Wednesday, July 4, 2007

నా వ్యాఖ్యాల్ని వక్రీకరిస్తున్నారు: లగడపాటి andhra jyothi

విజయవాడ, జూలై 4 (ఆన్‌లైన్‌): రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధ్దికోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషా లను పెంచడానికి ప్రయత్నిస్తుండడం సబబుకాదని విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. 610 జీవో అమలు విషయంలో ఇటీవల రాజ గోపాల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ నాయకులు రాజగోపాల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ, తనపై వ్యాఖ్యలు చేస్తున్న నాయకులను తీవ్రంగా విమర్శించారు.
వివిధ జిల్లాలోని ప్రజలను రెచ్చగొడుతూ, ఈ సమస్యను ఇండియా-పాకిస్థాన్‌ మధ్య ఉన్న సమస్య లా చీత్రీకరించడం తగదన్న ఉద్దేశంతోనే తాను కొన్ని వ్యా ఖ్యలు చేసినట్లు తెలిపారు. అయితే కొందరు ఉద్దేశపూర్వ కంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మనదేశ సంస్కృతి, తెలుగు సంస్కృతికి విరుద్ధంగా విధి విధానాలకు దూరంగా ప్రజలను తీసుకువెళ్లి, వారిని రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సబబో చెప్పాలన్నారు. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇంకొక ప్రాంతానికి చెందిన వ్యక్తులను దూషించడం తగదని చెప్పారు.
ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాలను పాకిస్థాన్‌- భారత్‌ సమస్యతో పోల్చడాన్ని దయచేసి వక్రీకరించవద్దని రాజగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. శాంతికి, సహజీవనానికి భం గం కలిగించకూడదన్నదే తన తపన అన్నారు. కొంతమం ది రాజకీయ నాయకులు ప్రజల మధ్య లేనిపోని అపోహ లు సృష్టించి అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాలలో స్థానికేతరులలో కూడా ముఖ్యంగా టీచర్లు 20 శాతం మంది సొంత ప్రాం తాలకు వెళ్ళేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వీరంతా వెళ్ళిపోతే ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని నియమించుకో వాల్సి వస్తుందన్నారు.
సిబ్బందిని కొత్తగా నియమించడానికి కనీసం ఒక ఏడాది పడితే ఈ లోపల విద్యార్థుల భవి ష్యత్‌ ఏమిటన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో చదువు చెప్పేవారు దొరకరని అన డం వాస్తవం కాదన్నారు. కొంతమంది నేతలు తాను అహంకారంతో మాట్లాడానని వక్రీకరించడం విచారకర మని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు వ్యతిరేకినని స్పష్టం చేశారు. తెలుగు సంస్కృ తి, దేశ సంస్కృతిని కాపాడడంతో బాటు సంస్కారం, సభ్యతలను పాటిస్తూ ర్రాష్టాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నదే తన అభిమతమని చెప్పారు.

జీవో 43ను రద్దు చేయాలి andhrajyothy

హైదరాబాద్‌, జూలై 4 (ఆన్‌లైన్‌): స్థానికేతర టీచర్లను సొంత జిల్లాలకు పంపించే ప్రక్రియలో భాగంగా పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో 43ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ నేతలు బుధవారంనాడిక్కడ పాఠశాల విద్యా డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ సిబ్బంది లోపలికి వెళ్ళకుండా అడ్డుకొని,పాఠశాల విద్యా డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘెరావ్‌ చేశారు. దీంతో పోలీసులు ఎంఎల్‌సీలు మోహన్‌రెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీనివాసులు నాయుడు, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట రెడ్డి, రవికిరణ్‌లతో సహా పలువురిని అరెస్టు చేసి తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.

అంతకు ముందు మోహన్‌రెడ్డి, వెంకటరెడ్డిలు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయానికి వెళ్ళి ధర్నా నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకోసం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సీబీ ఎస్‌ వెంకటరమణ, డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం అక్కడకు వస్తారని ఉపాధ్యాయ నేతలు భావించారు. అయితే, ఉన్నతాధికారులిద్దరూ పాఠ్య పుస్తకాల సరఫరాపై డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే పేరిట పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమానికి హాజరు కాలేదు.

దీంతో నేతలంతా పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ చేరుకొని, అక్కడ డైరెక్టర్‌ను ఘెరావ్‌ చేయడంతో అరెస్టులు జరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలనుంచి సొంత జిల్లాలకు బదిలీ అయినవారిలో పంచాయతీరాజ్‌ టీచర్లకు జిల్లా పరిషత్‌ సీఈఓలు, ప్రభుత్వ టీచర్లకు డీఈఓలు పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వాలని జీవో 43లో నిర్దేశించడం వివాదాస్పదమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఈ నెల 17వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

స్వచ్ఛందానికి స్పందన కరవు eenadu

20 శాఖల్లో 802 మంది బదిలీ
55 శాఖల్లో ఒక్క ఉత్తర్వూ జారీ కాలేదు
రాష్ట్రంలో 610 జీవో అమల్లో భాగంగా స్వచ్ఛంద బదిలీలకు గడువు పెంచినా ఆశించిన స్పందన లేదు. 7వేల మందికి పైగా స్థానికేతరులను గుర్తించినప్పటికీ ఇప్పటిదాకా 802 మందికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు 1975 నుంచీ ఉన్న స్థానికేతర ఉద్యోగుల జాబితా గుర్తింపు ప్రక్రియపై సవాలక్ష సందేహాలు తలెత్తటంతో ఏ ఒక్క శాఖలోనూ దీన్ని ప్రారంభించలేదు. పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా నత్తనడకన సాగుగుతోంది. చాలా శాఖలు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

స్వచ్ఛంద బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ గతనెల రెండో వారం నుంచి మొదలయింది. 27 నుంచి ఉత్తర్వులివ్వడం మొదలుపెట్టారు. బుధవారం వరకూ 20 శాఖల నుంచే బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు, విద్యా శాఖలు జారీ చేసిన ఉత్తర్వులపై వివాదాలు నెలకొని బదిలీలు నిలిచిపోయాయి. సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, పశు సంవర్థక, నీటిపారుదల, రెవెన్యూ, రవాణా- రోడ్లు- భవనాలు, యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక, ఉన్నత విద్య, ఆర్థిక, ఇంధన, పురపాలక, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, జీఏడీ, ప్రణాళిక శాఖల నుంచి 573 మందికే ఉత్తర్వులిచ్చారు. స్వచ్ఛంద బదిలీలకు ఈ నెల 16 వరకే గడువును నిర్దేశిస్తూ మూడురోజుల క్రితం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత కేవలం నాలుగు శాఖల నుంచే ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 75 శాఖలకు గాను ఇంకా 55 శాఖల నుంచి ఒక్క ఉత్తర్వు జారీ గాకపోవడం సాధారణ పరిపాలన వర్గాల్లో విస్మయం కలిగించింది. సీఎం నిర్దేశించిన గడువుకు మరో పది రోజులే ఉండగా ఈ లోపే అన్ని శాఖల నుంచి ఉత్తర్వులు జారీ చేయించాలనే ఉద్దేశంతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణకు పూనుకున్నారు. మరోవైపు 1975 నుంచి స్థానికేతరుల గుర్తింపు ప్రక్రియకు ఉత్తర్వులు ఇచ్చినా ఇది ఎక్కడా జరగలేదు. కొన్ని శాఖలు తమ వద్ద జాబితాలు లేవని చెప్పగా, మరికొందరు మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తంచేశారు.
ముల్కీ నిబంధనల్ని పునరుద్ధరించాలి : ఆరు సూత్రాల పథకంలో మొదటి ఐదు నిర్వీర్యమయినందున చివరి సూత్రంలో చెప్పినట్లు ముల్కీ నిబంధనల్ని పునరుద్ధరించి, తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని ఒకే జోన్‌గా పరిగణించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది.