Saturday, August 11, 2007

నాలుగు లక్షల మంది విద్యార్థులతో ఉద్యమం

తెలంగాణ వచ్చేదాకా పోరు ఆగదు శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ ఉద్ఘాటన
నాలుగు లక్షల మంది విద్యార్థులతో పటిష్టమైన విద్యార్థి విభాగాన్ని రూపొందించుకుని ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడతామని తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఇక్కడి తెలంగాణ భవన్లో తెరాస విద్యార్థి విభాగం సభ్యుల తొలిదశ శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే 15,000 మంది విద్యార్థులు తమ విభాగంలో చేరారని, వీరికి ఆర్నెల్ల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. అనంతరం మరో 15,000 మంది విద్యార్థినులకు డివిజన్‌ స్థాయిలో శిక్షణ ఇస్తామన్నారు. హింసకు దిగడమే ఉద్యమం కాదని, ప్రజాస్వామ్యయుతంగా బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణను సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. 'ఈ దఫా తెలంగాణ వచ్చేదాకా పోరు జరిగి తీరుతుంది. తెలంగాణకు అనాదిగా అన్యాయం జరుగుతోంది. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన 36 జీవోకు వ్యతిరేకంగా మంత్రి దామోదరం సంజీవయ్యే కోర్టుకెక్కారు. ఇప్పుడు 610పై కాంగ్రెస్‌ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కోర్టుకు వెళ్లారు. అనాదిగా తెలంగాణకు ఇదే అన్యాయం జరుగుతోంది. వీటినుంచి బయట పడాలంటే ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం. ఈ విద్యార్థులు ఏడాదికి 15 రోజుల పాటు ముఖ్యమైన రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు' అని కేసీఆర్‌ వివరించారు. ఈ శిబిరంలో సూర్యాపేట (నల్గొండ), గద్వాల (మహబూబ్‌నగర్‌), కమలాపురం (కరీంనగర్‌) నియోజకవర్గాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి వారికి కేసీఆర్‌ వివరించారు. అనంతరం దేశిపతి శ్రీనివాస్‌, విద్యాసాగరరావు, ప్రకాశ్‌, ఇతర తెలంగాణ మేధావులు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాల నేతలు పాల్గొన్నారు.