Saturday, December 29, 2007

కుమారుడే వారసుడు! మార్చిలో ఉప ఎన్నిక? Eenadu 30-12-07


హైదరాబాద్‌, న్యూస్‌టుడే: జనార్దనరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 2008 మార్చిలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 2009 ఏప్రిల్‌ వరకు ఉన్నందున ఉప ఎన్నిక ఖచ్చితంగా జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ తరువాత సభ కాలవ్యవధి అతి తక్కువకాలం ఉంటే ఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం పునరాలోచిస్తుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ కాలవ్యవధి ఇంకా 16 నెలలకు పైగా ఉంది. అందువల్ల
త్వరలోనే ఎన్నిక వస్తుందని భావిస్తున్నారు. కర్ణాటక శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ శాసనసభ రద్దవడంతో ఏప్రిల్‌లోగా ఎన్నికలు జరిపి తీరాలి. ఆ మేరకు కర్ణాటక ఎన్నికలు మార్చిలో జరగవచ్చునని వాటితో పాటే ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం జనార్దనరెడ్డి కుమారుడు విష్ణువర్దన్‌కే దక్కే అవకాశాలున్నాయి. మూడున్నర దశాబ్దాలపాటు పీజేఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలపై అధిష్ఠానంలో గుర్తింపు ఉంది. ఆయన అహర్నిశలు పార్టీ కోసం పని చేశారని ఢిల్లీ నేతలు కూడా శ్లాఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీజేఆర్‌ కుటుంబం నుంచే ఒకరికి అవకాశం ఇవ్వడం గ్యారంటీ అని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఈ విషయంలో అడ్డుపడే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. పీజేఆర్‌ కుటుంబంలో సహజంగానే తొలుత ఆయన భార్య సులోచన పేరు వినిపిస్తోంది. అయితే ఆమె ఆరోగ్యరీత్యా ఎన్నికల్లో తలపడి ఆ తరువాత ప్రజలతో సంబంధాలు నెరపడం కష్టమవుతుందనే భావన పీజేఆర్‌కు అత్యంత సన్నిహితులయిన వారిలో ఉంది. అందువల్ల యువకుడైన విష్ణువర్దన్‌నే పీజేఆర్‌ వారసునిగా ఆయన కుటుంబం ప్రకటిస్తుందని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా విష్ణు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. విష్ణును రాజకీయవారసుణ్ణి చేయాలనే తలంపు పీజేఆర్‌లోనూ ఉండేదని, ఇప్పుడుకూడా అందుకనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.