Monday, July 16, 2007

కొత్త గడువు 610 అమలు జులై 31 వరకు పొడిగింపు eenadu

ఆన్‌లైన్‌లో స్థానికేతరుల నమోదు
మంత్రులకు సమీక్ష బాధ్యతలు
మరోసారి గడువు పెంచనివ్వొద్దని ముఖ్యమంత్రి
హెచ్చరిక
జీవో 610 అమలుపై రెండుసార్లు గడువు ప్రకటించి అమలు ప్రక్రియ పూర్తి చేయలేకపోయిన సర్కారు... మరోసారి గడువు పొడిగించింది. తాజా గడువు జులై 31. సోమవారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం ఈ భేటీ తన షెడ్యూలులో లేనప్పటికీ, శాసనసభ వాయిదా పడిన వెంటనే ముఖ్యమంత్రి తన కార్యాలయానికి వచ్చి 610పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, సభ్యులైన ఇతర మంత్రులు జానారెడ్డి, కోనేరు రంగారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) హరినారాయణ, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... వీలైనంత ఎక్కువ మందిని స్వస్థలాలకు పంపేందుకు వీలుగా స్వచ్ఛంద బదిలీలు కొనసాగించాలని, డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఆదేశించారు. ఇందుకు మరో పదిహేను రోజులపాటు (ఈ నెలాఖరు వరకు) గడువు తీసుకోవాలని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జీవో అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ''నేను మొదటిసారిగా జూన్‌ 30న పూర్తి చేస్తానన్నాను. రెండోసారి ఈ నెల 15 వరకు గడువు చెప్పాను. మీరు మాత్రం పని పూర్తి చేయడం లేదు. ఎలాంటి సమస్య లేకున్నా ఎందుకు జాప్యం చేస్తున్నారు. జాప్యం చేస్తే ప్రభుత్వం ఏమీ చేయలేదనుకుంటున్నారు. మరోసారి గడువు పొడిగించే పరిస్థితి తీసుకురావద్దు'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఏడు వేల మంది స్థానికేతరులను గుర్తించామని, 957 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల గుర్తింపు, ఉద్యోగుల కేటగిరి విషయమై సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. కొన్ని ప్రాజెక్టుల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉండగా వాటిని దేని కింద పరిగణించాలనే విషయమై సందిగ్ధం ఏర్పడిందని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ... ప్రాజెక్టులున్న చోటనే కార్యాలయాలు పనిచేస్తున్నట్లుగా గుర్తించాలని, హైదరాబాద్‌లో ఉన్న వాటిని క్యాంపు కార్యాలయాలుగా పరిగణించాలని ఆదేశించారు. 1975లో నాన్‌గెజిటెడ్‌గా ఉన్న పోస్టులను ఆ తర్వాత గెజిటెడ్‌గా మార్చడంతో వారిని ఏ కేటగిరిలో చేర్చాలనే విషయమై సమస్య ఏర్పడిందని సీఎస్‌ చెప్పగా, ఆయా పోస్టులను నాన్‌గెజిడెట్‌ కేటగిరి కిందనే చూడాలని సీఎం సూచించారు. మానవతా దృక్పథంతో బదిలీలు సాగాలని, ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.
అధికారులమీదే వదిలేయవద్దు
జీవో అమలు బాధ్యత అధికారులపైనే వదిలివేయకుండా మంత్రులు దీనిపై శ్రద్ధ చూపాలని వైఎస్‌ సూచించారు. వెంటనే శాఖల వారీగా కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమై స్థానికేతరుల బదిలీలు జరిగాయా, డిప్యుటేషన్లు రద్దయ్యాయా అనే అంశాలను సత్వరమే సమీక్షించాలని ఆదేశించారు. నెలాఖరు వరకు స్వచ్ఛంద బదిలీలకు అనుమతించాలన్నారు. ఆ తర్వాత, మిగిలిన వారి విషయంలో ఎలాంటి విధానం అవలంబించాలనే అంశంపై ఉద్యోగ సంఘాలతో శనివారం చర్చించాలని సీఎం ఆదేశించారు. 1975 నుంచి స్థానికేతర గుర్తింపు విషయం ఈ సమావేశంలో చర్చకు రాగా... బదిలీలు, డిప్యుటేషన్లు పూర్తయిన తర్వాత దాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. స్థానికేతరుల వివరాలు ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించగా... ఈ బాధ్యతను రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌)కు అప్పగించామని, 3 రోజుల్లో ఇది పూర్తవుతుందని సీఎస్‌ చెప్పారు.
గడువును అధికారికంగా ప్రకటించొద్దు:ఇప్పటికే రెండుసార్లు గడువు ప్రకటించి, అమలు చేయలేకపోవడంతో విమర్శలు వస్తున్నాయని, తాజాగా నెలాఖరు వరకు గడువు పొడగిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించవద్దని మంత్రి డి.శ్రీనివాస్‌ సీఎంను కోరారు. దీనికి సీఎం అంగీకరించినట్లు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రులెవరూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
అసెంబ్లీలో అభాసుపాలు కాకూడదనే: రెండు గడువులో జీవో అమలు చేయకపోయిన పరిణామం... ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఏదో ఒక రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభాసుపాలు కాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం తాజా గడువుపెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

డెప్యుటేషన్లపై 'యథాతథం' eenadu

ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:

610 జీవో అమలులో భాగంగా అన్ని డెప్యుటేషన్లనూ రద్దు చేయాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ అమలును రెండు వారాలపాటు యథాతథ స్థితిలో ఉంచాలంటూ సోమవారం ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డెప్యుటేషన్లను రద్దు చేయాలంటూ జులై 2న జారీ చేసిన సర్క్యులర్‌పై ఎం.చంద్ర ఓబుళరెడ్డి తదితరులు ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. డెప్యుటేషన్‌ నియామకాలకు 610 జీవోతో సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణయ్య ట్రైబ్యునల్‌కు తెలిపారు. కొన్ని శాఖల్లోని పోస్టులను డెప్యుటేషన్లపైనే భర్తీ చేయాలన్న నిబంధనలున్నాయని వివరించారు. తాత్కాలిక నియామకాలకు, 610 జీవోతో సంబంధంలేదన్నారు. పిటిషనర్ల డెప్యుటేషన్లను యథాతథంగా ఉంచాలంటూ ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

కాంగ్రెస్స్ వాళ్ళని మించిన నట చక్రవర్తులు ఈ శృష్టిలొ లేరని చెప్ప వచ్చును

చాన్నాళ్ళ క్రితం నాటకాలు వేయడంలోను , పాత్రలను పండించడంలోను సురభి నాటక మండలివారిది ఒక విశిష్టమైన శైలి. కాలక్రమేణా రంగస్థలం రంగువెలసి, కళాకారులు కనుమరుగయ్యారు. ప్రస్తుతం వాళ్ళు లేని లోటును మన రాజకీయనాయకులు తీర్చడమేకాదు వారికంటే అమోఘంగా నటిస్తూ నిత్య నూతనంగా వెలుగొందు తున్నారు. అందులో ఎలాంటి పాత్రనైన ముఖ్యంగా అమాయక సన్నివేషాలనుండి ఆరాచక సన్నివేషాలవరకు అవలీలగా పొషించడంలో కాంగ్రెస్స్ వాళ్ళని మించిన నట చక్రవర్తులు ఈ శృష్టిలొ లేరని చెప్ప వచ్చును. ఇలాంటి విషయాల్లో కడప కళాకారులు కాకలుతీరిన వారు.

అందుకే జూబిలీ పడక సీనులొ తండ్రి (రవీంద్రా రెడ్డి) కొడుకు(సుమధుర్ రెడ్డి) అద్బుతంగా నటించారు. అలా అనేకంటే జీవించారు అని చెప్పడం సబబుగా ఉంటుందేమో. మాయావి రాజశేఖర్ రెడ్డి దవాఖానల ప్రదర్శించిన పరామర్శ సీను తన గంభీర వదనంతో మరీ పండించారు. కీ.శే.వై.ఎస్స్.రాజా రెడ్డి కుటుంబానికి దాడులు చెయ్యడంలోను, శవాలను అదృశ్యం చెయ్యడలోను ఎంత ఘనమైన చరిత్ర వున్నదో అలనాటి కడప లోకసభ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఒక స్వతంత్ర అభ్యర్థి హత్య అనంతరం శవం అదృశ్య ఘట్టం మనకి వాస్తవాన్ని విశదీకరిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ తెర మీద వారి నటన అమొఘంగా ఉన్నా ఒన్స్ మోర్లు మరియు నీరాజనాలు మాత్రం అందుకోజాలరని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా నాయకుల నయవంచక అశ్లీల నటనలతో మా ప్రజలు ఎప్పుడో విసిగి వేసారిపోయి ఉన్నారు గనక మీ నటన పట్ల ఆసక్తి గాని, ఆకర్షణ గాని ఏ మాత్రం లేవని మనవి. మీ సమష్యలకు మా సమష్యలకు ప్రత్యేక రాష్ట్ర మొక్కటే పరిష్కారం.తద్వార మన సకల కుటుంబాలు సుఖ శాంతులతో కలకాలం వర్థిల్ల గలవు.


నయవంచనతో కూడిన నటనకు ఏదో ఒకనాడు తెర పడక తప్పదు.


తెలివి మీరి నటిస్తే తెర మరుగు గాక తప్పదు.


జై తెలంగాణా-జై హింద్,

అనీల్ మద్దిరాల