచ్చిన ఫిర్యాదే తప్పని పోలీసులు పేర్కొన్నారు. అందులోని అంశాలు వాస్తవం కాదన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌ రెడ్డిపై పెట్టిన కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ''గత ఆదివారం (8న) రాత్రి 9.30కి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి భార్య ఇందిర అలియాస్‌ సులోచన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. భారీ సంఖ్యలో జనం రాడ్లు, కర్రలు, పదునైన ఆయుధాలతో తమను అడ్డుకున్నారని.. తమపై దాడి చేసి చంపుతామంటూ బెదిరించారన్నవి ఆ ఫిర్యాదులోని ఆరోపణలు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు వై.ఎస్‌.రవీంద్రనాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిగా ఈ ఫిర్యాదు చేశారు. సులోచన ఇచ్చిన ఫిర్యాదుపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపారు. ఘటనాస్థలిలో, చుట్టపక్కల అనేక మంది సాక్షుల్ని విచారించారు. సమగ్ర విచారణ అనంతరం ఆమె చేసిన ఆరోపణలు వాస్తవంకాదని వెల్లడైంది. అంతేగాక ఘటన జరిగిన చాలా సమయం తర్వాత ఫిర్యాదు చేయడంతో.. అది రవీంద్రనాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు ప్రతిగా చేశారని తేలింది. ఈ నేపథ్యంలో సులోచన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌రెడ్డిపై నమోదుచేసిన కేసును ఎత్తివేస్తున్నాం'' అని బల్వీందర్‌ ప్రకటనలో వివరించారు.

ఆదివారం రాత్రి జరిగిన గొడవకు సంబంధించి ఇరు వర్గీయులూ పోలీసుల్ని ఆశ్రయించడం తెలిసిందే. ఆ ఫిర్యాదుల ఆధారంగా పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మేనల్లుడు సంతోష్‌రెడ్డిలపై హత్యా యత్నం కేసును నమోదు చేశారు. పీజేఆర్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డిలపై అటకాయించడం, దాడి తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇది వివాదానికి ఆజ్యం పోసింది. రవీంద్రనాథ్‌ రెడ్డి, ఆయన కుమారుడిపై కూడా 307 సెక్షన్‌ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయాలని, డీసీపీని సస్పెండ్‌ చేయాలని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని పీజేఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆ 3 డిమాండ్లపై స్పందించకుంటే.. సోమవారం నుంచి ఆమరణ దీక్షచేస్తాననీ ఆయన హెచ్చరించారు. ఇలాంటి నేపథ్యంలో.. పోలీసులు కేసే ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

Thursday, July 12, 2007

పీజేఆర్‌కు ఢిల్లీ పిలుపు! eenadu

రేపు మాట్లాడదాం
మేడంతోనూ చర్చిద్దాం
రాజకీయం చేయొద్దని దిగ్విజయ్‌ హితవు
రాష్ట్రంలో వీహెచ్‌ రాజీ యత్నాలు
రెండు కుటుంబాలతోనూ భేటీ
సీఎంతో చర్చ
న్యాయం జరక్కుంటే దీక్ష తప్పదు: పీజేఆర్‌
హైదరాబాద్‌, న్యూఢిల్లీ -న్యూస్‌టుడే
పీజేఆర్‌ ఆమరణ దీక్ష హెచ్చరిక ప్రకంపనలు సృష్టించింది. అధిష్ఠానాన్నీ కదిలించింది. అటు దిగ్విజయ్‌.. ఇటు వీహెచ్‌ రంగంలోకి దిగారు. అధికారికంగా రాజీ యత్నాలు షురూ చేశారు. చర్చల కోసం ఢిల్లీ రావాలని దిగ్విజయ్‌ ఆహ్వానించారు. మేడమ్‌తోనూ మాట్లాడుదురు గాని అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముంగిట ఇబ్బందికర పరిస్థితిని నివారించే లక్ష్యంతో సాగిన ఈ రాజీ యత్నాలు.. పీజేఆర్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆయనే మాత్రం రాజీ పడకపోగా... వైఎస్‌ ప్రభుత్వంపై దాడిని మరింత ఉద్ధృతం చేశారు. మరోసారి సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమరణ దీక్షపై వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. వైఎస్‌ సోదరుడూ ఘాటుగానే స్పందించారు. దెబ్బలు తిని కూడా బతికి ఉన్నందుకే తమపై హత్యాయత్నం కేసు పెట్టాలా అంటూ మండిపడ్డారు. దిగజారుడు డిమాండ్లొద్దని పీజేఆర్‌కు హితవు పలికారు.

ఇప్పటిదాకా దాన్నో చిన్నసమస్యగా అభివర్ణించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం గురువారం నేరుగా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌, సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి కుటుంబాల మధ్య రేగిన చిచ్చు పార్టీకి నష్టం కలిగించనుందని గ్రహించి.. దానికి సత్వరం ముగింపు పలకాలని నిర్ణయించింది. ముఖ్యంగా తన డిమాండ్లను నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని పీజేఆర్‌ హెచ్చరించడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటుతోందని అది గ్రహించింది. అదీగాక అసెంబ్లీ సమావేశాలు 16న ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ వివాదాన్ని ప్రతిపక్షాలు హైజాక్‌చేసే ఆస్కారముందనీ ఆందోళన చెందింది. అదుకే హుటాహుటిన నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ గురువారం పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని రాజకీయం చేయొద్దని ఆయనకు సూచించారు. శనివారంనాడు (14న) ఢిల్లీకొస్తే.. నేరుగా చర్చిద్దామని దిగ్విజయ్‌ సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాతో కూడా మాట్లాడదామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
రవీంద్ర సౌమ్యుడు:పీజేఆర్‌తో చర్చించిన తర్వాత దిగ్విజయ్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి సౌమ్యుడని ఆయన కితాబిచ్చారు. రవీంద్ర ముఖ్యమంత్రికి సోదరుడన్న సంగతి ఆయన నివసించే ప్రాంతంలో చాలా మందికి తెలియదని.. దాన్నిబట్టే ఆయనెలాంటి వ్యక్తో తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తిపై చిన్న విషయం గురించి దాడిచేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్‌, పీసీసీ అధ్యక్షుడు కేకే, పీజేఆర్‌లతోసహా హైదరాబాద్‌లోని పలువురు పార్టీ నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు తమంతట తామే కేసులు నమోదు చేశారని, నిష్పాక్షికంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 307 సెక్షన్‌ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయడంపై పీజేఆర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారన్నారు. వైద్య పరీక్షల నివేదికలు పరిశీలించి, గాయాలు తీవ్రమైనవి కాకుంటే శిక్ష తగ్గుతుందని వివరించారు.

వైఎస్‌ జోక్యం అవసరంలేదు: ఈ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని లేదని దిగ్విజయ్‌ స్పష్టంచేశారు. వీధి గొడవను రాజకీయ అంశంగా మార్చవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన మీడియాను తప్పుపట్టారు. రవీంద్రనాథ్‌కు పీజేఆర్‌ క్షమాణలు చెప్పారని తెలిపారు. ఈ వివాదంలో పలువురు ఎమ్మెల్యేలు పీజేఆర్‌ను సమర్థించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు కాదా అని అడగ్గా.. రాష్ట్రం నుంచి పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తెలంగాణ అంశంగా ఎలా మారుతుందంటూ ఎద్దేవా చేశారు.

నేనుంటే ఇలా జరిగేది కాదు: ఇటు హైదరాబాద్‌లో సీనియర్‌ నేత వి.హనుమంతరావు రాజీ యత్నాలకు శ్రీకారం చుట్టారు. అమెరికా నుంచి ఆయన గురువారం ఉదయమే హైదరాబాద్‌ చేరుకున్నారు. వచ్చిన కొద్దిగంటల్లోనే పీజేఆర్‌ ఇంటికెళ్లారు. పీజేఆర్‌తోను, ఆయన భార్యతోను, కుమారుడితోను మాట్లాడారు. సంఘటన వివరాలను, తదనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డి తమపై దాడి జరిగిన తీరును వివరించారు. ఇలా రెండు కుటుంబాల అభిప్రాయాలూ తెలుసుకున్న వీహెచ్‌.. ఆనక సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని సైతం కలసి మాట్లాడారు. జరిగిన వివాదంపై తక్షణం దృష్టిసారించకపోతే పార్టీకి మరింత నష్టం కలుగుతుందని భావించి.. తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు వీహెచ్‌ ప్రకటించారు. ఆదివారం తాను హైదరాబాద్‌లో ఉండిఉంటే ఇంతవరకూ వచ్చి ఉండేది కాదన్నారు. ఆరోజే ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి ఉంటే సరిపోయేదన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేస్తే పార్టీకి మంచిదని చెప్పారు. చిన్న పిల్లల తగాదా పెద్ద కాకుండా ఉండాల్సిందన్నారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన సచివాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎలాచేస్తే బాగుంటుందనే అంశంపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. మొదట పీజేఆర్‌ ఆమరణ దీక్షను విరమింపజేయడం.. లేదంటే వాయిదా వేయిస్తే మిగతా అంశాలను పరిష్కరించేందుకు అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు గురించి తానేమీ మాట్లాడబోనన్నారు. మొత్తంమీద పీజేఆర్‌ డిమాండ్ల సాధ్యాసాధ్యాలను ఓవైపు పరిశీలిస్తూనే.. మరోవైపు దీక్ష చేపట్టకుండా చూడటమనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతల రాజీయత్నాలు సాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వివాదానికి ముగింపు పలకాలన్నది వారి లక్ష్యం!

కొన్ని గెజిటెడ్‌ పోస్టులకూ 610 eenadu

వంద శాఖాధిపతుల ఆఫీసులకు కూడా
ప్రభుత్వం అంగీకరించింది
ఉత్తమ్‌కుమార్‌ వెల్లడి

నాన్‌ గెజిటెడ్‌ నుంచి గెజిటెడ్‌గా మారిన పోస్టుల్లోనూ 610 అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. 1975 తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ జరిగిన నియామకాలన్నింటినీ సరిచేయాలని నిశ్చయించింది. ఈ జీవోపై ఏర్పాటైన శాసనసభా సంఘం ఛైర్మన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాలు ప్రకటించారు. సభాసంఘం గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై, జీవో అమలును సమీక్షించింది. ''అదనంగా సృష్టించిన వంద పైచిలుకు శాఖాధిపతుల కార్యాలయాలను మళ్లీ జోనల్‌ పరిధిలోకి తేవాలి. వాటిలోనూ 610 జీవోను అమలు చేయాలి. దీనిపై ఏమి చర్యలు తీసుకున్నదీ వారంలోగా నివేదిక ఇవ్వాలి. న్యాయశాఖకూ దీన్ని వర్తింపజేయాలి. ఈ జీవోపై కాంగ్రెస్‌ ఎంపీలు హైకోర్టులో వేసిన కేసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం గట్టిగా వాదించాలి. 610 సంబంధిత కేసులన్నింటిలోనూ ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ స్వయంగా వాదనలు వినిపించాలి. సభాసంఘం తదుపరి భేటీకి ఆయన కూడా హాజరవ్వాలి. గతంలో రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో ఉండి, అనంతరం గెజిటెడ్‌గా మారిన పోస్టులకూ ఈ జీవోను వర్తింపజేయాలి. స్వచ్ఛందంగా స్వస్థలాలకు వెళ్లదలచుకున్న స్థానికేతర ఉపాధ్యాయులందరి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించాలి. బదిలీ చేసిన ఉద్యోగులను తక్షణం రిలీవ్‌ చేయాలి'' అంటూ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. సమావేశం తర్వాత ఉత్తమ్‌కుమార్‌ విలేఖరులతో మాట్లాడారు. న్యాయ, ఆదాయపు పన్ను శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లో మొత్తం 6,714 మంది స్థానికేతర ఉద్యోగులను ఇప్పటిదాకా గుర్తించినట్టు చెప్పారు. పోలీసు శాఖలో 2,406 మంది ఉన్నారన్నారు. ''అయితే ఇవి 20 శాతాన్ని స్థానికేతర కోటా (సీలింగ్‌) గా భావించి సేకరించిన వివరాలు. సీలింగ్‌ను తీసేస్తే ఈ సంఖ్య పెరగవచ్చు. కానీ కొన్ని పార్టీలు చెబుతున్నట్టు అది లక్ష దాకా ఉండే అవకాశం మాత్రం లేదు'' అని ఆయన వివరించారు. 5, 6 జోన్లలోని ప్రభుత్వోద్యోగుల స్థానికత వివరాలను త్వరలో వెబ్‌సైట్లో ఉంచి, అభ్యంతరాలను స్వీకరిస్తామని వివరించారు. ఇకనుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని నియామకాల్లో 610ని అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. విశ్వవిద్యాలయాలకూ వర్తింపజేయాలని తాము సూచించామన్నారు. కాగా 610 అమలులో అధికారులు, ప్రభుత్వం తీరుపై సభాసంఘం సభ్యులు పెదవి విరిచారు. దీన్ని సమగ్రంగా ఆచరణలోకి తేవాలంటూ తామూ కోర్టుకెళ్తామని ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తెలిపారు. ఇతర సభ్యుల అభిప్రాయాలు వారిమాటల్లోనే..
నాలుగడుగులు వెనక్కి: దేవేందర్‌ గౌడ్‌ (తెదేపా)
610 అమలు రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు చందంగా జరుగుతోంది. జీవో అమలు కాకుండా ప్రభుత్వం ప్రతిదానికీ మసిపూసి మారేడుకాయ చేస్తోంది. చివరికి సభాసంఘం పని స్వచ్ఛంద బదిలీలను పర్యవేక్షించే వ్యవహారంగా మారుతోంది. 610 అమలు ఆగకుండా కోర్టులో కెవియట్‌ వేయాలంటే సమాధానం లేదు. అధికారుల్లోనూ అంతా అయోమయం, అస్పష్టత. న్యాయపరంగా చిక్కులున్న అంశాలకు చర్చను పరిమితంచేసి, అర్థరహితంగా మార్చారు.

ముల్కీ అమలు చేయాలి: పీజేఆర్‌ (కాంగ్రెస్‌)
ఈ జీవో సమస్య ఉద్యోగుల పరిధి దాటి ప్రజల దాకా వెళ్లింది. పలు కాలనీల్లో స్థానిక, స్థానికేతర విభేదాలు తలెత్తుతున్నాయి. ఇది నానాటికీ ముదిరి ఇండియా- పాకిస్థాన్‌ గొడవ మాదిరిగా తయారవుతోంది. జీవో అమలులో ఎన్నో చిక్కులు వస్తున్నాయి. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ మాట కూడా వినకుండా మా ఎంపీలు కొందరు దీనిపై కోర్టుకు వెళ్లారు. మరి ప్రభుత్వం, సభాసంఘం, మంత్రివర్గం, వైఎస్‌ ఏం చేస్తున్నట్టు? దీనిపై కెవియట్‌ ఎందుకు వేయడం లేదు? అధికారులను అడిగితే షరామామూలుగా 'ప్రాసెస్‌లో' ఉందంటున్నారు. జీవో స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణలోనే ఆరో జోన్‌ నుంచి ఐదో జోన్‌కు ఉద్యోగులను బదిలీలు చేస్తున్నారు. అందువల్ల దీనికి బదులు తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నట్టుగా ముల్కీ నిబంధనలను అమలు చేయాలి. దీనిపై వైఎస్‌ ఆలోచించడం మంచిది.

వారే హీరోలూ, విలన్లూ: జూలకంటి రంగారెడ్డి (సీపీఎం)
610 విషయంలో కాంగ్రెస్‌ నేతలే హీరోలుగా, విలన్లుగా వ్యవహరిస్తున్నారు. అమలు చేయాల్సిందేనని కొందరు, అస్సలు కూడదని మరికొందరు వాదిస్తున్నారు. శాఖలవారీగా స్థానికేతర ఉద్యోగుల సంఖ్య, పేర్ల జాబితాను ఈ భేటీలో సమర్పించాలని, ఇంటర్‌నెట్లో కూడా పెట్టాలని క్రితంసారి సూచిస్తే అధికారులు స్పందించలేదు. గిర్‌గ్లానీ సిఫార్సులను పట్టించుకోకుండా ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాగైతే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి.

సమన్వయమేది: హరీశ్‌రావు (తెరాస)
610 అమలులో అధికారుల మధ్య సమన్వయమే లేదు. పాఠశాల విద్యాశాఖలో 20 శాతం పరిమితికి మించిన స్థానికేతరులను మాత్రమే పంపినట్టు విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆ శాఖలో 518 మందే ఉన్నారని గత భేటీలో, 1,105 మంది ఉన్నారని ఇప్పుడు చెప్పారు. స్థానికత విషయమై ఏ శాఖ నుంచీ పూర్తి సమాచారం లేదు. దిగువ స్థాయి కోర్టుల్లోని స్థానికేతరుల సమాచారం తెప్పించాలని నిర్దేశిస్తే అధికారులు స్పందించలేదు.

రౌడీయిజం నశించేదాకా పోరు eenadu

ఒక వ్యక్తి పేరుతోనే రాష్ట్రంలో గూండాయిజం నడుస్తోంది
ప్రాణాలు పోయినా లెక్కచేయను
గాంధీ మార్గంలో ఉద్యమిస్తా
న్యాయం జరగకుంటే దీక్ష తప్పదు
మా ప్రభుత్వంలో మాకు రక్షణలేదు
నా కుటుంబానికి భద్రత కల్పించాలి: పీజేఆర్‌

రౌడీయిజం నశించే వరకూ తన పోరాటం కొనసాగుతుందని, ఈ ప్రయత్నంలో తన ప్రాణాలుపోయినా లెక్కచేసేదిలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వ్యక్తి పేరు చెప్పుకుని నడుస్తున్న గూండాయిజం పోవాలి' అని అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తానని అన్నారు. గాంధేయవాద పద్ధతిలో తన పోరాటం ముందుకు సాగుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్‌ వివాదంలో ప్రభుత్వం న్యాయం చేయకుంటే సోమవారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించిన నేపథ్యంలో... పీజేఆర్‌ గురువారం అసెంబ్లీ వద్ద విలేఖరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు తన ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నారు. నాకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేదిలేదని చెప్పాను. ఆయన గాయపడిన నా కుమారుణ్ని పరామర్శించారు' అని పీజేఆర్‌ అన్నారు. అయితే ఎవరి పేరిట గూండాగిరీ నడుస్తోందన్న ప్రశ్నకు మాత్రం పీజేఆర్‌ సమాధానం ఇవ్వలేదు. తెదేపాపై 30 ఏళ్ల పోరాటంలో తాను రక్తం చిందించిన సందర్భాలున్నా... తన భార్య, చెల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎప్పుడూ వెళ్లలేదన్నారు. కానీ మొన్నటి గొడవలో వెళ్లాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పశ్చిమ మండలం డీసీపీ మధుసూదన్‌రెడ్డే కారణమనీ, ఆయన్ను తక్షణం సస్పెండ్‌ చేయాలని మరోసారి డిమాండ్‌ చేశారు. 'వస్తావా, లేపి తీసుకెళ్లాలా?' అంటూ తన బంధుమిత్రుల ముందే ఆయన దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. ఎవరో చెప్పిన ప్రకారం మధుసూదన్‌రెడ్డి నడుచుకున్నారని వ్యాఖ్యానించారు. 'పైగా నన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేనైన నాకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటి? నన్ను నేనే కాపాడుకోలేకపోతే నియోజకవర్గ ప్రజలనెలా కాపాడుకుంటాను? అందుకే ఈ విషయంలో న్యాయం జరిగే దాకా నిరాహార దీక్ష చేస్తాను' అన్నారు.
జూబ్లీహిల్స్‌లోని తన కుమార్తె అనురాగిణి రెడ్డి ఇంటివద్ద కూడా పీజేఆర్‌ గురువారం విలేఖరులతో మాట్లాడారు. 'మా ప్రభుత్వ పాలనలో మాకే రక్షణ లేకుండా పోయింది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఘటన జరిగినప్పటినుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కరువైందని, పోలీసులు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత రెండు రోజులుగా కొందరు అపరిచితులు తన కుమార్తె అనురాగిణిరెడ్డి ఇంటి పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకుని తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తమ చేతికి మట్టి అంటకుండా తీవ్ర స్థాయిలో నేరాలు చేసే వ్యక్తులు తన కుటుంబ సభ్యులపై దాడికి పథకం వేశారని ఆయన ఆరోపించారు. పశ్చిమ మండల డీసీపీ మధుసూదన్‌రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని, సీఎం సోదరుడిపై కూడా 307 కేసును నమోదు చేయాలనే డిమాండ్లను పునరుద్ఘాటించారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా 16వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు.

పీజేఆర్‌ కుమార్తె ఇంటివద్ద పోలీసు భద్రత
తమ ఇంటి పరిసరాల్లో అనుమానితుల తిరుగుతున్నారని పీజేఆర్‌ అల్లుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీజేఆర్‌ కుమార్తె అనురాగిణి రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

610 జీవోపై శాసన సభా కమిటీ సమావేశం andhra jyoth

హైదరాబాద్‌, జూలై 12 ః 610 జీవో పై శాసన సభా కమిటీ గురువారం సమావేశమైంది. 610 జీవో అమలు, స్థానికేతరుల బదిలీ తదితర విషయాలపై సమావేశం సమీక్ష నిర్వహించనుంది. కాగా ఈ సమావేశానికి ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానికేతరుల గుర్తింపు, సరైన విధి విధానాలు, పారదర్శకత తదితర అంశాలు చర్చించే అవకాశం వుంది. జీవో అమలుకు సంబంధించి టిఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు హరీష్‌ రావు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడాన్ని కూడా కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం వున్నట్లు సమాచారం. హౌస్‌ కమిటీ సమావేశం కారణంగా అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు

Tuesday, July 10, 2007

ఇది కుటుంబ సమస్య కానేకాదు eenadu

సీఎంకు ఫోన్‌ కూడా చేయాలన్పించలేదా?

ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా?

క్షమాపణ చెబుతానన్నా కేసులు పెట్టారే

తెదేపా పాలనలోనూ ఇంత దారుణం లేదే

కార్లో కత్తులు పెడతారని భయపడ్డా

ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చిస్తా

భావి కార్యాచరణ నిర్ణయిస్తా: పీజేఆర్‌

ముఖ్యమంత్రి వైఎస్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ధ్వజమెత్తారు. ప్రస్తుతం కుటుంబ సమస్యో కానే కాదని స్పష్టంచేశారు. భార్య సులోచనమ్మతో కలిసి మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ''ముఖ్యమంత్రి రాష్ట్రానికే సీఎం. వైఎస్‌ విమానాశ్రయం నుంచి నేరుగా ఆస్పత్రికివెళ్లి సోదరుణ్ని, ఆయన కుమారుడిని పరామర్శించారు. 1978 నుంచి ఎమ్మెల్యేను, పార్టీ కోసం కృషి చేస్తున్నాను.. నాకు కనీసం ఫోన్‌చేసి మాట్లాడాలని కూడా ఆయనకు అనిపించలేదు. ఇంత అన్యాయమా?'' అంటూ మండిపడ్డారు. కనీసం తానో ఎమ్మెల్యేనని కూడా చూడకుండా పోలీసులు అత్యుత్సాహంతో అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ''నేను హంతకుడినా, క్రిమినల్‌నా, రౌడీషీటర్‌నా? ఎమ్మెల్యేతో పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా?'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌, చంద్రబాబులకు వ్యతిరేకంగా తాను పలు కార్యక్రమాలు చేపట్టినా.. ఏనాడూ తనపట్ల ఇంత దారుణంగా వ్యవహరించలేదన్నారు. తన సభా హక్కులకు భంగం కలిగించారనే అంశంపై ఫిర్యాదుచేసేందుకూ ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

నా కొడుకు భవిష్యత్‌ పాడుచేసేందుకే...


కాంగ్రెస్‌కు నష్టం జరక్కుండా చూసేందుకు తాను తీవ్రంగా ప్రయత్నించానని పీజేఆర్‌ పేర్కొన్నారు. ''సంఘటన జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ అరవిందరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి భాను ఇద్దరికీ నేనే స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడాను. జరిగిందేదో జరిగిపోయింది.. నేను క్షమాపణ చెబుతాను. కేసులొద్దని చెప్పాను. కానీ వైఎస్‌ సోదరుడు కేసు పెట్టాలనే పట్టుబట్టినట్లు వారిద్దరూ చెప్పారు'' అని తెలిపారు. ''నా కొడుకు గతమెలాంటిదో చూశారా? అతడేమైనా నేరస్తుడా? ఎవరినైనా కొట్టాడా? భూవివాదాల్లో చిక్కుకున్నాడా? ఎన్‌ఎస్‌యూఐ కోశాధికారి అయిన అతడి భవిష్యత్‌ పాడుచేయాలని ప్రయత్నం చేశారు'' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. వెస్ట్‌ జోన్‌ డీసీపీ మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్‌ చేసి, జరిగిన దానిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ''డీసీపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రవర్తించారు. నేను హోంమంత్రికి కూడా చెప్పాను. అయితే ఆయన్ను మాత్రం ఎంతవరకు నడవనిస్తారు? ఎవరి మాటా వినొద్దనే కదా కడప జిల్లాకు చెందిన ఈ డీసీపీని తెచ్చారు. ఆయన్ను సెంట్రల్‌ జోన్‌ నుంచి వెస్ట్‌జోన్‌కు ఎందుకు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు'' అని వ్యాఖ్యానించారు.

మారణాయుధాలు పెడతారని..
''నా భార్యపట్ల మహిళ అనే సానుభూతిని కూడా పోలీసులు చూపలేదు. క్రూరంగా ప్రవర్తించారు. మొదట నా కారును సీజ్‌ చేస్తున్నట్లు చెప్పారు. నేను అంగీకరించలేదు. ఆర్టీఏ ఆఫీసుకు ఫోన్‌ చేసి, కారు నెంబరిచ్చి ఎవరి పేరు మీదుందో క్షణాల్లో తెలుసుకున్నారు. నా కారులో కత్తులు, మారణాయుధాలు పెట్టి.. కేసులు పెడతారని భయపడ్డాం. అందుకే విలేకరుల సమక్షంలో కారు తలుపులు తీసి, పోలీసులకు చూపించా'' అని పీజేఆర్‌ వివరించారు. ''పోలీసుస్టేషన్‌లో 20 గంటలు కాదు.. ఎన్ని రోజులున్నా పోలీసులు వైఎస్‌ సోదరుడిపైనా, ఆయన కుమారుడిపైనా 307 సెక్షన్‌(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయరని నిర్ధారణ అయిన తర్వాతే వెనక్కి వచ్చేశా. స్టేషన్‌ నుంచి వచ్చిన తర్వాతే నా కార్యకర్తలను పోలీసుస్టేషన్ల నుంచి విడుదల చేశారు. హైదరాబాద్‌లో మొత్తం 10 వేల మంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. నన్ను చూద్దామని వచ్చిన వాళ్లనూ జైళ్లలో ఉంచారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా'' అని మండిపడ్డారు.

ప్రాణ త్యాగానికైనా..
''నా మిత్రులు అయిన ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, శంకరరావు బుధవారం వస్తున్నారు. వీరితోబాటు నా పట్ల సానుభూతి ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నాతో మాట్లాడుతున్నారు. వారందరితో చర్చించి బుధవారం భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తా'' అని పీజేఆర్‌ తెలిపారు. ''నేను, నా కుటుంబం నాశనమైనా పర్వాలేదు. నన్ను, పార్టీని నమ్ముకున్నవారికి నష్టం జరగకూడదనేదే నా అభిమతం. ఈ క్రమంలో ప్రాణత్యాగం చేసేందుకూ నేను సిద్ధంగా ఉన్నాను'' అంటూ ఆవేశంగా స్పందించారు. రాజు ఎవరైతే వారిదే కదా శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతంటూ.. వైఎస్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ''వైఎస్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నవారిలో నేనూ ఒకడిని. అలాంటిది.. నా కొడుక్కి ఎన్‌ఎస్‌యూఐ పదవి వచ్చాక సీఎంను కలిసేందుకు ఆయన సెక్రటేరియట్‌లో స్వయంగా అపాయింట్‌మెంట్‌ అడిగాం. ఇంత వరకూ టైం ఇవ్వలేదు'' అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

దత్తాత్రేయ, శ్రీనివాసయాదవ్‌ల రాక

భాజపా నేత బండారు దత్తాత్రేయ, తెదేపా నేత తలసాని శ్రీనివాసయాదవ్‌లు మంగళవారం పీజేఆర్‌ను కలుసుకున్నారు. జరిగిన వివాదం, గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై పీజేఆర్‌తో వారు చర్చించారు.

పీజే ఆర్‌ తనయుడు విడుదల andhrajyothi

సైదాబాద్‌, జూలై 10 (ఆన్‌లైన్‌): ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు పి.జనార్దన్‌రెడ్డి తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు సంతోష్‌రెడ్డిలు మంగళవారం సాయంత్రం చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. వీరికి బెయిల్‌ మంజూరైందన్న విషయాన్ని తెలుసుకున్న పీజేఆర్‌ మద్దతుదారులు, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థులు సుమారు 70 వాహనాల్లో భారీ ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు.
బెయిల్‌ మంజూరు పత్రాలు చంచల్‌గూడ జైలు అధికారులకు సాయంత్రం 5.45 గంటలకు అందించారు. వీరిద్దరిని 6.15 నిముషాలకు బయటకు పంపించారు. విష్ణువర్ధన్‌రెడ్డి జైలు గేటు నుంచి బయటకు రాగానే కాంగ్రెస్‌ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విష్ణును పూలదండలతో ముంచెత్తారు. నినాదాలు చేస్తూ ఉగ్వేదంతో ఊగిపోయారు. పెద్ద ఎత్తున రోడ్లపై కార్యకర్తలు బాణాసంచా పేల్చడంతో అరగంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కార్పియో వాహనంపై విష్ణును కూర్చోబెట్టి ఊరేగింపుగా తోడ్కొని వెళ్ళారు.


కక్షకట్టి కేసులో ఇరికించారు...
ప్రభుత్వం తమ కుటుంబంపై కక్షకకట్టి కేసులో ఇరికించారని పిజెఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన తల్లిని కారులో తోడ్కొని వెళుతున్న సందర్భంలో అకారణంగా వై ఎస్‌ రవీంద్రరెడ్డి, అతని కుమారుడు, కారులో ఉన్న మరో ఇద్దరు తమను తీవ్ర పదజాలంతో ధూషించి దాడిచేశారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై బెయిలబుల్‌ కేసు నమోదు చేసి తనపై 307 సెక్షన్‌ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. తమకు మద్దతిస్తున్న ప్రజలకు తాము రుణపడి ఉంటామన్నారు.

కెపిహెచ్‌బిలో వినూత్న నిరసన
కెపిహెచ్‌బి కాలనీ, జూలై10 (ఆన్‌లైన్‌) : పిజెఆర్‌ తనయుని విషయంలో న్యాయం తారుమారైందని ఎత్తి చూపుతూ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో పిజెఆర్‌ వర్గీయులు గొట్టిముక్కల దేశాల్‌ ఆధ్వర్యంలో వినూత్నంగా శాంతియుత నిరసనకు దిగారు. చెప్పులు చేతులకు తొడుక్కోవడంతో పాటు కాళ్లకు గడియారాలు ధరించి చొక్కాలను వెనుక వైపునకు వేసుకొని న్యాయం తారుమారైందని ఎత్తి చూపారు. ఇక్కడ వైఎస్‌ దిష్టిబొమ్మకు పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించారు
మీడియాలపై విరుచుకు పడడం,అక్రమ కేసులు బనాయించడం లాంటి పనులకు వైఎస్‌ పాల్పడుతున్నాడని ఆయన దిష్టిబొమ్మకు ఈ రకమైన సన్మానం చేసి తమ నిరసన తెలియజేస్తున్నట్లు దేశాల్‌ పేర్కొన్నారు. కూకట్‌పల్లి పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కర్కె పెంటయ్య,వెంగళరావు, బ్రహ్మానంద్‌రెడ్డి తదితర నాయకులు నిరసన కార్యక్రమానికి విచ్చేసి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ నాయకులు రామాంజన్‌రెడ్డి,కళ్యాణ్‌ చక్రవర్తి,
రాందాస్‌,బాస్కర్‌,రమేష్‌,వెంకట్‌రెడ్డి,బాబు, అంజన్‌కుమార్‌ చౌదరి,టి. ఆర్‌.గౌడ్‌, ఎమ్‌.క్రిష్ణారావు పాల్గొన్నారు.
ఖైరతాబాద్‌లో ఆగని ఆందోళన

యూసుఫ్‌గూడ, జూలై 10 (ఆన్‌లైన్‌): జూబ్లీహిల్స్‌ సంఘటన పై పీజేఆర్‌ అనుచరులు, కాంగ్రెస్‌ నాయకుల, ఎన్‌ఎస్‌యుఐ నాయకుల ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. పోలీసులు వ్యవహరించిన తీరుపై, ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కక్షసాధింపు చర్యలపై ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ నాయకులు చాలాచోట్ల నిరసన ప్రదర్శనలు చేశారు. ఎన్‌ఎస్‌యుఐ నాయకులు సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చాలాచోట్ల కాంగ్రెస్‌ నాయకులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేశారు. ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల పట్ల డిసిపి మధుసూదన్‌రెడ్డి ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ నల్ల జెండాలతో వాహనాల ర్యాలీలు నిర్వహించారు.

కళాశాలల బహిష్కరణ
సంజీవరెడ్డినగర్‌, అమీర్‌పేట, బేగంపేట, దోమల్‌గూడ, నారాయణగూడ తదితర ప్రాంతాలలో పీజేఆర్‌ యువసేన నాయకులతో పాటు ఎన్‌ఎస్‌యుఐ నాయకులు విష్ణువర్ధన్‌ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టింనందుకు నిరసనగా కళాశాలలను మూయించివేశారు. దోమల్‌గూడలోని ఎ.వి. కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి నిజాం కాలేజీ, నారాయణగూడ ప్రాంతంలోని కళాశాలలను మూయించివేసి ఎస్‌ఆర్‌నగర్‌ చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Monday, July 9, 2007

ఇది ఆటవిక పాలన మా వాళ్ళు జైల్లో... ఆయన ఏసీ గదిలోనా?

మేమేమైనా నక్సలైట్లా... దొంగలమా? నాపై కక్ష ఉంటే నా కుటుంబ సభ్యులు ఏం చేశారు? ప్రాణాలకు ముప్పుందన్నా పోలీసులకు పట్టలేదు తెలుగుదేశం హయాంలోనూ ఇలా జరగలేదు
అన్యాయంపై ప్రజల్లోకి వెళ్తా: పీజేఆర్‌
''రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హాయాంలో కూడా ఇలాంటివి జరగలేదు, నేనేమైనా నక్సలైట్‌నా? మా వాళ్లు నక్సలైట్లా? లేదంటే మేం దొంగలమా? మా వాళ్లపై లాఠీఛార్జీ చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనా? కార్యకర్తల తలలే పగలగొడుతారా?'' - పి.జనార్దనరెడ్డి

20 గంటలపాటు పోలీస్‌ స్టేషన్లో పీజేఆర్‌ andhra jyothy

(ఆన్‌లైన్‌, సిటీబ్యూరో) ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డిలతో ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో జరిగిన గొడవ అనంతరం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు గిరిసంతోష్‌రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8.40గంటల సమయంలో పీజేఆర్‌ తన సతీమణి ఇందిరాదేవి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వచ్చారు.
ఇరుపక్షాలు కేసులు పెట్టినందున వై.ఎస్‌ సోదరుడిని కూడా స్టేషన్‌కు తీసుకురావాలని, అందరికీ ఒకే న్యాయం అమలు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన కు న్యాయం జరిగేంతవరకు కదలబోనని భీష్మిం చిన ఆయన అప్పటినుంచి సోమవారం సాయం త్రం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నారు. తమ నాయకుడికి బాసటగా వందలాది మంది కార్యకర్తలు పీజేఆర్‌ వెంటే ఉన్నారు.

తెల్లవారుజామున ఇంటికెళ్లిన ఇందిరాదేవి...

పిీజేఆర్‌తోపాటు రాత్రి మొత్తం పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న ఇందిరాదేవి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో సోమవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత పశ్చిమ మండలం డీసీపీతోపాటు పలువురు పోలీసు అధికారులు పిీజేఆర్‌ను కూడా వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మీ ఫిర్యాదుపై కూడా తగు చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పటా నికి ప్రయత్నించారు. అయితే పిీజేఆర్‌ మాత్రం పోలీస్‌స్టేషన్‌ నుంచి కదలలేదు. సోమవారం తెల్లవా రుజామున అక్కడే బ్రష్‌ చేసుకున్నారు. మధుమేహం ఉన్న నేపథ్యంలో ఉదయం నాలుగు పూరీలు తిన్న ఆయన మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేశారు. కొన్ని పళ్లు తీసుకున్నారు.
అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయో లేక ఎవరు నచ్చజెప్పారో గానీ సోమవారం సాయంత్రం 5.15గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇంటికి బయల్దేరి వెళ్లారు. స్టేషన్‌ నుంచి బయలుదేరిన సమయంలో అనుచరులు ఆయన వెనుక పది వాహనాలలో వెళ్లారు. అయితే పీజేఆర్‌ నివాసానికి చేరుకునేసరికి ఈ వాహనాల సంఖ్య దాదాపు రెండువందలకు చేరుకుంది. దారి పొడవునా ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పీజేఆర్‌ అనుచరులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.


నేను నక్సలైట్‌నా? దోపిడీ దొంగనా?: పీజేఆర్‌ andhra jyothy


హైదరాబాద్‌, ఆన్‌లైన్‌ (సిటీబ్యూరో), జూలై 9: 'నేనేమన్నా నక్సలైట్‌నా? లేక దోపిడీ దొంగనా? ఇరవై నాలుగు గంటల పాటు నన్ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. మీరు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యేను. అయి నా కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు.' అంటూ ఖైర తాబాద్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి పోలీసులపై విరుచుకు పడ్డా రు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీ స్‌స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఆయన విలేకరులతో మా ట్లాడారు. తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వేలెత్తి చూపుతున్నందుకే ముఖ్యమంత్రి తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు.
'నా కూతురు ఇంట్లో శుభ కార్యం జరుగుతున్న విషయం ముఖ్య మంత్రి తమ్ముడైన రవీంద్రనాథ్‌ రెడ్డికి తెలుసు. ఆ ఇల్లు నాకూతురుదన్న విషయం కూడా వారికి తెలుసు. అయినా నా కుమా రుడు కారు పక్కకు జరపలేదన్న కారణంతోనే రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడు సుమధుర్‌రెడ్డిలు పచ్చిబూతులు తిట్టడంతో పాటు కొట్టడానికి వచ్చారంటే నా కుటుంబంపై వైఎస్‌ కుటుం బానికి ఎంత కక్ష వుందో అర్థమవుతోంది.' అని పీజేఆర్‌ అన్నారు. పైగా తన కుమారుడే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జరిగిన గొడవను సర్దుబాటు చేశానని, చిన్న విషయం కోసం పార్టీ పరువును బజారుకీడ్చరాదని భావించానని పీజేఆర్‌ అన్నారు. అయినా కావాలని రవీంద్రనాథ్‌రెడ్డి తన కొడుకుపై ఫిర్యాదు చేశారని అన్నారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. జరిగిన సంఘటన పై రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు రప్పిం చకుండా నన్ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని ఒత్తిడి చేశారని అన్నారు. తాను రానని చెప్తే చేతులీడ్చి తరలించండి అంటూ డీసీపీ మధుసూదన్‌రెడ్డి సీఐకి ఆదేశాలుజారీ చేశారని అన్నారు. తన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కావాలనే సెక్షన్‌ 307 కింద కేసు బుక్‌ చేస్తారని ముందే ఊహించానని పీజే ఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా ముందే చెప్పానని అన్నారు.
అంతకు ముందు పోలీసులు తన కారును స్టేషన్‌కు తరలించాలని ప్రయత్నించారని, తాను ముందు జాగ్రత్తగానే మీడియా ముందు కారు డిక్కీ తెరిచి ఫోటోలు తీయించానని అన్నారు. తర్వాత పోలీసులు కారు తీసుకుపోవడానికి నిరాకరించారని చెప్పారు. తనపై పథకం ప్రకారమే కుట్ర జరుగుతోందని పీజేఆర్‌ ఆరోపించారు. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని వుందనీ గతంలో అడిషనల్‌ కమిషనర్‌ అరవిందరావుకు, తర్వాత వ చ్చిన పోలీస్‌ కమిషనర్‌ మహంతికి, ప్రస్తుత కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌కు కూడా ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వివరాలు, నెంబర్లను పోలీసులకు ఇచ్చానని అన్నా రు. అయినా ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఆదివారం జరిగిన సంఘటనలో తన కుమారుడిని అరెస్టుచేసి 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని మరి రవీంద్రనాథ్‌రెడ్డి, అతని కుమా రుడిని ఎందుకు అరెస్టు చేయలేదని పీజేఆర్‌ ప్రశ్నించారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు ఒకవైపు వారినే స్టేషన్‌కు తీసుకొచ్చారంటేనే పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు స్పష్టమవుతోం దని అన్నారు. గొడవ జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యేనైన నా ఇంటికి రాకుండా, ఏమీ కాని రవీంద్రనాథ్‌ ఇంటికి పోలీస్‌ కమి షనర్‌ వెళ్లి పరామర్శించారని, కేవలం ముఖ్యమంత్రి సోదరు డైనందుకే ఇలా జరిగిందని అన్నారు.
ప్రభుత్వంలోని అధికారుల నుంచి కానీ, పోలీసుల నుంచి తనకు న్యాయం జరగదని స్పష్టమైందని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత ఏ మంత్రి కానీ తనను కనీసం పరామర్శించలేదని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తన కోసం వచ్చిన వందలాది మంది కార్యకర్తలను కొట్టి పోలీస్‌ స్టేషన్‌లలో పెట్టారని, ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై అక్రమకేసులు బనాయిస్తున్నారని, కుటుంబ సభ్యుల పై కేసులు పెడుతున్నా రని ఆరోపించారు. న్యాయం కోసం ప్రజల ముందుకే వెళ్తానని పీజేఆర్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తానని అన్నారు.

Sunday, July 8, 2007

పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారు: పీజేఆర్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌ ఇంకా జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. రవీంద్రరెడ్డి, సుమధుర్‌రెడ్డిలపై పోలీసులు 143, 144, 341, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. వారిపై 307 కేసు కూడా నమోదు చేయాలని పీజేఆర్‌ స్టేషన్‌లోనే బైఠాయించారు. వివాదంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పీజేఆర్‌ తప్పుబట్టారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి ఇంటికి వెళ్లి కమీషనర్‌ పరామర్శించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేనైన తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందిచారన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో కూడా తనను పోలీసు స్టేషన్‌లో నిర్భందించలేదని పీజేఆర్‌ చెప్పారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రవీంద్రరెడ్డి వర్గాన్ని అరెస్టు చేసేంతవరకు ఠాణా నుంచి కదిలేది లేదని ఆయన తెలిపారు. పీజేఆర్‌తో డీసీపీలు మధుసూదన్‌రెడ్డి, కమల్‌హాసన్‌ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. పీజేఆర్‌కు మద్దతుగా భారీ ఎత్తున అనుచరులు జూబ్లీహిల్స్‌ స్టేషన్‌ వద్దకు వచ్చారు. పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అన్ని రోడ్లని పోలీసులు మూసేశారు.

పోలీస్‌స్టేషన్‌లోనే పీజేఆర్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌, వైఎస్‌ వర్గాల ఘర్షణ కారణంగా తలెత్తిన ఉద్ధ్రిక్తత కొనసాగుతూనేఉంది. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు సంతోష్‌లపై ఐదు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 147, 307, 427, 506, 149ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. వారిద్దరిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రరెడ్డి, ఆయన కుమారుడు అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు తనపై ఎటువంటి ఫిర్యాదు లేకున్నా పీజేఆర్‌ ఇంకా పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవతలి వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రవీంద్రరెడ్డి వర్గంపై కూడా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని పీజేఆర్‌ పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చున్నారు. పీజేఆర్‌ అనుచరులు భారీ ఎత్తున స్టేషన్‌ వద్దకు చేరుతుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

పీజేఆర్‌ కుమారుడు, అల్లుడుకి 20 వరకు రిమాండ్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, అల్లుడు సంతోష్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు ఈ నెల 20 వరకూ రిమాండ్‌కు ఆదేశించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు పోలీసులు వారిని సికింద్రాబాద్‌ మారేడుపల్లిలోని మూడో అదనపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అయితే నేరుగా కోర్టుకే తీసుకెళ్లాలని మేజిస్ట్రేట్‌ సూచించడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు

మూసీ కంపు... సొంపవుతుందా!? andhra jyothy

(ఆన్‌లైన్‌ , సిటీబ్యూరో) చైనాలోని 'ప్యూ అండ్‌ నాన్‌' నది తరహాలోనే మూసీని బాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక లు సిద్ధం చేసింది. మూసీ నది తరహాలోనే ఆ నది సైతం కాలుష్యంతో నిండిపోయింది. చైనా ప్రభుత్వం దాన్ని శుద్ధిచేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కలుషిత నదిని బాగుచేయడంలో చైనా ప్రభుత్వం కనబరిచిన కౌశలాన్ని ప్రపంచ పర్యావరణవేత్తలు ముక్తకంఠంతో ప్రశంసిం చారు. ప్యూ అండ్‌ నాన్‌ మాదిరిగానే భాగ్యనగర చరిత్రతో పెనవేసుకున్న 'మూసీ' నదిని మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది.
లక్ష్య సాధనలో ఇప్పటికే ఆయా శాఖలు తమ పనులు ప్రారంభించాయి. 'మూసీ ఇక కంపు కాదు... సొంపు' అంటూ అధికారులు ప్రకటనలు గుప్పించేశారు. అయితే మూసీ ప్రక్షాళనకు పరిశ్రమల కాలుష్య జలాలు పెద్ద సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏమంటే ఆయా ప్రాంతాలల్లో 'సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌' ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రసాయన వ్యర్ధాలు మూసీలోకి రావని వారి వాదన. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
మూసీలోకి పారిశ్రామిక వ్యర్ధజలాలు వివిధ నాలాల గుండా ప్రవహించడం అటుంచితే, ఏకంగా కొన్ని పరిశ్రమల నిర్వాహకులు అత్యంతగాఢత ఉన్న యాసిడ్‌ అవశేషాలను అక్రమంగా మూసీలోకి కుమ్మరిస్తున్న సంఘటనలు తాజాగా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దాడులల్లో వెలుగుచూశాయి. మరో పక్క మహానగర నీటి సరఫరా, సివరేజ్‌ బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు' నిర్మిస్తోంది. అయితే ఈ ప్లాంట్లు పరిశ్రమల వ్యర్ధజలాలను శుద్ధి చేసేవి కాదు. ఇటువంటి పరిస్థితిలో నిజంగా 'మూసీ సొంపు' అవుతుందా... వెచ్చిస్తున్న కోట్లరూపాయలకు ఫలితం ఉంటుందా... లేదా... అనేది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్న...


ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఇవే...
మూసీలోకి వస్తున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు గాను వాటర్‌ బోర్డ్‌ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్స్‌ను 340 కోట్లరుపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తోంది. అంబర్‌పేట్‌, నాగోల్‌, నల్లచెరువు, అత్తాపూర్‌లలో వీటిని నిర్మిస్తున్నారు. వీటి సామర్ధ్యం అంబర్‌పేట్‌లో 339 ఎం ఎల్‌డి(మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే) నాగోల్‌లో 172, నల్లచెరువులో 30 , అత్తాపూర్‌లో 51 ఎంఎల్‌డి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పరిశ్రమల రసాయన వ్యర్ధజలాల శుద్ధికి ఇక్కడ నిర్మిస్తున్న సివరేజ్‌ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ శక్తి సరిపోదు. అని శాస్త్రీయంగా మాట్లాడితే పరిశ్రమల వ్యర్ధజలాలతో గృహా వ్యర్ధాలను కలపడం ద్వారా వాటి గాఢత తగ్గిస్తాం అని పేర్కొంటున్నారు. వాస్తవానికి రసాయన వ్యర్ధజలాలో ఉండే భారీలోహాలు ఎటువంటి వ్యర్ధాలతో కలిపినా వాటి స్వరూపం మారవన్న భౌతిక శాస్త్ర నియమాన్నే కాదనే అధికారులను చూసి జాలిపడాలో .. ఇటు వంటి అధికారులు చరిత్ర ఆనవాళ్లు ఉన్న మూసీనదికి మంచి రోజులు తెస్తామంటే సంబరపడాలో అర్ధం కావడం లేదు.

610 బదులు మల్కీ కోసం డిమాండ్‌ vaartha

610 అమలు చేయలేకపోయిన కారణంగా ముల్కీ నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు, టిఆర్‌ఎస్‌ పేర్కొన్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులు కాకుండా అంతకు ముందు ఉన్న ముల్కీ నిబందనలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు.

వేర్వేరు భేటీలపై గుర్రు eenadu

ఉద్యోగుల మధ్య చిచ్చుకోసమే తెలంగాణ సంఘాల ఆగ్రహం సమావేశం నుంచి సగంలో బయటకు అడిగితేనే ఇలా నిర్వహించాం మరోసారి అలా చేయం: సీఎస్‌

రాష్ట్రంలో 610 జీవో అమలు వ్యవహారం మరో వివాదంలో చిక్కుకుంది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ శనివారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం ఇందుకు కారణం. దీన్ని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమర్థించగా.. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. సీఎస్‌ ఎదుటే నిరసన తెలిపాయి. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే తాము హాజరుకాబోమని స్పష్టంచేసి, అర్ధాంతరంగా వెళ్లిపోయాయి. విడివిడిగా చర్చలు జరిపినా, శనివారం కీలక నిర్ణయాలేమీ తీసుకోకపోవడం విశేషం.
గత వారం ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశం ముగిశాక స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు సీఎస్‌ను విడిగా కలిశారు. తమకు, తెలంగాణ సంఘాలకు వేర్వేరు సమావేశాలు నిర్వహించాలని కోరారు. దీంతో శనివారం ఉదయం స్టాఫ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎస్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి ఏపీ ఎన్జీవో, టీఎన్జీవో నేతలతోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. విడి భేటీ నిర్వహించినందుకు ప్రతినిధులు సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఇలాగే జరపాలని సూచించారు. 610తో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చే వారందరినీ బదిలీ చేయాలని మరోసారి కోరారు. టీఏ, డీఏలను, సీనియారిటీని అడక్కుండానే వెళ్లడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘంతో, సీఎంతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని సీఎస్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలపై మార్గదర్శకాలు లేకపోవడంవల్ల అమలు కష్టసాధ్యంగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పగా, త్వరలో వాటిని ఇస్తామని హరినారాయణ అన్నారు. 1975 నుంచి ఉద్యోగుల జాబితా దొరకడం అసాధ్యమని సంఘాలు చెప్పగా, అందుబాటులో ఉన్నవన్నీ సేకరించాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించామన్నారు. స్థానికేతరుల జాబితాపై అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని సంఘాలు ఫిర్యాదు చేయగా వారి వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని హామీ ఇచ్చారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సంఘాలతో సీఎస్‌ విడిగా సమావేశమయ్యారు. దీనిపై ఆ సంఘాల నేతలు తీవ్ర నిరసన తెలిపారు. ''తెలంగాణ, తెలంగాణేతర సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను ఉమ్మడిగా చర్చిస్తేనే, ఒకరి అభిప్రాయం మరొకరు తెలుసుకొని, తుదకు ఏకాభిప్రాయం, పరిష్కారం సాధించే వీలుంది. వేర్వేరు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటి? జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, తెలంగాణ సంఘాలతో ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆదేశాలిచ్చారు. దానిని బేఖాతరు చేయడం మాకు అవమానకరం. దీనికి బాధపడుతున్నాం. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం. స్టాఫ్‌ కౌన్సిల్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు లేవు. దాంతో సమావేశం జరపడం వల్ల మా ప్రాంతానికి ఒరిగేదేమీ లేదు. వచ్చే సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించకుంటే మేం హాజరుకాబోం. లేదంటే మాకూ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ హోదా కల్పించాలి'' అని ప్రతినిధులు వాదులాడారు. సంఘాలను తాము వేర్వేరుగా చూడడంలేదని సీఎస్‌ వివరణ ఇచ్చారు. ''స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రత్యేకంగా జరపాలని దాని ప్రతినిధులు కోరడం వల్లే అందుకు అనుమతిచ్చాం. సాయంత్రం సమన్వయ కమిటీ భేటీకి హాజరు కావాలని వారికి సూచించినా ఎవరూ రాలేదు. మరోసారి ఇలా జరగనివ్వం'' అని హరినారాయణ వివరించారు. అనంతరం జీవో అమలుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించబోగా... తెలంగాణ నేతలు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.

నేడు రౌండ్‌ టేబుల్‌ భేటీ
కాగా బదిలీలను నిషేధిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల పరిధిలోంచి 610 జీవో బదిలీలను ప్రభుత్వం మినహాయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అన్ని శాఖల్లో కాంట్రాక్టు నియామకాల్లో సైతం విధిగా 610ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ముల్కీ నిబంధనల అమలు కోసం ఆదివారం ఉదయం పది గంటలకు నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 610 అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఆరు సూత్రాలలో అయిదింటిని ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్లనే.. ముల్కీ నిబంధనలు అమలు చేసి, తెలంగాణ మొత్తాన్ని ఒక జోన్‌గా పరిగణించాలని కోరుతున్నామని చెప్పారు.