
తెరాస పురిటిగడ్డ కరీంనగర్. కష్టకాలంలో ఆ పార్టీకి వెన్నంటి నిలుస్తున్న జిల్లా. ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభిస్తే.. కలిసొస్తుంది అన్నది కేసీఆర్ నమ్మిక. ఆ క్రమంలో ఉప ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ కేంద్రంగా నిర్వహించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
కరీంనగర్, న్యూస్‌టుడే: కరీంనగర్‌ను కేంద్రంగా చేసుకొని ఉప ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉప ఎన్నికల్లో..తన రాజీనామాతో ఖాళీ అయిన కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచే ఆయన బరిలోకి దిగనున్నారు. కేసీఆర్ తన నామినేషన్‌ను మే 11న దాఖలు చేసి... తర్వాత కరీంనగర్ నుంచే ప్రచారభేరిని మోగించనున్నారు. ఉపఎన్నికలు జరిగే శాసనసభ, 4 లోక్‌సభ స్థానాల్లో.. ఉత్తర తెలంగాణ పరిధిలోనే నాలుగు లోక్‌సభ, ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో ఉపఎన్నికలు జరిగే తక్కిన తొమ్మిది నియోజకవర్గాల్లో మూడు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి, నల్గొండ జిల్లాలో ఒకటి, మూడు హైదరాబాద్ నగరం పరిధిలోకి వస్తాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోనే అధికంగా నియోజకవర్గాలు ఉండటం, భౌగోళికంగా ఆ ప్రాంతాలకు కరీంనగర్ చేరువగా ఉండటం- ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ కరీంగనర్‌ను కేంద్రంగా చేసుకోవడానికి దారితీసింది.. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి, కష్టకాలంలో తెరాస వెన్నంటి జిల్లా ప్రజలు నిలుస్తుండటం, ప్రచారాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభిస్తే కలిసొస్తుందని కేసీఆర్ విశ్వసిస్తుండటం అందుకు పరోక్షంగా దోహదపడింది. మేడారం, కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో రెండ్రోజులు, కరీంగనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో రెండ్రోజులపాటూ రెండు విడతల్లో కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెరాస వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రచారంలో త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించారు. నామినేషన్ల ఘట్టానికి తెరలేయడంతోనే- ఇదివరకే శిక్షణ ఇచ్చిన విద్యార్థులను బృందాలుగా విభజించి గ్రామాల్లోకి పంపడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. తెరాస సాంస్కృతిక విభాగంలోని కళాకారులను బృందాలుగా విభజించి.. ఉప ఎన్నికలు జరిగే అన్ని మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో 'తెలంగాణ ధూంధాం'లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మండలాల్లోని నేతలను మూడు బృందాలుగా విభజించి.. ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రచారం ముగిసే నాటికి.. ఒక్కో ఇంటిని కనీసం మూడుసార్లు చుట్టి రావాలన్నది తెరాస నేతల వ్యూహం. ప్రచారంలో సెంటిమెంటును రగల్చడమే ధ్యేయంగా తెరాస బృందాలు పనిచేసేలా వారికి శిక్షణ ఇచ్చారు. వీటికి తోడు నాలుగేళ్ల వైఎస్ పాలనలో తెలంగాణ కేటాయించిన నిధులు, ఆదాయం వివరాలతో కూడిన సాహిత్యాన్ని పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.



పీజేఆర్ విలక్షణ రాజకీయ నాయకుడు. సమస్యలతో రాజీ పడడం ఆయన నైజం కాదు. ఏ మాత్రం సర్దుకు పోయినా అందలం ఎక్కే అవకాశం ఉంటుందని తెలిసినా తాననుకున్న దానికే కట్టుబడ్డారు. తాను మంచి అనుకున్నదే చేస్తారు. దానివల్ల రాజకీయంగా తను నష్టపోయే పరిస్థితి ఉన్నా లెక్కపెట్టరు. ఆయనలోని ఈ మొండితనం ఆయన్ను అనేకసార్లు పదవులకు దూరం చేసిందని సన్నిహితులు అంటారు. 1994-99 మధ్య కాలంలో పీజేఆర్ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా పీజేఆర్ సమస్యలపై తన పోరాటం నుంచి పక్కకు తప్పుకోలేదు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్ విపక్షంలో ఉండి వాగ్దానాలకు కట్టుబడాలని ఆయన పట్టుబట్టారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఐమ్యాక్స్, రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ ఆస్తుల వేలం, తదితర అనేక అంశాల్లో ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వేసిన సభా సంఘాల్లో ఎక్కువ శాతం పీజేఆర్ డిమాండ్‌తో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు విషయంలో ఆయన సహ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డితో కలసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ శాసన సభ్యునిగా ఉంటూ ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సమస్యపై ఆందోళనదశలోనే పీజేఆర్, శశిధర్‌రెడ్డిలను హైదరాబాద్ బ్రదర్స్ అనే పేరు వచ్చింది. పోతిరెడ్డి పాడు అంశాన్ని పీజేఆర్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దానివల్ల తెలంగాణాకు ముఖ్యంగా జంట నగరాల తాగునీటి అవసరాలకు ఇబ్బంది అవుతుందని వాదించారు. కాంగ్రెస్‌లో అసమ్మతినేతగా అంతా భావించినా ఆయనెప్పుడూ పార్టీ క్రమశిక్షణను తప్పకుండా సమస్యలపై మాత్రమే గళమెత్తారు. దాంతో పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు ఆయనతో చర్చలు జరిపేది. పోతిరెడ్డిపాడు విషయంలో పీజేఆర్ డిమాండ్లతో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రత్యేకంగా ఒక ఇంజినీర్‌తో దానిపై అధ్యయనం చేయించారు. పోతిరెడ్డిపాడు వల్ల ఇబ్బంది లేదని ఇంజినీరు తేల్చారు. పార్టీలో ఒకనిర్ణయం తీసుకున్నాక కొందరికి ఆమోద యోగ్యం కాకున్నా కట్టుబడి ఉండాల్సిందేనన్న పార్టీ సూచన మేరకు దానికి కొంత విరామాన్నిచ్చారు. పోతిరెడ్డిపాడు వివాదానికి ముందు పీజేఆర్ ప్రత్యేక తెలంగాణా విషయంలో తన వైఖరిని ఎప్పుడూ బయట పెట్టలేదు. పోతిరెడ్డిపాడుపై పీజేఆర్ రాజీలేని పోరాటం చేయడంతో తెలంగాణా వాదుల్లో ఆయన్ను హీరోను చేసింది. అప్పటినుంచి ఆయన ప్రత్యేక వాదిగా ముద్రపడ్డారు. హైదరాబాద్ నగరానికి మూడో దశ కింద కృష్ణాజలాలనే రప్పించాలనేది ఆయన డిమాండ్. డిపెప్ కుంభకోణంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు పాత్రపై విచారణ కోసం పీజేఆర్ కొంతకాలంగా సభాసంఘం సమావేశాల్లో తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. సూరీడును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన రెండు రోజుల క్రితం సిఐడి అధికారులను నిలదీశారు. ప్రభుత్వం గోదావరి నీటినితెచ్చే ప్రయత్నాల్లో ఉండడంతో దానిపై ఉద్యమం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

అర్ధరాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ ఆయన వెంట నడుస్తారు. జనం బాధను పంచుకుంటారు. కొండంత అండగా నిలబడతారు. ఆయన ఏ పదవిలో ఉన్నా నమ్మిన వారికి న్యాయం చేసేవరకు విశ్రమించరు. బడుగువర్గాలు, కార్మికులంటే ఎంతో ప్రేమ. పదవిలో ఉన్నా.. లేకున్నా.. ఆయనది రాజీలేని మనస్తత్వం. ఆయనే పబ్బతిరెడ్డి జనార్దనరెడ్డి. పీజేఆర్‌గా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువైన నేత. నగరంలో ఏమూల ఏపేదవాడికి ఏకష్టమొచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోయే జెన్నన్నను మృత్యువు మింగేసిందంటే జనం తట్టుకోలేకపోతున్నారు.


తరలివచ్చిన నేతలు పీజేఆర్ మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఆసుపత్రికి ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్, నేదురుమల్లి దంపతులు, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఇక్బాల్ సింగ్, కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, పళ్లంరాజు, రాష్ట్ర మంత్రులు కొణిజేటి రోశయ్య, కొణతాల రామకృష్ణ, రఘువీరారెడ్డి, షబ్బీర్‌అలీ, డాక్టర్ గీతారెడ్డి, ముఖేష్, ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచందర్‌రావు, సీనియర్ నేతలు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణరావు, కోదండరెడ్డి, ఎంపీలు వెంకటస్వామి, వి.హనుమంతరావు, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి, తెదేపా నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, జి.సాయన్న, భాజపా నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, క్రైస్తవ మతప్రచారకుడు కె.ఎ.పాల్, సినీ ప్రముఖులు శ్రీహరి, ఎం.ఎస్.రెడ్డి, బాబూ మోహన్, కార్మిక సంఘాల నేతలు వచ్చారు.


