Tuesday, September 4, 2007

ఉద్యమానికి పునరంకితమవుదాం Eenadu

కేసీఆర్‌ పిలుపు 'గో బ్యాక్‌' అమర వీరులకు శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: త్యాగాల పునాదిపై జరిగిన ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పునరంకితమవ్వాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. 'ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌.. నాన్‌

ముల్కీ గో బ్యాక్‌' ఉద్యమంలో అసువులు బాసిన వారి సంస్మరణార్థం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో గల అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెరాస ఏడు భారీ కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది. నాన్‌ ముల్కీ గో బ్యాక్‌.. జై తెలంగాణ లాంటి నినాదాలు ఈ సందర్భంగా మిన్నంటాయి. కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణపై వలసవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణను హేళన చేస్తూ అప్పటి మద్రాసు ప్రభుత్వ నేతలు చేసిన ప్రకటనలపై తెలంగాణ విద్యార్థులు 1949లో 'ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌.. నాన్‌ ముల్కీ గో బ్యాక్‌' నినాదంతో ఆందోళన ఉద్ధృతం చేశారన్నారు. ఈ సమయంలో సిటీ కాలేజీ వద్ద పోలీసులు కాల్పులు జరిపి ఏడుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వాదులపై, ఉద్యమకారులపై అవి తొలి పోలీసు కాల్పులన్నారు. ఆ దమననీతి, మోసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ జోహారులు.. జోహారులు.. అమవీరులకు జోహారులంటూ గీతాలను ఆలపించి అందరి కర్తవ్యాన్నీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలు నాయిని నర్సింహ్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు రవీంద్రనాథ్‌, ఎమ్మెల్సీలు దిలీప్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.