Tuesday, December 11, 2007

'జై తెలంగాణ' అంటేనే 'జై చిరంజీవ' Andhra Jyothy

చిరు రాకపై కేసీ ఆర్‌ సమాలోచనలు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (ఆన్‌లైన్‌): సినీ నటుడు చిరంజీవి రాజకీయ ఆరంగ్రేటంపై టీఆర్‌ఎస్‌లోనూ తర్జనభర్జన సాగుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌ ఆయుధంగా పనిచేస్తోన్న తమకు.. చిరంజీవి పార్టీ ఏర్పాటు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లగలదన్న అంశంపై పలువురు ముఖ్య నాయకులతో టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. లాభనష్టాలపై ఒక అంచనాకు వచ్చిన ఆయన.. ప్రత్యేక తెలంగాణపై విధానపరంగా చిరంజీవి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే కలిసి పనిచేద్దామన్న అభిప్రాయం వ్యక్తంచేసి నట్లు తెలిసింది. తెలంగాణపై సానుకూలంగా స్పం దించకుండా చిరంజీవి కూడా ముందుకు వెళ్లలేరన్నది టీఆర్‌ఎస్‌ వర్గాల అభిప్రాయం.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉండి, ఆయనతో కలిసి పనిచేసినట్లయితే ఇరుపక్షాలకు మేలు జరుగుతుందన్నది ఆ వర్గాల అంచనా. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను కాదని ఏకపక్షంగా ముందుకెళితే.. తెలంగాణ ప్రాంతంలో చిరంజీవి పార్టీకి ఆయన అభిమానుల నుంచి కొంత ఆదరణ లభించినా, మిగతా అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఆదరణ లభించకపోవచ్చని నేతలతో కేసీఆర్‌ అన్నట్టు తెలిసింది. 'మనతో కలిస్తే తప్ప.. తెలంగాణలో ఆయనకు ఆశించిన ఫలితం దక్కదు. మనతో కలిస్తే ఆంధ్రా, తెలంగాణల్లో ఒక వెలుగువెలిగిపోవచ్చు. ఈ విషయాన్ని నేను రెండు మాసాల క్రితమే బహిరంగంగా చెప్పాను' అని ఆయన నేతలతో అన్నారు.

మాయాకు ఆంధ్రలో సీన్‌ లేదు!
చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలుసుకోవడానికి ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్‌.. తాజాగా ఆ బంధం తమకు అంతగా లాభించదన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆమెతో జత కడితే జాతీయ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించవచ్చ ని భావించిన ఆయన.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి ప్రయోగం పనిచేయదని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్క­ృతుడైన ఆలె నరేంద్ర బీ ఎస్పీలో చేరడానికి మాయావతి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే.. ఆమెకు దూరంగా ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.